కథాకాహళి- 20

ఆశ్రిత కులాల చైతన్య ప్రస్థావనలు – గోగు శ్యామల కథాప్రయోజనాలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

దళిత సాంస్కృతిక జీవితాన్ని“మాదిగోడు” కథలలో, నాగప్పగారి సుందర్రాజు మాదిగల ఊరుమ్మడి జీవితాన్ని చిత్రిస్తే, గోగు శ్యామల మాదిగ ఆశ్రితకుల స్త్రీల శ్రమైక జీవితాన్ని, ధైర్య, స్థైర్యాలను చిత్రించి దళిత స్త్రీవాద సాహిత్య సృజనశీలతను విస్తృతపరిచారు. దళితులలో కూడా మరింత అట్టడుగు జీవిక మాదిగలదైతే, అందులోనూ మాదిగ ఆశ్రితకులాల స్త్రీల వేదన ఎంత సూక్ష్మీకరించబడిన (మార్జినలైజ్డ్) కథాంశమో చెప్పవలసిన పనిలేదనుకుంటాను. ఆశ్రితకులాల సంవేదనాత్మక జీవితాన్ని చిత్రించడానికే ఈమె కథలు పరిమితంకావు. మాదిగ శ్రామికస్త్రీల జీవితంలోని స్త్రీవాద మౌలికాంశాలైన గుర్తింపు, గౌరవరాహిత్యం, ఇంటిచాకిరి, శారీరక సామర్థ్య నిర్దారణ, లైంగిక వేధింపులు, హక్కుల పోరాటం, వీటన్నిటికి తోడు దళిత్ ఈస్తటిక్ వాల్యూ కూడా ఈమె కథలకు తోడైంది. అగ్ర, ఆధిపత్యకులాల సాంస్కృతిక విలువలే ప్రామాణిక విలువలుగా చలామణి అవుతున్న దశలో వాటి సరసన ఆశ్రిత కులాల సాంస్కృతిక, భాషా సౌందర్యాలను ప్రత్యామ్నాయంగా నిలబెట్టటం, సామాన్యమైన విషయమేమి కాదు.  

ఆశ్రిత కులాల సాంస్కృతిక నేపథ్యం వాళ్ళ జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో ఈమె తన కథల ద్వారా తేటతెల్లం చేసింది. సాధారణంగా మాదిగలు భయస్తులు, పిరికివారు, పెత్తందార్లను ఎదిరించే శక్తి,యుక్తి లేనివారనేది లోక రివాజు. కానీ శ్యామల కథల్లోని మాదిగ ఆశ్రితకుల స్త్రీపాత్రలు అణిచివేతను బేలగా భరించి బలైన మూర్తిమత్వం ఏకథలోనూ కానరాదు. ఆర్థిక దోపిడిని, లైంగికదాడులను ఎదుర్కొని, తమ జీవితాలను వెలిగించుకున్న ధీశాలులుగా బాలమ్మ, శ్యామల, సాలమ్మ, లసుమవ్వ, భైండ్లామె మొదలైన పాత్రలను పాఠకుల ముందు నిలబెట్టారు. మనువాద రాజకీయాలను శక్తివంతంగా తిప్పికొట్టిన వైనం ఈమె కథల్లో చూడగలం. ప్రధానంగా ఈమె కథల్లో కనిపించే వస్తు, శిల్పవైవిధ్యం దళిత స్త్రీవాద చైతన్య విస్తృతికి ఉదాహరణలు. 

తాటకికథలో బాలమ్మ పన్నెండేళ్ళకే  వేటాడటం, పొలంపని తెలిసిన అమ్మాయి. తమ పొలాల కునీళ్ళు అందడం లేదనే కోపంతో బాలమ్మను దొర ఈడ్చుకుపోయి అత్యాచారం చేయబోతాడు. ఆ అమ్మా యి దొరను కాళ్ళతో తన్ని అతని పట్టునుండి విడిపించుకొంటుంది. ఈ కథలో బాలమ్మ ఆడుకొనే వయస్సులోనే అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా వుండటమే కాకుండా ఆధిపత్యానికి, వివక్షకు, అత్యా చారానికి గురికాకుండా  తనని తాను కాపాడుకొనే స్థైర్యాన్ని నింపుకున్న గడసరి చిన్నారి. వేటాడటంలో ఆమె చూపిన ఉపాయం, ధైర్యంగా నీళ్ళలో దూకిన ధైర్యం, ఒడుపుగా తన వేటను దక్కించుకోవడంలో ఎంత నైపుణ్యం చూపిందో, దొరను ఎదురించి పోరాడి తనను తానే కాపాడుకోవడంలో కూడా అంతే చొరవను ప్రదర్శించింది. పన్నెండేళ్ళ అమ్మాయి తెగబలిసిన దొరబారినుండి తప్పించుకోవడంలోని అనౌచిత్యాన్ని ఆఅమ్మాయి ప్రతిభ పరిహరించగలుగుతుంది. అంతేకాదు అంతవరకూ అందరిలో దొరపై వున్న భయాన్ని పోగొట్టటమే కాకుండా అతన్ని నవ్వులపాలు చేసింది. బాలమ్మపై  దాడిచేస్తే ఆమె నవ్వులపాలవుతుందని, పొలంమొఖం చూడలేదన్నది దొర పన్నాగం. దాన్ని బాలమ్మ  నిర్వీర్యంచేసింది.

 దళితుల్లో స్త్రీ, పురుషులకు ప్రత్యేకమైన పనులు కేటాయించడం, ఆడపిల్లలను కేవలం  ఇంటి పనికి మాత్రమే పరిమితం చేయాలన్న ధోరణి కనపడదు. స్త్రీలు పురుషులతో సమానంగా శ్రమ చేస్తారు. అగ్రాధిపత్య కులాల ఆచారాలు విలువల్లో నుంచే దళితులు కూడా చూడటం ఆజాడ్యాలను శ్రమజీవులకు అంటగట్టడం లోని అలసత్వాన్ని శ్యామల నిర్ద్వందంగా వ్యతిరేకించే క్రమంలోనే దళిత బాలిక పాత్ర రూపకల్పన ద్వారా తెలుస్తుంది. కానీ శ్రమకు తగిన ఫలితం పొందడంలో మాత్రం ఇంకా వివక్షకు గురి అవుతూనేవున్నారు. ఈ విషయం ఆధిపత్య కులం, ఆధిపత్య భావజాలం కలిగిన కర్ణం, దొరల మాటల్లోనే చూడగలం.

 “ఏమే తాటకి… ఏం పానం పోయిందని మొగోని లెక్క సేనుకు నీళ్ళు పారవెడుతున్నావే. మా ఇండ్లల్ల అయితే నీయంత ఆడపిల్లలు నీలాగ సేనికి రారు. ఆడపిల్లలను ఇంట్ల ఉంచాలనే తెలివే  మాల మాదిగోలకు లేదు.” ఆధిపత్య కులాలలో తమ స్త్రీలను గడపదాటకుండా వుంచడం వారి ఆర్థికస్థోమత లోని అంతరాలకు సంబందించింది. అలాగే అంటరానితనాన్ని పాటించడంలోని స్వార్థపూరిత అధిపత్య రాజకీయ స్వభావ కల్పనగా గుర్తించే దిశగా బాలమ్మ  ఆలోచిస్తుంది. అంటరానితనం స్త్రీశరీరం కావాల్సి నప్పుడు మాత్రం ఎందుకు గుర్తుకు రాదు. అప్పుడు ఏమైపోయిందీ అంటరానితనం? అన్న భావన  బాలమ్మ మనస్సులో మొదలుతుంది. 

అంటరానితనంలోని అంతరార్ధాల గమనింపు, సమస్య మూలాలను గుర్తించడమే సమస్య. దానిలోతుల్ని పరిశీలించి ఆ సమస్యని ఎదుర్కోవడం  విషయంలో నిమ్నకులస్థులన్న భావన నుండి బయటపడగలిగితే, వాళ్ళ శక్తియుక్తులకు  ఏదీ తక్కువకాదని తెలుస్తుంది. దళిత రచయిత్రులు అంబేద్కర్ భావజాలాన్ని అందిపుచ్చుకోవడంలో  విజయవంతమయ్యారనడానికి ఇలాంటి రచనలే ఆధారంగా నిలుస్తాయి.

మాదిగ ఆశ్రితకులాల్లో డక్కలి కులం ఒకటి. “లసుమవ్వదుక్కి” కథలో లింగమ్మ, ఈరయ్యలు డక్కలి కులానికి చెందిన వాళ్ళు. మాదిగలను ఆశ్రయించి బతికేవాళ్ళు. వీళ్ళ సాహసం వారిని  సంప్రదాయ కట్టుబాట్ల  నుండి విముక్తుల్ని చేసింది. చాటించిన ప్రకారం పెద్ద పులిని చంపిన స్థలాన్ని, ఈరయ్యకు, లింగమ్మలు బహుమతిగా పొందుతారు. భూమిని సాగుచేసి సమృద్ధిగా పండిస్తారు. మాదిగలను ఆశ్రయించి బతికాల్సిన ఆదంపతులు, వృత్తి నూన్యత నుండి  బయటపడటమే కాకుండా తమ శ్రమశక్తితో జీవించడంలోని తృప్తి, ఆనందాన్ని పొందటమేకాక నలుగురిలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు.

దీన్ని ఓర్చలేని అగ్రకులస్థులు తమకు చాకిరీ, (వెట్టి) చేసే వాళ్ళు భూములుపొంది  పంటలు పండిస్తుంటే సేవచేసే వాళ్ళెవ్వరు? అని ఆలోచించి లింగమ్మ, ఈరయ్యలను ఎలాగైనా వెనక్కు లాగాలనే వుద్దేశ్యంతో ఊరు బయట డక్కలోడు వ్యవసాయం చేయడం క్షేమం కాదంటారు. భవిష్యత్తులో ఈ సంస్థానానికి కీడు రాగలదని, వాడు డక్కలోడు మాత్రమే కాదు క్షుద్రశక్తులు కూడా వున్నాయని, ఆశక్తుల ద్వారా ఊర్లోని భూముల సారాన్నంతా తన భూమిలోకి లాగేస్తున్నాడన్న అభియోగం మోపుతారు. అందుకే అతనికి అంత పంట పండుతున్నదని లేనిపోనివి కల్పించి లింగమ్మ, ఈరయ్యలను చంపేస్తారు. తెలంగాణా ప్రాంతంలో డక్కలి, భైండ్ల కులాలవాళ్ళకు చేతబడి, బాణామతిలాంటి క్షుద్రవిద్యలు తెలుసనే ప్రచారం వాడుకలో వుంది. తమ మాట విననివాళ్ళను, తమ పెత్తనానికి లొంగని ఆశ్రిత కులాలవాళ్ళ ప్రాణాలు ఎలా కోల్పోతున్నారో ఈకథలో శ్యామల బట్టబయలు చేశారు. 

అందరూ వీళ్ళలాగే తయారయితే తమ ఆధిపత్యం నిరాటంకంగా సాగదన్న కుట్రపూరిత మనస్తత్వాన్ని ఈకథ వ్యక్తంచేస్తుంది. ఎదుగుతున్న దళితులను తమ స్వార్థపూరిత ఆధిపత్య అహంకారంతో దళితుల మాన ప్రాణాల్ని హరించటం ఆనాటి నుండి ఈనాటి వరకు చర్విత చరణమే. అయితే తాము చేసిన కిరాతకాలను పురాణాల పేరుతో సమర్థించుకోవటాన్ని ఈకథలో గోగు శ్యామల పురాణాల  ఆవిర్భావ వికాసాలకు,వాటి ప్రాచుర్యాల  నేపథ్యం, వాటి వుద్దేశిత లక్ష్యాన్ని రచయిత్రి తనకథల్లో రెండు మూడుసార్లు సంధర్భాలలో బహిర్గత పరిచారు.

 “ప్రస్తుతం మన అవసరాన్ని బట్టి పని చేయడం మన రాజనీతి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు అది తప్పు అయినా పర్వాలేదు. అయినా మన సాంప్రదాయాన్ని, మన రాజనీతిని కాపాడుకోవలసిందే”. అంటే తమ అడుగులకు మడుగులొత్తనివారిని చంపైనా అగ్రకుల ఆధిపత్యాన్ని కాపాడుకోవటమే వాళ్ళ రాజనీతి. ఈ సంఘటన లింగమ్మ, ఈరయ్యల పిల్లలతోపాటు దళితులందరిని తమ ఆధీనంలో ఉంచుకొనే ఎత్తుగడ ఇది. ఎవరికివారు సేవక కులాలు స్వతంత్రంగా బతికితే వీళ్ళగతే పడుతుందనే  అంతర్గత హెచ్చరిక ఎప్పుడూ దళితులను వెంటాడుతూనే వుంటుందని ఈకథ ఋజువుచేసింది.

ఇంతచేసినా, ఈరయ్య లింగమ్మల  సంతానం ఆవాడలోని దళితులందరికీ దేవుళ్ళయ్యారు. ఎవరి నోటచూసినా వారిపాటలు, పద్యాలు, కథలు, పిల్లలు ఆడుకొనే ఆటల్లోని పేర్లు కూడా ఈరయ్య లింగమ్మలవే అయ్యాయి. ఈఆదరణ దొరల గుండెలో గుబులు రేపగలిగింది. కానీ, వీళ్ళ భూమి మాత్రం ఆ దొర చేతుల్లోనే వుండిపోయింది. లింగమ్మ ఈరయ్యల కథ తెలిసిన వాళ్ళెర్వరూ ఈభూమిని కొనడానికి మందుకురాలేదు. తీసుకున్నవాళ్ళకి నానా రకాల కష్టాలు వచ్చి మరణిస్తారని, ఆ వూరి జనానికున్న మూఢనమ్మకం. పులిని చంపగలిగిన సాహసికులకు ఆధిపత్యాలను ఎదిరించే సత్తా వున్నా, అనేకానేక సాంస్కృతిక మౌళికాంశాలు మూఢనమ్మకాల రూపంలో వాళ్ళను బలహీనపరుస్తూనే వున్నాయనిపి స్తుంది.

 దళితుల్ని మానసికంగా, శారీరకంగా దెబ్బతీయడం, దెబ్బతీయలేనప్పుడు చంపేయడం, దుష్టశిక్షణ శిష్టరక్షణ పేరుతో అగ్రకులాలు రాజకీయం చేయడం  ఇంకా కొనసాగుతూనేవుందన్న వాస్తవాన్ని ఈకథలో  శ్యామల కథనం చేశారు. దళితుడు ఎప్పటికీ ఎంత శ్రమపడినా, శ్రమలోనే బతకాల్సి వస్తోంది. ఎదురుతిరిగితే శవాలుగా మారాల్సి వస్తోంది. ఎన్ని కళలు, వృత్తి నైపుణ్యాలు వాళ్ళ చేతుల్లో పురుడుపోసుకున్నా నిరంతరం నిస్సహాయులుగా పడివుండడానికి అధిపత్యవర్గం ప్రతినిత్యం ప్రయత్నిస్తూనే వుందన్న ఎరుక ఈకథ అందిస్తుంది. అలాగే దళితువర్గాలలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఎక్కువ తక్కువలు లేకుండా వుత్పత్తి రంగంలో శ్రమపడగలరని లింగమ్మ, లసుమమ్మ పాత్రలు తేటతెల్లం చేస్తాయి.

జోగినిగా మార్చడాన్ని వ్యతిరేకించినందుకు ఆధిపత్యకులాల చేతుల్లో ఆశ్రితకులాలు అన్ని రకాల హింసలకు గురై, వున్నవూరిని, భూమిని కూడా పొగొట్టుకొని, (వెలికి)బహిష్కరణకు గురికావడం రడం కథాంశం. బాలయ్య ఒక్కగానొక్క కూతుర్ని, బడికి పంపించి బాగా చదివించాలనుకుంటాడు. కానీ వూర్లో అగ్రకులస్తులంతా ఆవూరి జోగినికి వయసైపోయిందని ఆమె బతికుండగానే  మరొకరికి ఆటపాటలు, పద్యాలు  నేర్పించాలనే నిర్ణయంతో బాలయ్య కూతురు సాయమ్మను జోగినిగా తయారు చేయాలనుకుంటారు. బాలయ్య దీనికి అంగీకరించక ఆమెను  తాండూరు హాస్టల్లో వదిలేసి వస్తాడు. అక్కడి వార్డన్ కు అన్ని విషయాలు చెప్పి ఆమె అందించిన భరోసాతో వూరికి వెళ్తాడు. విషయం తెలిసిన వూరి అగ్రకులస్తులంతా పోలీసులతో సహో కుమ్మక్కై బాలయ్యను కొట్టి హింసిస్తారు. రక్తసిక్తమై చావుబతుకుల మధ్య దాహంతో కొట్టుకుంటున్నా ఆధిపత్యకుల స్త్రీలు తమ పురుషులకు భయపడి నీళ్ళు ఇవ్వరు. ఇంకొందరు అంటరానితనం పాటించడం వల్ల ఇవ్వరు. మరొకరు నీళ్ళిచ్చినప్పటికీ చిల్లులు పడ్డ గ్లాసుతో ఇవ్వడంవల్ల అతని దగ్గరకు వచ్చేసరికి ఖాళీఅవుతాయి. చివరకు ఆదారినవెళ్ళే దళితస్త్రీ తన చనుబాలతో అతని దాహం తీరు స్తుంది.

చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్న బాలయ్యతో నీ కూతుర్ని జోగినిని చేస్తే ఈవూర్లో వుండొచ్చు. లేదంటే చంపేస్తానని భయపెడతారు. ఇల్లు, భూమి అన్నిటినీ కైవసం చేసుకునేందుకు, పేపర్ల మీద బలవంతంగా వేలిముద్రలు వేయించుకోని వాళ్ళని వూరి నుండి వెలేస్తారు. అంటరానితనం, జోగినీసమస్య, ఆధిపత్య రాజకీయాలు, ఆర్థిక దోపడీలతోపాటు బాలయ్య శారీరకహింసకు కూడా గురవుతాడు

బాలయ్య తన కూతురికి చదువు చెప్పించి, మంచి ఉద్యోగం చేయించాలనుకుంటాడు. ఆడపిల్లని బాగా చదివించాలని నిర్ణయించుకున్న కుటుంబాన్ని పథకం ప్రకారంవత్తిడి చేసైనా  జోగినిని చెయ్యాలి, రంగం ఎక్కించాలని ఆధిపత్యకులాలు ఆశించాయి, అందుకై బాలయ్యను, అతని కుటుంబాన్ని ఒక క్రమంలో  మోటివేట్ చేసిన  పద్ధతిని ఇక్కడ గమనించగలం.

“ఉన్న ఊర్ల ఏర్పులకేస్తేమనందరి కండ్లముందుంటది. సదివితే ఏమున్నదిరా బాలిగా ఎంత చదివినా పని తప్పదు కదా… జెర్ర పెద్దగయితే ఎవ్వనెంబడన్న పడిపోదని ఏం నమ్మకం, యా చాయ కప్పులు కడిగెటోనెంబడో పోదని ఏం గ్యారంటిరా?” అన్నమాటల్లోని కుట్ర పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుంది. నయాన భయాన మనుష్యుల్ని మానసికంగా వశపరుచుకోవాలంటే, మతానికి మించిన ఆయుధం మరొకటి వుండదు. దీని మూలంగానే ఆ కుటుంబాన్ని దేవుని పేరు చెప్పి, నమ్మకాల శక్తితో  వాళ్ళల్లో భయాన్ని రేకెత్తించి మరీ జోగిని దురాచారాన్ని వాళ్ళే ఇష్టపూర్వకంగా అమలు చేసే విధంగా చేయాలనుకోడం దానికి పోలీసుల మద్దతును కూడా కూడగట్టడం, అవసరమైతే యంత్రాంగం మొత్తాన్ని వాడుకోవాలనుకోవడాన్ని గమనిస్తాం.

అగ్రకులాధిపత్యం తన ఆధిపత్యాన్ని బాధితపక్షంలో నిలబెట్టుకొని కొనసాగించాలనే మొండివైఖరి ఈకథలో స్పష్టంగా కనిపిస్తుంది. “మీ బిడ్డను జోగినీ చేయమన్నది నా కోసం కాదు. ఊరు కోసం ఊరుబాగుకోసం మీ పోరిని వేస్తే జోగుకు వేయండి లేదా మీరు ఊరొదిలేసి పోండి. ఇదే ఆఖరుమాట. ఆ పని జెయ్యకుండ ఊర్ల ఉండనీకె వీల్లేదు. మొండికేసి ఉంటమంటిరా నిరుడు మీ మాదిగ జంగనికి పట్టిన గతే మీకు పడుతది చూస్కోండి” అని ఊరువదిలి పొమ్మని బెదిరిస్తారు. జోగినిని చెయ్యనందుకు ఆ కుటుంబం రోడ్డున పడింది. అయినా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా బిడ్డను చదివించాలనే వాళ్ళ సంకల్పం ఎంత బలమైందో పాఠకులకు తెలుస్తుంది. 

చదువుకోసం ఆ కుటుంబం పడినశ్రమ, చేసిన పోరాట చిత్రణ   దళితస్త్రీలకు చదువు ఎంత ముఖ్యమో రచయిత్రి ఈకథలో ఆదర్శీకరించారు.అంటరానితనం, ఆధిపత్యం, కులవివక్ష, జోగినీ వ్యవస్థ తీరు, చదువుకోసం బాధితుల ఆరాట పోరాటాలు దళిత సమస్యల సమాహార రూపం ఈకథలో కనిపిస్తూంది. అంతేకాదు ఒక జోగిని గా మారిన స్త్రీ విధివిధానాలశైలిని  ఈ కథలో రచయిత రికార్డ్ చేయడం జరిగింది.

 “రేపటి ఊరడమ్మ పండగకు రంగ మెవ్వరెక్కుతరు? పోలెపల్లిలో సిడెఎవరు కడ్తారు? మనూర్ల జోగుకి దీసిన లస్మి ముసలయింది. దానికి కొలువుజెప్ప నడుగులు డొల్లకొచ్చినయి. ఊర్ల శానామందికి అమ్మవారు పోసినప్పుడు ఊరడమ్మకు జీవులను, దున్నపోతులను కోసి పెద్ద పచ్చితునకను జోగిని నోటిల వేలాడదీసి ఊరు చుట్టు దిప్పాలంటే ఏడసాధ్యపడ్డది. ఈ ముసల్దాని కాళ్ళు సుట్టకపోయి వీరిబంధాల దిమ్మరపోయి పడ్డది”అన్న ఈ వాక్యాల్లో జోగినులు పడేపాట్లను గమనించవచ్చు. సిడి ఎక్కడమంటే, సామాన్యం కాదు. చాలా ఎత్తులో జోగినిని వేలాడదీస్తారు. అమానుషమైన ఈ కట్టుబాట్లను అగ్ర, ఆధిపత్య కులాలలోని స్త్రీలకు ఎందుకు విధించరు? అనేది ప్రశ్న. ఈప్రశ్ననే సవాలుగా మార్చి “బైండ్లామె భూమి అడగదా మరి”  కథలో పెత్తందార్ల  ఆధిపత్యాన్ని రచయిత్రి సమస్యాత్మకం  చేయగలిగారు.

ఊరు క్షేమం కోసం, వూర్లో జనాలకు, పశువులకు ఎటువంటి రోగాలు రాకుండ చావులు అరికట్టడానికి మాత్రమే జోగినినిగా మార్చడం  తమ  ఉద్దేశమంటారు. తమ స్వార్థ ప్రయోజనాలకు ముసుగేసి సామాజిక ప్రయోజనం కోసమేనన్న భ్రాంతిని కలిగిస్తారు. చదువురాని, శాస్త్రీయ పరిజ్ఞానంలేని వాళ్ళకు దేవుడి పేరుతో మూఢ నమ్మకాల పేరుతో భయపెట్టి, మభ్యపెట్టడం వలన  దళితస్త్రీలు సాంఘిక దురాచారాలకు బలవుతున్నారన్న వాస్తవాన్ని ఈకథ బహిర్గతం చేస్తుంది. ఇదే ఇతివృత్తంతో వచ్చిన మరోకథ “బైండ్లాయె భూమి అడగదా మరి”.  

అగ్రకుల ఆధిపత్యం, అంటరానితనం, కులాంతర వివాహం కారణంగా మాదిగ ఆశ్రితకులానికి చెందిన బైండ్ల స్త్రీ ఎదుర్కొన్న సమస్యల చిత్రణే ఈ కథ. ఏర్పులతనం చేసే సాయమ్మ బైండ్ల కులానికి చెందిన స్త్రీ, తెనుగోళ్ళ సెంద్రప్పను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అతను బ్రతికివున్నంత వరకు అన్నీసజావుగానే సాగాయి. సెంద్రప్ప మరణం తరువాత  శవాన్ని భార్యకు చూపించకుండానే వాళ్ళ ఆచార సంప్రదాయాల ప్రకారం కర్మ జరిపించాలని నిర్ణయించి శవాన్ని తీసుకెళ్తారు అతని కులస్తులు. సాయమ్మ భర్తను చివరిసారిగా చూడటానికి, ముట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఏడ్చినా, ముట్టుకున్నా తమకు అంటు అని తెనుగుకులం పెద్దలు మాట్లాడుతారు. “సాయమ్మ… నీవు ఇంట్లకొచ్చి పీనుగు మీద పడి ఏడ్వకమ్మ బయటపోయి ఏడ్వుపో.  మాదిగోళ్ల బైండ్లోల్లు, మిమ్ముల ముట్టగూడది బైటపోయి ఎడ్వుపో” అని నిర్ధాక్షణ్యంగా వెళ్ళగొట్టి, అవమానిస్తారు. 

దళితుల ప్రేమించి కులాంతర వివాహాలు చేసుకున్నా, పెద్దలు చేసినా ఇటు స్త్రీలైనా, అటు పురుషులైనా సరే తమ జీవితకాలంలో ఏదోవిధంగా  అంటరానితనానికి, కులవివక్షకు గురవుతూనే వున్నారు. 

పెండ్లి చేసుకొని ముగ్గురు పిల్లల్ని కనిన తరువాత పీనుగు దగ్గర కనపడిందా అంటరానితనం, అని కులపెద్దల మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. ఈవివాదంలో భైండ్ల కులస్థులు “శవాన్ని ముట్టనివ్వకపోతే, “అంటరానోళ్ళమని మాకే యాదికి జేస్తున్నారా, సరే అదే మాట మీద నిలవడుండి. అంటరానొల్లు గదా మేం మీ జోలికి రాం. మీకు డప్పులు కొట్టం, మీ కొట్టాలల్ల పశువుల జోలికి రాం. అవి సఛ్చిపోటే  గుంజెయ్యం, మీ పొలాలకు, పనులకు రాము, మీ బావుల్ల పూడిక తీయ్యం, మీ ఎవువసానికి పగ్గాలు వేయం, మీ పశువుల కాయనీకే మీ దగ్గర జీతాలుండం. మీ ఇండ్లల్ల కాన్పులు.. క్షయ్య మంత్రసాని తనం జెయ్యరాము దేనికీ రాము. మిమ్ములను ఈ ఊర్లకెళ్లి వెలేస్తున్నాం” అంటూ  ధిక్కరించడమే కాకుండా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి, తమ నిర్ణయాన్ని, నిరసనలను నిర్భయంగా వ్యక్తం వ్యక్తంచేయడంలో  మాదిగ దండోరా ఉద్యమ స్ఫూర్తి కనపడుతుంది . 

భర్త మరణించిన తరువాత సాయమ్మను జోగినిని చేస్తారు. గ్రామదేవతల జాతరలో ఆమె రంగం ఎక్కితేనే జాతర మొదలవుతుంది.  ఏర్పులతనం అన్నది వంశపారంపర్యంగా కొనసాగే ఆచారం. సాయమ్మ అత్తకు వూరి పెద్దలు భూమిని పంచిస్తారు. ఆ భూమి వారసత్వంగా సాయమ్మకే దక్కాలి కాబట్టి ఆ భూమిని పంచిస్తే ఈ యేడు పండుగలో ఏర్పులతనం చేస్తానంటుంది. కులపెద్దలంతా కలిసి మీ అత్తకు కూడా భూమి ఇవ్వలేదని వాదిస్తారు. కావాలంటే కూలి తీసుకోమంటారు. ఆ మాటకు ఆగ్రహించిన సాయమ్మ “ఆ కూలి నేనే ఇస్తాను మీ కూతుర్నిరంగమెక్కించు” అని వాదిస్తుంది. ఇవ్వకపోతే ఊరి చుట్టు మిమ్మలి పొలివడ్త అప్పుడు వూరికి వట్టిన పీడ వదుల్తుంది” అని దేవత పూనినట్టు మాట్లాడటంతో అగ్రకులస్తులంతా భయభ్రాంతులవుతారు. “ఒక బైండ్లది బల్లగుద్ది మాట్లాడుతుంటే గాజులు తొడుక్కొని కూర్చున్నార”ని దొర అగ్రహావేశానికి గురయినప్పుడు “బైండ్లదీ బల్లగుద్దిందంటాడేంది. భూమి అడగడానికే కదా” అని వాడ పెద్దలు ఆమెకు సపోర్టు చేస్తారు. దానివల్ల జరిగే పరిణామాన్ని కూడా హెచ్చరిస్తారు. 

జోగినిగా మారి, తనకు రావాల్సిన భూమిని తనకు పంచిస్తేనే ఏర్పులతనం చేస్తానని తెగేసి చెప్తుంది. ఏర్పులతనం చేసిన తన అత్త తరువాత ఆమెపేరవున్న భూమి వారసత్వంగా ఏర్పులతనం చేస్తున్న తనకు దక్కాలని అది తన హక్కని ప్రకటించి, దాని కోసం పోరాడుతుంది. ఇరవై ఏండ్ల నుండి మూడెకరాల భూమిని తమకివ్వకుండా అగ్రకులస్తులే వాడుకుంటున్నారు. దాన్ని ఇప్పించమని అడుగుతుంది. దానికి దొరలు కడజాతోల్లను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలని” అవమానిస్తాడు. ఇలా తమ హక్కును తాము పొందడానికి కూడా అవకాశం లేకుండా చేయాలనుకున్న ఆధిపత్యకుల స్వభావాన్ని అడ్డుకుంటుంది. దేవత పూనినట్లుగా ప్రవర్తించి తన భూమిని తాను పొందుతుంది. ఏ మూఢనమ్మకాలతో దళితులపై అధిపత్యం సాధించాలనుకున్నారో, అవే నమ్మకాలతోనే తన హక్కును సాధించుకుంటుంది. ఈమె చర్యలను జోగిని వ్యవస్థ కొనసాగింపుగా, పూనకం లాంటి మూఢనమ్మకాలను సమర్థించే రచనగా కాకుండా ఒకహక్కుగా సాధించుకునేందుకు అస్తిత్వ చైతన్య స్పృహతో భైండ్లామె చేసిన తిరుగుబాటుగానే పాఠకులు గుర్తిస్తారు. 

దళితులు వయసులో పెద్దవారైనా,ఆధిపత్యకులాలోని చిన్న పిల్లలు సైతం వాళ్ళను అమర్యాదగా పిలవడాన్ని కుల అస్తిత్వ చైతన్యం పెరిగిన తరువాత అక్షరాస్యులైన దళిత విద్యార్థులు ఈ సాంస్కృతిక వివక్షారూపాలకు ఏవిధంగా చెక్ పెట్టారో శ్యామల తన కథల్లో చిత్రించారు.

  “నీవు నాకన్నా యాడాది.. చిన్నవి కన్నా తక్కువ చదువుకున్నవ్ అయినా నన్ను రా… అంటున్నావు. మా అమ్మయ్యను అంటున్నావ్. ఎట్టి మాదిగరికం చేపించుకునుడు కూడా గొప్పగ జెప్పె తెల్విరా మీది కట్టడి కింద పెట్టి చేయించుకున్నందుకు మీరు సిగ్గుపడేలె. ఆ నేరం కింద జైలుకు పోతం అనే సోయి కూడా మీకు లేదురా, అది కూడా మేమే మీకు తెలియజెప్పే అద్వానం తూ…” అని తరతరాల కులవివక్షను ఉద్యమ భావజాలం ఇచ్చిన తెగువతోనే వ్యతిరేకిస్తారు.

ఆధిపత్యకులాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగాలైంగికంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా ఎలా అణచివేతకు గురవుతున్నారో ఈమె కథలు తెలియజేస్తాయి. ఊరూడమ్మ, మైసమ్మ, పోషమ్మ, ఈదమ్మ, ఎల్లమ్మలు  మాలమాదిగోళ్లు, పనిబాటల కులాలోళ్లు ప్రాణంతో అమ్మవార్లని కొల్చుకుంటారు. వాళ్ళను అట్లా చేసుకోవద్దంటే వ్యతిరేకమైతారు. తిరగవడ్తరు. జాతర్లు చేసుకోనిస్తూ మన చేతికింద పెట్టుకోవాలనే ఎత్తుగడలు వాళ్ళ మాటల్లోనే తెలుస్తూంది. “అమ్మవారి పండుగలో ఎన్నో చెయ్యాల్సి ఉంది. సరిగ్గా మెయింటెన్ చేయ్యకపోతే అసలుకు ఎసరొచ్చినట్లు అసలు మోసం బయటికొస్తుంది” ఇలా దళితులను సాంస్కృతికంగా కూడా తమ ఆధిపత్యం కింద బతికేలా చెయ్యాలన్నదే వారి ముఖ్యోద్దేశ్యం. ఈధోరణి వలన దళితులు ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో తెలుపడమే కాకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో కూడా రచయిత తన కథల్లో తెలియజేశారు.

స్త్రీలంతా ఒక్కటి కాదు. స్త్రీల బాధలన్నీ ఒక్కటి కావన్న సత్యాన్ని శ్యామల కథలు ఋజువు చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, పితృస్వామిక భావజాలం మనువాదంతో ఏవిధంగా ముడిపడివుందో ఈమెకథలు స్పష్టం చేస్తాయి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.