షర్మిలాం “తరంగం”

ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ !

-షర్మిల కోనేరు 


ఏజ్ జస్ట్ ఏ నంబర్ !

ఈ మాట ఇటీవల తరచుగా వినబడుతోంది !
నేను మీడియాలో పనిచేసేటప్పుడు మా రిపోర్టర్లు 50 ఏళ్ళకు పైబడిన వారిగురించి వార్త రాసినప్పుడు 53 ఏళ్ళ వృద్ధుడనో , 52 ఏళ్ళ వృద్ధురాలనో రాసేవారు.
అసలు వృద్ధులు అనే పదం వాడొద్దనే దాన్ని.
వయోధికులు అని రాయమని చెప్పేదాన్ని .
కానీ ఇప్పటికీ వాళ్ళు మారలేదనుకోండి!
వయసు పెరగడాన్ని హుందాగా స్వీకరించాలి. అసహాయంగా ధ్వనించే ముసలాళ్ళు అనే పదం నేను ఏనాడూ నా తాత నాన్నమ్మలని గానీ ఇప్పుడు నా అమ్మా నాన్నలని గానీ అన్లేదు.
ఇంతకు ముందు తరాలు ఎంత పాలిష్ చెయ్యని బియ్యం తిని కాలుష్యం లేని వాతావరణంలో వున్నా ఓ 60 ఏళ్ళు దాటేటప్పటికి కర్ర పట్టుకుని నడిచే వారు.
నా చిన్నప్పుడు మా వూళ్ళో ఇంటికో ముసలి ప్రాణి మంచానపడి వుండడం నాకు తెలుసు.
కానీ ఇప్పుడు అలా కాదు వయసు మీద పడనీయని ఆలోచనలు వయసుని జయిస్తున్నాయి.
స్త్రీల మోనోపాజ్ కూడా ఆలస్యంగా వస్తోంది .
రుతుచక్రం పూర్వం 40 నుంచి 50 ఏళ్ళకు ఆగిపోతే ఇప్పుడు కొందరికి 56 ఏళ్ళ వరకూ కొనసాగుతోంది.
పూర్వం ఎముకల దృడత్వం కోల్పోయి వెన్ను పూస వంగి పోవడం వల్ల వయోభారం మీద పడగానే వంగి నడిచేవారు.
ఇప్పుడు వంగి నడిచే వాళ్ళు ఎక్కడా కనిపించడంలేదు.
వయసుని జయించినా కానీ వయసు మీద పడ్డాక వచ్చే సమస్యలని జయించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. వయోధికులు దీర్ఘకాలం ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు.
ఒంట్లో చేవ వున్నా ఇంట్లో పిల్లలు వుండరు!
ఏ దూర తీరాలకో ఎగిరిపోతారు.
భార్యా భర్తలిద్దరూ ఎప్పుడో కట్టుకున్న గూటికి కాపలా పక్షులవుతారు.
వయసుతో పాటు వచ్చిన సుగర్, బీపీలకు మందులేసుకుంటూ ఉప్పు తక్కువ కూరలు , తీపి లేని కాఫీలతో ఉదయపు లేదా సాయంత్రపు నడకలతో కాలక్షేపం చేస్తారు.
భార్యాభర్తల్లో ఒకరు లేకపోతే ఆ వంటరి జీవితం గడపలేక వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు.
మన దేశంలోని ముఖ్య పట్టణాల్లోనూ రిటైర్మెంట్ హోం లు వెలుస్తున్నాయి.
70 ఏళ్ళు దాటి 80 వ పడిలోనూ ఇళ్ళల్లో చాకిరీ చేసుకోలేక రిటైర్మెంట్ హోం బెటర్ అనుకుంటున్నారు.
మా గురువు గారు ఏబీకే (ఎడిటర్) ఆయనకి ఓపిక వుండగానే నలుగురు పిల్లలున్నా ఎవరి దగ్గరా వుండనని చెప్పి చండ్ర రాజేశ్వరరావు పేరిట నడిచే హోమ్ కి దంపతులు ఇద్దరూపదేళ్ళ కిందట వెళ్ళిపోయారు.
ఆయన భార్య గతించి రెండేళ్ళయ్యింది.
ఆమె లేరన్న లోటు తప్ప ఆయన దినచర్యలో ఏ మార్పూ లేదు.
నేను ఆయన హోం లో చేరిన కొత్తల్లో సార్ ఎందుకు ఓల్డేజ్ హోమ్ కి అన్నప్పుడు ఆయన ఈ మాటలు అన్నారు.
“ఎవరి ఇంట్లో వున్నా వాళ్ళ ప్రైవసీ కి భంగం వాటిల్లుతుంది.
ఇక్కడ మా ప్రైవసీ మాకు వుంటుంది ఆంటీ కూడా పని చేయలేక పొతోంది.
శుభ్రంగా టైం కి భోజనం అన్నీ సమకూరుస్తారు.
నేను రాసుకుంటాను ఆమె గార్డెన్ లో మొక్కల్లో ఓపిక వున్నంత సేపూ పని చేస్తుంది హాయిగా వున్నాం “…
ఆయనకి మొన్న ఆగస్ట్ కి 85 నిండాయి.
ఇంకా ఆయన కలానికి విరామం ఇవ్వలేదు.
వయోధికులూ ! నిజమే ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ !!
ఆత్మాభిమానంతో జీవించండి !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.