‘అడవితల్లి’

సి.కె.జాను అసంపూర్తి ఆత్మకథ సమీక్ష

   -అనురాధ నాదెళ్ల

మళయాళీ మూలంః భాస్కరన్

ఆంగ్లానువాదంః ఎన్. రవిశంకర్

తెలుగు అనువాదంః పి. సత్యవతి

                                      ఇదొక అసాధారణమైన కథ. నిరక్ష్యరాస్యురాలైన ఒక ఆదివాసీ మహిళ తన ప్రజల కోసం ధైర్యంగా చేస్తున్న పోరాటం ఈ ఆత్మకథ. సి.కె. జాను ఈ కథానాయకురాలు. 

                                     ఈ పుస్తకం ముందుమాటలో రచయిత రవిశంకర్ చెప్పినట్లుగా జాను పుట్టి, పెరిగిన రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోని పది ఉత్తమ సందర్శనీయ స్థలాలలో ఒకటిగా చెప్పుకునే కేరళలో ప్రజాస్వామ్య పధ్ధతిలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట అభివృధ్ధి,  ప్రజల జీవనప్రమాణాలు ప్రశంసలు పొందాయి. సమాజాభివృధ్ధిని గురించి ప్రజల్లో జరిగే చర్చలు ఇక్కడివారి ప్రత్యేక అవగాహనను చెబుతాయి. ఇక్కడి ఆదివాసీల జీవితాలను, వారి అభివృధ్ధిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదన్నది వాస్తవం. దాదాపు  ముప్ఫై ఏళ్లుగా సి.కె. జాను చేస్తున్న ఎడతెగని పోరాటమే ఇందుకు నిదర్శనం.

రచయితలు భాస్కరన్, రవిశంకర్ లు ఆమెతో విస్తృతంగా మాట్లాడినప్పుడు నిరక్షురాస్యురాలైన జానులోని వివేకం, పరిశీలన వారిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ సంభాషణ ఈ పుస్తకం రూపొందేందుకు కారణమవుతుందని వాళ్లు అనుకోలేదు. జాను తమ భూపోరాటం రాజకీయ పోరాటం కాదని చెబుతుంది. ప్రధాన స్రవంతి కేరళ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేసున్నామని, కోల్పోయిన భూమిని దక్కించుకుంటే తమ సంస్కృతిని దక్కించుకున్నట్టే అంటుంది. ఆదివాసీల బ్రతుకుతెరువుకు అడ్డుపడకుండా వారిని వారిదైన సంప్రదాయ పధ్ధతిలో అభివృధ్ధి చెందనిస్తే చాలంటుందామె. తమ స్త్రీలు పురుషుల మీద ఆధార పడకుండా స్వతంత్రంగా జీవించగలరని చెబుతుంది. ఆమె భాషలోని పరిమళాన్ని పోగొట్టకుండా కథను రాసే ప్రయత్నం చేసానని రచయిత చెబుతారు.

                                        జాను వరిపొలాల్లో మట్టి తవ్వటం, విత్తనాలు చల్లటం, నారు పీకటం, నాట్లు వెయ్యటం వంటి పనులన్నీ పది సంవత్సరాల వయసులోనే చేసేది. అడవిలోని చెట్లను నరికి, ఆ భూమిని వ్యవసాయ యోగ్యం చేయటంలో ఉన్న శ్రమ ఆమెకు తెలుసు. ఆ జీవమున్న నేల దహనమవుతున్నప్పుడు వచ్చే వింత వాసన ఆమెకు అనుభవమే. మూడవ తరగతి చదువుకున్న తన చెల్లెలి పుస్తకంలో వ్యవసాయ పధ్ధతుల గురించి, భూమి దున్నటం, వరినాట్లు వెయ్యటం గురించి బొమ్మలతో సహా ఉందని చెబుతూ, అవేవీ చూడకుండానే, చదవకుండానే అడవి బిడ్డలైన తమకు ఆ పనులన్నీ తెలుసునంటుంది. 

చిన్నపిల్లలుగా తాము భూస్వాముల పశువులను కాస్తూ అడవిలో దొరికే పళ్లు , దుంపలు తినేవాళ్లమని అడవిలో తామెవరూ ఆకలి ఎరుగమని చెబుతుంది. అక్కడే నీళ్ల గుంటల్లోని నీటిని తాగి దాహం తీర్చుకునేవారు. వెదురు గొట్టాలు కోసి చీనీ (పిల్లనగ్రోవి) తయారు చేసి ఊది, సంగీతం పుట్టించేవారు. ఐదుగురు పిల్లల్ని, భార్యని వదిలి తండ్రి వెళ్లిపోతే చిన్నప్పట్నుంచీ అనేక కష్టాలు చూసింది జాను. అడవి బిడ్డలు కొండలను, అడవులను చదును చేసి వ్యవసాయ యోగ్యం చేసిన భూమిని క్రమంగా ఎలా కోల్పోయారో అవగాహన చేసుకుంది జాను. 

                                            ఒక టీచర్ ఇంట పనికి ఏడేళ్ల వయసున్న తనను తల్లి తీసుకెళ్లినప్పుడు దారి పొడవునా కాంక్రీటు రోడ్లను, పరుగెత్తే పెద్దపెద్ద వాహనాలను మొదటిసారిగా చూసిందామె. ఆ టీచర్ని, ఆమె పాపను అమితంగా ఇష్టపడింది. రేడియోలో పాటలు, నాటకాలు వింటూ అంత చిన్న పెట్టెలో అంతమంది మనుష్యులు ఎలా పట్టేరో అని ఆశ్చర్యపోయింది. ఆఇంట్లో పనిపాటలు చేసుకుంటూ సమీపంలోనే ఉన్న బడి గంట విని, తాను కూడా స్కూల్ కి వెళ్ళాలనుకుంది జాను. అక్కడ రెండేళ్లు పని చేసాక తిరిగొచ్చి, పొలాల్లో రోజుకి రెండు రూపాయల కూలీకి పనిచేసింది. 

తమ సమాజంలో కూడా పెళ్లి వేడుకలుంటాయని, అయితే వైభవంగా మాత్రం ఉండవని చెబుతుంది. పదిహేడేళ్ల వయసులో జానుకి పెళ్లైంది. సంప్రదాయాలలో ఇమిడిపోయి, మగవాళ్లతో కలిసి ఉండటం ఇష్టంలేక పెళ్ళిబంధాన్ని వదిలి బయటకు వచ్చేసింది. సాధారణంగా పెళ్లైన పిల్ల అత్తవారింట ఉమ్మడి కుటుంబంలో ఉండటం కానీ భర్తతో కలిసి విడిగా ఉండటం కానీ జరుగుతుంది. కుటుంబాల్లో తల్లిదండ్రులు భూస్వామి పొలంలో పనిచేస్తుంటే, పిల్లలు భూస్వామి పశువులను కాస్తారు. ఇది పరంపరగా సాగుతుంది.

                                            పార్టీ పనికోసం తమ ప్రాంతంలో అందరూ వెళ్లేవారమని, ఊరేగింపులకు లారీలో తీసుకెళ్లేవారని చెబుతుంది. సభలో రైతుల గురించి పాటలు పాడటం, కూలీల జీవనం గురించి, వారికిచ్చే కూలి గురించి మాట్లాడేవారని చెబుతుంది. ఆ ప్రాంతంలోని భూస్వాములంతా పార్టీ సభ్యులే. దానివలన కర్షకులు, కార్మికులకు అనుకూలమైన ఏ నిర్ణయాలను పార్టీ తీసుకునేది  కాదు. కేవలం వారి ఊరేగింపులకు జనం కావాలి కనుక తమను ఉపయోగించుకునేవారు. 

భూస్వాములు కేవలం తమ శ్రమను మాత్రమే దోచుకుంటే, వలస వచ్చినవాళ్లు తమ మగవాళ్లను వశపరచుకుని, వాళ్లను తాగుడుకి బానిసల్ని చేసి వారి భూముల్ని కూడా స్వంతం చేసుకున్నారు. 

                                         జాను ఒకచోట చెబుతుంది, గిరిజనులకు ప్రతి విషయానికీ భయమేనట. అసలు వాళ్ల వీపులు వంగి ఉన్నట్టు కనిపించటానికి ఈ భయమే కారణమేమో అంటుంది. తమ తాత, ముత్తాతలు చెట్లు నరికి, అడవి కాల్చి కొండ ప్రాంతాలు సేద్యపు భూములుగా చేస్తే భూస్వాములు వాటిని స్వంతం చేసుకున్నారు. తమ శ్రమతో బలవంతులైన భూస్వాములంటే ఆదివాసీలకు భయం. అసలు తమ సంస్కృతికి భిన్నమైన అంశాలేవైనా భయం కలిగించేవే. అయితే పస్తులతో చావటమంటే ఇంకా భయమని చెబుతుంది. ఎంత దీనమైన పరిస్థితులు! వారి పేదరికం, నిరక్షరాస్యత, అసహాయతలనుండి బయట పడేసే వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ కనుచూపుమేరలో లేవు. 

                                          పార్టీ పేరుతో సభలు, సమావేశాలు నిర్వహించే సభ్యులంతా పాలక పక్షమే. వారి లక్ష్యం స్వంతలాభమే. ప్రభుత్వాన్ని విమర్శించేవారు కూడా వాస్తవంలో ఈ అసహాయ నిరుపేదలకు ఎలాటి న్యాయాన్ని చెయ్యలేకపోవటం మరింత బాధాకరం. ఇది తరతరాలనుండి జరుగుతున్న దోపిడీయే. జాను లాటి వివేకవంతులైన నాయకుల చేతిలో కూడా ఘర్షణ మినహా వారికి లభించిన ప్రయోజనమేదీ పెద్దగా లేదు. పట్టుదలతో పోరాడాలన్న స్ఫూర్తి మాత్రం జాను నేర్పింది.

పౌరసమాజం, పార్టీ, భూస్వాములు అందరూ కూడా తమ స్త్రీలను ఉపయోగించుకున్నారంటుంది. పార్టీ సమావేశాలకు క్రమం తప్పకుండా వెళ్ళే జాను అక్కడ విషయాలను పూర్తిగా అవగాహన చేసుకునేది. చుట్టూ ఉన్న ఆదివాసీ గూడేలలోకి వెళ్లి వారి స్థితిగతుల్ని కళ్లారా చూసేది. వారిని చైతన్యపరిచేది. 

                                          భూస్వాముల పిల్లలు చదువుకుని, పెద్దస్థాయిలో సంపాదనా పరులయ్యాక భూస్వాములకు భూమితో అవసరం తీరింది. వలసవచ్చినవారు భూమినుంచి పంటను కాక లాభాన్ని ఆశించారు. పొలాల్లో ఆహారపంటలు మాయమై వాణిజ్య పంటలు ఆక్రమించాయి. క్రమంగా పొలాలన్నీ పోగొట్టుకుని ఆదివాసీలు కూలీపనులను వెతుక్కోవలసిన అవసరం వచ్చింది. నిలబడే స్థలం కరువైంది. స్వంత సంస్కృతికి దూరమయ్యారు. పౌర సంస్కృతిలో ఇమడలేని స్థితి. వారి మూలాలను ధ్వంసం చేసి, భూస్వాములు, పార్టీ, ఎస్టేట్ యజమానులూ బలంగా తయారయారు. పార్టీ కార్యకర్తలు కూడా పౌరసమాజంలోని వ్యక్తుల్లాగే ఆదివాసీ స్త్రీలకు సమస్యలు తెచ్చిపెట్టారు. వారిని పెళ్లికాని తల్లుల్ని చేసారు.

పార్టీ చెప్పినప్పుడల్లా ఆందోళన చెయ్యటం వరకూ ఆదివాసీల బాధ్యత. కానీ వారి కూలీ పెంచమన్నప్పుడు పార్టీ, అందులో సభ్యులుగా ఉన్న భూస్వాములు కూడా పరిష్కారాన్ని వాయిదా వేస్తుండేవారు. కూలీ పెంపుకోసం ఆందోళన నిరవధికంగా చెయ్యాలంటే పస్తులు తప్పవు. అలా వారి ఆందోళన ఆకలి బాధకి వీగిపోవల్సిన పరిస్థితులు. పార్టీకి ఆదివాసీలు ఒక ఓటు బ్యాంకు మాత్రమే. తమ స్థితిగతులు మెరుగుపడే చర్యలేవీ పార్టీ తీసుకోదని జానుకి క్రమంగా అర్థమైంది. 

                                         జాను 1966-67 సంవత్సరంలో కేరళలోని వైనాడ్ జిల్లా చెక్కోట్ లో ఒక నిరుపేద ఆదివాసీ దంపతులకి జన్మించింది. పదిహేడో ఏట కేరళ ప్రభుత్వం అమలు చేసిన ‘’అక్షరాస్యతా’’ కార్యక్రమంలో అక్షరాలను నేర్చుకుంది. అది సరిగా సాగక తన స్వంత ఆసక్తితో కనిపించిన కాగితాన్నల్లా చదువుతూ తానుగా నేర్చుకుంటూ, చుట్టూ ప్రపంచాన్ని అర్థం చేసుకుంది. కొంతకాలానికి గిరిజన స్త్రీలకి చదువు నేర్పే అక్షరాస్యతా బోధకురాలిగా కూడా పనిచేసింది. భారత కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలక సభ్యురాలిగా పనిచేసింది. ఆ పార్టీకి చెందిన రైతుకూలీ సంఘంలో చురుకుగా పాల్గొంది. పార్టీ తమకు న్యాయం చెయ్యదని అర్థమై 1991లో పార్టీ వదిలి బయటకొచ్చింది.

1992లో ‘’ఆదివాసీ అభివృధ్ధి కార్మిక సంఘం’’ స్థాపించింది. అదే సంవత్సరం ‘’దక్షిణ మేఘల ఆదివాసీ సంఘం’’ ఏర్పాటు చేసి అధ్యక్షత వహించింది. దీనికి కేరళ, కర్నాటక, తమిళనాడులలోని ప్రముఖ గిరిజన నాయకులు హాజరయ్యారు. పోగొట్టుకున్న భూమిని గిరిజనులు తిరిగి సంపాదించుకోవాలన్న విషయాన్ని వీరంతా సభలో చర్చించారు. గిరిజనులను పురిగొల్పి ఆందోళనలను చేపడుతున్నదని ఆమెపై పోలీసులు అనేకసార్లు దౌర్జన్యం చేసారు.  

                                          ‘’ఆదివాసీ అభివృధ్ధి కార్మిక సంఘం’’ కార్యక్రమాలలో భాగంగా ఆమె 1993లో భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో పర్యటించింది. 1994లో కేరళ ప్రభుత్వం  ఆమెకు ‘’షెడ్యూల్ తెగల ఉత్తమ సాంఘిక కార్యకర్తగా అవార్డు’’ ప్రకటించింది. ఆదివాసీల కోర్కెలను తీర్చని ప్రభుత్వం ఇచ్చే  అవార్డును జాను తిరస్కరించింది. దేశ, విదేశాల్లో జరిగిన అనేక సభల్లో పాల్గొంది. 

2001లో భూమిలేని గిరిజనులకు నాయకత్వం వహించి 40 రోజుల పాటు సెక్రెటేరియట్ ఎదురుగా గుడిసెలు వేసుకుని చారిత్రాత్మక పోరాటం చేసింది. దాని ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి ఒక ఒడంబడిక మీద సంతకం చేసింది. కానీ వాటిని అమలుపరచలేదు. 

                                    దానికి నిరసనగా జాను తనవారితో కలిసి వైనాడ్ జిల్లాలోని ‘’ముతాంగ్ రిజర్వ్ ఫారెస్ట్’’ లో కొంతభూమిని ఆక్రమించి ఒక గిరిజన ఆవాసాన్ని ఏర్పాటు చేసింది. వారిని ఆ ప్రాంతం నుంచీ ఖాళీ చేయించేందుకు 2003లో ప్రభుత్వం ‘’పోలీసు చర్య’’ చేపట్టింది. దానిలో ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక గిరిజనుడు మరణించారు. జాను అరెస్టయింది.

అయితే ఈ ఆందోళన ఫలితంగా 2001లో ప్రభుత్వం చెప్పిన విధంగా పదివేలమంది ఆదివాసీ కుటుంబాలకు భూమి లభించింది. భూమిలేని నిరుపేద ఆదివాసీలకు కన్నూర్ జిల్లాలోని అరళంలో వ్యవసాయ భూమి కేటాయించబడింది. 

ముతాంగ్ ఆక్రమణ, పోలీసు చర్య అయిన తరువాత రచయిత్రి అరుంధతీ రాయ్ కేరళ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాస్తూ, ‘’మీ చేతికి రక్తం అంటింది, మీ తప్పులు దిద్దుకోండి’’ అని హితవు చెప్పారు.

                                    జాను జాతీయ, అంతర్జాతీయ ఆదివాసీ సంఘాలతో కలిసి పనిచేస్తున్నప్పటికీ తమ సంఘానికి కావలసిన నిధులను మాత్రం ఎవరినుండి స్వీకరించదు. ‘’ఆదివాసీ అభివృధ్ధి మహాసభ’’ కార్యకలాపాలన్నిటికీ నిధులు పేద ఆదివాసీలే సమకూరుస్తున్నారు.

సి.కె. జాను వైనాడ్ జిల్లాలోని సుల్తాన్ బఠారీ నియోజక వర్గం నుంచి బి.జె.పి. అభ్యర్థిగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆమె బి.జె.పి. నుంచి లంచం తీసుకుందన్న వదంతులను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. 

                                   జాను ఛత్తీస్ ఘర్ కు చెందిన ఒక ఆదివాసీ ఆడపిల్లను దత్తత తీసుకుని, పనవల్లిలో తల్లి, చెల్లెలుతో కలిసి ఉంటూ తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

ఆకలి తీరాలంటే తమకు కొంత భూమి అవసరమని చెబుతారామె. అడవిలో ప్రతి మొక్క, చెట్టు, ప్రతి శబ్దం, ప్రతి జంతువు, పక్షి కదలికల్ని అర్థం చేసుకోగలిగే ఆదివాసీలను వారి మూలాల నుంచి వెళ్లగొట్టకుండా వారిని తమదైన జీవన విధానాన్ని కొనసాగించే వెసులుబాటును ఇవ్వాలన్నదే ఆమె ముఖ్యమైన డిమాండ్. అలుపెరుగని జాను బలం అడవి, అక్కడి మనుషులే! ఆమె నిజాయితీ, ఎన్ని కష్టాలొచ్చినా నమ్మిన సత్యం కోసం నిలబడే నిబ్బరం తమ ఆదివాసీ మహిళల సహజశక్తి అని చెబుతుంది. ఇదంతా అడవే నేర్పిందంటుంది తమకి. 

                                               ప్రపంచంలో అధికారమంతా పౌరసమాజం దగ్గరే ఉందని, ఆకలి తీర్చుకుందుకు అటువంటి వారి దగ్గరే పనిచెయ్యవలసిన పరిస్థితులు తమవని చెప్పే జాను నిజమైన అడవి బిడ్డ. ఒక టీ చుక్కకోసమో, ఒక బీడీ కోసమో తమ మగవారిని మచ్చిక చేసుకునే నేర్పు పౌరసమాజానికి ఉందంటుంది. ఒక రాజకీయ పార్టీ అండ కానీ, డబ్బు కానీ లేకుండా తన సాహసమే తన బలంగా పనిచేస్తున్న జానులాటివాళ్లు ఎందరు పుట్టుకొస్తే ఆదివాసీల అస్తిత్వానికి రక్షణ దొరుకుతుంది?

కేవలం యాభై పేజీలున్న ఈ పుస్తకం చదువుతుంటే ఒక ఉత్తేజం, ఒక కొత్త ఆలోచన, శక్తి కలిగాయి. స్వసుఖాలకు ప్రాకులాడే పౌరసమాజానికి చెందిన వ్యక్తిగా చిన్నతనం కలిగింది. ఆదివాసీ స్త్రీ శక్తి మీద అంతులేని అభిమానం, గౌరవం కలిగాయి. ఒక అరుదైన అనుభవాన్నిచ్చిన అపురూపమైన పుస్తకం ఇది. ఇది అసంపూర్తి ఆత్మకథ కనుక జాను తనకు కలిగిన అనుభవాల బలంతో, కొత్త తెలివిడితో ఆత్మకథను పూర్తి చెయ్యాలని ఆశిద్దాం. 

****

Please follow and like us:

2 thoughts on “‘అడవితల్లి’, సి.కె.జాను అసంపూర్తి ఆత్మకథ సమీక్ష”

  1. ఈ చిన్న పుస్తకం చదువుతున్నవారిని ఎంతో ఉత్తేజితుల్ని చేస్తుంది. సి.కె. జాను జీవితాన్ని తెలుసుకోవటం ఒక అరుదైన అనుభవం. థాంక్యూ శేషు.

  2. ఆడవితల్లి అసంపూర్తి ఆత్మ కధ is a window to know the day today problems of tribal people in various parts of India. C.K.Jaanu life story is truly inspiring. There are many such unknown social workers in our society who work relentlessly for the tribes. Thanks to the writer, translator and N.Anuradha who threw light on this inspiring life story.

Leave a Reply

Your email address will not be published.