
లోచన …!!
-రామ్ పెరుమాండ్ల
కాలం పరిచే దారుల్లో వేసిన అడుగుల జాడలు భాష్పిభవిస్తున్నాయి.ఎడారిలో విరిసిన వెన్నెలలుచీకట్లను పులుముకున్నాయి.ఉష్ణపు దాడుల్లో దహనమైనఆశల అడవులన్నీచిగురించే మేఘాల కోసం తపిస్తున్నాయి . ఎక్కడో ఓ ఖాళీకడుపు అర్థనాధం చేస్తుంటే చెవుల్లో మోగే సంగీతపు స్వరాలు నిన్నటి కన్నీటి గాయాలకు మరుపుమందు రాస్తున్నాయి. జీవితం కూడా కాలపు వల కింద దాచిన గింజలకు ఎపుడో దరఖాస్తు చేసుకుంటది.మరిప్పుడు మరణవార్తమరణమంత మాట కాదు. నీకు గుర్తుండదు భీకరవర్షంలో తడిసి వణికినకుక్కపిల్లను తరిమేశావో,నీ మనసు వెంటిలేటర్లో కట్టిన పిచ్చుక గూడును విసిరేశావో ,ఏ పసివాని చిరునవ్వును కర్కశంగా నిలిపివేశావో గానీ నేడు మరణవార్త బోసిపోయింది. ఏదో ఒక క్షణాన నీలో నీవే మరెన్నిసార్లు మరణించావో తుదకు నీకు తెలియాల్సివుంది.
****

నా పేరు రామ్ పెరుమాండ్ల. మాది నాగర్ కర్నూల్ జిల్లా మాధారం గ్రామం. నేను ప్రయివేట్ టీచర్ గా పని చేస్తున్నాను. డి.యడ్, బి.యస్సి , బి. యడ్ చదివాను. నేను పదవ తరగతి నుంచి మా గురువు గారు పెన్నా శివ రామకృష్ణ శర్మ గారి ప్రొత్సహంతో మొదట నాటకాలు రాసేవాడిని ఆ తరువాత కవితలు ,కథలు రాస్తున్నాను . అందులో భాగంగానే 2019 సంవత్సరంలో “మరోకోణం”అనే కవిత సంపుటిని తీసుకొచ్చాను .అలాగే ఉరేనియం , తొండెం బొక్కెన ,వందేళ్ళ తెలంగాణ దళిత కథలు అనే పుస్తకాలలో కథలు రాసాను. నా మొట్ట మొదటి కథ “కన్నీటి కథ “2020లో నవ తెలంగాణ పత్రిక లో ప్రచురితమయ్యింది.సామాజిక అంశాలపై కవితలు ,కథలు రాస్తున్నాను .
