అనుసృజన

నిర్మల

(భాగం-17)

అనుసృజన: ఆర్.శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

నేనిక్కడ అసలు లేను.బైట ముందుగదిలో ఉన్నాను.కళ్ళజోడు కనబడక ఇక్కడ పెట్టానేమోనని వెతికేందుకు లోపలికి వచ్చాను.చూస్తే తనిక్కడ కనిపించింది.నేను బైటికెళ్లబోతూంటే తనే,ఏమైనా కావాలా అని అడిగింది.కళ్ళజోడు కూడా తనే వెతికి ఇచ్ఇంది తెలుసా?”

ఓహో, మీకు కళ్ళజోడిచ్చి, కోపంగా బైటికెళ్ళిపోయిందనా మీరంటున్నది?”

నేనెంతో చెప్పాను, తను వచ్చే వేళయింది , కూర్చోమని.వినకపోతే నేనేం చేస్తాను?”

నకేం అర్థమవటం లేదు.ఒకసారి నిర్మల దగ్గరకెళ్ళొస్తాను.” అంటూ కదిలింది సుధ.

తొందరేమిటి వెళ్దువుగానిలే,”అన్నాడతను భయాన్ని దాచుకుంటూ.

లేదు ఇదేదో ఇప్పుడే తేల్చుకోవాలి,” అని సుధ బైటికి నడిచింది.

సుధ నిర్మల ఇంటికి వెళ్ళి ఆమె గదిలో అడుగుపెట్టింది. సుధ మంచం మీద పడుకుని ఏడుస్తూ కనిపించింది. పాప బిక్కమొహం వేసుకుని తల్లినే చూస్తూ నిలబడి ఉంది. సుధ వెంటనే పాపని ఎత్తుకుని,” ఏమైంది నిర్మలా? నిజమ్ చెప్పు.మా ఇంట్లో నిన్నెవరైనా ఏమైనా అన్నారా?” అంది.

అలాంటిదేం లేదు సుధా,” అంది నిర్మల కళ్ళు తుడుచుకుంటూ.

మరి నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా ఇక్కడికొచ్చి ఏడుస్తున్నావెందుకు?”

నా ఖర్మ ఇలా కాలిందని ఏడుస్తున్నాను.”

తిన్నగా చెప్పకపోతే నా మీద ఒట్టెయ్యాల్సి వస్తుంది.”

ఒట్టూ లేదు ఏం లేదు.నన్నెవరూ ఏమీ అనలేదంటున్నాను కదా? అబద్ధమ్ చెప్పమంటావా?”

చెప్పకపోతే నా మీదొట్టే!”

ఏమిటి సుధా నీ మొండితనం?”

నేను నీ దగ్గర ఏదీ దాచలేదు.నువ్వు నిజం చెప్పకపోతే నామీద నీకు ప్రేమ లేదనుకోవలసి వస్తుంది,” అమ్ది సుధ.ఆమె కళ్ళు చెమర్చాయి.పాపని కిందికి దింపి వెళ్ళిపోయేందుకు వెనక్కి తిరిగింది.

నిర్మల గబుక్కున ఆమె చెయ్యి పట్టుకుని,”సుధా నీకు దణ్ణం పెడతా,కారణమ్ మాత్రం అడగద్దు.వింటే నువ్వు బాధపడతావు. తరవాత నేను బహుశా నీకు నా మొహమ్ చూపించలేనేమో.నేను దురదృష్ట జాతకురాలిని కాకపోతే నాకు ఇలాటి అనుభవాలు ఎందుకెదురౌతాయి? దేవుడు నన్నెంత త్వరగా లోకం నుంచి తీసుకెళ్తే అంత మంచిది.లేకపోతే ఇంకా ముందు ముందు ఏమేం చూడాల్సి వస్తుందో!” అంది.

నిర్మల స్పష్టంగా చెప్పకపోయినా సుధ కొంతవరకూ గ్రహించగలిగింది.డాక్టర్ ఈమెతో వెకిలి మాటలేవో మాట్లాడి ఉండాలి.అమ్దుకే మొహం వేలాడేసుకుని దొంగ చూపులు చూస్తూ అడిగిన ప్రశ్నలకి అవకతవక జావాబులు చెప్పాడు. సుధ నిలువెల్లా వణికిపోయింది.సివంగిలా కోపంగా బైటికి నడిచింది.నిర్మల ఆమెని ఆపటానికి ప్రయత్నించింది కాని సాధ్యం కాలేదు.నేలమీద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.

***

రోజంతా నిర్మల మంచం మీంచి లేవలేదు. శరీరంలో ప్రాణమే లేనట్టు నిస్త్రాణ పూర్తిగా కమ్మేసింది.స్నానం , భోజనం ఏమీ చెయ్యకుండా అలా పడి ఉండిపోయింది.సాయంకాలానికి ఆమెకి జ్వరం వచ్చింది.రాత్రంతా ఒళ్ళు పెనంలా కాలిపోతూనే ఉంది.మర్నాటికి కూడా జ్వరం తగ్గలేదు.మంచం మీద పడుకుని నిశ్చలంగా గుమ్మంవైపే చూడసాగింది.లోపలా, బైటా అంతా శూన్యమే కనిపిస్తోందామెకి.ఒక రకమైన విరక్తిలో ఉన్నట్టు , భావాలూ మనసులో కదలటమ్ లేదు.మెదడు మొద్దుబారినట్టయిపోయింది.

ఇంతలో రుక్మిణి ఆశని ఎత్తుకుని నిర్మల గదిలోకొచ్చింది. పాపని చూడగానే ,”రాత్రంతా ఏడ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా వదినా?” అంది.

లేదు.చక్కగా నిద్రపోయింది. సుధ దీనికోసం పాలు తెచ్చింది.”

ఏం, పాలు పోసే అమ్మాయి రాలేదా?”

వచ్చింది, పాత బాకీ తీరుస్తే కాని పాలు పొయ్యనంది. నీ ఒంట్లో ఇప్పుడెలా ఉంది?” అంది రుక్మిణి.

నాకేం, బాగానే ఉన్నాను.నిన్న కాస్త ఒళ్ళు వెచబడిందంతే.”

డాక్టరు గారికి ఒంట్లో అస్సలు బాగాలేదట.”

ఏమయింది?” అంది నిర్మల కంగారుగా.

ఏమో, బతకటం కష్టమంటున్నారు.విషం మింగేశాడని ఒకరూ, గుండె ఆగిపోయిందని ఒకరూ అంటున్నారు.ఏమైందో భగవంతుడికే తెలియాలి మరి.”

నిర్మల నిట్టూర్చి,”పాపం సుధ ఎలా ఉందో . ఆయనకేమైనా అయితే ఎలా బతుకుతుంది?” అంది గద్గదంగా

మరుక్షణం ఆమె ఏడవసాగింది.చాలాసేపు అలా వెక్కి వెక్కి ఏడ్చింది. తరవాత లేని శక్తి కూడగట్టుకుని సుధ దగ్గరకి వెళ్ళేందుకు తయారవసాగింది.కాళ్ళు  వణుకుతున్నాయి.గోడ పట్టుకుని కాసేపు నిలబడింది.కదలటం ఎంత కష్టమైనా సుధని చూడకుండా ఉండలేనని అనిపించిందామెకి.ఇంటికెళ్ళి సుధ భర్తతో ఏమందో?నేనేమీ చెప్పలేదు కదా?నా మాటల్లో ఆమెకి ఏమి కనిపించి ఉంటుంది? అయ్యో, ఎంత పని జరిగింది!ఇలా జరుగుతుందని తెలిస్తే తను దాన్ని పెద్ద విషయంగా తీసుకునేదే కాదు కదా!తనవల్లే డాక్టర్ కి ప్రాణాపాయ స్థితి కలిగిందని అనుకోగానే నిర్మల మనసు కకావికలైపోయింది.గుండెల్లో ఎవరో శూలాలతో పొడుస్తున్నంత బాధ కలిగింది.వెంటనే సుధ ఇంటికి బైలుదేరింది.

శవాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే మిగిలారు.సుధ నేలమీద కూర్చుని ఏడుస్తోంది.నిర్మలని చూడగానే భోరున ఏడుస్తూ లేచి వచ్చి ఆమెని వాటేసుకుంది.ఇద్దరూ చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నారు.

కొంతసేపటికి అందరూ వెళ్ళిపోయి వాళ్ళిద్దరే మిగిలారు.”ఏమైంది సుధా? అసలెలా జరిగిందిది? నువ్వేమైనా అన్నావా?”అంది నిర్మల.

ఊరుకోలేకపోయాను నిర్మలా. చాలా కోపం వచ్చింది నాకు నువ్వు చెప్పింది విని.”

నేను నీకేమీ చెప్పలేదే?”

నీ నోటితో ఎలా చెపుతావు?నాకు ఆయనే చెప్పారు.అది విని కోపం ఆపుకోలేక నోటికొచ్చినట్టు తిట్టాను.అలాటి ఆలోచన ఆయన మనసులోకొచ్చిందంటే అవకాశం దొరికినప్పుడు దాన్ని కార్యరూపంలో పెట్టక మానరు.నవ్వులాటకన్నానని చెప్పి ఎవరూ తప్పించుకోలేరు.ఎవరూ లేని సమయంలో నీతో అలా అన్నారంటేనే ఆయన మనసులో అటువంటి తప్పుడు ఆలోచన ఉందనేగా?నేనెప్పుడూ నీకు చెప్పలేదు కాని,చాలాసార్లు ఆయన నీవైపు దొంగచూపులు చూడటం గమనించాను.అప్పుడు అది నా భ్రమేమో అనుకుని పట్టించుకోలేదు.కానీ దాని వెనక ఇలాంటిది ఉందని తెలుసుకోలేకపోయాను.అలాటి అనుమానం ఉంటే అసలు నిన్ను ఇంటికే రానిచ్చేదాన్ని కాదు! నీకు ఇటువంటి అవమానం జరగకుండా ఉండేది.మగవాళ్ళ మాటలు వేరు చేష్టలు వేరు అని నాకు తెలీలేదు.అలాంటి భర్తతో కాపురం చెయ్యటం కన్నా, వైధవ్యమే మేలనుకుంటాను.విషం కలిసిన భోజనం తినేకన్నా ఉపవాసాలుండటం నయం,” అంది సుధ.

ఇంతలో డాక్టర్ తమ్ముడూ, నిర్మల చెల్లెలు కృష్ణ ఇంట్లోకొచ్చారు.మళ్ళీ శోకాలు పెట్టారందరూ.

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.