రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం

-శీలా సుభద్రా దేవి

వందేళ్ళ తెలుగు కథానికా ప్రస్థానంలో రచయిత్రుల కథానికల్లోని భాష కాలక్రమేణా ఏవిధంగా, ఏ రకమైన మార్పులకు లోనైందీ, నాటినుండి నేటివరకూ సామాజిక జీవితంలోని మార్పులు భాషపై ఏ రకంగా ప్రభావం చూపాయనే విషయాల్నీ, నా పరిశీలనాంశాలనూ ఈ వ్యాసంలో ప్రస్తావించదలిచాను.

ఏ కాలంలో జీవిస్తున్న రచయిత్రి రచనలపై ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావం ప్రతిబింబించటం సహజం అనేది ప్రతితరంలోనూ గమనించగలం.

తొలితరం కథారచయిత్రులు సుమారు పదిహేనుమంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన పేరు భండారు అచ్చమాంబ, ఈమె రచించిన ‘స్త్రీవిద్య’, ‘ధనత్రయోదశి’ తెలుగు సాహిత్యంలో రచయిత్రుల తొలికథలుగా చెప్పవచ్చు. ఈ కథలలో అచ్చమాంబ ఉపయోగించిన భాష పూర్తిగా గ్రాంథికంలోనే నడిచినా, విషయం మాత్రం ఆనాటికి ఆధునికంగానే ఉంటుంది. ఆనాటి కథా రచయిత్రుల కథలలో ఇదే పద్ధతిలోనే చాలావరకూ గ్రాంథిక భాషాఛాయ కన్పిస్తుంది. అచ్చమాంబ కూడా అందుకు భిన్నంగా రాయలేదు.

తొలిరోజుల నాటినుండీ నాగరికత, విద్యా, సంస్కృతీ అందుబాటులో ఉన్నవారు, విద్యని అభ్యసించే అవకాశం ఉన్నవారు కావటాన నాటి సాహితీవేత్తలు ఎక్కువమంది బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవాళ్ళే. అందువలన ఆనాటి కథలలోని భాష మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలకు చెందినదిగానే ఉండేది.

రామాయణం, మహాభారతం, కావ్యాలూ, ప్రబంధాలు అధ్యయనం చేసినవారు కావటాన తొలినాటి కథల్లో గ్రాంథికపరమైన కావ్యభాష రచయిత్రుల కథానికల్లోకి ప్రవేశించింది. తర్వాత శిష్ట వ్యవహారిక భాష కథల్లోకి వచ్చినా కావ్యభాష వాసనలు పూర్తిగా వదలకపోవటాన కొన్ని కావ్యాల్లోని పంక్తులు, సూక్తులు, నానుడులు యథాతథంగా కొందరి రచనల్లో దొర్లిపోతూ ఉండేవి.

ఆనాటి వైవాహిక సంబంధాల సరళిని తెలియజేసే కథానికలు ఎక్కువగా రాసిన రచయిత్రులలో పెద్దాడ కామాక్షమ్మ, భాస్కరమ్మ చెప్పుకోదగినవారు. 1930లలో కామాక్షమ్మ రాసిన ‘మా అమ్మే నాపాలిట రాక్షసి’ మొదలైనవి గ్రాంథిక భాషలోనే నడచిన కథలు. భాస్కరమ్మ 1930లో ‘లలిత’ అనే కథని శిష్ట వ్యవహారిక భాషలోనే రాశారు. అదేవిధంగా గుమ్మడిదల దుర్గాబాయి 1930లోనే ‘నేను ధన్యనైతిని’ కథ, 1934లో నండూరి సుబ్బలక్ష్మీదేవి కథ ‘స్త్రీతత్త్వం’, 1932లో ఐ.ఎస్‌. లక్ష్మి రాసిన ‘గయ్యాళి వదిన’ కథలు ఆధునిక వ్యవహార భాషలోనే రాసినా చివరి ముగింపులో మాత్రం ‘స్త్రీ వినా పురుషుడు శరీరంలేని ఆత్మవంటివాడు’ వంటి సూక్తులలో ముగించారు.

మాగంటి శకుంతలాదేవి రాసిన ‘సరస్వతి కష్టాలు గట్టెక్కుట’ కథలో కథంతా పూర్తి గ్రాంథికంలో రాయకపోయినా కథలో ప్రయోగించిన ధూమశకటం, రక్షకభటుడు, ప్రచారకుడు వంటి పదాలూ, ‘స్వగృహమున కుర్చీపై ఆశీనుడై’, ‘మాతృగృహమున సర్వాధికారిణియై’ వంటి వాక్యాలు గ్రాంథిక భాషకి దగ్గరగా వుంటాయి. అదేవిధంగా కందాళం కమల రాసిన ‘ఆడలేక మద్దెలమీద పడి కొట్టుకోవటమా’ అనే కథలో కూడా సంభాషణరూపంలో ఉన్నా గ్రాంథికపదాలు విరివిగా దొర్లాయి.

తొలితరం రచయిత్రులలో కాంచనపల్లి కనకాంబ తప్ప ఇతరుల కథలు పుస్తకరూపంలో వచ్చినట్లు లేదు. ఇటీవలే భండారు అచ్చమాంబ కథల సంపుటి వెలుగుచూసింది.

1940ల వరకూ కథలు రాసిన రచయిత్రులకు తెలుగు, సంస్కృతం తప్ప మరో భాష తెలిసే అవకాశం తక్కువ. పైగా వాళ్ళందరు చాలావరకు సంప్రదాయ కుటుంబాల నుండి వచ్చినవారే. అయినాకూడా వారు ఆనాటి సామాజిక పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ వీటి మధ్య నలిగిన స్త్రీ సమస్యల అవగాహనతోను, పరిశీలనతోను వారికి పరిచయం ఉన్న భాషలో రాశారు. అందుచేత వారిపై ఇతరుల సాహిత్యం ప్రేరణ కలిగించే అవకాశం లేదు.  వీళ్ళకి ఇజాలూ, వాదాలూ తెలియకపోవచ్చు. పాత్రోచితమైన భాషతో వారిచుట్టూ             ఉన్న కుటుంబాలలో నిత్యజీవితంలో వాడే వాక్య నిర్మాణమే ఉండేది.

1930లోనే దళిత స్పృహతో లీలా సరోజిని రాసిన ‘మాదిగవాడు’ కథ శిష్ట వ్యవహారిక సరళిలోనే సాగింది. అయితే ప్రధానపాత్ర మాట్లాడి ‘మీ డబ్బు దయతో తీసుకొని మాశాంతమును, హర్షమును, పాటలను మాకు ఇవ్వండి’ అన్న వాక్యాల వంటివి చదివినప్పుడు అవి ఒక శ్రమజీవులు మాట్లాడిన వాక్యంలా ఉండదు. రచయిత్రి భాషలాగే ఉంటుంది. ఇక్కడ రచయిత్రి సంస్కారము, భాషాప్రయోగము వాక్యంలో వచ్చి చేరింది.

కనపర్తి వరలక్ష్మమ్మ రాసిన ‘మావూరు’, ‘పెంచినప్రేమ’, ‘ఒట్లు’ మొదలైన కథల్లో స్త్రీ విద్య, పునర్వివాహాలు, దారిద్య్రం, ప్రేమ, దాంపత్య సంబంధాలు వంటివే కాక, సహాయ నిరాకరణోద్యమం, చారిత్రక నేపథ్యం నుంచి కూడా కథానికలు రాశారు. ఈమె చాలావరకూ శిష్టవ్యవహారిక భాషలోనే రాసినా ప్రాంతీయ ప్రభావం రచనలలోని భాషలో ఎక్కువగా తొంగిచూస్తుంది.

ఈ తరంలో భాషా సాహిత్యాలు ప్రధానాంశాలుగాగల కథలు చాలా కనిపిస్తాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాలకు సంబంధించిన చర్చ ఆనాటి కథలలో కొన్నింటిలో సందర్భానుసారంగా మాత్రమే వచ్చింది. గుమ్మడిదల దుర్గాబాయి ‘పశ్చాత్తాపం’ కథలో సామాన్య అక్షరాస్యురాలైన భార్యకి ఆంగ్లభాష గొప్పదనాన్ని భర్త వివరించటం చర్చగా నడుస్తుంది.

1935లోనే గొట్టుముక్కల మంగాయమ్మ అనే దళిత రచయిత్రి రాసిన ‘అయ్యోపాపం’ అనే కథానికలో అక్కడక్కడ సంభాషణలలో ఆ ప్రాంత దళిత మాండలికాన్ని ప్రయోగించారు.

లీలావతి, పి. శేషమ్మ కథలు సాధారణ కుటుంబ సమస్యల చుట్టూనే అల్లుకొని ఉంటాయి. వీరిలో పి. శేషమ్మ సరళ గ్రాంథికంలో అరసున్నలతో సహా రాశారు. అప్పట్లో రాసిన రచయిత్రులు చాలామంది బండి ‘ఱ’ అక్షరాన్ని  అవసరమైనచోట్ల విరివిగానే ప్రయోగించారు. రామరత్నం వంటివారు కథలో వాడిన భాషా, సామాజిక నేపథ్యం సనాతనంగా ఉన్నా ముగింపులో మాత్రం ఆధునికత చూపారు.

క్రమంగా స్త్రీవిద్య వ్యాప్తి చెందటంతో రచయిత్రులు-ముఖ్యంగా అగ్రవర్ణాలకు చెందిన రచయిత్రులు-చదువుకున్నవారు కావటం, చలం, కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం వారిపై ప్రభావం చూపటం వీటన్నిటి వలన తర్వాతితరం రచయిత్రులు పూర్తిగా వ్యవహారభాషలోనే రాయటం మొదలైంది.

అంతవరకూ కావ్యభాషలో గ్రాంథికంగా నడిచిన కథానిక నానాటికీ ఆ బంధనాల్ని ఛేదించి వ్యవహారికభాషలో మెరుగులుదిద్దుకుంటూ పరుగులు తీసింది. కఠినమైన వాక్యాల్ని, పదబంధాల్నీ తప్పించుకొని సరళమైన వాక్యవిన్యాసాన్ని నింపుకుంది.

మొదట్లో వర్ణనల్తో నిదానంగా సాగిన కథానిక తదనంతరం వర్ణనలుతగ్గి, సాధారణ సంభాషణలూ, సంఘర్షణలతో ఆనాటి కాలానికి తగిన వ్యవహారిక భాష చోటుచేసుకున్నాయి. మెరిసే ముగింపుతో పూర్తవుతున్నాయి. మొదట్లోలా కథారచనలోని నియమనిబంధనలకు అడ్డుకట్ట కడ్తూ నడపకుండా స్వేచ్ఛగా స్పష్టమైన భాషతో చెప్పే పద్ధతి వచ్చింది.

రెండోతరం రచయిత్రులైన ఇల్లిందల సరస్వతీదేవి, కొమ్మూరి పద్మావతి, యల్లాప్రగడ సీతాకుమారి, విమలాదేవి, పాకాల రాజామణి, పంతం అమ్మాజీ,         ఉన్నవ విజయలక్ష్మి వంటివారు పూర్తిగా వ్యవహార భాషలోనే కథలు రాశారు. ఇతర భాషాపదాల్ని దొర్లించకుండా స్వచ్ఛమైన తెలుగు పదాల్నే ఉపయోగించారు.

శివరాజు సుబ్బలక్ష్మి, ఆచంట శారదాదేవి మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ పురుష సంబంధాలు, కుటుంబ సమస్యల్ని చిత్రించారు. వీరి రచనల్లో ప్రాంతీయ భాషానుడికారం ఉంది.

ఇతర ప్రాంతాలకి చెందిన వారిలో అతి తక్కువమంది రచయిత్రుల్ని గుర్తించగలుగుతున్నాము. ఎందుకంటే వారు కూడా ప్రామాణిక భాషనే కథానికా రచనకు ఎంచుకోవటం వలన వారి ప్రాంతీయతని ప్రత్యేకంగా గుర్తించే వీలులేకపోయింది. కుటుంబాలలో, ఉద్యోగాలలో సామాజిక జీవితంలో మాట్లాడుకొనే పద్ధతిలోనే వాళ్ళు రాసేరు.

మూడవతరంగా చెప్పుకోదగిన నిడదవోలు మాలతి, వాసిరెడ్డి సీతాదేవి, కె.రామలక్ష్మి, ద్వివేదుల విశాలాక్షి, రంగనాయకమ్మ, పి. సరళాదేవి, మాలతీ చందూర్‌, కళ్యాణ సుందరీ జగన్నాథ్‌, యశోదారెడ్డి మొదలైనవారు సాహిత్య రంగానికి వచ్చేసరికి కథానికాభాష, మరింత సరళంగా మారిపోయింది. గ్రాంథికం నుండి శిష్టవ్యవహారికం, అక్కడి నుండి ప్రామాణిక భాషగా రూపాంతరం చెంది పత్రికాభాష కథానికా సాహిత్యభాషగా స్థిరపడింది.

ఈతరం రచయిత్రులకు ఆంగ్లభాషతోనే కాక ఇతర భారతీయ భాషలతో కూడా పరిచయం ఉండడం వలన కుటుంబ పరిధిలోని ఇతివృత్తాలు తీసుకున్నా, సామాజిక సమస్యలపై స్పందించినా ఆ ప్రభావం వారి వారి వాక్యనిర్మాణంలోనూ, భాషలోనూ కనిపిస్తూ వచ్చింది. ఆలోచనా విధానంలోనూ, కథానికా శైలిలోనూ, రచనా పద్ధతిలోనే కాక భాషలోనూ సంక్లిష్టపదాలు లేకుండా సాధారణ పాఠకులకు కూడా అర్థమై మనస్సుకి హత్తుకునేలా ఆసక్తికరమైన సంభాషణలతో రచన           ఉంది.

కళ్యాణ్‌ సుందరీ జగన్నాథ్‌, వాసిరెడ్డి సీతాదేవి గ్రామీణ నేపథ్యం నుండి రావటం వలన కావచ్చు. భాషలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. అంతవరకూ బ్రాహ్మణ కుటుంబం, భాషా, సంస్కృతులతో మమేకం అయిన పాఠకులకు కొత్త జీవితం, కొత్త పరిసరాలు వీరి కథలను పరిచయం చేశాయి. సీతాదేవి దిగువ తరగతి మనుషుల జీవితాల్ని చిత్రించినా భాషలో మాత్రం పూర్తి ప్రాంతీయతని చూపలేదు. అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న పత్రికాభాషనే                      ఉపయోగించారు. అయితే యశోదారెడ్డి మాత్రం తన ప్రాంత మాండలికాన్ని తన కథల్లో చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది.

ఉన్నత, మధ్యతరగతి, సామాజికవర్గాలవారే అయినప్పటికీ దిగువ తరగతుల  వారి జీవితాలతో మమేకం అయిన కథకుల రచనలలో తప్పనిసరిగా ఆ వాసనలు తొంగిచూడటం అసహజం ఏమీ కాదు. శ్రమజీవుల కష్టసుఖాల్నీ, ఉత్పత్తిరంగాలకు చెందిన విభిన్న సామాజిక వర్గాలవారి జీవితాల్ని కథారూపంలోకి తెచ్చినప్పుడు పాత్రోచితమైన భాషనీ, ప్రాంతీయ నుడికారాన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది. పల్లెసీమలలోని వాడుకభాష సజీవమైనదిగా ఉండి ఆ ప్రాంత ప్రజాజీవితాన్ని స్పష్టంగా చూపగలుగుతుంది.

తొలిరోజుల్లో కథానికలు రాసిన రచయిత్రులు మామూలు గృహిణులు. కానీ ఇప్పుడు రాస్తున్నవారు చాలావరకూ విద్యావంతులు, ఆర్థిక స్వావలంబన కలిగినవారు. ఆనాటివారు రాసిన సమస్యలనే నేటికీ కొద్దిమార్పులతో తిరిగి కొత్తపరిసరాల్ని కల్పిస్తూ, కొత్త వాక్య విన్యాసంతో కొత్తరూపంలో కథానికల్ని మార్చటం గమనించవచ్చు.

అంతవరకూ ఒకే పద్ధతిలో ఏరులా సాగే రచయిత్రుల సాహిత్య ప్రస్తానంలో మార్పు వచ్చింది. 80వ దశకానికి వచ్చేసరికి సామాజిక ఉద్యమాల ప్రభావం, విప్లవ సాహిత్యసంస్థల ఆవిర్భావం వీటికారణంగా రచయితలలో ఏ విధమైన ప్రభావం చూపిందో అదేవిధంగా రచయిత్రుల పైనకూడా కొంత ప్రభావం చూపింది. మూసధోరణిలో సామాజిక మార్పును పట్టించుకోకుండా తమధోరణిలో రాసుకుంటూపోతున్నవాళ్ళు  ఎందరో వున్నా ఉద్యమ ప్రభావాలకి పరోక్షంగా ప్రభావితులైన వారుకూడా కొద్దిమంది రచయిత్రులలోనూ ఉన్నారు.

అభ్యుదయ, విప్లవ ఉద్యమాల వల్ల వస్తువులో మార్పు వచ్చి వర్గస్పృహ కథానికలలో ప్రవేశించి సమాజంలోని అట్టడుగు ప్రజల గురించీ, కష్టజీవుల గురించీ రచనలు వచ్చినప్పటికీ అవన్నీ ప్రధానంగా ఆర్థిక సంబంధాల ప్రాతిపదిక మీదే సాగాయి. అందువల్ల భాషమీద దీని ప్రభావం అంతంతమాత్రంగానే వుంటూ వచ్చింది. ఇటీవలి కాలంలో అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాతనే మరీ ముఖ్యంగా దళిత, బహుజన, మైనారిటీ ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలూ వచ్చిన తర్వాత – ఆయా వర్గాల, ప్రాంతాల వాడుకపదాలు విశేషంగా దొర్లి కథారచన కొత్తపుంతలు తొక్కింది.

ఒకే పద్ధతిలో కథంతా నడపటం తగ్గి, కథానికలోని దిగువ తరగతికి చెందిన పనిమనిషి, లేదా ఉత్పత్తి రంగాలకు చెందిన పేద, పల్లెపట్టులకు చెందిన పాత్రలకు ఆ పాత్రకు తగినరీతిలో సంభాషణల ద్వారా ఆ ప్రాంతీయతనీ, ఆ పాత్రల సామాజిక వర్గ స్వరూపాన్నీ బహిర్గతం చేసే కథనరీతి యిప్పుడు వ్యాప్తిలోకి వచ్చింది.

ఉద్యోగరీత్యా రాష్ట్రేతర ప్రాంతాలలో నివసిస్తున్న రచయిత్రులు ఆయా ప్రాంతాల్లో, వ్యవహారంలో వున్న కొన్ని పదాల్ని సంభాషణల్లోకి తీసుకోవటమూ ఉంది. ఎందుకంటే కథనడుస్తున్న ప్రాంతాన్ని దృశ్యమానం చేయాల్సిన బాధ్యత రచయిత్రి మీద ఉంటుంది కనుక వాస్తవానికి దగ్గరగా చూపటానికి తగుమాత్రంగా ఉపయోగించారు.

అయితే అస్తిత్వవాదాలు ఎప్పుడైతే సాహిత్యరంగంలోకి వచ్చాయో అప్పటినుండి క్రమక్రమంగా భాషాప్రయోగాలలో కొత్తధోరణి అడుగుపెట్టింది. ఆయాప్రాంతాలు, ఆయా సామాజిక వర్గాలు మాట్లాడే వ్యవహారశైలి మొదట్లో పాత్రల సంభాషణలకు మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమక్రమంగా ఆయా రచయిత్రులు సంఖ్యలో కొద్దిమందే వున్నప్పటికీ ముందుముందు వీరి సంఖ్య మరింత పెరుగుతుందని గట్టిగా నమ్మవచ్చు. ఎందుకంటే వీరి రచనలకు పాఠకుల నుండి విశేషస్పందన లభిస్తోంది.

రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాలకు చెందిన యువరచయిత్రులు తమతమ ప్రాంతీయ అస్తిత్వాన్ని తమ రచనల ద్వారా చాటుకుంటున్నారు. ముఖ్యంగా దళిత, మైనారిటీ ఉత్పత్తిరంగాలకు చెందిన రచయిత్రులు ఆయా మాండలిక భాషల్లో సమాజంలో తాము అనుభవిస్తున్న పీడనలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు.

80 దశకం తర్వాత వచ్చిన అనేకానేక సామాజిక ఉద్యమాల ప్రభావం, ఇతరేతర వర్గాలకు, వర్ణాలకు చెందిన రచయిత్రుల సంఖ్య కూడా పెరగడం, ఎవరికి వారు తమ తమ అస్తిత్వాలను సాహిత్యంలో ప్రకటించుకోవాలనే భావంతో ప్రతీ ప్రాంతంలోనూ ప్రాంతీయ స్పృహ పెరగడంతో ఇటీవల కథానికలలో భాషాపరిణామంలో వేగం పుంజుకుంది.

రచయితలతో పోలిస్తే రచయిత్రుల సంఖ్య ప్రతీతరంలోనూ తక్కువగానే         ఉంది. రచయిత్రులలో ఇతరేతర ఉత్పత్తి రంగాలకు, దళిత, మైనారిటీ వర్గాలకూ చెందిన రచయిత్రుల సంఖ్య మరింత తక్కువవడంవలన ప్రాంతీయ మాండలిక భాషాస్పృహతో వస్తున్న రచయిత్రుల కథానికలు రాసిలో అతితక్కువగా ఉంటున్నాయి. అయినా ఆయా కథానికలు ప్రజలభాషనీ, జనజీవితాన్నీ దృశ్యమానం చేస్తూ సాహిత్యరంగంలో గుర్తింపు పొందుతున్నాయి.

ఇటీవల రాస్తున్న కొందరు రచయిత్రులు ఇప్పటి యువతరం ఉపయోగిస్తున్న హిందీ లేదా ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగుభాషల్ని కలగలిపి మాట్లాడే పద్ధతినికూడా ఆధునిక మహిళా పాత్రల సంభాషణల ద్వారా తమ కథానికల్లో తీసుకువస్తున్నారు.

నిజానికి ఈనాడు యువతరం మాట్లాడుతున్నది మూడు భాషల సమ్మేళనంగా మారిన యాంకర్ల భాషే. ఆధునికతని ప్రదర్శించుకోటానికి మాట్లాడటంవరకూ అయితే కొంతవరకూ సమంజసం అనుకున్నా తెలుగు కథానికల్లో అంతవిరివిగా ఇతర భాషల్ని వాక్యాలకు వాక్యాలే రాయటం అంత వాంఛనీయంకాదని విజ్ఞుల అభిప్రాయం.

తెలుగు సాహిత్యంలో అనేక వాదాలూ, ప్రతివాదాలూ పెరిగిపోయి, వర్గ, వర్ణ, ప్రాంతీయాలుగా చీలికలు ఏర్పడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, నిజానికి              వందేళ్ళుగా సాహిత్యం వారి వారి భావజాలాల్ని బట్టి సమాంతరంగా రెండు పాయలుగానే ప్రస్థానం సాగిస్తూ ఉంది.

ఈ ప్రస్థానంలో నాటి నుండి నేటివరకూ రచయిత్రులు కూడా పాల్గొంటూ భాషని మరింత పరిపుష్టం చేస్తూనే వస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయం. ఇకముందు కూడా రచయిత్రుల కలాలు యింకా ఎక్కువ సంఖ్యలో ఈ దిశలో సాగిననాడు ఇది మనకు సంతోషదాయకమే కాదు, గర్వపడే విషయంగాకూడా కాగలదు.

*****

Please follow and like us:

4 thoughts on “రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం”

  1. భాష మారడం సహజమే అయినా కథలలో తెలుగు నుడికారం సాహిత్యంవల్లే నిలుస్తుంది. కథలలో ఇలాగే మాటాడుతున్నాం అంటూ సుభద్రాదేవిగారన్న “యాంకర్లభాష” లో రాస్తే జానుతెలుగు సౌరభాలు తెలుగువారికే తెలీకుండా పోతాయి కాలక్రమంలో. కొన్ని కథలు చూస్తే తెలుగులో రాస్తున్నారో ఇంగ్లీషులో రాస్తున్నారో తెలీదు. ఇది రచయిత్రులే కాదు రచయితలు కూడా ఈవిషయం గమనించవలసిఉంది. సుభద్రాదేవిగారూ, వ్యాసం బాగుంది. మంచివిషయం ప్రస్తావించేరు.

  2. గ్రాంధిక భాష నుండి, వివిధ వాదాలకు సంబంధించిన భాష వైపుగా, అత్యాధునిక యువ రచయిత్రుల ఇంగ్లీష్ పదవిన్యాసం వరకు రచయిత్రుల భాష ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో సోదాహరణంగా చెప్పారు సుభద్రాదేవి.

Leave a Reply

Your email address will not be published.