పెంచిన ప్రేమ

-అనసూయ కన్నెగంటి

           తల్లికోడి పెరడు అంతా తిరుగుతూ  ఆహారాన్ని చూడగానే “క్కొ..క్కొ..క్కొ..” అంటూ పిల్లల్ని పిలుస్తూంది.  అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటున్న కోడిపిల్లలు తల్లి పిలుపు విన్న వెంటనే ..” అమ్మ పిలుస్తూంది..అమ్మ పిలుస్తూంది “ అని అరుస్తూ గోల గోలగా ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ పరిగెత్తుకుంటూ వాళ్లమ్మ దగ్గరకు వెళుతున్నాయి.  

           ఆ పిల్లల్లో నాలుగు బాతు పిల్లలు కూడా ఉన్నాయి. అవి కోడిపిల్లల అంత చురుకు కాదు. కొద్దిగా మందకొడిగా ఉన్నాయి.  అందుకని అవి కోడి పిల్లల వెనుక కాస్త మెల్లగా పరిగెత్తుకుంటూ వెళుతున్నాయి. 

      ఈ విషయం గమనించింది ఒక గ్రద్ద. దానికి చాల సంతోషం వేసింది వాటిని చూసి. దాంతో..

      ఒకరోజు దగ్గరలో ఉన్న చెట్టు మీద ఆకుల చాటున మాటుగాసి కూర్చుంది  బాతు పిల్లల్ని ఎత్తుకుపోదామని.

అది గమనించని తల్లికోడి ఎప్పటిలాగే  ఆహారం చూడగానే పిల్లల్ని పిలిచింది. 

  ఇదే సమయమని చెట్టు మీదున్న గ్రద్ద  బాతు పిల్లను కాళ్లతో  తన్నుకుపోదామని  విసురుగా వచ్చేసింది.

    అప్పటికే అది పసిగట్టిన తల్లికోడి గ్రద్ద మీద విరుచుకుపడి..పిల్లల్ని రక్షించుకుంది.

     అలా గ్రద్ద ఎన్నిసార్లు  ప్రయత్నించినా  ఒక్క బాతుపిల్లను కూడా ఎత్తుకుపోలేకపోయింది.  దాంతో గ్రద్దలో పట్టుదల పెరిగిపోయింది.  ఎలాగైనా బాతుపిల్లను తినే తీరాలని  చెట్టు మీదే కూర్చుని ఉంది. 

      ఈ పెనుగులాటలో  గ్రద్దకూ, తల్లి కోడికి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. అయినా తినాలనే కోరిక గ్రద్దలోనూ, పిల్లల్ని కాపాడుకోవాలనే పట్టుదల కోడిలోనూ ఏమాత్రం తగ్గలేదు. 

       గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యా జరుగుతున్న  పెనుగులాటను  గమనిస్తూనే ఉంది అక్కడే తిరుగాడే కోడి పుంజు ఒకటి. 

   అది ఒకనాడు తల్లి కోడి దగ్గరకు వెళ్ళి ..

       ”  నిన్ను చూస్తుంటే  అమాయకురాలవు అనిపిస్తూంది. “ అంది .

   “ ఎందుకు అలా అనిపించింది నీకు ?” అని ఎదురు ప్రశ్నించింది  తల్లి కోడి. 

   “ ఏముంది?  గ్రద్ద బలం నీకు తెలియనిదా? అది పట్టు పట్టిందంటే వదలదు. నువ్వు గమనించావో  లేదో…కానీ  అది బాతు పిల్లల్ని మాత్రమే తన్నుకుపోవాలని ప్రయత్నిస్తూంది. అవి నీ పిల్లలు కావు కదా. కాకి కూడా నీలాగే కోకిల గుడ్లను పొదిగి గుర్తుపట్టగానే గూట్లో నుండి తరిమేస్తుందంట. దానికున్నపాటి జ్ఞానం కూడా నీకు లేదు. ఎంతకాలం నువ్వు పెంచితే బాతు కోడి అవుతుంది? కాబట్టి చూసీ చూడనట్టు వదిలెయ్. నీకెందుకు అంత పట్టుదల. “ అని చెప్పింది.

    కోడిపుంజు మాటలు విన్న తల్లి కోడికి చాల బాధేసింది. దూరంగా ఉన్న పిల్లలందర్నీ ఒకసారి కళ్లారా చూసింది. ఎలాంటి కల్మషం లేకుండా ఆడుకుంటున్న  వాటిని చూసి దానికి కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. 

    ఒక్కసారి తల విదిలించి పుంజు వైపు చూస్తూ..

    “ నా పిల్లల కంటే ఎక్కువ రోజులు పొదిగి వాటికి జన్మనిచ్చాను. నేను పెట్టిన గుడ్లు కాకపోవచ్చు. కానీ నేను పొదిగితేనే   కదా అవి పిల్లలయ్యాయి. కాబట్టి  అవీ నా బిడ్దలే. నా పిల్లలు కాదని చూస్తూ చూస్తూ వాటిని అలా ఎలా గ్రద్దకు అప్పగిస్తాను? కన్న ప్రేమకంటే పెంచిన ప్రేమ మరింత గొప్పదని   నీకు మాత్రం  తెలియదా? అయినా తల్లిప్రేమ గురించి నీకేమి తెలుస్తుందిలే! తెలిస్తే ఇలా చెప్పే దానివే కాదు?” అని పుంజుతో అని వెంటనే   “క్కొ.క్కో..క్కో” అని పిల్లల్ని పిలిచేసింది. అది విని  పొలో మంటూ పరిగెత్తుకొచ్చేసి తల్లి చుట్టూ చేరాయి  పిల్లలన్నీ.

        పుంజువైపు గర్వంగా ఒకసారి చూసి “రండి “ అంటూ ముందుకు సాగిపోయింది తల్లికోడి. 

    ఉత్సాహంగా తల్లిని అనుసరించాయి పిల్లలన్నీ.

              వాటినలా చూస్తూ “  నిజమే. తల్లికి అందరూ సమానమే. నేనే తప్పు మాట్లాడాను. నా తప్పును సరి దిద్దుకోవాలంటే ఆ గ్రద్ద నుండి  ఈ పిల్లలందర్నీ రక్షించటం ఒక్కటే  సరైన పని   “ అని మనసులో అనుకుంటూ  

గ్రద్ద వైపు చూసింది కోపంగా “ నీ సంగతి నేను చూస్తా..” అన్నట్టుగా .

 

           *****

Please follow and like us:

One thought on “పెంచిన ప్రేమ (బాల నెచ్చెలి-తాయిలం)”

  1. కంటే మాత్రమే తల్లికాదు. బాతు గుడ్లను పొదిగిన తీరు, పెంచుకున్న మమకారం, పంచిన ఆత్మీయత కొనసాగుతున్న ప్రేమ.. నిజంగా కోడి తనపిల్లలతో సమంగా పెంచడం, గ్రద్ద తన్నుకుపోకుండా కాపుకాయడం, ఆ ప్రక్రియలో భాగంగా గాయపడడం, ఆ గాయాలను పట్టించుకోక, కోడిపుంజుకు హితవు పలికి… తల్లిమనసు చాటుకోవడం..
    ఎంత సింపిల్గా, చెప్పారో… సరళత స్పష్టత.. సంబాషణలో ఆకట్టుకునే తీరు… నిజంగా పిల్లల కథగా చాలా బావుంది. మానవసంబందాలకు కూడా వర్తిస్తుంది…
    అనసూయా కన్నెగంటి గారూ

    -,అనురాధ బండి

Leave a Reply

Your email address will not be published.