స్వాభిమాని

-రామలక్ష్మి జొన్నలగడ్డ

‘‘పోటీలో బహుమతికి మొదట ఎంపికైన వీణగారి కథని పక్కన పెట్టి, మరో కథని ఎంపిక చేసి పిడిఎఫ్‌ పంపాం. టైమెక్కువ లేదు. చదివి వెంటనే నీ అభిప్రాయం చెప్పమన్నారు సరళమ్మ. నీ ఫోనుకోసం ఎదురు చూస్తుంటాను’’ అంది పద్మజ ఫోన్లో.

సరళ గవర్నమెంటు ఉద్యోగంలో రిటైరై వృద్ధాశ్రమంలో ఉంటోంది. కథలంటే ప్రాణం. ఏటా మూణ్ణెల్లకోసారి తాను గౌరవించేవారి పేరిట పోటీలు ప్రకటిస్తుంది. కథల ఎంపికకు లబ్దప్రతిష్ఠుల సహకారం తీసుకుంటుంది. వాటిలో బహుమతికి ఎంపికైన కథని నా అభిప్రాయంకోసం పంపుతుంది.

నేను సరళకంటే బాగా చిన్నదాన్ని. మొదటిసారి నన్ను కథల గురించి అడిగినప్పుడు, ‘‘మీకంటే చిన్నదాన్ని. నేను చూసేక మీరు చూడాలేమో కానీ, ఒకసారి మీరు చూసేక, ఇంకా నా అభిప్రాయం కావాలా?’’ అన్నాను. 

దానికామె, ‘‘జ్ఞానము చేత వృద్ధులు కానీ ఏండ్లు మీరినవారా వృద్ధులు – అంటుంది మిత్రలాభం. నేను సాహిత్యాభిమానినే కానీ విమర్శకురాల్ని కాను. నీ సాహితీవిమర్శ నాకిష్టం. కాబట్టి మిత్రలాభం పొందాలను కున్నాను. విశిష్టులు ఎంపిక చేసినప్పటికీ నువ్వు ఓకే చేస్తేనే – కథని బహుమతికి ఖరారు చేస్తాను’’ అంది. ఆ అభిమానానికి తలొంచి, సరేనన్నాను. ఆమె నాకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, తను పంపిన కథని ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా చదివాను. 

ఎంపిక చేసినవారు సామాన్యులా? ఆ కథ చదివిన రసానుభూతి నన్ను చాలా రోజులే వెంటాడింది.  

తర్వాత ఆమె చిన్న ఎత్తున ఓ సభ నిర్వహించి – కథ వ్రాసినవార్ని సన్మానించింది. ప్రముఖులు ఎంపిక చేసిన మిగతా కథల్ని ఓ వెబ్‌ పత్రికలో ప్రచురించడానికి ఏర్పాటు చేసింది. ఇలా నాలుగేళ్లుగా జరుగుతోంది.

ఇప్పుడు నాకు ఫోన్‌ చేసిన పద్మజ వృద్ధాశ్రమంలో సరళకు కేర్‌టేకర్‌. ఈ ఫోన్లతోనే తనూ క్రమంగా నా ఫ్రెండయింది. 

ఆ పోటీల్లో ఎంపికైన కథలన్నీ సత్సాహిత్యంగా పేరు తెచ్చుకోవడం నాకు చాలా సంతోషం కలిగించింది.

సరళ నిర్వహించే సన్మాన సభలు కూడా విలక్షణంగా ఉండేవి. వేదికమీద ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, గౌరవ అతిథి లాంటి పదవులుండేవి కాదు. ఆహ్వానితులైన సభికుల్లో పేరుపొందిన కథకులు, విమర్శకులు ఉండేవారు. పోటీ నిర్వాహకుల ప్రస్తావన అతి క్లుప్తంగా రెండే రెండు నిముషాలు. అనుసంధానకర్తగా సరళే వ్యవహరించేది. 

పోటీలో ఎంపికైన కథలపై సాహితీచర్చ జరిగేది. ఆ చర్చ ఆసక్తికరంగానూ, అర్థవంతంగానూ ఉండేది. అందుకని బహుమతి మొత్తం మరీ ఎక్కువ కాకపోయినా లబ్దప్రతిష్ఠులు కూడా సరళ నిర్వహించే పోటీల్లో పాల్గొంటున్నారు. 

బహుమతి కథ ప్రకటనలో నా పాత్ర గురించి బయటివారికి తెలియదు. సరళ నిర్వహిస్తున్న పోటీలకు, వాటిలో ఎంపికైన కథలకు సాహితీలోకంలో చెప్పుకోతగ్గ గౌరవస్థానముంది. అది నాకు ఎంతో సంతోషంగా ఉండేది. కానీ మొదటిసారిగా, ఈ సారి బహుమతికి ఎంపికైన కథని పక్కన పెట్టమనడం జరిగింది. సరళ అలా ఎందుకందా అనుకుంటూ, తను పంపిన రెండో కథ చదివాను. 

కథ బాగుంది. కానీ మొదటి కథలో లోపమేమిటా అన్న కుతూహలంతో మళ్లీ చదివాను. లోపమేం కనబడలేదు. ఏదో ఉండే ఉండాలనుకుంటూ, పట్టు వదలని విక్రమార్కుడిలా మరింత శ్రద్ధగా మరోసారి చదవసాగాను…. 

***

బంధుమిత్రులు ముక్కున వేలేసుకున్నారు. కన్నవారు కలా నిజమా అనుకున్నారు. మరి శాంతలాంటి మామూలు స్కూలు టీచర్ని, ఇంకా ముప్పైఏళ్లు నిండకుండానే మంత్రి పదవి లభించిన సోమనాథ్‌ పెళ్లాడతా ననడమేమిటి – అదీ కట్నకానుకలు లేకుండా!

శాంతకి మాత్రం సంతోషంగా లేదు. ఎందుకంటే ఆమె స్వాభిమాని. మంచి భవిష్యత్తుకోసం స్వయంకృషినే నమ్ముకుందామె. అందులో భాగంగా, ఉద్యోగం చేస్తూనే కంప్యూటరు నాలెడ్జి పెంచుకుంటోంది. 

సోమనాథ్‌ని పెళ్లాడితే – అతడి సంపద, వైభవం, అధికారం, హోదా – అన్నింటా సగభాగం ఆయాచితంగా లభిస్తుంది. స్వాభిమాని శాంతకి అదిష్టం లేదు. ఐనా అతణ్ణి కాదన లేదు. ఎందుకంటే….

ఆమె తండ్రి వెంకట్రావు రిటైర్డ్‌ గుమస్తా. శక్తికి మించి చదివించిన కొడుకులిద్దరూ రెక్కలొచ్చి ఎగిరిపోయారు. శక్తి చాలక కూతురికి సంబంధాలు తేలేక, రెక్కలు తెగిన పక్షిలా ఫీలౌతున్నాడు. ఆపైన కూతురిపై ఆధారపడ్డం ఆయన స్వాభిమానాన్ని ఇబ్బంది పెడుతోంది. 

అది గ్రహించిన శాంత, ‘‘అన్నయ్యలు పట్టించుకోలేదని బాధ. నేను పట్టించుకుంటే బాధ. ఏమిటమ్మా నాన్న?’’ అని తల్లి దగ్గర వాపోయింది. అందుకా తల్లి, ‘‘ఆడపిల్ల ఆడ పిల్లే కానీ ఈడ పిల్ల కాదు కదమ్మా!’’ అని తండ్రినే సమర్థించింది. 

శాంతకు మనసు చివుక్కుమంది. కూతుర్ని కన్నది, ఓ అయ్య చేతిలో పెట్టి పంపడానికేనా? పుట్టిపెరిగిన ఇంటికి తనేంకాదా? కన్నవాళ్లని కంటికి రెప్పల్లా చూసుకోవాలని ఆడపిల్లకు మాత్రం ఉండదా? అలా చూసుకుంటే, కన్నవారికి మనస్తాపమే కానీ, సంతోషం కలుగదా? 

తండ్రి మనసుకి ఉపశమనం కలగాలన్న తాపత్రయమే – శాంతని ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది 

కట్నకానుకలు లేవు. ఆర్భాటం లేదు. కన్నవారిమీద భారం పడకుండా శాంత పెళ్లి జరిగిపోయింది. శాంత భారం తొలగిపోవడంతో, వచ్చే పెన్షన్‌ డబ్బులు ఆమె తండ్రికి చెప్పుకోతగ్గ జీవనాధారమే అయ్యాయి.    

ఊహకందని అదృష్టాన్ని మూట కట్టుకుని కాపురానికెళ్లిందని అంతా అనుకున్నారు కానీ శాంతకా అదృష్టం ‘అ’దృష్టం (కనబడనిది). ఎందుకంటే ఆమె అత్తగారు జయాదేవికీ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. కొడుకునేమనలేక, తన ఉక్రోషాన్ని తీర్చుకుందుకు కోడల్ని లక్ష్యం చేసుకుంది. శాంత ఇంట్లో అడుగు పెట్టిందో లేదో, ‘‘కోటి రూపాయల కట్నమిస్తానన్నారు. కాదని మావాడు చింకి కోటైనా ఇవ్వలేని నిన్ను చేసుకున్నాడు. ఆ దరిద్రపు కొంపనుంచి ఇంత గొప్పింటికొచ్చావ్‌! మంత్రి పెళ్లానివై ఇంటా బయటా మహారాణి వైభోగాలు అనుభవిస్తున్నావ్‌!’’ అని సాధింపు మొదలెట్టిందామె. 

స్వాభిమానం శాంతని ఊరుకోనిస్తుందా, ‘‘దరిద్రపు కొంపలవాళ్లకి రెండు చేతులూ జోడించే కదా, మీ అబ్బాయి ఇంత చిన్న వయసులో మంత్రయ్యాడు. ఆ కృతజ్ఞతతో దరిద్రపు కొంపకి చెందిన నన్ను ఏరికోరి చేసుకున్నాడేమో! అందువల్ల నాకేమొరిగింది? కడివెడు పాలలో చిన్న ఉప్పురాయిలా, ఉన్న వైభవాలన్నింటికీ అత్త పోరు అంటగట్టాడు!’’ అనడానికి సంకోచించలేదామె.

‘‘కృతజ్ఞతతో కాలికింద చెప్పులా పడుండాల్సినదానివి. నాకే సమాధానం చెప్తావా? నీ పొగరు దించకపోతే నేను నేనే కాను’’ అని సవాలు చేసింది జయాదేవి. తర్వాత ఆమె కోడలి మాటలకు మసాలా దట్టించింది. వాటికి కొడుకు అహం దెబ్బతినేలా చిలవలూ పలవలూ అల్లింది. అప్పుడు కొడుక్కి చేరేసింది. 

అసలే మగాడిననే అహంకారం. ఆపైన మంత్రి పదవి. సోమనాథ్‌ తట్టుకోలేక పోయాడు. భార్యని కాస్త గట్టిగానే మందలించాడు.

ఎంత భార్యయితే మాత్రం – పదవికీ, పురుషాహంకారానికీ స్వాభిమానాన్ని వదులుతుందా? ‘‘మందలించాల్సింది నన్ను కాదు. మీ అమ్మని’’ అంది శాంత వెంటనే.

‘‘అక్కడే తెలుస్తోంది నీ దురుసుతనం. నువ్వు మా అమ్మని, మీ అమ్మ అనకూడదు. అత్తయ్య అనాలి’’ అని సవరించాడు సోమనాథ్‌. దానికి శాంత, ‘‘రక్తబంధం కానప్పుడు అత్తయ్యంటే అదో పిలుపు మాత్రమే! అనుబంధం విషయానికొస్తే, ఆమె నీకు అమ్మ. నాకైతే ప్రస్తుతానికి ఏమీ కాదు’’ అంది.

ఈ తరహా స్పందన, సమాధానం సోమనాథ్‌కి మింగుడు పడలేదు. కానీ రాజకీయాలు నేర్పిన సంయమనంతో కాస్త తమాయించుకుని, ‘‘చూడు శాంతా! నేనూ పుట్టుగొప్పవాణ్ణి కాను. అమ్మ చేసిన త్యాగాలతోనే ఇంతవాణ్ణయ్యాను. మాట పెళుసు కానీ మనసు వెన్న తనకి. తనతో సద్దుకుంటావనే లేనింటిదానివని తెలిసీ నిన్ను పెళ్లాడాను. ఇప్పటి మా వైభవం వెనుక కూడా అమ్మ శ్రమ చాలా ఉంది. అలాంటి శ్రమేం లేకుండా, నేనేసిన మూడంటే మూడుముళ్లతో ఆ వైభవాన్ని స్వంతం చేసుకున్నావని తనకి నీమీద కాస్త గుర్రుగా ఉంటే అది సహజం. అర్థం చేసుకోవాలి. ఆమె ఏమన్నా విని నవ్వి ఊరుకున్నావనుకో! నీకు ఇల్లే స్వర్గం, వీధిలో ఇంద్రవైభవం!’’ అని అనునయించబోయాడు.

శాంత అదోలా నవ్వి, ‘‘నువ్వూ ఆ తాను ముక్కే కదా! మీ అమ్మ మాటల్నే కాస్త మార్చి చెప్పావ్‌’’ అంది. 

‘‘పోనీ, నేనేంచెయ్యాలో నువ్వే చెప్పు’’ అన్నాడు సోమనాథ్‌. 

‘‘నేను చెప్పింది నువ్వు చెయ్యడానికి మీ అమ్మొప్పుకోదు. అడిగేక చెప్పింది చెయ్యకపోతే నాకు నచ్చదు. కాబట్టి ఏంచెయ్యాలో చెప్పను. నువ్వేంచెయ్యాలనుందో చెబుతాను. అదీ నువ్వు వింటానంటేనే….’’ అందామె.

సోమనాథ్‌లో కుతూహలం పుట్టింది, ‘‘వింటాను. చెప్పు’’ అన్నాడు.

‘‘మీ అమ్మ దృష్టిలో నేనొచ్చింది దరిద్రపు కొంపనుంచి. అచ్చం అలాంటి దరిద్రపు కొంపొకటి నాకోసం వెతికిపెట్టు. మకాం అక్కడికి మార్చేస్తాను. ఇక మంత్రి భార్యగా వీధిలో నాకు జరిగే మర్యాదల  గురించే కదా మీ అమ్మ ఏడుపు! బయటికెడితే నేనెవరో తెలియకుండా బురఖా వేసుకుంటాను. అప్పుడీ ఇల్లు మీ అమ్మకి స్వర్గం. ఆ ఇల్లు మనకి స్వర్గం. సరేనా?’’ అంది.

తన సమస్యకి భార్యనుంచి ఇలాంటి పరిష్కారం ఊహించని అతడికి ఒక్క క్షణం నోట మాట రాలేదు. తేరుకున్నాక, ‘‘అలాఎలా కుదుర్తుంది? మంత్రి భార్యవి. ఇంటాబయటా కూడా అందుకు తగ్గ హోదాలో ఉండాలి’’ అన్నాడు నెమ్మదిగా.  

శాంత నవ్వి, ‘‘మంత్రి భార్యవి అంటున్నావు. అంటే నా అనుబంధం నీతో కాక, నీ పదవితో ముడి పడుతుంది. కాబట్టి ఇంకోసారి బాగా ఆలోచించి చెప్పు. నేనిప్పుడు మంత్రి భార్యనా, నీ భార్యనా?’’ అంది. 

సోమనాథ్‌ రాజకీయాల్లో పరిణతి చెందినవాడు. ఆమె డౌటు, ‘తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా?’ అన్న ద్రౌపది ప్రశ్నకి ఏమాత్రం తీసిపోదని గ్రహించలేడా…. 

***

కథ ఇంతవరకూ చదవగానే ఠక్కున గుర్తొచ్చింది శకుంతల. 

శకుంతల నా బాల్యస్నేహితురాలు. ఇప్పటికీ టచ్‌లో ఉన్నాం. శాంత కథలో మంత్రి పాత్రని తీసి కలెక్టర్‌ పాత్రని పెడితే – ఇద్దరిదీ ఒకటే కథ. శకుంతల భర్త ధనుంజయ్‌ – మంచి భర్తలుగా చెలామణీ ఔతున్న చాలామంది మగాళ్లలాగే నివురు కప్పిన పురుషాహంకారి. తన ఇల్లాలిగా తప్ప భార్యకి మరో గుర్తింపుంటే సహించలేడు. తన భార్య పొందే సదుపాయాలన్నీ తనవల్లనేనని గర్వం. అలాగని ఆమె ఆ సదుపాయాల్ని ఉపయోగించుకోనంటే ఒప్పుకోడు. ఎందుకంటే, భార్య – కారుకంటే చిన్న వాహనమెక్కితే తనకి చిన్నతనం. ఆన్‌ లైన్లో ఐతే ఓకే కానీ, బయటే ఉద్యోగం చేసినా చిన్నతనం! 

కానీ శకుంతల స్వాభిమానం కూడా అతడి పురుషాహంకారానికి ఏమాత్రం తీసిపోదు. కలెక్టరు భార్యగా ఏ సభనుంచి ఆహ్వానమొచ్చినా వెళ్లదు. భర్త పనులకోసం తప్ప తనకోసం కారు వాడదు. భర్తకోసం తప్ప తన సరదాకోసం షాపింగు చెయ్యదు. 

అలా అంత హోదా ఉండీ తామరాకుపై నీటిబొట్టులా కొనసాగుతోందామె….  

ఫోన్‌ మ్రోగడంతో నా ఆలోచనలకు బ్రేకు పడింది. 

ఈసారి సరళే నేరుగా చేసింది. ఎందుకో తెలుసు కాబట్టి ప్రశ్నలేం వెయ్యకుండా, ‘‘మీరు పంపిన రెండో కథ చదివాను. బాగుంది. ఏ విధంగానూ మొదటి కథకి తీసిపోదని చెప్పాలనుంది. కానీ చెప్పను’’ అన్నాను. 

‘‘ఎందుకు?’’ సరళ గొంతులో ఆశ్చర్యం.

‘‘మీరు మొదట పంపిన వీణ గారి కథ చాలా బాగుంది. ఆ విషయం మీకు చెప్పాను. కానీ ఇప్పుడా కథని పక్కన పెట్టారు. అంటే, మన అభిరుచుల్లో ఏదో తేడా వచ్చిందనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ రెండో కథపై నా అభిప్రాయం అవసరమా?’’ అన్నాను. అంతకంటే చెప్పక్కర్లేదు. సరళకి అర్థమౌతుందని తెలుసు. సంజాయిషీకి ఎంతసేపు తడుముకుంటుందో చూడాలి.

సరళ తడుముకోలేదు, ‘‘లోపం కథలో లేదు. వ్రాసిన వ్యక్తిలో ఉంది. ఆ వీణ చెప్పేదొకటి, చేసేదొకటి. మన సభకి అలాంటివాళ్లొద్దు. ఆడదాని స్వాభిమానం గురించి ఎంతో గొప్పగా వ్రాసిన ఆ రచయిత్రికి ఆచరణలో మహా అతిశయం. సభకొచ్చి వెళ్లడానికి ప్రత్యేకంగా కారు ఏర్పాటు చెయ్యాలిట. లేకపోతే రాదుట. బహుమతి రద్దు చేసినా ఏమనుకోనని, మర్యాదగానే అందిలే’’ అంది వెంటనే.  

‘‘అలా అన్నదంటే, ఆమెకి డబ్బిబ్బంది ఉందేమో!’’ అన్నాను సాలోచనగా.

‘‘నేనూ అలాగే అనుకున్నా కానీ అసలు విషయం నిన్ననే తెలిసింది. తనిచ్చిన అడ్రసు తనది కాదు. వీణ కూడా తన అసలు పేరు కాదు. వీణ అనే కలంపేరు పెట్టుకుని, తన స్నేహితురాలి చిరునామా ఇచ్చింది. అసలు పేరు శకుంతల. కలెక్టరు ధనుంజయ్‌ భార్య. కావాలనుకుంటే స్వంతకార్లోనే రాగలదు. వాకబు చెయ్యగా తెలిసింది. కలెక్టరు భార్యనని తనకి చాలా అహంకారంట. పెద్దపెద్దవాళ్లు పిలిస్తేనే సభలకు వెళ్లదుట. ఇక మన సభ ఆనుతుందా? ఇదో వంక. కారు ఏర్పాటు నాకేం కష్టం కాదు. మనిషి పద్ధతి నచ్చలేదంతే! నిజానికి తనకీ కథ వ్రాసే అర్హత లేదు. తనలాంటివాళ్లకి వేదికనిచ్చి సమాజానికి మనమేం సందేశమిస్తున్నట్లు?’’ అంది సరళ.  

శకుంతల పేరు వింటూనే ఉలిక్కిపడ్డాను. ఆమె కథల్రాయడం ఎప్పుడు మొదలెట్టిందో నాకు తెలియదు. ఐతే అజ్ఞాతంగా ఎందుకు రాస్తోందో, వేరే అడ్రసు ఎందుకిచ్చిందో అర్థం చేసుకోగలను. 

కలెక్టరు భార్యగా కారు వాడదు తను. కానీ తను కారుకంటే చిన్న వాహనంలో వెళ్లకూడదు. తనకంటూ సంపాదన లేనప్పుడు, భర్త డబ్బుతో కారు బుక్‌ చేసుకుని తనకోసం ఏర్పాటు చేసిన సభకి వెళ్లడానికి స్వాభిమానం ఒప్పుకుంటుందా? రచయిత్రిగా ఆమెను సన్మానించదల్చిన సంస్థ, కారు పంపమందని ఆమెను అహంకారిగా భావించి తిరస్కరించడం – ఆ సంస్థ ఆదర్శాల నిబద్ధతకు తార్కాణమౌతుందా?

నాలో కలిగిన ఈ భావనల్ని నేను సరళకు చెప్పలేదు. ఎందుకంటే – సరళ నాకు బాగా తెలుసు. ఆమె ఆదర్శాలు, ఆశయాలు గొప్పవని తెలుసు. ఆమె నిబద్ధతపై నాకే అనుమానమూ లేదు.

అందుకని సరళకు శకుంతల కథని కాస్త వివరంగానే చెప్పి, ‘‘స్వాభిమానంతో భర్త అహంకారానికి ఎదురీదే ఓ భార్య జీవితంలోంచీ వచ్చిన కథ ఇది. ఇది వ్రాయడానికి శకుంతలకు అర్హత ఉందో లేదో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది’’ అని ఊరుకున్నాను.

      

****

ఆర్ట్: జావేద్

Please follow and like us:

5 thoughts on “స్వాభిమాని (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)”

  1. కథ చాలా బాగుంది అండి.
    రచయిత్రి రామలక్ష్మి గారికి..శుబాభినందనలు. In our life, compromise and adjustment are essential to lead happy life. But, one must protect self respect.

  2. కథ బాగుంది.. ..విశిష్టమైన వ్యక్తిత్వాలు గల స్త్రీలు, వారి అంతరంగాలులా ఉంది. శకుంతలే వీణ గా కథలు రాయడం అన్నది ఆసక్తి కరంగా మలిచి.. కథలో కూర్చడం కూడా బాగుంది. అయితే శకుంతల వంటి, వీణ పేరుతో శకుంతల రాసిన కధలోని శాంత వంటి … వారికి ప్రశాంతత ఎప్పటికైనా వస్తుందా ? అన్న ఆలోచన కలిగింది… మొత్తానికి అభినందనలు రచయిత్రి రామలక్ష్మి గారికి..

  3. స్వాభిమానానికి, అహంకారానికి మధ్య గీత చాలా సన్నది. అందుకే అభిమానాన్ని అహంకారం అని చాలామంది పొరపాటు పడుతుంటారు

  4. చాలా బాగుందండి కథ
    శుబాభినందనలు 💐💐

  5. కథ బాగుంది అండి. ఒకరి స్వాభిమానం మరొకరికి అహంకారంగా అనిపిస్తుంది. అయితే పోటీలలో కథల్ని మాత్రమే చూస్తారు కానీ ఆ రచయితల వ్యక్తిత్వాలనూ జడ్జి చేస్తారని తెలియదు. Congratulations అండి

Leave a Reply

Your email address will not be published.