మా యింటి ఎనగర్ర

(ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

-కూకట్ల తిరుపతి

ఇప్పటికీ… ఊర్లల్లా!
మంచికీ చెడ్డకూ
దొడ్లెకు గొడ్డచ్చిన యాళ్ల
ఇంట్ల కొత్త కోడలడుగు వెట్టిన యాళ్లంటరు

ఓ అంకవ్వా! నువ్వయితే…
మా నాయన కనకయ్య యేలు వట్టుకొని
అమృత ఘడియల్లనే ఇంట అడుగువెట్టుంటవు
గందుకేనేమో! మా లేకిడి అయ్యకు
ఇగ ముట్టిందల్లా ముచ్చమయ్యింది
పట్టిందల్లా పగుడమయ్యింది

తొక్కుడు బండంత నీ ఓపికకు మొక్కాలె
పందికొక్కుల్లాంటి పెత్తందార్ల పంటికింద రాయిలా
ఊళ్లె అన్నాలాలకు అడ్డువడుకుంట
ఉగ్గుర నరసిమ్ముడయిన మోదదోపు నాయనను
బుద్ధ దేవుడు పూనిన
పెద్ద మనిషిగా మార్సుకున్నవు

ఇంటికచ్చిన సుట్టపోళ్లకు
కాళ్ళకు నీళ్ళిచ్చుకుంట
కంటనీరు దీసినవు
సుట్టాకు పొగాకు సేతిలకిచ్చి
మంచంల గొంగడి సదిరి కూసుండ వెట్టుకుంట
పేరుపేరునా యింటోళ్లందర్నీ అడుక్కుంట
మంచి చెడ్డలు అర్సుకున్నవు
కడుపు నిండా ముచ్చెట వెట్టుకుంట
దేవునాతి దేవుతుల తీర్గ జూసుకున్నవు
అత్తమామలను ఆడిబిడ్డలను
పాపన్న పాణమోలే పలుకరిచ్చినవు
రగుత సవందపోళ్లందరికి పాయిరంగ
తల్కాయలో నాల్కె లెక్కన మెదిలినవు

నువ్వు ఆకిట్ల కసువు కుప్పజేసినా
అలుకు పూతల తీనెలు దీసినా
ఇల్లువొళ్లంత సుద్దపూసయి
ముగ్గుబుట్టోల్గె తేటగ పూసేది

పొద్దుపొద్దుందాక అంగిన నడుమెత్తకుంట
బక్క గొడ్డోలె
పునాస దుక్కుల్ల నలేరినా
మోకాళ్ల మంటి బురదల కలుపుదీసినా
సెట్టసెట్ట పొతంజేసె పనిమంతురాలుగ
నీ అవ్వయ్య పేరునుద్దరిచ్చినవు
గంపెడు పోరగాండ్లను గావురంగ
కంటిపాపలోలిగె కాపాడుకున్నవు

ఆకలి కడుపులకింత
కుండల గల్లది
కలోగంజో వోసుకుంట
దయగల్ల మాతల్లిగ పేరెల్లినవు

సూరుకిందికి నీడలు దిగంగనే
మా సూపులు నువ్వోయిన తొవ్వల్లకు జారేది
నువ్వు పొద్దుగాలనంగ అడివిలకువోతే
పొద్దుగూకి సందెలు వడంగ యిల్లుజేరిన యిగురానివి
చేతిల కొడవలో… కొంకనో…
నీ నల్లని కోలమొకం
గోసిచీర కట్టిన రూపం
మాకు కండ్లవడంగనే
మాకెంతో కండ్ల పండుగు
నీకు ఎదురుంగ రయ్యిమని ఉరికచ్చి
నీ కాళ్ల సుట్టు జెప్పన సుట్టుకోంగనే
నీ ఒడిగుమ్మిల
పచ్చి పల్లికాయ పలారమో
పాల కంకుల పాయసమో
పెసరుకాయలో మా ఆకలిని చల్లార్చేది

ఆకలికి అన్నం ముద్దయి
దూపకు సల్ల బుడ్డయి
వాటిక బుడ్డిని దమ్మువట్టచ్చిన నాయనను
పసి పిలగాని లెక్కన కడుపుల దాసుకున్నవు
దినాం పువ్వోలె పైలంగ జూసుకున్నవు
ఆయనను యింట మాత్రమే కాదు
రచ్చన సుతా గెలిపించినవు
నిట్టాడయి పుట్టింటి పేరును నిలవెట్టుడేగాదు
మెట్టినింటికి ఎనగర్రయి ఎల్లదీసినవు

నీతోటే కలిమి
నీ వల్లే బలిమి
ఇల్లు యిగురు వెట్టింది
పందిరి పచ్చ వడ్డది
కూకట్లోరి మ్యాల్లంల
పసిరిక తీగయి పర్సుకున్నవు

నీ మాటల మూటలు సలువదనమయి
మానేరు ఉత్కాలోలె గలగలపారినవు
అచ్చెగాళ్లను బుచ్చెగాళ్లను
అమ్మయి అదుర్తగ ఆడుకున్నవు
సేనుశెల్కల ఇరాంలేని పొతంల
నీ చేతుల నిండార్గ కాయలు గాసినయి
బొచ్చెడు ఆపచ్చెనల తొవ్వల్ల
నీ అరికాళ్లు సందువోకుంట ఆనెలు గాసినయి


నీ చేత తిన్నోళ్లందరూ
నీ కడుపు సల్లంగుండాలని అన్నోళ్లే
ఆత్మగల్ల అవ్వయి
అందరి దీవెనార్తులు అందుకున్నవు

అవ్వా!
పగోనిలోనయిన పాలోనిలోనయిన
మేలెంచి కీడెంచమన్న దేవతవు
నీ దయగల్ల చూపుల బోదలు
మాకు నిత్తెం చల్లని నీడలయినయి
మా బత్కున
తంగేడయి పూసినవు
ఎన్నీలయి కాసినవు
నీ పాయిరంగల్ల మన్సుకు
అయిదేళ్ల ఆరతి
పదేళ్ల పబ్బతి.

****

Please follow and like us:

12 thoughts on “మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)”

 1. ఆడది ఆలిగా, తల్లిగా చేస్తున్న కృషినకృషిని కవి చక్కగా వివరించారు. ఇంటి పైకప్పును ఎనగర్ర మోస్తుంది. అలా తల్లి ఇంటి బరువు బాధ్యతలను మోస్తుంది అని చెప్పిన తీరు సమంజసంగా ఉంది.

 2. మంచి పోయెం కూకట్ల మిత్రమా

  1. ధన్యవాదాలు రవీందర్ భయ్యా

  1. శెనార్తులు సర్
   తెలంగాణ పల్లె పదాల పట్ల మీకున్న పాయిరం, పట్టు బాగా గొప్పది. మీ మెప్పును పొందినందుకు సంబురంగా ఉంది. మీకు అలయి బలయి సర్.

 3. పల్లె జీవభాషలో రాసిన అద్భుత కవిత
  తీనెలు,పువ్వోలె,, పాయిరంగ, పబ్బతి, మాల్యం, లేకిడి అయ్య, సెట్ట సెట్ట పొతంచేసుడు ఇలాగ యాదిమర్సి వాడిపోయిన పదాలను “ఎనగర్ర” (ఇంటికి మూల స్తంభం) టైటిల్ తో కనిపెంచి పువ్వోలె సాదిన అవ్వమీద రాసిన కూకట్లకు శనార్థులు.

 4. చాల బాగుంది.అన్నా.. అందరి ఆకలి తీర్సే ఆత్మ గల్ల అవ్వ మీద నువ్వు రాసిన కవిత.

 5. మీ ఇంటి ఎనగర్ర…ఇంకేంది
  మంచిగనె బలంగానె ఉన్నది🤝👍

Leave a Reply

Your email address will not be published.