యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-8

మధ్యాహ్నం లంచ్ అంటూ ఏవీ తినలేదేమో సాయంత్రానికే అందరికీ కరకరా ఆకలి వెయ్యసాగింది. కొండ పైనున్న మా బసకి మా బస్సు మలుపు తిరిగే రోడ్డు దగ్గిర ఏవో రకరకాల హోటళ్లు ఉండడం చూసేం. మరో అరగంటలో పిల్లల్ని హోటల్లో దించేసి కాస్త మొహాలు కడుక్కుని కొండ దిగువకి వెళ్తున్న బస్సు పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చాము.   

ప్రధాన రోడ్డు పక్కన ఉన్న సర్వీసు రోడ్డుని మీద ఉన్న చిన్న చిన్న దుకాణాల్ని వరసగా చూస్తూ నడవసాగేం. వరసగా గిఫ్ట్ షాపుల మధ్య అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న భోజనం దుకాణాల్ని, ఐస్క్రీము దుకాణాన్ని దాటుకుని చివరి వరకు నడిచి చివరికి హిందీలో పేరు రాసున్న ఒక భోజనం దుకాణాన్ని ఆశ్చర్యంగా చూసేం. అయితే అటూ ఇటూ పది నిమిషాల పాటు తిరిగినా అసలు దుకాణం ఎక్కడుందో అర్థం కాలేదు మాకు.      

మొత్తానికి కాస్సేపటికి కనిపెట్టినదేవిటంటే బయటికి కనిపిస్తున్న గిఫ్ట్ షాపులో నుంచే లోపలి వెళ్తే ఒక పక్కగా చిన్న కిచెన్, నాలుగు టేబుళ్లు వేసున్న ఏరియానే రెస్టారెంట్ అన్నమాట. అప్పటికి సిరి రెండ్రోజులుగా ఫుడ్ సరిగా తినడం మానేసింది. తనకి ఇండియన్ ఫుడ్ ఇష్టం కాబట్టి ఇతరత్రా తినడం లేదేమో అని బాధపడుతున్న మాకు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ చూడగానే గొప్ప సంతోషం వేసింది. నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కావడంతో రోటీలు, కర్రీలు, వైట్ రైస్ ఆర్డర్ చేసేం. ఒక గంట తరవాత కనబడమని రెస్టారెంటు ఓనర్ కమ్ కుక్ చెప్పడంతో బయటికి వచ్చేము. 

రోడ్డు దాటి అవతల వైపు ఉన్న మరొక రిసార్ట్ వైపు నడిచేం. 

కొండ దిగువన ఉన్నా చాలా బావుంది రిసార్ట్. పైగా కొత్తగా కట్టినట్టు ఉంది. లోపలే రెస్టారెంటు, గిఫ్ట్ షాపులతో కళకళలాడుతోంది. ఒకవేళ బైట ఏవైనా కొనుక్కోవాలన్నా రోడ్డు దాటితే చాలు. పిల్లలతో వచ్చిన మాలాంటి వాళ్ళకి ఇదే ఉత్తమం. ఈ సారి వస్తే ఇక్కడ బస తీసుకోవడం మంచిదని అనిపించింది.  

మాకు చెప్పిన సమయానికి అయిదు పదినిమిషాలు ఆలస్యంగానే వచ్చినా మరికాస్సేపు వేచిచూడవలసి వచ్చింది. పక్కపక్కనే ఉన్న గిఫ్ట్ షాపుల్లో పిల్లల కోసం ఏవో ఒకట్రెండు బొమ్మలు, చాకెలెట్లు కొన్నాం. 

అక్కణ్ణించి మలుపు చివరి వరకు నడిచి కొండమీదికి వెళ్లే బస్సు కోసం నిర్దేశించబడిన వేచి చూసే స్థలానికి వచ్చి నిల్చున్నాం. అది బస్టాండూ కాదు, కూర్చోవడానికి ఏవీ లేవు. బస్సొస్తే కనబడే దూరంలో ఉన్న చెక్క బెంచీ మీద చతికిలబడి దాదాపు అరగంట వేచి చూసేక వచ్చిన బస్సు పట్టుకుని మొత్తానికి ఎక్కేమ్. ఇక మొదటి మా బస్సు కొండమీద ముందు వచ్చే రిసార్ట్ దగ్గిర ఆగి, అక్కడి నుంచి ఐదునిమిషాలు తర్వాత మా రిసార్టుకి బయలుదేరింది. 

మేం ఎక్కడున్నామో అని మా పెద్దమ్మాయి వరూధిని అప్పటికే మాకు రెండు సార్లు ఫోను చేసింది. మా దగ్గిర ఫుడ్ చల్లారిపోతుందన్న ఆదుర్దా ఒక పక్క, మరోపక్క పిల్లల్ని ఇద్దర్నీ వదిలేసి వచ్చాము అన్న గాభరా.  అయినా చేసేదేం లేక మాట్లాడకుండా కూచున్నాం. తిరిగి హోటలుకి పరుగులాంటి నడకతో గదికి చేరేసరికి పిల్లలిద్దరూ హాయిగా టీవీ చూస్తూ ఉన్నారు. హమ్మయ్య అని స్థిమితపడ్డాం.  

మా చేతుల్లోని ప్యాకెట్లు చూడగానే గెంతుకుంటూ వచ్చి ఆకలి అంటూ చుట్టుముట్టేరు. నిజానికి ఫుడ్ అంత రుచికరంగా లేదు. అయినా అందరం చకచకా అవగొట్టేసేం.   కానీ సిరి ఎందుకో అస్సలు సరిగా తినలేదు. అసలే అలాస్కా వచ్చినప్పటి నుంచి మెల్లమెల్లగా తినడం తగ్గించేసింది. ఇక తనకిష్టమైన ఇండియన్ ఫుడ్ కూడా తినకపోయేసరికి నాకు బెంగ పట్టుకుంది. వీలైనంత వరకు జ్యూసులు, లిక్విడ్స్ ఇవ్వడానికి ప్రయత్నించేను. 

అసలే  ఆ మర్నాడు మేం తిరిగి వెనక్కి వెళ్లే ప్రయాణంలో భాగంగా తల్కిట్నా (Talkeetna) అనే ఊర్లో బస చేసి హెలికాఫ్టర్ ద్వారా గ్లేసియర్ల మీద దిగే అడ్వెంచర్ టూరు చెయ్యబోతున్నాం. 

కానీ సిరికి వొంట్లో బాలేక ఏవైనా మళ్లీ హడావిడి చేస్తుందేమో అని భయం పట్టుకుంది. అదృష్టం కొద్దీ జ్వరంవంటిదేవీ రాలేదు. కానీ డల్ గా అయిపోయింది. 

మొత్తానికి దేనాలి నేషనల్ పార్కు ఒక నిరాశని మిగిల్చింది. బహుశా టండ్రాలు మంచుతో కప్పబడిన వేళల్లోనే అందంగా ఉంటాయేమో. వేసవిలో చూసేందుకేమీ ఉండదేమో. కానీ చేసేందుకేమీ లేకపోవడం వల్ల కూడా నచ్చలేదు మా సత్యకి, పిల్లలకి. అంతదూరం వెళ్లినా స్థానిక జాతుల వారినెవరినీ చూసే అవకాశం ఎక్కడా కలగనందుకు నిరాశ కలిగింది నాకు.

****

(ఇంకా ఉంది)

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.