జ్ఞాపకాల ఊయలలో-9

-చాగంటి కృష్ణకుమారి

కల్లేపల్లి  హైస్కూల్  నేను అక్కడ చదువుకొన్న రోజులలో ఒక తాటాకు పాక.  కొంత మధ్య నున్న   భాగం పైన బంగాళా పెంకులుండేవి ఆభాగానికే గోడలూ గుమ్మం . అది హెడ్ మాస్ఠారుగారి గది, ఆఫీసు కలసి వున్న భాగం .  దానికిరువైపుల భాగాలూ తాటాకులతో నేసిన ఒక షేడ్ అన్నమాట .తరగతి గదులమధ్యన గోడలుండేవి కానీ వాటి చుట్టూతా సగం గోడ ఆపైన వెదురుతో  తయారైన కటకటాలు.గుమ్మాలు లేవు. హెడ్మాస్టారు గదికి ఇవతల 6.7. 8, తరగతులూ , అవతలవైపుకి 9,10,11 తరగతులనూ నిర్వహించేవారు. నేల మట్టి నేలే! నాకు ఒక చిన్న బెంచీ మీద కూర్చున్న జ్ఞాపకం వుంది  6వతరగతిలో రెండు చిన్న బెంచీలున్నగుర్తు. కానీ చిన్నాడు… అదే అతని చేతిలోంచీ నాకరియర్ గిన్నె  నేల బావిలోకి జారిపోయిందే .. అతనే..    పేరు.. చాగంటి వీరేశ లింగం .. అతనంటాడూ కిందమట్టిలోనే కూర్చున్నామంటాడు.అందరూ కిందనే మట్టిలోనే కూర్చునేవారటమరి ! 

కల్లేపల్లి లో నా స్నేహితురాలి పేరు  పార్వతి. అది ఒకసారి పారిజాతం పువ్వులు స్కూల్ కి తీసుకొచ్చింది. ఎంతబాగున్నాయో ! ఎంత సువాసనో! నేనంతవరకూ అటువంటి పువ్వులను చూడలేదు. అది పారిజాతం చెట్టనీ అది పూలను రాలుస్తుందనీ ఎంత బాగా వర్ణించి చెప్పిందంటే  నాకా చెట్టును చూడాలనిపించింది. స్కూల్ అయిపోయాకా రావే మాఇంటికి  పారిజాతం చెట్టును చూపిస్తానూ అంది. ఇంకేముంది , మరో ఆలోచనే లేకుండా పుస్తకాలసంచీ పట్టుకొని దానితో వెళ్ళిపోయా. మరుసటి రోజు ఆదివారం. ఆరోజు రాత్రి వారింటిలో  చింతపండును నీళ్ళల్లో పిసికి  తయారు చేసిన పచ్చి చారూ నీళ్ళలో వేసి వుంచిన అన్నం తిన్నాను . మర్నాడుదయం  అది నన్ను పారిజాతం చెట్టుదగ్గరికి  తీసికెళ్ళింది.  చాలావిశాలంగా వున్న ప్రదేశంలో  ఏఆటంకాలూ లేకుండా గుండ్రంగా కొమ్మలు  విస్తరించి వున్న చెట్టు. ఆచెట్టుకింద ఎంత సేపు ఆడుకొన్నామో చెప్పలేను. గౌను ఎత్తి బుట్టలా పట్టుకొని నాగౌనులో పూలు పడ్డా  యి చూడంటే నాగౌనులో కూడా పడ్డాయంటూ తెగ ఆనందపడిపోయాము. ఆరోజు అక్కడ వీచిన గాలే గాలి! ఆ అనందమే ఆనందము! అప్పటి  నా సహాధ్యాయి పార్వతి  కేరింతలు  రాలి పడుతున్న పారిజాతం పూలంత స్వచ్చమైన ధవళ రాగంలో  తీసిన రాగాలు కాదూ !  बहरो फूल बरसाओ मेरा महबूब आया है…… హసరత్ జయపూరిగారు  పాటను రాసి వుండవచ్చు గాక! శంకర్ జైకిషన్ గారు కట్టిన రాగానికి  మహమద్ రఫి గారు పాట పాడి వుండవచ్చుగాక !ఆనాటి  మాఇద్దరి కేరింతాల ముందు ఆపాట తీసికట్టుకాదూ! ఆచెట్టు కింద మా కేరింతల దృశ్యం ముందు సూరజ్ సినీమాలో హస్రత్ జయపూరీ గారి పాట దృశ్యీకరణ ఎందుకు పనికొ స్తుందీ! నటన ! నటన! నటన! అంతానటనే గా! నేను లెక్చరర్  ఉద్యోగం  వెలగబెట్టినఊర్లో ఒకావిడ కిరసనాయలు పోసుకొని అంటించుకొని  ఆత్మహత్య చేసుకొంది. నా కొలీగ్ “ “పెచ్చి మొద్దు! జీవితం సినిమాలో చూపించినట్టు వుటుందనుకొంది!” అంది!

 ఆతరువాత కాస్త పొద్దీఎక్కేసరికి  పార్వతి నన్ను చిట్టెమ్మ గారింటికి కూడా  తీసికెళ్ళింది . ఆమె మాఇద్దరికీ మరమరాలు పెట్టింది.  ఈ లోగా కందాళ పఠాభి మాస్టారు ఒక పాలికాపును పార్వతి ఇంటికి తీసికొచ్చారు . అతనితో నన్ను  లచ్చమ్మ పేటకు పంపారు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.