అనుసృజన

నిర్మల

(భాగం-13)

అనుసృజన:ఆర్. శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

ఈమధ్య రోజూ ఏదో ఒక విషయానికి నిర్మలా , రుక్మిణీ పోట్లాడుకుంటూనే ఉన్నారు.నగలు దొంగతనమైనప్పట్నుంచీ నిర్మల స్వభావంలో పూర్తిగా మార్పు వచ్చింది.ఒక్కొకా పైసా కూడబెడుతోంది.సియారామ్ మిఠాయి కావాలని ఎంత ఏడ్చి రాగాలు పెట్టినా కొనటం లేదు. వాడి కోరికలే కాదు ఆమె తన అవసరాలకి కూడా డబ్బు ఖర్చు పెట్టటం లేదు.చీర పూర్తిగా చిరుగులు పట్టేదాకా కొత్తది కొనదు.నెలల తరబడి తలనూనె తెప్పించదు.ఆమెకి తమలపాకులంటే తగని ఇష్టం, కానీ ఇప్పుడు అది కూడా మానేసింది.చివరికి పసిదానికి పాలు కూడా ఎక్కువ తెప్పించటం లేదు. పసిదాని భవిష్యత్తు విశ్వరూపం దాల్చి ఆమె ఆలోచనల్లో నిరంతరం సుళ్ళు తిరుగుతూ ఉంటుంది.

తోతారామ్ పూర్తి పెత్తనం నిర్మలకే అప్పగించి, ఆమె పనుల్లో జోక్యం కలిగించుకోవటం మానేశాడు.ఎందుకో గాని ఆమెని చూసి ఆయన కొద్దిగా జంకటం మొదలెట్టాడు.ఒక్కరోజు కూడా నాగా పెట్టకుండా కోర్టుకెళ్తున్నాడు.యువకుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇంత కష్టపడి పని చెయ్యలేదు. చూపు కొద్దిగా మందగించింది, జీర్ణశక్తి ఎప్పుడూ బలహీనమే, ఇప్పుడు ఇంకా పాడయింది.కొత్తగా ఆస్థమా ఒకటి పట్తుకుంది.కానీ పాపం అర్ధరాత్రి వరకూ పని చేస్తూనే ఉంటాడాయన. ఆయన అలసిపోయినా, ఆరోగ్యం బాగా లేకపోయినా నిర్మలకి ఆయన మీద లేశమంత జాలి కూడా వెయ్యదు.భవిష్యత్తు గురించిన భయం విపరీతంగా మనసుని కమ్మేసి ఆమెలో ఉన్న సున్నితమైన భావాలని చంపేసింది.

ఒక రోజు నిర్మల నెయ్యి కొని తెమ్మని సియారామ్ ని బజారుకి పంపింది. మధ్య పనిమనిషిని నమ్మటం లేదామె. బజారు పనులన్నీ సియారామ్ కే చెపుతోంది.వాడి మీద మాత్రమే ఆమెకి నమ్మకం. అయినా ఇంటికి తెచ్చిన వస్తువులన్నిటినీ మళ్ళీ తూచి, తూకంలో కాస్తంత తేడా వచ్చినా తిప్పి పంపేస్తుంది.సియారామ్ ఇలా ఇంటికీ బజారుకీ తిరగటంలో బోలెడంత సమయం వృథా అవుతూ ఉంటుంది.ఇవాళ కూడా అదే జరిగింది.సియారామ్ ఎన్నో దుకాణాలు తిరిగి తనకి మేలు రకం అనిపించిన నెయ్యే తెచ్చాడు.దాన్ని వాసన చూస్తూనే , ” ఇది బాగాలేదు.తిరిగి ఇచ్చేసి రా,”అంది.

ఇంతకన్నా మంచిది కొట్లోనూ లేదు,”అన్నాడు సియారామ్ చిరాకు పడుతూ.

అయితే నేను అబద్ధం చెబుతున్నానా?”

నేనలా అనలేదే.కానీ దుకాణం వాడు, సరిగ్గా చూసుకుని తీసుకెళ్ళు,తరవాత బాగాలేదంటే వాపసు తీసుకోను అని చెప్పాడు.నేను వాసన చూసి, రుచి చూసి మరీ తెచ్చాను.ఇప్పుడే మొహం పెట్టుకుని వాపసు ఇవ్వను?”

నిర్మల పళ్ళు కొరుకుతూ,” ఇందులో కొవ్వు కలిపారు, అయినా ఇది బావుందంటున్నావా?దీన్ని వంటింట్లోకి రానివ్వను.వెనక్కిస్తావో, నువ్వే తింటావో, నీ ఇష్టం,”అంది.

నెయ్యి ముంతని అక్కడే వదిలి నిర్మల లోపలికెళ్ళిపోయింది.సియారామ్ కి ఏం చెయ్యాలో అర్థం కాక కోపం వచ్చింది.వాడి మనసు బాధపడింది.’ నేను మళ్ళీ దుకాణానికి వెళ్ళను గాక వెళ్ళను,’ అనుకున్నాడు మనసులో.

తల్లి లేని పిల్లవాడంత దురదృష్టవంతుడు లోకంలో మరొకరుండరు.వాడి బాధ ఏమిటో వాడికే తెలుసు.సియారామ్ కి తన తల్లి గుర్తుకొచ్చింది.’అమ్మే ఉంటే రోజు నాకిన్ని కష్టాలుండేవా?పెద్దన్నయ్య లోకం వదిలి పోయాడు, చిన్నన్నయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఇవన్నీ భరించేందుకు నేనొక్కణ్ణే ఇక్కడ మిగిలాను !’ ఇలా అనుకునేసరికి సియారామ్ కళ్ళు ధారాపాతంగా వర్షించాయి . బాధ భరించలేక ,” అమ్మా, నన్ను మరిచిపోయావా అమ్మా? నన్ను నీ దగ్గరకి పిలిపించుకోవేమమ్మా?” అని పైకే శోకాలు పెట్టాడు.

హఠాత్తుగా నిర్మల గదివైపు వచ్చింది. నెయ్యి ముంత తీసుకుని సియారామ్ వెళ్ళిపోయుంటాడని అనుకుందామె.వాడింకా అక్కడే కూర్చునుండటం చూసి,” ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక వంటెప్పుడు చేస్తాను?” అంది కోపంగా.

సియారామ్ గబగబా కల్ళు తుడుచుకుని,”నాకు స్కూలుకి ఆలస్యమౌతుంది,”అన్నాడు.

ఒక్క రోజు ఆలస్యంగా వెళ్తే కొంపలేమీ మునిగిపోవు.ఇదీ మన ఇంటి పనేగా?” అంది.

రోజూ పనులతోనే సరిపోతోంది. ఎప్పుడూ స్కూలుకి ఆలస్యమే.ఇంట్లో కూడా చదువుకునేందుకు తీరికుండదు. బజారుకీ ఇంటికీ ఇన్నిసార్లు తిరగటం, మీ చేతా, దుకాణంవాడి చేతా తిట్లు తినటంనాకు ఇదేమీ బాలేదు, మీదేం పోయింది?”అన్నాడు సియారామ్.

అవును , నేను నీ శత్రువుని కదా?నాలో నీకంతా చెడే కనిపిస్తుంది.అయినా నీ తప్పేముందిలే,సవిత్తల్లి ఎప్పుడూ చెడ్డదేగా?కన్నతల్లి విషం పెట్టినా అమృతంలా ఉంటుంది.నేను అమృతం తాగించినా అది విషంగా మారిపోతుంది.మీ అందరివల్లా నా బతుకు బండలైంది.ఏడుస్తూనే బతుకుతున్నాను. దేవుడు అసలు నన్నెందుకు పుట్టించాడో ! నేను చాలా సుఖంగా బతుకుతున్నానని నువ్వనుకుంటున్నావు.నిన్ను పీడించటం నాకు 

చాలా ఆనందంగా ఉంటుందికదూ? భగవంతుడిక్కూడా నా సంగతి పట్టలేదు,నన్ను తీసుకుపోతే మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి.”

చివరి మాటలంటూ ఉంటే నిర్మల కళ్ళలో కన్నీళ్ళు ఉబికాయి.ఆమె లోపలికెళ్ళిపోయింది. నిర్మల అలా ఏడవటం చూసి సియారామ్ బెదిరిపోయాడు.పశ్చాత్తాప పడలేదు కాని, తనని శిక్షిస్తుందేమోనని భయపడ్డాడు.మాట్లాడకుండా ముంత పట్టుకుని దుకాణంలో వాపసు ఇచ్చేందుకు బైలుదేరాడుపరిచయం లేని కొత్త ఊళ్ళోకి కుక్క వచ్చినట్టుంది వాడి పరిస్థితి!వాడు అనాథ అని గ్రహించేందుకు చూసేవాళ్ళకి పెద్ద తెలివితేటలు అవసరం లేదు.

[సియారామ్ నెయ్యి ముంతతో దుకాణం చేస్రుకున్నాడు. వాడి గుండె వేగంగా కొట్టుకుంటోంది. వాణ్ణీ, వాడి చేతిలో ముంతనీ చూడగానే దుకాణదారు, నెయ్యి వాప్సు తీసుకోనని చెప్పా కదా అన్నాడు.సియారామ్ అతనితో వాదించాడు కానీ ఏమీ లాభమ్ లేకపోయింది.]

దుకాణం లో ఒక జడల సాధువు కూర్చునున్నాడు.అతని పేరు పరమానంద్. గొడవంతా తమాషా చూస్తున్నాడు.చివరికి లేచొచ్చి నెయ్యి వాసన చూసి, “నెయ్యి చాలా బాగుందే,ఎందుకు గొడవపడుతున్నావు? దీన్నిఇంటికి తీసుకెళ్ళు బాబూ,”అన్నాడు.

సియారామ్ కి ఏడుపొచ్చింది.నెయ్యి బాగాలేదనటానికి ఇక సాకులేవీ లేకపోయాయి.”ఆవిడే బాగాలేదు ఇచ్చేసి రమ్మంది!” అన్నాడు ఏడుస్తూ.

ఎవరా అన్నది?”

వీడి తల్లే, వస్తువూ ఆమెకి నచ్చదు, సవిత్తల్లి కదా,మాట్లాడితే కొట్టుకి వెళ్ళమని తరుముతుంది.కన్న తల్లైతే కాస్త ప్రేమగా ఉంటుంది,” అన్నాడు దుకాణదారు.

సాధువు సియారామ్ వైపు జాలిగా చూస్తూ,” మీ అమ్మ పోయి ఎన్నాళ్ళైంది బాబూ?” అన్నాడు.

ఆరేళ్ళయింది.”

అంటే అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివన్నమాట.భగవంతుడా నీ లీలలు ఎవరర్థం చేసుకోగలరయ్యా! పసివాడిని తల్లిలేనివాడిగా చేశావే,ఎంత నిర్దయుడివి!బాబూ, షావుకారూ,పాపం పిల్లవాడిచ్చే నెయ్యి వాపసు తీసుకో,లేకపోతే వీళ్ళమ్మ ఇంట్లోకి రానివ్వదు,”అన్నాడు సాధువు.

[దుకాణదారు వేరే నెయ్యి ఇచ్చాడు.సాధువు సియారామ్ వెంట నడవసాగాడు. తీయటి మాటలు మాట్లాడాడు.తను కూడా సవిత్తల్లి వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పాడు.అందుకే ఇల్లు వదిలి ఇలా సాధువునైపోయానని అన్నాడు.సియారామ్ కి ఇంట్లోంచి పారిపోవాలన్న ఆలోచన చాలా సార్లు ఇంతక్రితమే వచ్చింది.కుతూహలంతో ఇల్లు వదిలి ఎక్కడికెళ్ళారని సాధువుని అడిగాడు.]

ఇల్లు వదిలి వెళ్ళిన రోజే నా కష్టాలన్నీ తీరాయి.నాకు ఒక మహత్ముడు దొరికాడు.ఆయన నాకు యోగవిద్య నేర్పాడు.నన్ను తన వెంట ఎన్నో దేశాలు తిప్పాడు.ఇప్పుడు యోగవిద్య నాకు పూర్తిగా కైవసమైంది. మా అమ్మ ఆత్మతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడగలను.”

మీ అమ్మ చనిపోయిందా?” అన్నాడు సియారామ్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి.

అవున్నాయనా, అయినా యోగవిద్య తెలిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడచ్చు.”

అయితే నేనూ నేర్చుకుంటామా అమ్మతో మాట్లాడతా!”

తప్పకుండా నాయనా.”

మీరు నేర్పిస్తారా?”

అలాగే.”

సరే నేనింక ఇటు వెళ్తాను,”అన్నాడు సాధువు.

మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు?”

త్వరలో వస్తాలే.మీ ఇల్లెక్కడ?”

మా ఇల్లు ఇక్కడికి దగ్గరే.నాతో ఇపుడు వస్తారా?” అన్నాడు సియారామ్ ఉత్సాహంగా.ఇద్దరూ వాడి ఇంటి ముందుకి వచ్చారు.”లోపలికి రండి,”అన్నాడు సియారామ్.

లేదు నాయనా, రేపో ఎల్లుండో వస్తాను.ఇదే కదా మీ ఇల్లు?”

రేపు ఎప్పుడొస్తారు?”

కాస్త తీరిక దొరకగానే వస్తాను.”అని సాధువు కదిలాడు.కొంత దూరం వెళ్ళాక అతనికి మరో సాధువు తగిలాడు.అతని పేరు హరిహరానంద్.

ఎక్కడేక్కడ తిరిగొచ్చావు? పిట్టేదైనా వల్లో పడిందా?” అని పరమానంద్ ని అడిగాడు

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.