యాత్రాగీతం
నా కళ్లతో అమెరికా
అలాస్కా
-డా||కె.గీత
భాగం-12
మర్నాడు బయటంతా చిన్న జల్లు పడుతూ ఉంది. ఉదయానే లేచి తయారయ్యి రిసార్ట్ ఆవరణలో ఉన్న చిన్న అందమైన గ్రీన్ హౌస్ ని చుట్టి వచ్చాము.
కాస్సేపట్లోనే సీవార్డ్ లోని మా రిసార్టు నుంచి వీడ్కోలు తీసుకుని బస్సులోకి ఎక్కి మాకు నిర్దేశించిన సీట్లలో ఉదయం 8 గం.ల కల్లా కూచున్నాం.
మేం మొదట బస చేసిన ఎంకరేజ్ మీదుగానే ప్రయాణం చేసి ఎంకరేజ్ కి దక్షిణంగా దాదాపు 125 మైళ్ళ దూరంలో ఉన్న సీవార్డ్ అనే ఊరికి మా ప్రయాణం మొదలయ్యింది. మొత్తం తల్కిట్నా నుంచి 250 మైళ్లు. దాదాపు అయిదు గంటల పైనే ప్రయాణం. మధ్యలో ఏంకరేజ్ లో ఒక గంట భోజనవిరామంతో కలిపి ఆరు గంటలు.
బస్సు ప్రయాణం రైలు ప్రయాణమంత ఆహ్లాదంగా లేకున్నా పిల్లలు మారుమాట్లాడకుండా కూచున్నారు పాపం. ఈ బస్సులో సీట్లు బాగా సౌకర్యవంతంగా ఉండడం వల్ల, పొద్దున్నే లేచి ప్రయాణం ప్రారంభించడం వల్ల దాదాపు రెండు గంటల పాటు అందరం నిద్రపోయేం.
ఆ ముందురోజు నుంచే నాకు పాదాల వేళ్ళు దురదలు పెట్టసాగేయి. ఏవో కుట్టేయని అనిపించసాగింది. అప్పటికొద్దీ ఏదో ఫస్ట్ ఎయిడ్ చేస్తే తగ్గినట్లే తగ్గి మళ్లీ ఆ ప్రయాణమంతా భలే ఇబ్బంది పెట్టింది.
ఏంకరేజ్ చేరేసరికి మధ్యాహ్నభోజన సమయమయ్యింది.
సామాన్లు బస్సులోనే వదిలి డౌన్ టౌన్ లో నిర్దేశిత ప్రదేశంలో ప్రయాణికులందర్నీ దిగమన్నారు.
అక్కణ్ణించి ఎవరికి ఇష్టం వచ్చిన చోటికి వారు వెళ్లి భోజనాదులు కానిచ్చి మరో గంటలో తిరిగి అక్కడికే రావాలన్నది నిబంధన.
మేం దిగిన ఏరియా ఒక మ్యూజియం అని అర్థమైంది.
అయితే అక్కణ్ణించి ఎటు వెళ్తే ఏముంటాయో తెలియక ముందు అక్కడక్కడే తచ్చట్లాడేం.
పిల్లల్ని తీసుకుని వెతుక్కుంటూ తిరగడం కష్టం కాబట్టి, నేను, వరు ముందు వెళ్లి ఒక పీజా టేకవుట్ ప్రదేశం చూసి వచ్చాము.
తీరా పీజా టేకవుట్ తీసుకున్నాక ఎక్కడ కూచుని తినాలో అర్థం కాని ప్రదేశమది.
అదృష్టం కొద్దీ దానికి అనుకుని ఉన్న చిన్న రెస్టారెంటులో చిన్నపాటి ఆర్డర్ ఏదో కూడా చెప్పి వాళ్ళ ఆవరణలో ఉన్న కుర్చీల్లో కూచుని తిన్నాం. రెస్టారెంటు వాళ్లు మేం పీజా వేరే చోటి నుంచి తెచ్చుకుని తింటున్నా మా పిల్లల్ని చూసి ఏమీ అనకుండా ఊరుకున్నారు.
మాకిచ్చిన గంటలో తిని మళ్లీ వెనక్కి రావడానికి సమయం సరిగ్గా సరిపోయింది.
దారిపొడవునా భూభాగం లోపలికి చొచ్చుకొచ్చిన సముద్రపు నీటి ప్రవాహాలు, ఎత్తైన కొండలు, దూరంగా కనబడే మంచు శిఖరాలతో ఆ మధ్యాహ్న ప్రయాణం ఆహ్లాదంగా జరిగింది.
మరో రెండు గంటల్లో సీవార్డ్ చేరుకున్నాం.
ఎంకరేజ్ నుంచి పూర్తి దక్షిణదిక్కులో ఉన్న సీవార్డ్ సముద్రతీరపు అందమైన పట్టణం.
మా బస్సు తిన్నగా మమ్మల్ని తల్కిట్నాలోలా రిసార్ట్ గుమ్మం ముందు దించింది.
అయితే రిసార్టులో చెకిన్ అయ్యేక మమ్మల్ని మా గది దగ్గిర దించడానికి వ్యాను వచ్చింది.
అప్పుడు అర్థమైంది ఆ రిసార్ట్ ఒక పెద్ద అపార్టుమెంటు కాంప్లెక్సు వంటిదని.
ఒక చోటి నించి మరో చోటికి నడవడానికి సమయం పడుతుందని.
ముఖ్యంగా సామాన్లతో, పిల్లలతో నడవడం అయ్యేపని కాదు.
పూర్తిగా చెక్కతో నిర్మించబడిన పెద్ద కాబిన్ కాంప్లెక్సుల్లో మా బ్లాక్ లో చివరి కాటేజీ మాది.
అలాస్కాలో అంతవరకు మేం బస చేసిన అన్ని రిసార్ట్ ల కంటే పెద్ద పెద్ద దుంగలతో తయారుచేసిన ఫర్నిచర్ తో భలే విభిన్నంగా ఉంది ఇది.
****
(ఇంకా ఉంది)