కథన కుతూహలం -1

                                                                – అనిల్ రాయల్

ఇటీవల తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపులో ఎనిమిది భాగాలుగా వచ్చిన ‘కథాయణం’ పరంపరకి ఈ ‘కథన కుతూహలం’ కొనసాగింపు. దీనికి వేరే పేరు పెట్టటానికి కారణముంది. ‘కథాయణం’లో వివరించినవన్నీ ప్రతి కథకి అత్యవసరమైన అంశాలు: ఎత్తుగడ, ముగింపు, శీర్షిక, సంభాషణలు, దృక్కోణం, పాత్రలు, నిర్మాణం. అవి లేని కథ ఉండదు. అవన్నీ తగుపాళ్లలో ప్రతి కథకీ అవసరం.

ఈ ‘కథన కుతూహలం’లో వివరించబోయే ప్రక్రియలు అన్నీ ప్రతి కథకీ అవసరం ఉండకపోవచ్చు. ఈ పరంపరలో వచ్చే వ్యాసాలని మీ కథలకి కొన్ని హంగులు ఎలా అద్దాలో నేర్పే పాఠాలుగా భావించొచ్చు.

ఈ తొలి భాగంలో ప్రత్యేకంగా ఏ వ్యాసమూ అందిచబోవట్లేదు. ఈ భాగంలో ఓ ప్రత్యేకమైన కథ చదువుదాం. ఇదో అనువాద కథ. ఇది ఎందుకు ప్రత్యేకమైనదంటే – ఇది మధ్యమ పురుషంలో (second person) నడిచే కథ. ఈ దృక్కోణంలో నడిచే కథలు అరుదాతి అరుదు.

కథ చదివేయండి. సాంకేతికంగా ఈ కథలో ఉన్న ఓ గొప్ప విషయం గురించి ‘కథన కుతూహలం’ తరువాయి భాగంలో తెలుసుకుందాం.

బ్రహ్మాండం

(Andy Weir ఆంగ్ల కథ ‘The Egg’ కి మూల కథకుడి అనుమతితో చేయబడ్డ అనువాదం. అనువదించినవారు Anil S. Royal)

నువ్వు ఇంటికి వెళుతుండగా జరిగిందది.

రహదారి ప్రమాదం.

అందులో పెద్ద విశేషమేమీ లేదు – నువ్వు చనిపోవటం తప్ప.

పెద్దగా బాధపడకుండానే పోయావు. ఒక భార్యని, ఇద్దరు పిల్లల్నీ వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాట్టానికి వైద్యులు శక్తికొద్దీ ప్రయత్నించారు. కానీ నీ శరీరం ఎంతగా నుజ్జైపోయిందంటే – నువ్వు బతికుండటం కన్నా ఇదే మెరుగంటే నమ్ము.

అలా కలిశావు నువ్వు నన్ను. అదే మొదటిసారి కాదనుకో. కానీ ఆ సంగతి అప్పటికి నీకింకా తెలీదు.

“ఏం జరిగింది?”. నీ తొలి ప్రశ్న. “ఎక్కడున్నా నేను?”. రెండోది.

“చచ్చిపోయావు,” వెంటనే చెప్పేశాను. నాన్చుడు నాకు తెలీదు.

“పెద్ద వాహనమేదో వచ్చి నన్ను ఢీకొంది …”

“అవును”

“నేను … పోయానా!?!”

“అవును. అందులో బాధపడాల్సిందేమీ లేదు. అందరూ పోయేవాళ్లే ఏదో నాటికి”

నువ్వు చుట్టూ చూశావు. ఏమీ లేదక్కడ. ఉంది మనమిద్దరమే.

“ఎక్కడున్నాం మనం? పరలోకమా?” అన్నావు.

“అలాంటిదే”

“నువ్వు … దేవుడివా?”

“అలా కూడా పిలవొచ్చు”

“నా భార్య, పిల్లలు …” అంటూ ఆగిపోయావు.

ప్రశ్నార్ధకంగా చూశాను.

“వాళ్లకేమవుతుందిప్పుడు?” అన్నావు.

“ఏమో, చూద్దాం”, అన్నాను. “నీ విషయానికొస్తే – చనిపోయిన వెంటనే వాళ్లని తలచుకుని బాధపడుతున్నావు. మంచి గుణమే”

అప్పటికి కాస్త తేరుకున్నావు. నన్ను తేరిపారా చూశావు. నీకు నేనో దేవుడిలా కనబడలేదు. ఓ సాధారణ మానవ రూపంలో కనబడ్డాను. అది పురుషుడో లేక స్త్రీనో కూడా తేల్చుకోలేకపోయావు.

“బాధ పడొద్దు,” నేను కొనసాగించాను. “నీ పిల్లలు నిన్నెప్పటికీ ఓ మంచి తండ్రిగా గుర్తుంచుకుంటారు. వాళ్లకంటూ వ్యక్తిత్వాలు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఏర్పడకముందే పోవటం నీ అదృష్టం. ఇక నీ భార్య – లోకం కోసం ఏడ్చినా లోలోపల నీ పీడ వదిలిందనుకుంటోంది. మీ మధ్యన అంత గొప్ప అనుబంధమేమీ లేదు కదా”

“ఓహ్,” అన్నావు నువ్వు ఆశ్చర్యపోతున్నట్లు. వెంటనే సర్దుకున్నావు. “అయితే, ఇప్పుడేమవుతుంది? నేను స్వర్గానికో, నరకానికో పోతానా?”

“లేదు. మళ్లీ పుడతావు”

“ఓహ్,” మళ్లీ ఆశ్చర్యపోయావు. “అంటే, హిందువులు చెప్పేది నిజమేనన్న మాట!”

“అన్ని మతాలు చెప్పేదీ నిజమే,” అంటూ నడక ప్రారంభించాను. నువ్వు అనుసరించావు, “ఎక్కడికి?” అంటూ.

“ఎక్కడకూ లేదు. మనమున్న ఈ చోట ఎంత నడచినా ఎక్కడకూ వెళ్లం”

“మరి నడవటం ఎందుకు?”

“ఊరికే. నడుస్తూ మాట్లాడుకోటం బాగుంటుంది కాబట్టి”

కాసేపు మౌనంగా నన్ను అనుసరించాక నోరు విప్పావు.

“మళ్లీ పుట్టటం వల్ల ప్రయోజనమేంటి? ఈ జన్మలో నేను నేర్చుకున్నదంతా వదిలేసి మళ్లీ కొత్తగా మొదలెట్టటం … అంత అర్ధవంతంగా లేదు”

“లేదు. నీ గత జన్మల జ్ఞానం ప్రతి జన్మలోనూ నీ తోడుంటుంది. ప్రస్తుతానికి అదంతా నీకు గుర్తు లేదంతే,” అంటూ ఆగాను. నువ్వు కూడా ఆగిపోయావు.

నీకేసి తిరిగి, నీ భుజమ్మీద చెయ్యివేసి కొనసాగించాను. “ప్రస్తుత జన్మలో నలభయ్యేళ్లే నువ్వు మానవ రూపంలో ఉన్నావు. గత జన్మల సారాన్నంతటినీ అనుభూతించేంత సమయం నీకు దొరకలేదు, అంతటి వివేకం నీకింకా కలగలేదు”

నా మాటలు అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ కాసేపు నిశ్చలంగా ఉండిపోయావు. తర్వాత అడిగావు.

“నాకెన్ని గత జన్మలున్నాయి?”

“లెక్కలేనన్ని. ఒక్కో సారీ ఒక్కో రకం జీవితం”

“రాబోయే జన్మలో నేనెవర్ని?”

“క్రీ. శ. 540, చైనా దేశంలో ఒక గ్రామీణ పడుచువు”

“ఏమిటీ!” అంటూ నిర్ఘాంతపోయావు. “కాలంలో వెనక్కి పంపుతున్నావా నన్ను??”

“సాంకేతికంగా చెప్పాలంటే అంతే. ఈ ‘కాలం’ అనేది నువ్వెరిగిన విశ్వానికి మాత్రమే వర్తించే లక్షణం. నేనొచ్చిన విశ్వంలో విషయాలు వేరుగా ఉంటాయి”

“ఎక్కడ నుండొచ్చావు నువ్వు?” అడిగావు.

“ఎక్కడ నుండో. నాలాంటి వాళ్లు మరిందరూ ఉన్నారు. వాళ్లూ ఎక్కడెక్కడ నుండో వచ్చారు. నీకా విషయాలన్నీ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. అవన్నీ నీకర్ధమయ్యేవి కాదు కాబట్టి వాటినలా వదిలేద్దాం”

“ఓహ్,” నిరాశగా నిట్టూర్చావు. అంతలోనే నీకో అనుమానమొచ్చింది. “అవునూ, నేనిలా కాలంలో ముందుకీ వెనక్కీ గెంతుతూ పునర్జన్మలెత్తుతుంటే ఎప్పుడో ఓ సారి నా అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడవా?”

“అది తరచూ జరిగేదే. నీ అవతారాలు తన ప్రస్తుత జన్మని మాత్రమే గుర్తుంచుకుంటాయి కాబట్టి ఒకదాన్నొకటి గుర్తుపట్టవు”

“ఇదంతా దేనికోసం?”

“నువ్వు ఎదగటం కోసం. నీ ప్రతి జన్మ పరమార్ధమూ నువ్వు గత జన్మలోకంటే కొంత మెరుగుపడటం. అంతే. అందుకోసం ఓ విశ్వాన్నే సృష్టించాను – నీ ఒక్కడి కోసం”

“నా ఒక్కడి కోసం!?! మరి, మిగతా వాళ్ల సంగతేంటి?”

“మిగతా వాళ్లంటూ ఎవరూ లేరు. ఈ విశ్వం మొత్తానికీ ఉన్నది నువ్వొక్కడివి, నీకు తోడుగా నేను”

నువ్వు భావరహితంగా నాకేసి చూశావు. “మరి, భూమ్మీది ప్రజలందరూ …”

“వాళ్లంతా నీ వేర్వేరు అవతారాలే”

“ఏంటీ!! అందరూ నేనేనా?”

“అవును. ఇప్పటికి తత్వం బోధపడింది నీకు,” అన్నా నేను అభినందనపూర్వకంగా నీ వీపు తడుతూ.

“భూమ్మీద పుట్టిన, గిట్టిన ప్రతి మనిషీ నేనేనా?”

“పుట్టబోయే ప్రతి మనిషి కూడా నువ్వే”

“మహాత్మా గాంధీని కూడా నేనే?”

“నాధూరామ్ గాడ్సేవీ నువ్వే”

“అడాల్స్ హిట్లర్‌ని నేనే?”

“అతను ఉసురు తీసిన లక్షలాది మందివీ నువ్వే”

“ఏసు క్రీస్తుని నేనే?”

“క్రీస్తుని నమ్మిన కోట్లాది భక్తులూ నువ్వే”

నువ్వు మ్రాన్పడిపోయావు.

నేను చెప్పటం ప్రారంభించాను. “నువ్వొకరిని బాధ పెట్టిన ప్రతిసారీ నువ్వే బాధ పడ్డావు. నువ్వు పెట్టిన హింసకి నువ్వే బలయ్యావు. నువ్వు చూపిన కరుణ నీ మీదనే కురిసింది. ఆయుధం నువ్వే, దాని లక్ష్యమూ నువ్వే. కర్తవి నువ్వే. కర్మవీ నువ్వే”

నువ్వు దీర్ఘాలోచనా నిమగ్నుడివయ్యావు. అందులోనుండి బయటపడ్డాక అడిగావు.

“ఎందుకిందంతా చేస్తున్నావు?”

“ఏదో ఒక రోజు నువ్వు నాలా మారతావు కాబట్టి; నువ్వు నా బిడ్డవి కాబట్టి”

“అంటే … నేను … దేవుడినా??”

“అప్పుడేనా? ప్రస్తుతానికి నువ్వింకా పిండం దశలోనే ఉన్నావు. మెల్లిగా ఎదుగుతున్నావు. సర్వకాలాల్లోనూ వ్యాపించిన మానవ జన్మలన్నిట్నీ సంపూర్ణంగా అనుభవించాక, మనిషిగా పరిపూర్ణుడివయ్యాక, అప్పటికి – నువ్వు నీ అసలు అవతారమెత్తటానికి సిద్ధమౌతావు”

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం! “

“ఉత్తి అండం కాదు. బ్రహ్మాండం. అది బద్దలవటానికింకా చాలా సమయముంది,” అని నీ భుజం తట్టి చెప్పాను. “ప్రస్తుతం నీ మరు జన్మకి సమయమయ్యింది”.

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

*****

అనువాదకుడి మాట: పై కథ రాసింది ఆండీ వెయిర్ (Andy Weir). ఆ పేరు వెంటనే అందరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ, అఖండ విజయాన్నందుకున్న హాలీవుడ్ సినిమా ‘ది మార్షియన్’కి ఆధారమైన, అదే పేరుతో వచ్చిన నవలా రచయిత అంటే చాలామందికి తెలియవచ్చు. అంతగా గుర్తింపులేని కాలంలో అతను రాసిన ‘The Egg’ అనే కథకి అనువాదం ఈ ‘బ్రహ్మాండం’. ఆంగ్లకథని ఒక్క ఆంగ్ల పదమూ దొర్లకుండా తెనుగీకరించటం ఈ ‘బ్రహ్మాండం’లోని చిన్న విశేషం.

*****

(సారంగ, తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపు లలో ప్రచురితం-)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.