నా బాల్యంలో భూతల స్వర్గం

-సుగుణ మద్దిరెడ్డి

బుధవారం సంత
చుట్టున్నా
పల్లె సరకుల మోత పేటకి. 
సంతలో దొరకందిలేదు. 
కూరగాయల తట్టలు
బెస్త పల్లె చేపల గంపలు
ఈడిగపల్లె తమలపాకులు
దుగ్గుమూటలు
చెంగనపల్లి నుంజలు
పాతపాళ్యం సదువుశెట్టి వాళ్ల పూలు
ఐలోలపల్లి అనపకాయతట్టలు
కొలిమి గంగన్న చేసే కొడవలి. పార. తొలికె. గొడ్డలి. గడ్డపార. 
తయ్యూరోళ్ల సరకుల అంగడిలో చాచిన చెయ్యి వెనక్కి తీయాలంటే ఓ గంట
రైస్ మిల్లు లో  ఓపక్కవొడ్లుబోస్తే  ఇంకోపక్క
బియ్యం  మరోపక్క తౌడు అబ్బో…. ఏమి కరెంటో…. 
ఏంమిసన్లో…. 
ఆపక్కనే గింజలుబోస్తే
ఈపక్క
నూనొఛ్చే మిసిను. ఏమి 
అద్భుతాలో…. 
ఐరాలమద్యలో జూసిన గౌరుమెంట్ ఆసుపత్రి. 
ఆవుకి సూదేసే ఆస్పత్రికూడా
కోనేటికాడుండే బాంకు
దాని దగ్గిరుండే పోలీస్స్టేషన్. 
భద్రాచలం వాళ్ల ఇంటి ఎనకపక్క వీధి లో ఉన్న
లైబ్రరీ 
నంబూరోలంగిట్లో నోటు పుస్తకాలు 
పీర్ల పండగ. గుండందొక్కేది  జూసి అబ్బో…. 
అగ్గిపై నడవడం 
వాళ్ళు దేముళ్లు అనుకొన్నా
వాళ్ల ను జూసి
కుప్పయ్య అంగట్లో
 బాదంపాలు 
దొరస్వామి.చేసే.. టీ. 
 తాగితే అమృతమే.
ఇండియా లో దొరకనివి
కమ్మరకట్లు. సీనీ చాక్లెట్ లు
పుల్ల ఐస్. సేమియా ఐస్
బటానీలు
ఏదికావాలన్నా
పేటకి బొయ్యి వస్తే ఇస్తా….. 
పేట ఆ నాటి భూతల స్వర్గం 
 
 సినిమా కొటాయి
 
బెంచి టిక్కెట్టు 75పైసలు
నేల టిక్కెట్టు 40పైసలు
80పైసలుంటే రెండుసార్లు 
సినిమా కి
కరెంట్ పోతే మళ్లీ సినిమా 
పది పైసల మురుకులు
 తింటూ ఆ సంతోసంవేరే..లే… 
అవ్వ తాతలతో 
కిటకిటలాడే పాత సినిమా ల మెరుపు
మేకమార్కు బీడీ
ప్యాన్సీ టైలర్ బొమ్మ 
ఊరివిషయాల తెలిపే
 పోస్టర్లు
దండోరాతో చెప్పే విషయాలు
 
 గంగ జాత్ర 
 
మనసులో యాత్ర 
చుట్టూ ఊర్లలోసంబరాలు
గంగమ్మ కి కుంబం 
సలిబిండి ముద్దల్లో 
దీపాలవెలుగు
పంపలోల్ల గంగమ్మ పాటలు 
పూసలదండలు. పక్కపిన్నులు
రిబ్బన్ లు బుడ్డ లు కొనే సంబరాలు
పాలేటమ్మకి పొంగిళ్లు. 
రాములవారి గుళ్లో ప్రసాదం
తింటే
భువిలో దొరకని ఆనందం
 
ఎద్దుల కుంచెలు
 
 ఎద్దులకొమ్మలకు రంగులుపూసి. నెమలీకలప్రభలజోడింపు
మట్టి మిద్దెలపై గుంపుగూడి
ఎద్దుల పరుగులను 
చూసేజనం. 
పలకలకొట్టి ఈలలతో
 ఉర్రూతలూగించే కుర్రజనం
అబ్బో…… ఏమి చెఫ్పను….
ఏమని జెప్పను…..
మరువలేని…. 
ఆ జ్ఞాపకాలు….నిధి… లో
ఒక్కో క్కటీ….. 
వస్తూనే ఉన్నాయి…..  రాయడం ముగిద్దామంటే…….
 

****

Please follow and like us:

2 thoughts on “నా బాల్యంలో భూతల స్వర్గం (కవిత)”

Leave a Reply

Your email address will not be published.