చాతకపక్షులు  (భాగం-5)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

అలవాటు లేని పని కావడంతో బాగా అలిసిపోయిందేమో ఇట్టే నిద్ర పట్టేసింది మంచంమీద వాలీ వాలగానే.  

తెల్లారి లేచి టైము చూస్తే ఏడు దాటింది. అయ్యో ఇంతసేపు పడుకున్నానా అనుకుంటూ లేచి మొహం కడుక్కుని వంటగదిలోకి వచ్చింది కాఫీ పెట్టడానికి. అక్కడి దృశ్యం చూసి తెల్లబోయింది. నిన్నరాత్రి తాను ఎలా వదిలేసిందో అలాగే వుంది మొత్తం సీను, ఎక్కడిగిన్నెలు అక్కడే వున్నాయి. 

“రాత్రి పని చూసుకుంటూంటే టైము తెలీలేదు. నాలుగు దాటిపోయింది. ఇప్పుడు లైబ్రరీకి వెళ్లాలి కొన్ని రిఫరెన్సులకోసం. వచ్చేక చూస్తాలే. నువ్వేం చెయ్యకు. అలా వుండనీ, నేను వచ్చేక చూస్తాను,” అంటూ హడావుడిగా బాత్రూంలోకి వెళ్లిపోయేడు హరి. 

గీత మాటాడుకుండా, కౌంటరుమీద గిన్నెలు జరిపి కాఫీ చెయ్యడానికి కాస్త చోటు చేసుకుంది. 

హరి బాత్రూంలోంచి వచ్చి గబగబా కాఫీ తాగేసి, మళ్లీ తనగదిలో కంప్యూటరుముందు కూచున్నాడు. మరోగంట తరవాత కారు తీసుకుని లైబ్రరీకి వెళ్లిపోయేడు, గీతని మరోసారి ఎట్టి సందర్భంలోనూ తలుపు తియ్యొద్దనీ, బయటికి వెళ్లొద్దనీ హెచ్చరించి.

ఆతను వెళ్లిపోయిన తరవాత, గీత కంచాలూ, గిన్నెలూ తొలిచి డిష్ వా‌షర్లో పడేసి, స్నానం చేసి, మరో కప్పు కాఫీ పుచ్చుకు కూచుంది. 

చుట్టూ కలయజూసింది ఓమారు. కాఫీబల్లమీద న్యూయార్క్ టైమ్సూ, ఎదురుగా టీవీ, కిటికీ తెరల్లోంచి ఛాయామాత్రంగా కనిపిస్తున్న బయటి ప్రపంచం – గదిలో భరించలేని నిశ్శబ్దం, ఒంటరితనం … మారీచ సుబాహుల్లా. …. దుఃఖం ఒక్కసారిగా ఉప్పెనలా ముంచుకొచ్చింది. గీత ఆపుకోడానికి ప్రయత్నించలేదు. మనసారా ఏడిచేసింది. పదినిముషాల తరవాత మనసు కుదుటపడింది. .

      ***

కాలం నత్తనడకలతో సాగుతోంది కానీ అంతూ పొంతూ లేకుండా ఆలోచనలు కందిరీగలపుట్టలా ముసురుకుని రొద పెడుతున్నాయి మనసులో. అమ్మా, తమ్ముళ్లూ, ఇరుగూ పొరుగూ చుట్టాలూ స్నేహితులూ, పదే పదే గుర్తుకొస్తున్నారు. సత్యం అయితే మరీను. కూడా కూడా వున్నట్టే వుంది ఏపని చేస్తున్నా. గుంటూరులో శివం మామయ్యగారూ, కనకమ్మత్తా, ఏసీకాలేజీ చదువూ, తొలివారంలోనే పరిచయం అయి ఆత్మీయురాలయిపోయిన సత్యం – 

ఎక్కడ్నుంచి ఎక్కడికొచ్చి పడ్డానూ అనుకుంటూ గతంలోకి జారిపోయింది గీత. …

ఏనాటిమాట! దశాబ్దం పైమాటే తను యస్సెల్సీ పరీక్ష రాసి. అప్పట్లో … …. 

స్కూల్ ఫైనలు ఫలితాలు వచ్చాయి. స్కూలంతా ఒకటే కోలాహలం. 

లిస్టు వేసిన బోర్డుదగ్గర తొడతొక్కిడిగా వుంది. ఫెయిలయినవాళ్లు ఏడుప్మొహాలతోనూ, వాటిని కప్పుపుచ్చుకుంటూ వెల్తిమొహాలతోనూ వీలయినంత వేగిరం అక్కడినుంచీ పారిపోడానికి ప్రయత్నిస్తున్నారు. పాసయినవాళ్లు పని గట్టుకుని వాళ్లని నిలేసి పలకరిస్తున్నారు. ఫెయిలవుతాం అని ఖచ్చితంగా తెలుసుకున్నవారు స్కూలికి రాలేదు. ఫెయిలవం అనుకుని అక్కడికి వచ్చి ఫెయిలయినట్టు తెలుసుకున్నవాళ్లు  “ఎక్కడో పొరపాటు జరిగింది” అనీ, “సప్లిమెంటరీలిస్టు వచ్చితీరుతుంద”నీ నొక్కి వక్కాణిస్తున్నారు. కనీసం పాసయినవాళ్లు పాసవలేదంటూ మరో లిస్టు వచ్చినా బాగుండునని ఆశిస్తున్నారు. అలా ఆశించనవసరం లేనివాళ్లు వీరిని తిలకించి వినోదిస్తున్నారు. 

మొత్తంమీద ఆ ప్రదేశం అంతా ఆహ్లాదంగా వుంది. చెదురుమదురుగా కన్నీళ్లు చిలుకుతున్నా. 

తరవాతేం చేస్తావన్న ప్రశ్న ప్రతి ఒక్కరి ఆశలూ, ఆశయాలూ, విధ్యుక్త ధర్మాలూ గగ్గోలుగా వినిపిస్తున్నాయి.

“కాలేజీలో చేర్తాను.”

“నేను బయాలజీ తీసుకుంటాను.”

“నాక్కూడా బయాలజీ తీసుకోవాలనుంది.” అన్నాడు వెంకన్న తప్పు చేస్తున్నవాడిలా తలొంచుకుని. 

“అయితే కాలేజీలో చేర్తావన్నమాట,”

ఓవార ఒకమ్మాయి మరొక అమ్మాయిని ఓదారుస్తోంది, “అయినా పాసయినవాళ్లందరూ తెలివైనవాళ్లూ, కష్టపడి చదివినవాళ్లేనేమిటి?” అంటూ. 

రెండో అమ్మాయి ఓదారకుండా వెక్కి వెక్కి ఏడుస్తోంది, 

“పరీక్ష పోయిందని వింటే మానాన్న డొక్క చీరేస్తాడు” అంటున్నారెవరో ఎవరితోనో. 

“… రెండు వందలు తీసుకున్నాడు,” ట్యూషను మేష్టరిని దీవించేడు కసి దీరా మరొక అబ్బాయి. 

“నా పేపరు వాచరే తీసుకుని బుచ్చిలక్ష్మికి ఇచ్చేడు. ఆ అమ్మాయి పాసయింది. నాది గోవింద కొట్టింది,”

“ప్చ్, అంతే మరి.”

రాజుగారి అబ్బాయి రంగారావు షోగ్గా బుచ్చిలక్ష్మి ముందు నిలబడి, “కార్లో వెళ్దాం రారాదూ?” అంటూ ఆహ్వానించేడు. 

ఆ అమ్మాయి “అక్కర్లేదు. నువ్వెళ్లు,” అంది మొహం చిట్లించి.

రంగారావు విలాసంగా వెన్ను విరుచుకు వెనుదిరిగాడు. 

“కారుందని గీర,” అంది మరో అమ్మాయి. 

“డొక్కు కారు” అంది బుచ్చిలక్ష్మి.

“డొక్కో డోలో … నీకూ నాకూ అదీ లేదు కదా” ఎడంగా నిలబడిన గుంపులోంచి వస్తున్న మాటలు వింటున్న మరో సుందరి అంది.

“మా అన్నయ్య టైపు నేర్చుకోమంటున్నాడు.”

“మా నాన్నగారు హిందీ పరీక్షలకి చదవమంటున్నారు.”

“నేను అమెరికా వెళ్తాను.” అన్నాడు రంగారావు. ఆ ప్రకటనతో అక్కడున్న పదిమందికళ్లూ అతనివేపు తిరిగేయి. 

అటువేపున్న ఓ పొట్టికుర్రాడు నవ్వేడు, “అవునౌను .పొద్దున్న బస్టాండులో చూసేను టిక్కెట్టు కొంటుంటే.” 

“ఎంతేమిటి టికెట్టు?” ఇంకోడు వంత పాడేడు.

“రూపాయిన్నర కాబోలు” మరో గొంతులో హేళన. 

రంగారావు పక్కనే వున్న వెంకటప్పయ్య అలా నిలబడగలిగినందుకు కించిత్ గర్విస్తూ అన్నాడు, “నవ్వకండొరే. వాడు నిజంగానే అమెరికా వెళ్తున్నాడు.”

చుట్టూ వున్నవాళ్లు తలో మాటా మళ్లీ … 

“వెళ్లి ఏం చేస్తావక్కడ?”

“అక్కడ చాలా బాగుంటుందిట కదా. కార్లూ, మేడలూ …”

“ఓహ్. ఇంద్రభోగమే అనుకో. ఏ పనికయినా సరే మిషన్లుంటాయి. మనుషులు శుభ్రంగా రాజకుమారుల్లా వుంటారు. ఇళ్లు ధగధగ మెరుస్తూ వుంటాయి. ప్రతివాడికీ ఒకటో రెండో కార్లు.”

“రెండు కార్లే?”

“ఇక్కడలా మేష్టర్లకి భయపడక్కర్లేదు తెలుసా! అక్కడ అందరూ సమానమే.”

“అక్కడ … అక్కడ …” కబుర్లతో, కోరికలతో, కలకలా, గలగలాగా ఆరోజు ఆ ఆవరణ దీపావళిలా వెలిగిపోయింది. ఆనాడు అక్కడ రంగారావుచుట్టూ వెలిగిన ప్రభలు చాలాకాలం అతని స్నేహితులు మరిచిపోలేదు. 

పరీక్ష పాసయినందుకు సరోజ అందర్నీ తనయింట్లో పార్టీకి రమ్మని ఆహ్వానించింది. సరోజ అంటే ఇష్టం లేనివాళ్లు సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు.  

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

7 thoughts on “చాతకపక్షులు నవల-5”

  1. నిజంగా 10th class result అంటే ఎంత కోలాహలంగా వుండేదో. తర్వాత ఏమి, ఎందుకు చదవాలో కూడా తెలియని అయోమయ యవ్వనారంభ రోజులు.. ఓసారి గుర్తుకు వచ్చాయి. చాలా బాగా సాగుతోంది కథనం❤️

  2. అప్పుడే అయిపోయిందా అనిపించింది, చాలా బావుంది

  3. మరీ కొంచెమే వేస్తున్నారబ్బా, ఇంకా చదవాలనిపిస్తుంటేనూ

    1. ఏ కథయినా ఇంకా కావాలనిపించినప్పుడు ఆపకపోతే పాఠకులకి ఇంకా అవదేమీ అని విసుగేస్తుంది. మీ ఆసక్తికి చాలా సంతోషం.

Leave a Reply

Your email address will not be published.