అమ్మమాట

-ఆదూరి హైమావతి 

 అనగనగా ఒక చిట్టడవి. ఆడవిలో ఒక మఱ్ఱి చెట్టు క్రింద ఉన్న బొరియలో ఒక ఎలుక నివాసం ఏర్పరచు కుని జీవిస్తూ ఉండేది. దానికి కొంతకాలానికి రెండు ఎలుకలు పుట్టాయి.వాటికి రోజూ ఇంత తిండి తెచ్చి పెడుతూ పెంచసాగింది. క్రమక్రమంగా అవి పెరగ సాగాయి.బొరియలో అటూ ఇటూ పరుగెడుతూ ఆడుకో సాగాయి.

 ఒకరోజున ఎలుక తిండి వెతికి తేవటానికి వెళుతూ “పిల్లలూ! బయటికి వెళ్లకండి. నేనే మిమ్మల్ని బయటి కి తీసుకెళ్ళి ,ఎలా ఎక్కడ తిరగాలో, ఎక్కడ అపాయం ఉంటుందో , ఎలా తప్పించుకోవాలో మెలకువలన్నీ చెప్తాను. అంతవరకూ నాకు తెలీకుండా బొరియదాటి వెళ్ళకండి.మీకుతిండి తెస్తాను “అని చెప్పి వెళ్ళింది.

 ఆరెండు పిల్లలూ “అమ్మ చెప్పిందికానీ బయట ఎన్ని వింత లున్నాయో, ఎంత అందంగా ఉంటుందో,  ఎంత చల్లని గాలి వీస్తుందో చూద్దాం. వెంటనే లోపలికి వచ్చేద్దాం. అమ్మ వచ్చేలోగా తిరిగి వద్దాం,సరా!” అని ఒకదానికొకటి చెప్పుకున్నాయి.

 రెండు మెల్లిగా నడుస్తూ బయటికి వచ్చాయి. కమ్మని,చల్లని  గాలికి వాటి శరీరం పులకించింది. లోపల వేడిగా ఉంది.ఇక్కడ ఎంత చల్లగా ఎంత బావుందీ! అనుకుని, మరికాస్త ముందుకెళ్ళాయి.

 అక్కడ మరో పెద్ద చెట్టు క్రింద ఒక పిల్లి గుండ్రంగా చుట్టుకుని పడుకునుంది. అవి పిల్లిని ఎప్పుడూ చూడలేదు. ‘ఇది ఏమి జీవీ’ అనుకుని దగ్గర కెళ్ళి చూశాయి. తెల్లగా నున్నని వెంట్రుకలతో ఉన్న దాని చుట్టూ తిరిగి చూస్తూ కొద్ది దూరంలో నిల్చున్నాయి. పిల్లి కళ్ళుతెరచి వాతిని చూసి,మహదానందంగా “ఆహా! ఈరోజెంత మంచిరోజు! ఉదయాన్నే కమ్మని తిండి లభిస్తున్నది “అనుకుని మెల్లిగా కళ్ళు తెరిచి ఆఎలుక పిల్లలకేసి చూసింది.అదికళ్ళు తెరవగానే ఆ ఎలుకలకు కాస్త భయమేసింది కానీ అలాగే నిల్చును న్నాయి. పిల్లి వాటిమీదకు దూకబోతుండగా దానికి వెనుక నుంచీ వేటకున్న అరుపు  వినిపించింది.

  కుక్క ఒక్క ఉదుటున  పిల్లి మీదకు దూకబోగా పిల్లి, ‘మ్యావ్ మ్యావ్’ అంటూ   పరుగులంకించుకుంది. ఎలుకలు ఆ అరుపులకు భయపడి తమ కలుగు లోకి 

 పరుగెత్తాయి. అప్పుడే అక్కడకు వచ్చి అంతా చూసిన ఎలుకతల్లి  వాటిని లోపలికి తీసుకెళ్ళి ” చూసారా ! ఎంత ప్రమాద్మ తప్పిందో! నేను దగ్గరుండి చూపుతానంటే మీరే బయటి కెళ్ళిపోయారు.  భగవంతుని దయవల్ల ప్రమాదం  తప్పిది,లేకపోతే ఆపిల్లి మిమ్మల్ని ఈపాటికి నమిలి తినేసేది. ఇంకెప్పుడూ ఇలాచేయకండి “అంది .

 ఎలుకపిల్లలు  గజగజా  వణకుతూ ” ఇంకెప్పుడూ అమ్మ మాట మీరం ”  అన్నాయి.అదన్నమాట అమ్మ మాట కథ. పిల్లలూ! ఎప్పుడూ అమ్మా, నాన్న చెప్పిన మాటమీరకండి, ప్రమాదాలు పొంచి ఉంటాయి.  

      *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.