ఆద్యంతం చదివించగలిగే ”గల్పికా తరువు”

-శైలజామిత్ర

 

ఇదొక కరోనా సమయం. బయట ప్రపంచంలో ఎవరున్నారో, ఎక్కడున్నారో తెలియని అగమ్యగోచరం. ఉద్యోగాలు, కళలు, చేతివృత్తులు  అన్నీ మూతపడ్డాయి. ప్రపంచం నాలుగు గోడల మధ్యకు చేరిందా? లేక ప్రపంచాన్నే నాలుగు గోడలతో మూసేసారా అన్నంత భావన. ఒంటరితనం. లేమితనం. నిర్భంధాల్లో బంధాలు. పలకరింపు లేవు. వీధులన్నీ జంతువులు, పక్షుల  పరమయ్యాయి. అడవులు  విశాలమయ్యాయి. కొత్త పక్షులతో  ఆకాశం మురిసిపోయింది. అంతా నిశ్శబ్ధం. కరోనా కరచాలనంతో బయట ఏమి జరుగుతోందో, ఏ దేహం ఎందుకు కన్నుమూసిందో తెలియని నిశ్శబ్ధం. బతకాలనే తపన, బతికి ఉన్నన్నాళ్ళు ఏమీ చేయలేకపోయానే అనే ఆవేదన, చనిపోయిన వ్యక్తి భర్తయినా, తల్లయినా, తండ్రయినా  ఆఖరికి బిడ్డయినా ఆయా సంబందిత దేహాలు ఆఖరిచూపు కూడా నోచుకోకుండా  దహనమవుతుండటం గుర్తొస్తుంటే నిజంగా భయానక వాతావరణంలో మనం జీవించామో  తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది.    


ఇలాంటి అగమ్య గోచరంలో చిక్కటి కవితల కవయిత్రి జ్వలితకి వచ్చిన ఆలోచనే ఈ ‘‘గల్పికా తరువు’’  ఒక్క పేజీకి మించని కథ. చాలామందికి ‘‘గల్పిక’’ అనే పదానికి అర్థమే తెలియదు. తెలియజేసి మరీ రచింపజేసిన కవయిత్రి, రచయిత్రి జ్వలిత. భావ ప్రకటనకు ఏ రూపమైతేనేమి అంటూ లేఖాసాహిత్యం కూడా వీరి సంపాదనలో సాహిత్యంలో మెరుపును పోలిన ప్రక్రియ ‘గల్పిక’. పదిపేజీల కథను ఒక్క పేజీకి ఇమడ్చగలిగే సత్తువ కలిగినది ఈ ‘గల్పిక’.


‘‘గల్పిక’’ ఒక మినీ కథ ప్రక్రియ కిందికే వచ్చినా మినీ కధ కాదు. మినీ కథలు  వేరు. గల్పిక వేరు. చదువుతున్నప్పుడు విషయం అర్థకాకుండా ఆద్యంతం చదివిన తర్వాత విషయం అర్థమయ్యేదే గల్పిక.  కాలం  మారుతున్న కొద్దీ ఆలోచలను సరికొత్త దుస్తుల్ని ధరిస్తున్నట్లే, సాహితీ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ భావాల అంచుల  దగ్గరకు వస్తున్నాయి. నాలుగు అంచుల్లో విస్తరించాల్సిన విషయాన్ని రెండంచులకే పరిమితం చేయటం. ఇప్పుడు కత్తికి ఒకవైపే పదును అన్న తీరులో ఏ సమస్యకైనా ఒకే అంచు అన్నది నేటి వాదన.  కట్టెకొట్టె తెచ్చె అన్న రీతిలో విషయాన్ని హాస్యభరితంగా, వ్యంగ్యంగా, వస్తు వైవిధ్యంతో తీర్చిదిద్దగలిగేదే గల్పిక. ఒక పేజీ నిడివిలో మన మేధస్సును కనబరచి జీవితాన్ని వ్యాఖ్యానించగగాలి.  అయితే ఒక కథానికకు, ఒక కథకు ఉన్నంత స్వేచ్ఛ ఇందులో ఉండదు. విషయ విపులీకరణలో అన్నీ భావాలు  ఒకచోట చేరాలి అనేదే గల్పిక సిద్దాంతం.  కాకుంటే వస్తువులో స్పష్టత, శిల్పంలో  పదును ఉండాలి. హిందీ సాహిత్యంలో ‘గల్ఫ్ ’ అంటే కథానిక. కానీ  తెలుగులో  కథానిక వేరు. గల్పిక వేరు. వ్యంగ్యం, వెటకారం రెండు సమపాళ్ళలో ఉంటే గల్పిక ప్రాణం పోసుకుంటుంది. విషయ విపులీకరణ అనేది ఏ ప్రక్రియలోనూ సహించేది కాదు.  


ఒక రాజు కష్టాలు  పడ్డాడు. తర్వాత సైన్యంతో కలిసి పోరాడి చివరకి సుఖంగా జీవించినంత కాలం  జీవించాడు అనేది గల్పిక కాదు కదా అసలు  ఏ ప్రక్రియకూ సంబంధించినది కాదు. పాఠకుల  మదికి పనిపెట్టడమే ఏదైనా అనేది తెలుసుకోవాలి. ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వారు కొడవటిగంటి కుటుంబరావు గారు. అందుకు వీరి ‘‘ఎన్నిక ప్రచారం, ‘పందికొక్కులు ’ అనే రాజకీయ వ్యంగ్య గల్పికలే తార్కాణం. ప్రముఖ కథకులు విహారి గారు అన్నట్లు మొదట గల్పిక కన్ను ముక్కులేని మనిషిలా అనిపిస్తుంది. కానీ పరికించి చూస్తే కనిపించే ఆకారమే ‘‘గల్పిక’’. ఈ విషయం తెలిసుకున్నప్పుడే మనం రచించే రచనలో పరిపక్వత నోచుకుంటుంది. ఎప్పుడైతే పాఠకుల  మెదళ్ళకు ఆలోచించే శక్తిని కలిగిస్తుందో అది తప్పకుండా ఉత్తమ కథగా నిలిచిపోతుంది. అంటే పాఠకుల  మెదడుకు విజ్ఞానాన్ని కలిగించేదే గల్పిక.


తెలంగాణ సాహిత్యంలో యశోదారెడ్డి, బొమ్మ హేమాదేవి,కాలువ మల్లయ్య , రామాచంద్రమౌళి, బియస్‌.రాములు , శిరంశెట్టి కాంతారావు, జాతశ్రీ, పెద్దింటి అశోక్‌కుమార్‌ వంటి వారే కాక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేతు విశ్వనాథ రెడ్డి, డాక్టర్  కె.గీత, తాతినేని వనజ, చివుకుల  శ్రీలక్ష్మి వంటి వారు గల్పికా రచనలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు. మినీ కధలు , కాలమ్‌ కథలు , కార్డు కధలు  అనే ప్రక్రియలు  కూడా ఇటీవల  కాలంలో వేటి స్థానం అవే తమ ప్రత్యేకతను నిరూపించుకుంటున్నాయి. గల్పికా ప్రక్రియ కనుమరుగు అవుతుందేమో అనుకునే క్రమంలో ప్రముఖ కవయిత్రి, కథయిత్రి జ్వలిత  ఈ నిర్ణయం తీసుకున్నారు.  గల్పిక ఎలా రాయాలో తెలియజేస్తూ గల్పిక స్థానాన్ని మరింత పటిస్ట పరచడంకోసం వీరు చేసే ప్రయత్నం కడు ప్రసంశనీయం.


ఈ సంకలనంలో రెండు కొత్త విషయాలు  ఉన్నాయి. ఒకటి రచయిత్రు పేర్లు, వారి కధ వద్ద లేకపోవడం, రెండు వారి పేర్లు కావానుకుంటే వెనక పేజీల్లో వారి చిరునామాతో సహా పొందుపరచడం బావుంది. బావుంది అని ఎందుకు అంటున్నాను అంటే ముందు మాట రాసిన ప్రముఖులకు కూడా ఈ విషయంలో సులువై ఉంటుంది అని నా నమ్మకం. కేవలం  కథ మాత్రమే కనిపిస్తుంది తప్ప రచించినవారు కనిపించకపోవడం వారికి ఎంతో సులువై వుంటుందని నా నమ్మకం. ఒక విధంగా సమీక్ష ద్వారా నాకు చాలా సులువు అయ్యిందని ఒప్పుకుంటున్నాను.  


ఇక ఈ ‘‘గల్పిక’’ విషయానికి వస్తే .. చాలా వరకు ఇందులో కథా సారాంశం శీర్షికలోనే కనిపిస్తోంది. గల్పికలో ఇది కూడా ముఖ్యం. శీర్షిక వస్తువును తెలప కూడదు. కానీ చాలా వరకు కథల్లో ఈ విధానం కనిపిస్తుంది. కొన్ని జరిగిన సంఘటనను వివరిస్తూ,  గల్పికగా భావించడం జరిగింది. అలా గల్పిక లక్షణాలను కలిగి వున్నగల్పిక  ‘‘ఆ చెట్టు కొమ్ములు ’’,  ఇందులో  కొడుకు మాటల్లోనే తండ్రి తనను తాను చూసుకుని మురిసిపోవడం బావుంది. మనిషి పోతే గానీ మివ తెలిసిరాదు అనే విషయాన్ని ఎంతో సున్నితంగా తెలిపిన గల్పిక ‘‘ఆమె విలువ’’, స్నేహం విలువ తెలిపే గల్పిక ‘‘ఆలోచన’’. పెద్ద పెద్ద ఉద్యోగాలు  సైతం మనల్ని విడిచిపోతాయి కానీ నేల తల్లి మాత్రం నిత్యం మనల్ని కాపాడుతుందనే ధోరణిలో సాగిన గల్పిక ‘‘ఆసరా’’. తాను పొందలేని ఆనందాన్ని తన కూతురులో చూసుకోవాలనే నెపంతో కూతురుకి వేషధారణలో స్వేచ్ఛను కల్పించిన తీరు ‘‘అంగార ధారిక’’ లో కనిపిస్తుంది. తాను కోరుకున్న గ్రంథావిష్కరణ జరుపుకున్న   తీరు ‘‘అంతర్మథనం’’ గల్పికలో కనిపిస్తుంది. వృక్షాల  గొప్పదనాన్ని వివరించే ధోరణిలో ‘‘అంతరార్థం’’ గల్పిక సాగుతుంది. అలాగే ఇది కల కాదు, ఆ యుద్దం వెనుక, ఉల్లిపాయలు , ఎదరీత, ఏమివ్వగలను?, ఒక్క క్షణం, కన్నీటి మడుగు, కనువిప్పు, కరోనా సోకితే, కొలువు, ఘటన, చాకచక్యం, జ్ఞాపకం గల్పికలు  దాదాపుగా గల్పిక లక్షణాలను కలిగి వున్నాయి.  


ఈ సంపుటిలో ప్రత్యేకతను కలిగి ఉన్న గల్పికలు  కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా “లేఖోపాఖ్యానం ” గల్పికలో స్మైలీ (చిరునవ్వు), లైకీ (ఇష్టం ) అనే రెండు సామాజిక మాధ్యమాల్లో ఎంతగా ప్రాముఖ్యతను చాటుకుంటున్నాయో అనే విషయాలను, తమను తాము ఇతరులకంటే గొప్పవారమంటూ తెలుపుకోవాలని నేటి నెటిజన్ల పాట్లు తెలియజేస్తూ చాలా సరదాగా సాగింది. అలాగే కష్టాలు  వచ్చినప్పుడు పరిష్కారం మన కళ్ళముందే కనిపిస్తున్నా ఆ దేవుడిపై భారం వేసి తామేదో కోల్పోయామని బాధపడటాన్ని తెలిపే గల్పిక ‘‘జంగమయ్య మాట’’ అనాధ పిల్లవాడిని పెంచి పెద్దచేసే పెద్ద మనసును తెలిపే గల్పిక ‘‘దేవుడమ్మ’’, మనకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండాలి అని తెలిపే గల్పిక ‘‘రాగి చెంబు, తాబేలు, కుందేలు తత్వాన్ని మరో కోణంలో చూపిన గల్పిక ‘‘ముందు చూపు’’ , ఒక్కోసారి కలలు  కూడా జీవితంలోని నిర్ణయాను మార్చేస్తాయని సాగిన గల్పిక ‘‘నిర్ణయం’’, లో స్వరంతో మాట్లాడినా అది లోపలి స్వరం కాదు గుండెల్ని గాయాలు చేసే ఆర్తనాదం అని తెలిపే గల్పిక ‘‘లో ‘స్వరం’, బేతాళుడిని సైతం ఆలోచింపజేసిన ప్రశ్నతో సాగిన గల్పిక ‘‘విక్రమార్క భేతాళం’’. సరదాగా సాగిన గల్పిక ‘‘తలుపుగొట్టిన గణపయ్య’’ ఇలా ఒక్కటేమిటి ? ప్రతీ గల్పిక తమదైన శైలిలో తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. కథయిత్రుందరికీ అభినందనలు.


పిండి ఏదయినతేనేం? వండటం రావాలి అంతే అన్నట్లు రాయడం రావాలే కానీ వస్తువు ఏదయినతేనేం? అనిపిస్తుంది ఈ గల్పికలు  చదువుతుంటే.. ఐదారు పేజీలు  రచించినా రాని స్పష్టత ఈ గల్పికల్లో ఉన్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రచించడం రచయిత లక్షణం. రచింపజేయడం మానవీయ 

లక్షణం. ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకనాటికి రచయితలుగా పిలవబడుతారు. అదే అన్ని ఆలోచనల్ని ప్రోత్సహించి, వారికో స్థానాన్ని కలిగించే మానవీయ మాత్రులు మాత్రం  అరుదుగా కనిపిస్తారు. వారు చరిత్రలో నిలిచిపోతారు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి చక్కని గ్రంథాన్ని తెలుగు సాహిత్యానికి కానుకగా అందించిన సంపాదకురాలు  జ్వలిత గారికి నా హృదయపూర్వక అభినందనలు. రాబోయే రోజుల్లో ఇదివరలో వచ్చిన పెద్దల గల్పికలతో పాటుగా మరొకొందరిని చేర్చి మరో గల్పిక గ్రంధం తీసుకురావాలని నా అభ్యర్ధన. 


పుస్తక వివరాలు

జె.డి.పబ్లికేషన్స్, సంపాదకురాలు – జ్వలిత,

పుస్తకం పేరు – గల్పికా తరువు, వెల- 200

పేజీలు -136, ప్రథమ ముద్రణ – డిసంబరు 2020.


పుస్తకం లభించే చోటు

జ్వలిత, సాహితీవనం, 15-21-130/2,

బాలాజీనగర్, కుకట్పల్లి- 72, హైదరాబాద్.

మొబైల్ – 9989198943.

*****
Please follow and like us:

One thought on “ఆద్యంతం చదివించగలిగే ”గల్పికా తరువు””

Leave a Reply

Your email address will not be published.