“మగువా, చూపు నీ తెగువ!

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

తెన్నేటి శ్యామకృష్ణ

నందిత ఒకసారి తన వాచీకేసి చూసుకుంది. టైం తొమ్మిదిన్నర … మై గాడ్! లేటైపోయింది. పదికల్లా మీటింగ్‌లో ఉండాలి తను. పవన్ బెడ్ మీద మగతగా పడుకుని ఉన్న్నాడు, ఒళ్ళు కాలే జ్వరం. శ్రవణ్ అన్నాడు, “నువ్వు బయలుదేరు నందూ, వాడికి టైంకి మందులు నేను ఇస్తాగా!” 

భర్త వైపు జాలిగా చూసింది నందిత. రెండేళ్ళ క్రితం పక్షవాతం వచ్చి ఒక కాలు, చెయ్యి వంకరఫోయాయి తనకి. దాంతో తన ఇన్ష్యూరన్స్ ఏజెంట్ ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. అతి కష్టం మీద చేతికర్ర సాయంతో కాలు ఈడ్చుకుంటూ నడుస్తాడు. తనకేమో సెలవు పెట్టే అవకాశం లేదు. ఈ రోజు మహిళా దినోత్సవం, ఎంపీ పాండురంగారావుగారు ముఖ్య అతిథిగా ఆంగన్వాడి టీచర్లతో పెద్ద మీటింగ్, వెళ్ళక తప్పదు. మరోసారి శ్రవణ్‌కి జాగ్రత్తలు చెప్పి బయటికి వచ్చి కనబడిన ఆటో ఎక్కింది. ఆటో ముందుకు ఉరుకుతుంటే మనసేమో ఇంటికేసి, వెనక్కి పరుగుపెడుతోంది.   

వడివడి అడుగులతో హాల్ గుమ్మం ముందరికి వచ్చి నిలిచిపోయింది నందిత. సంశయంగా ఒకసారి దృష్టి లోపలికి సారించింది. అప్పటికే సుమారు ఒక వంద మందిదాకా ఆంగన్వాడి టీచర్లు, సూపర్వైజర్లు తమ సీట్లలో కూర్చుని ఆనాటి గెస్ట్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఒక కమ్యూనిటీ హాల్ అది.

ప్రాజెక్ట్ ఆఫీసర్ చెన్నయ్య మైకు దగ్గర నిలబడి సూచనలిస్తున్నాడు. గుమ్మం దగ్గర నిలబడ్డ నందితని చూడగానే ఆయన మొహంలో అసహనం, “వచ్చిందండి మన వీఐపి, అందరూ నిలబడి వందనం చెయ్యండి!” ఆయన మాటల్లోని వ్యంగ్యానికి నందిత కుంచించుకుపోయింది. ‘అక్కడే భూమి విచ్చిపోయి తనను లోపలికి తీసేసుకుంటే ఎంత బాగుండును!’ 

గొంతులో బాధను అణచుకుంటూ, “బాబుకు … జ్వరం …” అంటుండగానే, “వెళ్ళి కూర్చోవమ్మా, ఆయన వచ్చే వేళయింది!” కసురుకున్నాడు. గబగబ లోనికి వచ్చేసరికి రెండో వరసలో కూర్చున్న మిత్రురాలు అనల పిలిచింది రమ్మని. తనకోసమని తన ప్రక్క సీటు ఆపి వుంచిందామె. వెళ్ళి కూర్చోగానే తన చెయ్యి మీద చెయ్యి వేసింది. ఆ స్పర్శలోనే  ఎన్ని పలకరింపులు, ఎంత సాంత్వన!     

కొద్దిగా తేరుకున్న నందిత వేదిక వైపు చూసింది, చెన్నయ్యగారి సూచనలను వినే ప్రయత్నంలోవేదిక వెనక గోడపైని బ్యానర్ మీదమహిళా దినోత్సవంఅనీ, దాని క్రిందముఖ్య అతిథి ఎంపీ పాండురంగారావ్ గారికి స్వాగతంఅనీ వ్రాసి ఉంది. అనల లోగొంతుతో అన్నది నందినితో, “ రాజకీయ నాయకులు టైంకి ఎప్పుడు రావాలి?” నిట్టూర్చింది. “లేదు, ఈయనకి విషయంలో మంచి పేరుంది,” నందిత బదులిచ్చింది.

ప్రాజెక్ట్ ఆఫీసర్ చెన్నయ్య గొంతు మైకులో ఖంగుమంది, “ఎంపీ గారు మన కమ్యూనిటీ హాల్ రెనొవేట్ చేయడానికి నిధులు ఇవ్వడానికి తనకు తానై వస్తున్నారు. ఇది మన మీటింగ్లకి చాలా అవసరం. మీరంతా కార్యక్రమాన్ని పూనుకుని విజయవంతం చేయాలి!” ఆయన మాటాలలో అర్ధింపు కన్న శాసనం పాలు అధికంగా ధ్వనించింది! అంతలో ఆయన చేతిలో ఫోన్ మ్రోగింది. మాట్లాడ్డం కాగానే ఫోన్  కట్ చేశాడు, “ఆయన వస్తున్నారు, అంతా బయటికి వచ్చి ఆయనకి స్వాగతం పలకాలి!”

అంతా బయటికి వచ్చి గుమ్మానికి ఇరుప్రక్కలా బారులు తీరి నిలబడ్డారు, కాంపౌండ్ వాల్ గేటు వరకు. నందిని, అనల  ఒక ప్రక్కగావచ్చి నిలబడ్డారు.  “ఎంఏ గోల్డ్ మెడలిస్ట్వి, నీకీ చిన్నపాటి ఉద్యోగం చెయ్యడమేమిటే ఖర్మ కాకపోతే? అన్నట్టు, నీ గోల్డ్ మెడల్ ఏంచేశావ్?” సరదాగా అన్నది అనల, “నేనైతేనా, ఈపాటికి దాన్ని నా నెక్లెస్కి పెండంట్లాగా ధరించేదాన్ని!” 

నందిత అన్నది నవ్వుతూ, “ఇంకా నయం, పాపటి బిళ్ళలాగా ధరిస్తాననన్నావుకాదు!” 

అదే అనల గొప్పతనం, తన మూడ్ బాలేనప్పుడు తన మాటలతో నవ్వించి మామూలు మనిషిని చేస్తుంది. ఆమే తోడు లేకుంటే ఈ జాబ్ తను ఏడుస్తూ చెయ్యాల్సివచ్చేది!

అంతలో ఎంపీగారి కారు వచ్చి గేటు ముందర ఆగింది. ఆయనకి, కూడా వచ్చిన మరో ఇద్దరు అధికారులకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి వేదికమీద ఆశీనులైనాక సభ ప్రారంభమయింది. ముఖ్య అతిధిని, ఇద్దరు జిల్లా అధికారులను సభకు పరిచయం చేసి పూలదండలతో సత్కరించారు చెన్నయ్యగారు. ఆ ఇద్దరు అధికారులు క్లుప్తంగా మాట్లాడి ముగించారు. ప్రాజెక్ట్ అధికారి చెన్నయ్య లేచి తమ ఉద్యోగినులకు మహిళా దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా ముఖ్య అతిధిని కోరారు. 

పాండురంగారావు గారు లేచి మైకు పోడియం దగ్గరికి వచ్చి మాట్లాడ్డం మొదలుపెట్టారు, “ముందుగా సభలోని ఆంగన్వాడి టీచర్స్, సూపర్వైసర్స్, అందరికీ నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు …” ఒక చిన్న విరామం తరవాత ఆయన అందరినీ కలియజూస్తూ కొనసాగించాడు, “స్వాతంత్ర్యం వచ్చిన తరవాత మన దేశంలో స్త్రీకి సముచితమైన స్థానం ఇచ్చాము. ఒక స్త్రీ మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగిందంటే అది మనమంతా గర్వించదగిన విషయం, కద? ఇంకా ఎందరో స్త్రీలు వివిధ రాష్త్రాలకు ముఖ్య మంత్రులుగా, గవర్నర్లుగా పనిచేశారు, చేస్తున్నారు …” సభలో చప్పట్లు.

“చిన్న పోలిస్ కానిస్టేబుల్ ఉద్యోగం నించి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఆమే చేయలేని ఉద్యోగం లేదు. నిజానికి, ఈ ఆంగన్వాడి టీచర్లలాంటి ఉద్యోగాలు స్త్రీలు మాత్రమే చెయ్యగలుగుతారు, ఆ ఓపిక, సహనం వారిలోనే ఉన్నయి. స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలన్నీ అట్టడుగు వర్గాలవరకు చేరవెసే మీరు సంఘానికి మూలస్థంభాలవంటివారు! …” మరోసారి హాలు చప్పట్లతో మార్మ్రోగింది. ఆయన ఉపన్యాసం అలా ప్రవాహంలా సాగిపోతోంది. మధ్య మధ్య మ్రోగే చప్పట్ల హోరుతో. 

నందిత పెదవులమీద ఒక శుష్క దరహాసం వెలిసింది. అనల వైపు చూసేసరికి ఆమె ఉపన్యాసంలో లీనమయిందని అర్థమయింది. ‘ఆయన మాటల్లో చిత్తశుధ్ధిని తను శంకించటంలేదు. కానీ, …’ బలవంతంగా తన దృష్టిని ఆయన మాటలవైపు మళ్ళించింది.

కమ్యూనిటీ హాలు కొరకు తనిచ్చే ఫండింగ్ గురించి ప్రకటన చేయగానే మళ్ళీ చప్పట్లు. తన ఉపన్యాసానికి ముగింపునిస్తూ ఆయన అన్నాడు, “చివరగా ఒక ముఖ్య విషయం ప్రస్తావించాలి. అక్టోబర్ 2017లో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకుంది. దేశదేశాల సెలబ్రిటీలైన స్త్రీలు ఒకరితో మొదలై, నేను సైతం అంటూ మరొకరు, మరొకరు ధైర్యంగా ముందుకు వచ్చి పని స్థలాల్లో జరిగిన లైంగిక వేధింపులకు తామెలా గురియైనారో ధైర్యంగా చెప్పుకోవడం సంచలనం సృష్టించింది. అది ఎంతలా ప్రజలలోకి వెళ్ళిందంటే, అదే స్ఫూర్తితో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు నివారణ చర్యలు చేపట్టే దిశగా దృష్టి సారించేంతలా! ఇదొక శుభపరిణామం! మరొక్కసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను!”

హాలంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ప్రాజెక్ట్ అధికారి చెన్నయ్య ముగింపు మాటలు పలకడానికి తన సీటులోంచి లేచి నిలబడేలోపు పాండురంగారావుగారు సభనుద్దేశించి అన్నారు, “ రోజు మీ రోజు. అంటే స్త్రీల రోజు. అసలు సందర్భంగా మాట్లాడవలసింది మీరు. మీలో ఎవరైనా మైకు దగ్గరికి వచ్చి ఒక రెండు మాటలు మాట్లాడితే సంతోషిస్తాను!”

సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ముఖాలు చూసుకోవడం, మౌనం వహించడం చూసి ఆయన మళ్ళీ అన్నారు, “తప్పదు, మీలో ఒకరు మాట్లాడవలసిందే. ఇంత మంచి అవకాశం మీకు మళ్ళీ రమ్మన్నా రాదు,” నవ్వుతూనే అన్నాడాయన.  

అనల నెమ్మదిగా లేచి నిలబడింది, “నందిత చాలా బాగా మాట్లాడుతుందండి!” తన ప్రక్కన కూర్చున్న స్నేహితురాలిని చూపించింది. “ష్ …” నందిత అనల చెయి పట్టుకుని క్రిందికి గుంజింది, “కూర్చోవే!” 

వెంటనే పాండురంగారావ్ గారు అందుకున్నారు, “రామ్మా, ఇక్కడ అంతా మనవాళ్ళేగద, వచ్చి ఒక రెండు మాటలు మాట్లాడు!” 

నందితకు ఇక తప్పలేదు. ఆమె స్టేజ్ వైపు బిడియంగా నడిచి వస్తుంటే అంతా చప్పట్లుచెన్నయ్యగారు ముఖం చిట్లించారు, ‘ఈయనో చాదస్తుడిలా ఉన్నారు.’ ఎంపీగారు తన సీటులో ఆసీనులై ఆమె ఏం మాట్లాడుతుందో వినాలనే ఉత్సుకతతో ముందుకు వంగారు

సభకు నమస్కారం,” ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా ప్రారంభించింది నందిత, ” నిజమే, ఈరోజు భారతీయ  స్త్రీలు అన్ని రంగాలలో ముందున్నారు. వ్యోమనౌకలలో అంతరిక్షంలోకి దూసుకుపోయారు, కల్పనా చావ్లా లాగా; యుధ్ధ నౌకలలో సముద్రంలోకి దూసుకు పోయారు, నేవీ ఆఫీసర్ లెఫ్ట్నంట్ కుముదిని త్యాగి లాగ. కానీ, భూమి మీదే వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమయింది. విషయం నేను ఊరికే చెప్పటంలేదు.  … స్త్రీల మీద యాసిడ్ దాడులు, తనని ప్రేమించమని వెంటపడి, కాదన్నందుకు పట్టపగలే నగరం నడిబొడ్డున నరికివేసిన సంఘటనలు గాంధీ గారి మాటల్ని గుర్తుచెయ్యడంలేదూ? అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగిననాడు నా దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అన్న ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తోందో దిన దినం జరిగే ఘోరాలకు! ఏదైనా ఘోరకలి జరిగినప్పుడు రేగిన అలజడి సద్దుమణిగాక అంతా మర్చిపోతారు, మళ్ళీ మరో ఘాతుకం జరిగినపుడు మేలుకుంటారు …”     

     “ష్చూడమ్మా,” చెన్నయ్యగారు అడ్డుతగిలారు తను కూర్చున్న చోటునించి ఆమె వైపు తీవ్రంగా చూస్తూ, “అలాంటి మాటలకు ఇది వేదికా కాదు, సమయమూ కాదు!” హెచ్చరింపుగా అన్నాడు.

ఆమె తలతిప్పి ఆయనవైపు చూస్తుండగానే పాండురంగారావుగారు ఆయన చెయ్యి మీద తన చెయ్యి వేశారు, “చెప్పనియ్యండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వు చెప్పమ్మా,” ఆమెవైపు తిరిగి చెయ్యి ఊపారు కొనసాగించమని సూచిస్తూ.     

నందిత తన ఉపన్యాసాన్ని కొనసాగించింది, “ఉదాహరణకు 2012లో దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగిన నిర్భయ రేప్ అండ్ మర్డర్ కేసు. ఎనిమిది సంవత్సరాలు పట్టింది దోషులకు ఉరిశిక్ష అమలు కావడానికి! ప్రజల నిరసన ప్రదర్శనలు చల్లబడ్డాక, పాపం ఆమె తల్లి సుప్రీం కోర్ట్ గడప త్రొక్కి ఒంటరి పోరు సల్పింది! …” ఆమె గొంతు గద్గదికమయింది.

హాలంతా నిశ్శబ్దం అలుముకుంది. తేరుకుని ఆమె మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది, “విచిత్ర మేమిటంటే, నిర్భయ కేసు నేపధ్యంలో ఇలాంటి అత్యాచారాల విషయంలో సత్వర న్యాయం చెయ్యాలని కేంద్రం చర్యలు తీసుకుంటుండగానే, కేసు సుప్రీం కోర్టులో ఉండగానే, మరో రేప్ కేసు వెలుగు చూసింది, అదే రాజధాని నగరంలో! …” 

ఒక నిమిషం వ్యవధి తీసుకుని ఆమె చెప్పడం మొదలుపెట్టింది, ఇకమీటూప్రస్తావన వచ్చింది కాబట్టి చెపుతున్నాను. సెలబ్రిటీలు ఆ స్థితికి చేరుకున్నాక తమ పూర్వపు చేదు అనుభవాలను బయటపెట్టే ధైర్యం చెయ్యగలిగారు, మీడియా వాళ్ళ మాటల్ని పట్టించుకుంది. కాని అదే అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే, లేదా అనామకులైన సామాన్య ఉద్యోగినుల ఆర్తనాదాలు గుండె గోడల మధ్యే అణగారిపోవలసిందేనా, ఒకవేళ చెప్పినా వినిపించుకునేది ఎందరు? ఎన్ని ఉదాహరణలైనా చెప్పగలను, సమయం ఉంటే … ” 

 “షాపింగ్ మాల్స్లో పనిచేసే సేల్స్ గర్ల్స్ పడే బాధలు చెప్పొద్దు; వారికి రెస్ట్ రూంకి రోజులో ఎన్నిసార్లు వెళ్ళాలనే దానిమీద కూడా పరిమితులు విధిస్తారనే విషయం, నేను చెపితే మీరు నమ్ముతారా? కేరళలో ఒక మహిళా సామాజిక కార్యకర్త వెలుగులోకి తీసుకువచ్చేదాకా నాకూ తెలియదు.  అక్షరాలా ఎనిమిది సంవత్సరాల పోరాటం తరవాత వారి పని పరిస్థితులు బాగుపరిచే చట్టం తేవడంలో ఆమె కృతకృత్యురాలయింది, అదీ 2018లో! ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఎన్ని రావాలో ఉద్యోగిని స్థాయి మారాలంటే!”

ఇక ముగించనాఅన్నట్టు ఆమె ఎంపీగారి వైపు చూసింది. “చెప్పమ్మా, ఇంకా వినాలని ఉందిచెయ్యి ఊపాడాయన. చెన్నయ్యగారు తన సీటులో అసహనంగా కదిలాడు

“… 2013, పని స్థలాలలో స్త్రీల లైంగిక వేధింపు నివారణ చట్టం గురించి ఎంతమందికి తెలుసు? బాస్, తోటి ఉద్యోగులు, క్లైంట్స్ నించి రక్షణ కొరకు సుప్రీం కోర్ట్ సూచించిన మ్యాండేటరి కమిటీలు కాగితాలమీదనే ఎందుకు ఉండిపోయినయి? ఇక అవ్యవస్థీకృత రంగంలోని చిరుద్యోగులు స్త్రీల మాట చెప్పేదేముంది? …” 

హఠాత్తుగా ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టినయ్. కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేయలేదామె, అలాగే తన మాటల్ని కొనసాగించింది, “డ్యూటీలో ఉన్న  ఒక ఆశా హెల్త్ వర్కర్ని హరియాణాలో అంబులన్స్ డ్రైవర్ లైంగిక వేధింపుకు గురిచేశాడు. ఇలాంటి చట్టం ఒకటి ఉందని ఆమెకి తెలియదు, ఫిర్యాదు చెయ్యడానికి. అందరూ ఆమెకి సలహాలిచ్చేవాళ్ళే, అతన్ని క్షమించి వదిలెయ్యమని! ‘యత్ర నార్యస్తు పూజ్యంతే …’ అని కదూ ఆర్యోక్తి? మమ్మల్ని పూజించొద్దు, మనుషుల్లాగా చూడండి చాలు …” తీవ్ర వ్యధ మనసును తొలిచివేస్తున్నట్టుగా ఆమె మొహం కందిపోయింది. మాట్లాడుతున్నదల్లా తూలి మైకు పోడియంను పట్టుకుని నిలద్రొక్కుకోవాలని ప్రయత్నించి అలాగే నేలమీదికి జారిపోయింది.  

అందరికంటే ముందుగా తేరుకుని ముందుకు ఉరికింది అనల. వేగంగా వేదిక మెట్లెక్కి ఆమెని తన వొడిలోకి తీసుకుంది, “నందినీ, ఏమయిందే?” ఆత్రుతగా పిలిచింది

ఆమెకి స్పృహ తప్పింది, అంబులన్స్ని పిలవండి!” చుట్టుచేరినవారిలో ఎవరో హెచ్చరించారు.       

తన మిత్రురాలితోపాటు అంబులన్స్ ఎక్కడానికి ఉద్యుక్తురాలైన అనలని పాండురంగారావుగారు వారించారు, “ఆమె ప్రాణానికేం ప్రమాదంలేదమ్మా, నేను వేరేవాళ్ళని తోడు పంపిస్తాను. నీతో ఒకసారి మాట్లాడాలి, రామ్మా!” పక్కనే ఉన్న ఆఫీస్ గదిలోకి నడిచాడాయన. తలుపులు దగ్గరికి వేసి, ఆమె ఎదురుగా వచ్చి కూర్చున్నాక ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు, “నీకొచ్చిన భయమేమీ లేదు, ఇక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియాలి, చెప్పమ్మా,”

 అనల మొదలుపెట్టి చెప్పింది నందిత పట్ల ప్రాజెక్ట్ ఆఫీసర్ చెన్నయ్య ఆగడాలు. ఆమె భర్తకి పక్షవాతం రావడంఆమె గతిలేక ఉద్యోగం చేస్తుండడం, తోడెవరూ లేరనే అలుసుతో ఆమెతో అతి చనువు తీసుకోడం గురించి, ఆమె లొంగకపోతే పనిలో వంకలు పెట్టి వేధించి వేధించి ఆమెకి మనశ్శాంతి లేకుండా చేయడం, ఒకటొకటిగా చెప్పుకొచ్చింది. అంతా విని నిట్టూర్చి తలపంకించాడాయన ఆమె వైపు సాలోచనగా చూస్తూ

* * *

హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరిచిన నందితకి తన చెయ్యి పట్టుకుని పక్కనే కుర్చీలో కూర్చున్న అనల కనిపించింది. తన వైపు చూస్తూ నీరసంగా అడిగింది, “ఏమయిందే నాకు?”

అంతా మంచే అయింది! ఎంపీ పాండురంగారావ్ గారు మాట ఇచ్చారు నాకు. ఇక చెన్నయ్య ఆగడాలకు చెక్ పెట్టినట్టే! కొసమెరుపు ఏమిటంటే, ఆయన వచ్చే ముందే ఆఫీసు విషయాలలో జరిగే కొన్ని అవకతవకల గురించి నిర్ధారించుకుని మరీ వచ్చారన్నది!” 

అనల చెప్పి నవ్వుతుంటే  నందిత చేయి ఆప్యాయంగా ఆమె చెయ్యిని నొక్కింది. ఒక చిరునవ్వు ఆమె పెదాలపై వెల్లివిరిసింది!      

****

Please follow and like us:

9 thoughts on ““మగువా, చూపు నీ తెగువ!”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)”

 1. తెన్నేటి శ్యామకృష్ణగారు మంచి కథనాన్ని అందరికీ సులువుగా అర్ధమయ్యే విధంగా వ్రాయడంలో దిట్ట . ప్రస్తుత కథ లో కూడా నందిత జీవితంలో జరిగిన సంఘటనల్ని చెప్పకుండానే చెప్పినట్లుగాచెప్పారు . రాజకీయ నాయకులలో పాండురంగారావు లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారని మనకి తెలియచెప్పడంలో మహిళా దినోత్సవాన్ని ఒక సాధనగా ఉపయోగించుకున్నారు . కథ మొదలునించీ కూడా చదువుతుంటే అందులో లీనమయ్యే విధంగా వ్రాశారు .మనసుకు హత్తుకునే పద్ధతిలో వ్రాయడంలో శ్యామకృష్ణగారు
  వ్రాసిన విధానం నాకు బాగా నచ్చింది .

 2. అనేకులు మగువకు జరుగుతున్న అన్యాయాలను, అఘాయిత్యాలను రాస్తారు.ఐతే శ్యామకృష్ణ గారు ఓ మగువా ఇక చూపు నీ తెగువను అంటూ స్త్రీ ని ప్రోత్సాహిస్తున్నారు.
  సమస్యను చూపటం వేరు సమస్యను పరిష్కరించడం వేరు.
  కథకుడు పరిష్కరించుకోవటానికి కావాల్సిన ధైర్యానిస్తూ ఆమెను ప్రోత్సాహించటం నాకు నచ్చింది.
  అందుకే శ్రీ తెన్నేటి గారి కథకు నేను మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నాను

 3. నేను శ్రీ తెన్నేటి శ్యామకృష్ణ గారి కథకు మొదటి ప్రాధాన్యతను ఇస్తాను

 4. నందిత లాంటి సగటు ఉద్యోగినులు ఎంతో మంది తమ పైఅధికారులు చేత వేధించబడుతూ,తిరగబడే ధైర్యం లేక, నలిగి పోతున్నారు. నందితకి దొరికిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్న తీరు రచయిత తెన్నేటి శ్యామకృష్ణ గారు “మగువా చూపు నీ తెగువ”! కథలో పొందు పరిచిన తీరు చాలా బాగుంది

 5. ఉద్యోగ నిర్వహణలో స్త్రీలు ఎదుర్కొనే మానసిక వత్తిడి ల గురించి హృదయాన్ని స్పృషంచేలా చక్కగా రచించారు తెన్నేటి శ్యామక్రృష్ణ తన కధ మగువా చూపు నీ తెగువ అనే కధ ద్వార. ఒక చక్కటి కధ చదివిన అనుభూతి కలిగింది

 6. నమస్తే అండి నాడు నేడు ఆడవాళ్ళు మీద జరుగుతున్న అన్యాయల్ని గురించి ఎన్నో కధలు ,సినిమాలు వచ్చిన, స్ర్తీల పట్ల కొనసాగుతున్న వివక్షత
  చిన్న చూపు సమాజంలో నేటికి ఏలాంటి మార్పు లేదు.కధాపరంగా తనకున్న సహనం ఓర్పుని ఏ మాత్రం కోల్పోకుండ సందర్భం రావటం వచ్చిన అవకాశం లో చెప్పాలి అనుకున్న విషయాన్ని నిస్సంకోచంగా వివరించిన నందిత చాల చక్కగా రాశారు రచయిత గారు కధ ఈ మార్పు నిజజీవితంలో జరిగితే మహిళా మణులు ఏ లాంటి పాత్రల్లో వున్న వారి జీవితం ఆనందమయమే అవుతుంది.

 7. Mahila dinotsava sandarbhangaa mahilala kashtaalu telusukovadamane aalochana , vaatini nirmoolinchadam chaala harshaneeyanga undi.👏👏👏👏

Leave a Reply

Your email address will not be published.