కథన కుతూహలం -2

                                                                – అనిల్ రాయల్

గత భాగంలో ‘బ్రహ్మాండం’ (అనువాద) కథ చదివారు. ఆ మూల కథలో నన్ను ఆకట్టుకున్న విషయాల్లో ఒకటి – మూల రచయిత Andy Weir వాక్య నిర్మాణంలో పాటించిన పొదుపు. కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే – పొడుగాటి వాక్యాలు చదివి అర్ధం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు అర్ధం చేసుకోవటం తేలిక కాబట్టి; అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి; అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు అనవసరమైన కొవ్వుని కరిగించేసి కథ సొగసు పెంచుతాయి కాబట్టి. కథలకి క్లుప్తత గొప్ప సుగుణం.

ఇంతకీ క్లుప్తత అంటే ఏమిటి? అది ఏమి కాదో చెప్పటం తేలిక. క్లుప్తత అంటే – కథలో వాక్యాలు ఎడాపెడా తెగ్గోసి పుటల సంఖ్య తగ్గించేయటం మాత్రం కాదు. కథ ఎంత పెద్దగా లేదా చిన్నగా ఉండాలనేది దాని కథాంశం నిర్దేశిస్తుంది. ముప్పై పేజీలకి పైగా సాగే కథలో క్లుప్తత దండిగా ఉండొచ్చు, మూడే పేజీల కథలో అది పూర్తిగా కొరవడనూవచ్చు. కాబట్టి వర్ధమాన కథకులు అర్ధం చేసుకోవలసిన మొట్టమొదటి విషయం: కథ పొడుగుకి, క్లుప్తతకి సంబంధం లేదు. పది పదాల్లో చెప్పగలిగే భావాన్ని పాతిక పదాలకి పెంచకుండా ఉండటం క్లుప్తత. అంతేకానీ, పొడుగు తగ్గించటం కోసం అవసరమైన దాన్ని సైతం కత్తెరేయటం కాదు.

“ఈ ఉత్తరం సుదీర్ఘంగా ఉన్నందుకు మన్నించు. సమయాభావం వల్ల ఇంతకన్నా కుదించలేకపోయాను” అన్నాడట పదిహేడో శతాబ్దపు శాస్త్రవేత్త బ్లెయిజ్ పాస్కల్. క్లుప్తీకరించటమనేది ఆషామాషీ వ్యవహారం కాదని ఆ వ్యాఖ్య తెలుపుతుంది. “కవితలు రాయలేని వారు కథలు, అవి కూడా రాయలేని వారు నవలలు రాస్తారు” అనే అతిశయభరిత వ్యంగ్యోక్తి కూడా క్లుప్తత సాధించటం ఎంత కష్టమో వివరించేదే. అయితే, అది కష్టం కావచ్చు కానీ అసాధ్యమైతే కాదు.

కథలో క్లుప్తత సాధించాలంటే కథకుడికి మొదటగా కావలసినది చెప్పదలచుకున్నదానిపై స్పష్టత. ఏం చెప్పాలో తెలీనప్పుడు దాన్ని ఎలా చెప్పాలో తెలిసే అవకాశమే లేదు. ఇలాంటప్పుడే పదాడంబరం రంగప్రవేశం చేసి కథ పొడుగు పెంచుతుంది. ఇక రెండోది, చెబుతున్న విషయమ్మీదనే దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి. ఇది కొరవడితే కథలోకి అనవసరమైన పాత్రలు, వాటిమధ్య సందర్భశుద్ధి లేని సంభాషణలు, వగైరా ప్రవేశిస్తాయి. ఈ రెండిటి తర్వాత ముఖ్యమైనది – తక్కువ పదాల్లో ఎక్కువ భావం పలికించగలిగటం.

పైవేవీ బ్రహ్మవిద్యలు కావు. సాధనతో సమకూరే సుగుణాలే. కథాగమనానికి దోహద పడని వర్ణనలకి దూరంగా ఉండటం, పాత్రల సంఖ్య పరిమితం చేయటం, పునరుక్తులు పరిహరించటం, అనవసరమైన పాండితీ ప్రదర్శనకి పాల్పడకుండా నిగ్రహించుకోవటం … ఇలా చిన్న చిన్న చిట్కాలతోనే కథలో గొప్ప క్లుప్తత సాధించొచ్చు. వీటన్నింటికన్నా ముందు, క్లుప్తత కోసం ప్రయత్నించే కథకులు వదిలించుకోవాల్సిన దుర్గుణం ఒకటుంది. అది: పాఠకుల తెలివిపై చిన్నచూపు.

ఈ చివరిదానికి ఉదాహరణగా, ‘బ్రహ్మాండం’ అనువాదంలో అత్యుత్సాహంతో నేను చేసిన ఓ పొరపాటుని ప్రస్తావిస్తాను.

మూలకథలో చివరి వాక్యాలు ఇలా ఉంటాయి:

***

“So the whole universe,” you said, “it’s just…”

“An egg.” I answered. “Now it’s time for you to move on to your next life.”

And I sent you on your way.

***

ఆ వాక్యాలని క్రింది విధంగా తర్జుమా చేస్తే సరిపోయేది:

***

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద …”

“అండం” అని నీ భుజం తట్టి చెప్పాను. “ఇక నీ మరు జన్మకి సమయమయ్యింది.”

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

***

దానికి బదులు, నేను ఇలా తెనిగించ తెగించాను:

***

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం! ”

“ఉత్తి అండం కాదు. బ్రహ్మాండం. అది బద్దలవటానికింకా చాలా సమయముంది,” అని నీ భుజం తట్టి చెప్పాను. “ప్రస్తుతం నీ మరు జన్మకి సమయమయ్యింది.”

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

***

పైన రెండో వాక్యం రాసినప్పుడు పదాల పటాటోపం పైన మాత్రమే దృష్టి పెట్టి, ఓ లోపాన్ని పట్టించుకోకుండా వదిలేశాను. ‘బ్రహ్మాండం’ అనే పదం ఇక్కడ వాడాల్సిన అవసరం లేదు. అది కథ పేరులోనే ఉంది. మరో మారు నొక్కి వక్కాణించటం వల్ల అదనంగా వచ్చిపడ్డ విలువేం లేదు. “ఇలా ప్రత్యేకంగా గుర్తుచేయకపోతే – బ్రహ్మాండం అనే పేరుకి, ఈ కథకి ఉన్న సంబంధమేంటో కొందరు పాఠకులు తెలుసుకోలేకపోవచ్చేమో” అన్న అనుమానం నన్నలా రాసేలా చేసింది. మరోలా చెప్పాలంటే, పాఠకుల తెలివితేటలపై అపనమ్మకం! అరుదుగా జరిగినా, పొరపాటు పొరపాటే. ‘బ్రహ్మాండం’ అనే పదాన్ని కంటిన్యుటీ దెబ్బతినకుండా ఇరికించటం కోసం వాక్యాన్ని సాగదీయాల్సొచ్చింది. అలా ఈ కథలో ఓ పునరుక్తి దొర్లింది. ఆ మేరకి క్లుప్తత కుంటుపడింది.

‘అనవసరమైన పాండితీ ప్రదర్శనకి తెగబడకుండా ఉండటం’ అనేదానికి కూడా ఈ ‘బ్రహ్మాండం’ మూలకథ మంచి ఉదాహరణ. దాని గొప్పదనమంతా, ఉన్నతమైన భావాన్ని అతి సరళమైన రోజువారీ పదాలతో వివరించటంలో ఉంది. ఆ కారణంగా అనువాదంలోనూ తేలిక పదాలే దొర్లేలా జాగ్రత్త పడ్డాను. అందుకు బదులు – సందు దొరికింది కదాని గంభీర పద విన్యాసాలతో వీరంగమేసినట్లైతే మూలకథలో ఉన్న అందమంతా అనువాదంలోంచి ఆవిరైపోయుండేదని నా నమ్మకం.

ఈ విషయంపై ఇంకా రాసుకుంటూ పోవచ్చు కానీ, ‘క్లుప్తత’ అనే అంశమ్మీద కొండవీటి చాంతాడంత వ్యాసం చదవాల్సిరావటం కన్నా పెద్ద ఐరనీ ఉండదు. కాబట్టి దీన్ని ఇంతటితో చాలిద్దాం.

*****

(సారంగ, తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపు లలో ప్రచురితం-)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.