షర్మిలాం “తరంగం”

కనబడని శత్రువుతో పోరాటం !

-షర్మిల కోనేరు 

ఈ బంధాలు శాశ్వతం కాదు అని చెప్తుంది వేదాంతం. ” రాక తప్పదు పోక తప్పదు ” అని అనుకుంటాం నిర్వేదంగా !

జగం అనే రంగస్థలం పైన మనం పాత్రధారులం అని కూడా అంటాం …

కానీ ఈ రాక కి పోక కి మధ్య జరిగేవి ఉత్తి సన్నివేశాలేనా ?

నాటకంలో నటిస్తాం జగన్నాటకంలో జీవిస్తాం!

నటించడం అయిపోగానే పాత్రధారి నిష్క్రమిస్తే ఆ పాత్ర ముగిసినట్టే, కానీ జీవితంలో అలా కాదు ఆ మనిషి తోపెనవేసుకున్న ఎన్నో జీవితాలు అల్లకల్లోలం అవుతాయి.

నడి సముద్రంలో జారవిడిచి నావ తీరానికి జేరిపోతే ఒడ్డెక్కడం ఎంత కష్టం!

ఇప్పుడు ఈ కరోనా చేసే కరాళ నృత్యంలో పిల్లలకు తలులు , కొందరు పిల్లలకు తండ్రులు దూరం అవుతున్నారు.

భర్తను పోగొట్టుకున్న  భార్యలు … భార్యలకు దూరమైన భర్తలు ఇంటరై బేలగా ఈ సంసారాన్ని తోడు లేకుండా ఎలాఈదాలో తెలియక తల్లడిల్లుతున్నారు .

వృద్ధ తల్లి తండ్రులకు తీరని శోకం మిగులుతోంది.

ఇవన్నీ చూస్తూ ఇంకెన్ని చూడాలో తెల్యక గుండెలు చిక్కబట్టుకుని బతుకుతోంది భారత దేశం .

రాజకీయ ఎత్తుగడల్లో మునిగితేలడం  తప్ప ప్రజలి రక్షించే వ్యూహరచన లేని నాయకత్వాన్ని నిందించాలో తమ ఖర్మకిఏడ్వాలో తెలియని జనం శ్మశానాల దగ్గర బారులు తీరుతున్నారు.

ఇదంతా మిధ్య అని చెప్పే వేదాంతం మాకొద్దు.

జీవితం బుద్భుదప్రాయం కాదు.

ఆలింగనాలు , అలకలు, కోపతాపాలు , ఆవేశ కావేషాలు  ప్రేమలు , బాధ్యతలు ఇంకెన్నెన్నో రంగుల సమ్మేళనం.

ఒక క్రిమి గాని క్రిమి పడగ విప్పి జనాల్ని కాటేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాత .

ఆప్తుల్ని పోగొట్టుకున్న వారిని వాటేసుకుని ఓదార్చడానికి సాటి మనుషులు సాహసించలేని పాడు కాలం దాపురించింది .

కానీ మనిషి ఏనాటికైనా జయిస్తాడు.

అంతవరకూ కరోనాతో జరిగే ఈ యుద్ధంలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం .

అస్త్రం దొరికే వరకూ మనని మనం కాడుకుంటూ బాధితులకు బాసటగా నిలవడమే అందాకా మనం చేయాల్సిన పని !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.