పద్ధతి (తమిళ అనువాదకథ)

తమిళం: మాలన్

తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్

తాతయ్య ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది జనని.

తాతయ్యను అడగడానికి ఆమె దగ్గర ఒక ప్రశ్న ఉంది. ముఖ్యమైన ప్రశ్న. అడిగి తీరాల్సిన ప్రశ్న. తను చేసిన లెక్క సరియైనదా? తప్పా?

జనని మళ్ళీ ఒకసారి పరీక్ష పేపరును తీసి చూసింది. లెక్క మీద అడ్డంగా ఎరుపు రంగు పెన్సిల్‍తో గీత గీసి ఉంది. మార్జిన్‍లో పెద్దగా సున్నా వేసి ఉంది. జీరో వేస్తే లెక్క తప్పు అని నాలుగేళ్ళు నిండిన జననికి  తెలుసు. కానీ ఏడూ ఇంటూ రెండు పద్నాలుగు ఎలా తప్పు అవుతుంది? అదే ఆమెకు అర్ధం కాలేదు.

జననికి పోయిన నెలలోనే నాలుగేళ్ళు నిండాయి. నాలుగేళ్ళకి మంచి తెలివి తేటలు ఉన్నాయనే చెప్పాలి. ఒక్క నిమిషం కూడా ఊరికే ఉండకుండా చెయ్యి ఏదైనా తుంటరి పని చేస్తూనే ఉంటుంది. నోరు ఏదైనా అడుగుతూనే ఉంటుంది. సముద్రం ఎందుకు నీలంగా ఉంటుంది? చెట్టు ఆకుపచ్చగా ఎందుకు ఉంటుంది? జిగినా పేపరు ఎక్కడి నుంచి వస్తుంది? వానలో తడిస్తే ఆవుకు జలుబు చేస్తుందా? కంప్యూటరుకు ఎలా అన్నీ తెలుస్తాయి? దేవుడు అంటే కంప్యూటరేనా?

జనని అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పడం అంటే తేనెతుట్టె మీద రాయి విసిరినట్లే. ఒక ప్రశ్నకు జవాబు చెబితే, దానితో ఆగిపోదు. శరమారిగా ప్రశ్నలు పుట్టుకు వస్తూనే ఉంటాయి. ఆమె ఏదైనా మొదలు పెట్టిందంటే, కాస్త ఊరుకోమ్మా అంటారు నాన్న. ఈ విధంగా మాట్లాడ కూడదు అని అడ్డుపడుతుంది అమ్మ.

కానీ తాతగారు మాత్రం జవాబు చెబుతారు. విసుగు చెందకుండా చెబుతారు. ఆ నిమిషంలో ఆయనే చిన్న పిల్లవాడిలా మారి పోయినట్లు ఉత్సాహంగా చెబుతారు. క్రమ క్రమంగా ప్రశ్న అడగకుండానే జవాబు తెలుసుకోవడం ఎలాగ అని నేర్పించారు. వేరే విధంగా ఆలోచించు, జవాబు దొరుకుతుంది అని నేర్పించారు. వేరే కోణంలో చూస్తే అన్నీ ఎలా వేరు విధంగా కనబడతాయి అని ఆయనే నేర్పించారు. కాలిక్యులేటర్ లో 7 ను నొక్కి తలక్రిందులుగా చేసి తమిళ అక్షరం అనే వారు. 3 ను నొక్కి E అనేవారు. జీరోను O అనీ, I ని ఒకటి అనేవారు.

తాతయ్యని అడిగితే తెలుస్తుంది. ఆ లెక్క తప్పు ఎలా అవుతుంది?

పరీక్ష పేపరును చూడగానే తాతయ్య అదిరి పడ్డారు? “జీరోనా? ఏంటమ్మా ఇది? ఏం ప్రశ్న అడిగారు? ప్రశ్నాపత్రం తీసుకురా. చూద్దాం.” 

ప్రశ్నాపత్రాన్ని చూశారు. 

“ఒక వారానికి ఏడురోజులు. రెండు వారాలకి ఎన్ని రోజులు?”

జనని వ్రాసిన ఆన్సర్ షీట్ ను చూసారు. జనని 7×2 = 14 అని వ్రాసింది.

లెక్కకు అడ్డంగా టీచరు గీసిన గీత. పక్కన మార్జిన్‍లో పెద్దగా సున్నా.

“తప్పా తాతయ్యా? ఎలా తప్పు?”

“అదేనమ్మా నాకూ అర్థం కావడం లేదు.”

తాతయ్య మరునాడు ఆఫీసుకు సెలవు పెట్టారు. జననితో స్కూలుకు వెళ్ళారు. లెక్కల టీచర్ని విడిగా కలిసి, తీసుకు వెళ్ళిన ఆన్సర్ షీటును తెరిచి చూపించారు.

“ఇందులో తప్పు ఏముంది మేడం?”

“తప్పుకాదా మరి?”

“అదే ఎలాగా అని…”

టీచరు చేతిని పైకి లేవనెత్తి చూపించి మాటలను ఆపింది.

 “చెబుతాను. ఈ లెక్కను క్లాసులో వర్క్ చేసి చూపించాము.”

“ఏమని?”

“ఒక వారానికి ఏడూ రోజులు. అంటే రెండు వారాలకు 2×7=14.”

“సరే. 7×2= 14 అని పాప వ్రాస్తే అది తప్పై పోయిందా?”

“కాదా మరి. క్లాసులో ఎలా నేర్పిస్తామో  అదే విధంగానే వ్రాయాలి. 2×7=14 అని నేర్పించినప్పుడు 7×2= 14 అని వ్రాస్తే అది తప్పే మరి.”

“టీచర్! ఇది అన్యాయం” అంటూ గొంతు పెంచారు తాతయ్య. “నేను ప్రిన్సిపాల్ దగ్గర పుకారు చేస్తాను.”

“ప్లీజ్… డూ ఇట్!” అంది టీచర్ నిర్లక్ష్యంగా.

ప్రిన్సిపాల్ కళ్ళజోడును తీసి చత్వారపు కళ్ళజోడు పెట్టుకుని, ప్రశ్నాపత్రాన్ని, జవాబు వ్రాసిన పేపరును రెండింటినీ మారి మారి చూశారు. తాతగారు చెప్పింది పూర్తిగా శ్రద్ధగా విన్నారు. “కాస్త ఉండండి. కనుక్కుని చెబుతాను” అని అన్నారు.

జనని లెక్కల టీచర్‍కి  పిలుపు వెళ్ళింది. పిలుపు వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నందువల్లో ఏమో టీచర్ లెక్కల పుస్తకంతో సహా వచ్చింది.

“ఏంటమ్మా ఇది?” అన్నారు ప్రిన్సిపాల్.

“సార్! మనం క్లాసులో ఈ లెక్కను ఎలా చేయాలో చేసి చూపించాము.”

ప్రిన్సిపాల్ గారి మేజ మీద నోటు పుస్తకాన్ని తెరిచి పెట్టింది టీచర్. “కానీ ఈ స్టూడెంట్ పరీక్షలో ఆ పద్దతిలో వ్రాయలేదు.”

“అందుకోసం 7×2= 14 అని వ్రాస్తే తప్పై పోతుందా?” అన్నారు తాతగారు కోపంగా.

“అలా కాదు సార్. ఇది ఒక స్టూడెంట్ క్లాసులో ఎంత ఏకాగ్రతతో ఉంటోంది అని తెలుసుకోవడం కోసం ఇవ్వబడింది.”

“ఐ యాం సారి సార్! మీ మనవరాలు క్లాసులో తగినంతగా శ్రద్ధ చూపించడం లేదు అన్నది దీని ద్వారా తెలుస్తోంది. మీరు కాస్త హెచ్చరించి పెట్టండి” అన్నారు ప్రిన్సిపాల్ గారు.

కుర్చీని బర్రున వెనక్కి నెడుతూ లేచి నిలబడ్డారు తాతగారు.

****

విద్యా శాఖాదికారిని చూడడానికి రెండు గంటలకు పైగానే వేచి ఉండాల్సి వచ్చింది. వరండాలో వేసి ఉన్న ఒక బెంచీ మీద కూర్చున్నారు. కట్టలు కట్టలుగా కాగితాలు సంతకం కోసం ఆయనగారి గదిలోకి వెళ్లి వస్తూ ఉండడం చూస్తూ ఉండి పోయారు తాతగారు. పనులన్నీ ముగించుకుని బయలు దేరే ముందు లోపలికి పిలిచారు అధికారి.

“అర్జంటుగా వెళ్ళవలసి ఉంది. ఐదు నిమిషాల్లో చెప్పవలసిన దాన్ని చెప్పి ముగించండి సార్” అన్నారు మొదలు పెట్టక ముందే.

గబ గబా చెప్పడం ప్రారంబించారు తాతగారు. మధ్యలోనే అడ్డు పడ్డారు ఆధికారి.”ఈ ఎల్.కే.జి., యూ. కే.జి.లన్నీ మా అధికారం క్రిందికి రావు సార్” అని అన్నారు.

“అది ఉండనివ్వండి సార్. కానీ ఇది అన్యాయం అని మీకు అనిపించడం లేదా?”

“ఏది?”

“సరియైన జవాబు వ్రాసినా సున్నా వెయ్యడం.”

“మీ పాప వ్రాసింది పూర్తిగా తప్పు అని చెప్పలేం. పార్శియల్లీ కరెక్ట్.”

తాతగారు ఒక నిమిషం ఆలోచించారు.

“అలాగైతే పార్శియల్లీ కరెక్ట్ అని మీరు ఒక పేపరు మీద వ్రాసి ఇవ్వగలరా?”

“దేనిని? ఏడూ ఇంటూ రెండు ఈక్వల్ టు పద్నాలుగు అన్నదానినా?”

“అది కాదు సార్.”

“చూడండీ. ఇది మొదట నా పరిధికి మించిన విషయం. రెండవది జవాబు మాత్రమే కాదు. చేసే పద్ధతి కూడా సరిగ్గా ఉండాలని గాంధీజీ గారే సెలవిచ్చారు కదా?”

మంత్రి దాకా ఈ విషయాన్ని తీసుకు వెళ్ళాలా అని తాతగారు నిర్ణయించుకోలేక పోయారు. అంత పెద్ద స్థాయికి తీసుకు వెళ్ళడానికి ముందు జనని తల్లి తండ్రులతో మాట్లాడడం మంచిది  అని అనిపించింది. ఇంత దూరానికి తీసుకు వెళ్లినందుకే, మమ్మల్ని అడగకుండా ఎందుకు ఇదంతా చేశారు అని కోపగించుకోవచ్చు. దీని తాలూకు మంచి చెడ్డలు మా పాప మీదే కదా పడతాయి అని గొడవ చెయ్యవచ్చు. కానీ పాపకు బహిరంగంగా ఒక అన్యాయం జరుగుతూ ఉంటే దానిని చూస్తూ పక్కకి తప్పుకునేటంతగా ఆయన రక్తం  ఇంకా చల్లారి పోలేదు.

అందువలన రాత్రి పూట డైనింగ్ టేబుల్ ముందు మెల్లగా విషయాన్ని కుండబద్దలు కొట్టారు.

“ఆ టీచరు చెప్పింది తప్పుగానే ఉండవచ్చు. కానీ వాళ్ళు చెప్పినదానిని అలాగే పరీక్షలలో వ్రాయడానికి ఈమెకేం తెగులు?”

“సరి. వ్రాయలేదు. అది తప్పు అయిపోతుందా?”

“ఎందుకు వ్రాయలేదు?” తల్లి అడిగింది.

“ఆమెనే పిలిచి అడుగు.”

“జననీ!” పెద్ద గొంతుతో పిలిచారు నాన్నగారు. 

“యెస్ డాడీ!” పరిగెత్తుకుంటూ వచ్చింది పాప.

“ఒక వారానికి ఏడు రోజులు. రెండు వారాలకు ఎన్ని రోజులు?”

టీచరు ఇచ్చిన లెక్కను నాన్నగారు ఎందుకు అడుగుతున్నారు అని అర్థం కాకుండా విస్తుపోయిన జనని, “పద్నాలుగు” అంది కాస్త జంకుతూ.

“ఎలాగా?”

“ఏడు ఇంటూ రెండు ఈక్వల్‍ టు  పద్నాలుగు.”

“ఏడూ ఇంటూ రెండు ఎలా అవుతుంది? ఒక వారానికి ఏడు రోజులు. అంటే రెండు ఇంటూ ఏడు అనే కదా?”

“లేదు తాతయ్యా! ఒక వారంలో ఒక సండే, ఒక మండే, ఒక ట్యూస్ డే.. ఇలా ఏడు రోజులు. రెండు వారాల్లో రెండు సండే , రెండు మండే…” అంటూ వేళ్ళను మడిచి లెక్క పెట్టింది జనని.

“సో… ఏడు రోజులు… ఒక్కొక్కటీ రెండు సార్లు . అందుకే ఏడు ఇంటూ రెండు.”

“గ్రేట్!” అన్నారు తాతగారు. “ఇది విబిన్నమైన ఆలోచన.  క్లాసు మొత్తం టీచర్ చెప్పిన పద్దతిలోనే గుర్రం కళ్ళకు గంతలు కట్టినట్లు ఒకే మూసలో వెళ్తూ ఉంటే, మెదడును ఉపయోగించి నువ్వు లెక్క చేశావు చూడూ. ఇదే మరి క్రియేటివిటీ! ఇదే కుశాగ్రబుద్ధి!” అంటూ ఉత్సాహంతో పొంగి పోయారు తాతగారు.

“ఎక్కువగా సంతోషపడకండి నాన్నగారూ. ఇది చింతించ వలసిన విషయం.”

“ఏమిట్రా అంటున్నావు?”

“తను ఆడపిల్ల. గుర్తు పెట్టుకోండి. చెప్పినట్లు కాకుండా వేరే విధంగా ఆలోచించే పాప, భవిష్యత్తులో పెద్దగా అయిన తరువాత చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఇప్పటిదాకా ఆచరణలో ఉన్న సంప్రదాయాలు, నమ్మకాలు… వీటన్నిటి గురించీ ప్రశ్నిస్తుంది. విభిన్నంగా ఆలోచించడం వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయి. సమాజాన్ని, లోకాన్ని అనుసరించకుండా ఉంటే ఆమెకీ అవస్థ. మిగిలిన వాళ్ళకీ హింస.”

“అందువల్ల?”

“జననీ! టీచరు ఎలా నేర్పిస్తోందో అలాగే లెక్క చెయ్యి. అధిక ప్రసంగి లాగా నడచుకోవద్దు” అని చెబుతూ లేచారు నాన్నగారు.

మనవరాలిని రెప్పవాల్చకుండా ఒక నిమిషం చూసిన తాతగారు, ముందుకు వచ్చి ఆమెను దగ్గరికి తీసుకున్నారు. ఆయన కళ్ళలో తడి మెరిసింది.

****

Please follow and like us:

11 thoughts on “పద్ధతి (తమిళ అనువాదకథ)”

  1. పద్దతి కథ చాలా బాగుంది. చిన్న పాప సందేహాన్ని నివృత్తి చేయకుండా. సరియైన జవాబు కూడా తప్పంటూ వాళ్ళ టీచర్ చెప్పడం బాధగా ఉంది. ఆడపిల్లలోని ప్రశ్నించే తత్వాన్ని చిన్నప్పటి నుండే అణచివేయడం. అదీ తెలియకుండానే ఓ పద్ధతిగా .. చదువుతుంటే సమాజంలో తారసపడిన ఘటనలు గుర్తుకు వచ్చాయి. కథ అనువాదం అనిపించలేదు.చాలా బాగుంది. స్త్రీలను ఆలోచింపజేసే కథ. ఇంత మంచి కథను అందించిన గౌరీ కృపానందన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
    రచన పేరు: పద్దతి
    తేదీ:24-06-2021

  2. Good story. Applies even to boys too thanks to Giuri garu for a good transalatin of a good story with an exallent conept

    1. This siruation in educational institutions
      applies to both boys and girls .killing creativity and originality ! A good story
      Thanks Gouri garu
      Krishnakumari chaganty

    2. పిల్లలలోని
      సృజనాత్కకతను మొగ్గలోనే చిదిమి వేయాలని చూచే తల్లి తండ్రులు మారితేనే భావితరం బాగుపడుతుంది. కధ నచ్చినందుకు చాలా సంతోషం.

  3. Excellent story గౌరి గారూ… ధన్యవాదాలు.

  4. చాలా మంచి అనువాదం. ఎక్కడా అనువాదమని అనిపించనంత సహజత్వం. మెదడుకు పదును పెట్టే కథ. ఒక పద్ధతిని ,అందులోనూ ఆడపిల్ల ఆలోచించనూ కూడదు. ఎంత సరళంగా అనిపిస్తుందొ అంతే లోతుగాఉన్న కథ. ఇంత మంచి కథను అందించినందుకు గౌరీ కృపానందన్ గారికి ధన్యవాదాలు.

    1. మన సమాజంలో ఆడపిల్ల అనగానే ఎన్ని నిబంధనలు, ఎన్ని కట్టుబాట్లు ! ఆఖరుకి ఆడపిల్ల ఆలోచనలకు కూడా ఆంక్షలు. తల్లి తండ్రుల దృక్పధం మారితే తప్ప సమాజం బాగుపడదు. మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి. పద్ధతి కధ, అనువాదం మీకు నచ్చినందుకు సుశీలా.

  5. A very good translation of a very important story from Tamil. I recollect that the school educators in Chennai did take the issue in right earnest when Malan wrote this story. However things have not improved and the teachers behave as high-handedly as ever, especially the lady teachers in CBSE schools.

    1. పద్ధతి కధ మరియు అనువాదం మీకు నచ్చినందుకు థాంక్స్ RAYA CHELLAPPA.. మీరు ఈ కధను తమిళంలో కూడా చదివి ఆస్వాదించి వుంటారు.

Leave a Reply

Your email address will not be published.