అనుసృజన

నిర్మల

(భాగం-14)

అనుసృజన:ఆర్. శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

ఇంతసేపయిందేం? ఎక్కడ ఆగిపోయావు?” అంది నిర్మల విసుగ్గా.

దారిలో ఒక చోట నిద్రొస్తే పడుకున్నాను,” అన్నాడు సియారామ్ పొగరుగా.

చాల్లే,టైమెంతయిందో తెలుసా? పదయింది.బజారు అంత దూరమేమీ కాదుగా?”

అవును, గుమ్మంలోనే ఉంది!” అన్నాడు సియారామ్ వ్యంగ్యంగా.

మర్యాదగా జవాబు చెప్పలేవా? నా సొంత పనిమీదేమైనా పంపించానా నిన్ను?”

అయితే ఎందుకలా పిచ్చిగా వాగుతున్నారు? కొట్టతను అంత సులభంగా ఒప్పుకుంటాడా? ఎంతసేపు వాదించానో ఏమైనా తెలుసా మీకు? చివరికి ఎవరో బాబా కల్పించుకుని అతన్ని ఒప్పిస్తే నెయ్యి మార్చాడు.”

ఒక్క నెయ్యి తెచ్చేందుకే ఇంత ఆలస్యం చేశావు.ఇక పొయ్యిలో కట్టెలకోసం పంపితే నువ్వొచ్చేసరికి పొద్దుగూకుతుందేమో! మీ నాన్నగారు భోంచెయ్యకుండా ఆఫీసుకెళ్ళిపోయారు.సరే వెళ్ళి కట్టెలు కొని తీసుకురా.”

సియారామ్ కి మండింది,”ఇంకెవరినైనా పంపించండి.నాకు స్కూలుకి ఇప్పటికే చాలా ఆలస్యమైంది.”

భోంచెయ్యవా?”

అక్కర్లేదు.”

కట్టెలు తెస్తే త్వరగా వండేస్తా.”

పనిమనిషిని పంపించండి.”

తను ఎలాటి వస్తువులు చూస్తుందో ఎప్పుడూ చూళ్ళేదా?”

నేనిప్పుడు వెళ్ళనంతే!” అన్నాడు సియారామ్ మొండిగా.

సియారామ్ చాలా రోజుల్నించీ స్కూలుకెళ్ళటం లేదు.దుకాణాలకి వెళ్ళి రావటంతో ఇంట్లో చదువుకునేందుకు కూడా తీరిక దొరకటం లేదు.స్కూలుకెళ్తే  టీచర్ చేత తిట్లూ, బెంచీ మీద ఎక్కించటం తప్పవు.ఇంట్లోంచి వెళ్ళేప్పుడు పుస్తకాలు వెంట తీసుకెళ్ళేవాడు.కానీ ఊరి బైట చెట్టు నీడనో కూర్చుని అలసట తీర్చుకునేవాడు,లేదా ఆర్మీ వాళ్ళ కవాతు చూస్తూ కాలం గడిపేవాడు.మూడు గంటలకి ఇంటికి వచ్చేవాడు. రోజు కూడా ఇంట్లోంచి బైలుదేరాడు కానీ కడుపులో ఎలుకలు పరిగెట్టటం వల్ల స్థిరంగా ఒకచోట కూర్చోలేకపోయాడు.’పది గంటలేగా, రెండు రొట్టెలు చేసి పెట్టుండచ్చుగా ? ఇంట్లో అసలు ఒక్క పైసా కూడా లేదా? ఏమైనా బజారునుంచి తెప్పించి ఉండచ్చు.మా అమ్మే ఉంటే ఇలా జరిగేదా? నేను తిండి తినకపోతే ఊరుకునేదా? ఇక నాకెవ్వరూ లేరు!’అని బాధ పడ్డాడు.

సియారామ్ కి హఠాత్తుగా సాధువు గుర్తొచ్చాడు.అయన్ని వెంటనే చూడాలనిపించింది.’ఆయనెక్కడున్నాడో?ఎక్కడ వెతకను? ఎంత చల్లని చూపు, మెత్తని మాట ఆయనది! అప్పుడే ఆయన వెంట వెళ్ళిపోతే బావుండేది.ఇంట్లో నాకిక ఏముందని అక్కడ ఉండను?’ ఇలా సాగింది వాడి ఆలోచన.

అంతే ,మధ్యాన్నం ఇంటికెళ్ళకుండా నెయ్యి కొన్న దుకాణానికి వెళ్ళాడు.అక్కడ మళ్ళీ సాధువు కనిపిస్తాడని ఆశ పడ్డాడు.కానీ ఎంతసేపు ఎదురుచూసినా సాధువు అటుకేసి రాలేదు.

ఇంటికొచ్చి గదిలోకెళ్ళి కూర్చున్నాడో లేదో నిర్మల వచ్చి,”ఇంతసేపెక్కడున్నావు?పొద్దున్న వంట కాలేదని అన్నం తినకుండా వెళ్ళిపోయావు.ఇంకా ఉపవాసమే ఉంటావా?వెళ్ళి బజారునుంచి కూరగాయలేవైనా తీసుకురా,” అంది.

రోజంతా ఏమీ తినలేదు.ఆకలి మండిపోతోంది.ఇంటికొచ్చినవాడికి కాస్త తాగేందుకైనా ఏమీ ఇవ్వకుండా బజారుకి తరమటమేనా?నేనేమీ మీ నౌకర్ని కాను.ఈపాటి కూలీ పని ఎక్కడైనా చేసుకుని పొట్టపోసుకోగలను.నాకోసం మీరేమీ వంట చెయ్యక్కర్లేదు,”అన్నాడు సియారామ్ దురుసుగా.

నిర్మల అవాక్కయింది. పిల్లాడికి ఇవాళ ఏమైంది?ఇంతవరకూ ఎదురు చెప్పకుండా చెప్పిన పని చేసేవాడు.అనుకుందే కాని వాడి చేతిలో నాలుగు పైసలు పెట్టాలని అప్పటికీ ఆమెకి తట్తలేదు.పిసినారితనం బాగా పెరిగిపోయింది. “మన ఇంటి పని మనం చేసుకోటం కూలి పనెలా అవుతుంది? అయితే నీలా నేను కూడా వంట చెయ్యనని అనచ్చు కదా?మీ నాన్నగారు ఉద్యోగం చెయ్యనంటే ఏమౌతుంది?నీకు వెళ్ళాలని లేకపోతే మానెయ్.బాజారు పన్లు చెయ్యటం నీకంత కష్టంగా ఉందని నాకు తెలీదు.ఇవాళ్టి నుంచీ నీకే పనీ చెప్పను, లెంపలేసుకుంటున్నాను, సరేనా?”

నిర్మల మాటలకి సియారామ్ కాస్త సిగ్గుపడాడు,కానీ కొట్టుకి వెళ్తానని మాత్రం అనలేదు.వాడి ధ్యాసంతా సాధువు పరమానంద్ గురించే.తన కష్టాలన్నీ తీర్చగల శక్తి సాధువుకే ఉండన్న నమ్మకం కలిగింది వాడికి.రోజంతా ఏమీ తినక ఆకలితో నకనకలాడుతున్నా అదేమీ లెక్క చేయక వాడు బజారంతా సాధువుకోసం గాలించాడు.ఎంత వెతికినా ఆయన కనిపించనే లేదు. అయినా వాడికి ఆశ చావక బజార్లు దాటి ఇంకా దూరం వెళ్ళాడు.

క్రమంగా వీధులు నిర్మానుష్యమయాయి.ఇళ్ళ తలుపులు మూసుకున్నాయి.వీధి పక్క పేవ్ మెంట్ల మీద వెదురు చాపలూ, గోనెలూ పరుచుకుని భారతదేశం ప్రజలు సుఖంగా నిద్ర పోయేందుకు సిద్ధమౌతున్నారు,కానీ సియారామ్ ఇంటికి వెళ్ళలేదు. ఇంటిమీద వాడికి విరక్తి కలిగింది.మనసు విరిగిపోయింది.’అక్కడ తనమీద ఎవరికీ ప్రేమ లేదు,ఇంకెక్కడా ఆశ్రయం దొరక్క అక్కడున్నాడంతే.ఇప్పుడు కూడా తను ఇంకా ఇంటికి రాలేదేమని ఎవరూ ఆందోళన పడుతూ ఉండరు.నాన్నగారు భోంచేసి పడుకునుంటారు,అమ్మ కూడా అంతే.నా గదివైపు ఎవరూ తొంగి కూడా చూడరు.అత్త మాత్రం గాభరా పడుతుందేమో.నేను ఇంటికి వెళ్ళేదాకా అన్నం తినకుండా ఎదురుచూస్తూ కూర్చుంటుంది!’

రుక్మిణి జ్ఞాపకం రాగానే వాడు ఇంటి దారి పట్టాడు.’ఆవిడ ఇంకేమీ చెయ్యలేకపోయినా తనని ఒళ్ళోకి తీసుకుని కన్నీరైనా కారుస్తుంది. తను బైటినుంచి రాగానే కాళ్ళూ చేతులూ కడుక్కునేందుకు నీళ్ళైనా అందిస్తుంది,’ అనుకున్నాడు సియారామ్.

అందరికీ పంచభక్ష్య పరమాన్నాలు దొరకవు.కొందరికి అసలు కడుపునిండా భోజనమే దొరకదు.కానీ ఇంటిమీద విరక్తి కలిగేది తల్లిలేని పిల్లలకే.

సియారామ్ నిరాశగా ఇంటికెళ్ళేందుకు వెనుదిరిగాడో లేదో పక్క సందులోంచి పరమానంద్ వస్తూ కనిపించాడు.వాడు పరిగెత్తుకెళ్ళి అతని చెయ్యి పట్టుకున్నాడు.అతను ఉలిక్కిపడి,”అరే,నువ్విక్కడేం చేస్తున్నావు?” అన్నాడు.

“ఒక స్నేహితుడింటికి వచ్చాను,”అని అబద్ధమాడి,”మీరుండేది ఇక్కడికి దగ్గరేనా?” అని అడిగాడు.

“ఇవాళ ఈ ఊరొదిలి వెళ్తున్నాం నాయనా. హరిద్వార్ కి ప్రయాణమౌతున్నాం.”

“ఓ, ఇవాళే వెళ్ళిపోతున్నారా?” అన్నాడు వాడు నిరుత్సాహపడిపోతూ.

“అవున్నాయన, మళ్ళీ వచ్చాకే కనిపిస్తాను.”

“నేను కూడా మీవెంట వస్తాను,” అన్నాడు సియారామ్ భయం భయంగా.

“నావెంటా? మీ ఇంట్లోవాళ్ళు ఒప్పుకుంటారా?”

“వాళ్ళకి నాగురించి ఏం పట్టింది?” అని ఆగిపోయాడు వాడు.ఆ తరవాత మాట్లాడలేకపోయినా వాడి కళ్ళు వాడి జాలిగాథని చెప్పకనే చెప్పాయి.

పరమానంద్ వాణ్ణి గుండెలకి హత్తుకుని,” సరే నాయనా, కావాలంటే మా వెంట రా.సాధు సన్యాసులు గడిపే జీవితం ఎలా ఉంటుందో చూద్దువుగాని.భగవంతుడు దయ తలిస్తే నీ కోరిక నెరవేరుతుంది.”

గింజల మీద ఎగురుతున్న పక్షి చివరికి వలలో పడింది.దాని జీవితం పంజరంలో ముగుస్తుందో లేక అది వేటగాడి కత్తికి బలౌతుందో ఎవరికి తెలుసు?

***

తోతారామ్ కోర్టు నుంచి వచ్చి తన గదిలోకెళ్ళి మంచం మీద సోలిపోయాడు. వయసు మీద పడుతోంది, అలసిపోతున్నాడు, పైగా రోజంతా ఏమీ తినలేదు.మొహం వాడిపోయింది. రోజు కేసు గెలవలేదు.నిర్మల మూడు నాలుగు కేసుల గురించి ఏమైందని అడిగింది.ఒక్కటీ గెలవలేదని చెప్పాడాయన.

పొద్దున్న లేస్తూనే ఎవరి మొహం చూశారో ఏమిటో!”అంది నిర్మల.

మధ్య తోతారామ్ చురుగ్గా పని చెయ్యలేకపోతున్నాడు.ఆయనకి కేసులు దొరకటమే తక్కువ ,దొరికినా అన్నీ ఓడిపోయే కేసులే అవుతున్నాయి.కానీ తన ఓటమిని వీలైనంతవరకూ నిర్మలకి తెలియనిచ్చేవాడు కాదు. చేతిలో డబ్బు లేకపోతే స్నేహితుల దగ్గర అప్పు చేసి తెచ్చి నిర్మలకిచ్చేవాడు. రోజు అప్పు కూడా పుట్టలేదు.

ఆదాయం పరిస్థితి ఇలా ఉంటే ఇక దేవుడే మనని కాపాడాలి.అది చాలనట్టు సియారామ్ మొండిగా తయారయాడు.కట్టెలు తెమ్మంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు,” అంది నిర్మల.

అయితే వంట చెయ్యలేదా?” అన్నాడు తోతారామ్.

ఇలా మాట్లాడతారు కాబట్టే కేసులు ఓడిపోతున్నారు.వంట చెరకు లేకుండా ఎవరైనా వంటెలా చేస్తారండీ?”

అయితే సియారామ్ భోంచెయ్యకుండానే వెళ్ళిపోయాడా?”

ఇంట్లో ఏమైనా ఉంటే కదా తినటానికి?”

కొంచెం డబ్బేమైనా ఇవ్వకపోయావా,బైట తినేవాడు,”అన్నాడు తోతారామ్ జంకుతూ.

అవును ఇంట్లో డబ్బుకేం లోటు?” అంది నిర్మల మొహం చిట్లిస్తూ.

తోతారామ్ జవాబు చెప్పలేదు.కొంతసేపు తినటానికేమైనా ఇస్తుందేమోనని ఎదురుచూశాడు.నిర్మల మంచినీళ్ళైనా ఇవ్వలేదు. సియారామ్ పడుతున్న బాధని తల్చుకుని ఆయన తల్లడిల్లాడు.’ఒక్కసారి పనిమనిషిని పమ్పించి కట్టెలు తెప్పిస్తే కొంప మునుగుతుందా? ఇంట్లో వాళ్ళని పస్తులుంచి ఇలా పొదుపు చెయ్యకపోతేనేం?’ అనుకుంటూ తన పెట్టె తెరిచి అందులో డబ్బులేమైనా ఉన్నాయా అని వెతకసాగాడు.చివరికి కాయితాలు ఒక్కొక్కటీ తీసి దులుపుతూ ఉంటే ఒక కాయితం మడతలోంచి పావలా కాసు కింద పడింది.ఆయన ఆనందానికి అంతు లేదు.ఇంతకుముందు ఇంతకన్నా ఎన్నో రెట్లు సంపాదించాడు.కానీ డబ్బులు దొరికినప్పుడు కలిగిన ఆహ్లాదం మునుపెన్నడూ కలగలేదు! పావల పట్టుకుని సియారామ్ గదివైపు నడుస్తూ వాణ్ణి పిలిచాడు.వాడు పలకలేదు.గదిలోకెళ్ళి చూస్తే వాడక్కడ లేడు.’ఇంకా స్కూలునుంచి రాలేదా?’ అనుకుంటూ లోపలికెళ్ళి పనిమనిషిని అడిగాడు. వాడు స్కూలునుంచి వచ్చాడని చెప్పిందామె.

ఏమైనా తిని తాగాడా?”

పనిమనిషి జవాబు చెప్పకుండా మూతీ ముక్కూ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది.

తోతారామ్ చేసేదేమీ లేక తన గదిలోకెళ్ళి కూర్చున్నాడు.అవాళ మొదటిసారి ఆయనకి నిర్మల మీద కోపం వచ్చింది.కానీ మరుక్షణం కోపం తనమీదికి మళ్ళింది.దీపమన్నా వెలిగించకుండా చీకట్లో నేలమీద పడుకుని కన్న కొడుకు విషయం ఏమీ పట్టించుకోనందుకు తనని తాను తిట్టుకోసాగాడు.బాగా అలసిపోయున్నాడేమో కొద్ది సేపట్లో నిద్ర పట్టేసింది.

బాబుగారూ, భోజనం చేద్దురుగాని రండి,”అంది పనిమనిషి వచ్చి.

తోతారామ్ ఉలిక్కిపడి లేచాడు.గదిలో దీపం వెలుగుతోంది.అయోమయంగా చూస్తూ, ” టైమెంతయింది?” అన్నాడు.

తొమ్మిదైనట్టుంది.”

బాబు వచ్చాడా?”

వస్తే ఇంట్లో ఉండడూ?” అంది పనిమనిషి విసుగ్గా.

తోతారామ్ కి ఒళ్ళు మండింది,” నేనేమడిగాను, నువ్వేం జవాబిస్తున్నావు?వచ్చాడా లేదా?” అన్నాడు కోపంగా.

నేను చూడలేదు.”

తోతారామ్ మళ్ళీ పడుకుని,”వాడు రానీ, అప్పుడొస్తాను,”అన్నాడు.

తలుపువైపే చూస్తూ అరగంట అలాగే పడుకున్నాడాయన. తరవాత లేచి బైటికొచ్చి వీధిలో ఒక అర ఫర్లాంగ్ కుడివైపు నడిచాడు.మళ్ళీ వెనక్కి వచ్చి,గుమ్మంలోంచే,” సియారామ్ వచ్చాడా? ” అని అడిగాడు.

ఇంకా రాలేదు,” అని లోపల్నుంచి సమాధానం వచ్చింది.

ఈసారి ఆయన ఎడమవైపు వీధి మొగ దాకా వెళ్ళాడు.ఎక్కడా సియారామ్ కనబడ లేదు.మళ్ళీ ఇంటికొచ్చి వాకబు చేస్తే రాలేదని తెలిసింది.పోలీస్ స్టేషన్ గడియారం పది గంటలు కొట్టింది.

ఆయన గబగబా పార్కువైపు నడిచాడు.పార్కులో తిరగటానికెళ్ళి వాడికి చల్లగాలికి నిద్ర పట్టేసిందేమో అనుకున్నాడు.పార్కు మొత్తం వెతికాడు.చాలామంది కనిపించారు కానీ సియారామ్ పత్తా లేడు.వాణ్ణి పేరు పెట్టి చాలాసార్లు పిలిచి చూశాడు.జవాబు లేదు !

స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అవుతోందేమో, అక్కడున్నాడేమో అనుకుని స్కూల్ కి బైలుదేరాడు.స్కూలు ఒక మైలు దూరంలో ఉంది. బైలుదేరాడే గాని, నడిచే ఓపిక లేక మధ్య దారిలో వెనుదిరిగాడు.కొట్లన్నీ మూసి ఉన్నాయి.వీధుల్లో ఎవరూ లేరు.ఇంత రాత్రయేవరకూ స్కూల్లో వేడుకలేమీ జరపరు,అనుకుని ఒకవేళ సియారామ్ ఇంటికి వచ్చేసి ఉంటాడన్న చిన్న ఆశ మనసులో కదిలింది.వాకిట్లోంచే,”సియారామ్ వచ్చాడా?” అని కేక పెట్టాడు.తలుపులు మూసి ఉన్నాయి.లోపల్నుంచి సమాధానం రాలేదు.మళ్ళీ గట్టిగా అరిచాడు. సారి పనిమనిషి తలుపు తీసి ఇంకా రాలేదని చెప్పింది.తోతారామ్ ఆమెను దగ్గరకి పిలిచి,” నీకు ఇంట్లో జరిగే విషయాలన్నీ తెలుసు. రోజేం జరిగింది,చెప్పు?” అన్నాడు.

బాబుగారూ,అమ్మగారు నన్ను పనిలోంచి తీసేసినా పరవాలేదు కానీ అబద్ధం చెప్పను.ఎంత సవతి కొడుకైనా ఇలానా కాల్చుకుతినేది? మాటిమాటికీ బజారుకి తరుముతారు.ఇవాళ కట్టెలు తేలేదని పొయ్యి వెలిగించలేదు.అడిగితే ఆవిడకి కోపం. మీరే పట్టించుకోకపోతే ఇంకెవరైనా ఏం చెయ్యగలరు?రండి భోజనానికి, ఆవిడ చాలాసేపుగా మీకోసం ఎదురుచూస్తున్నారు,” అంది పనిమనిషి.

నేను తిననని చెప్పు,” అని తోతారామ్ తన గదిలోకెళ్ళిపోయాడు. భగవంతుడా నా శిక్ష ఇంకా పూర్తవలేదా? నాకున్న ఒక్కగానొక్క నలుసునీ నాక్కాకుండా చేస్తావా , అనుకుంటూ చాలా బాధపడ్డాడు.

నిర్మల ఆయన గదిలోకొచ్చి,”సియారామ్ ఇంకా రాలేదేం? వంట చేస్తున్నాను, తిని వెళ్ళమని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో!మాట వినడు కదా.మీరు భోజనానికి లేవండి. అతనికి విడిగా తీసి ఉంచుతాను,”అంది.

తోతారామ్ నిర్మలవైపు కళ్ళెర్రజేసి చూస్తూ,” ఇప్పుడు టైమెంతయింది?”అన్నాడు.

ఏమో, పదయుంటుంది.”

కాదండీపన్నెండు!”అన్నాడు వ్యంగ్యంగా.

పన్నెండయిందా?ఇంత ఆలస్యం ఎప్పుడూ చెయ్యలేదే?ఎంతసేపని అతనికోసం చూస్తారు? మధ్యాన్నం కూడా ఏమీ తినలేదు మీరు.అబ్బ, ఇలాంటి బాధ్యత తెలీనివాణ్ణి ఎక్కడా చూడలేదు!”

నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు కదూ?”

మరి? చూడండి , అర్ధరాత్రి అయినా ఇల్లు గుర్తురాలేదు?”

ఇదే వాడు చేసే చివరి అల్లరి కావచు!”

ఏమిటండీ మాటలు? ఎక్కడికెళ్తాడు? స్నేహితుడింట్లోనో ఉండిపోయుంటాడు.”

అయుండచ్చు. దేవుడి దయుంటే వాడికేమీ కాదు.”

పొద్దున్న వచ్చాక కాస్త మందలించండి.

తప్పకుండా.”

పదండి భోంచేద్దురుగాని.చాలా పొద్దుపోయింది.”

పొద్దున్న వాడి సంగతి చూశాక తింటాలే.ఒకవేళ ఇంటికి రాకపోతే పాపం నీకొక నమ్మకమైన నౌకరు లేకుండా పోతాడు!”

అయితే నేనే ఇంట్లోంచి తరిమేశాననా మీరనేది?” అంది నిర్మల కోపంగా.

అయ్యో,లేదు,అలాగని ఎవరన్నారు? నువ్వెందుకు తరిమేస్తావు? నీకు ఎంత చాకిరీ చేసేవాడు?”

నిర్మల మాట్లాడకండా లోపలికి వెళ్ళిపోయింది.పనిమనిషి వెళ్ళి వీధి తలుపులు మూసేసి వచ్చింది.

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.