పడి లేచిన కెరటం – గంటి భానుమతి

   -పి.జ్యోతి

                     

తెలుగులో డిప్రెషన్ పై చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం, డిప్రెషన్ కేసులు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మహత్యలలో మనం చాలా ముందు వరసలో ఉన్నాం. సైకియాట్రిస్టుల కొరత మన దేశంలో చాలా ఉంది. అంతే కాదు వైద్యుల వద్దకు వచ్చే మానసిక రోగుల సంఖ్య అత్యల్పం. ఇక మానిక్ డిప్రెషన్ (OCD), స్కిజోఫ్రెనియా లాంటి జబ్బుల సంగతి తెలిసిన వారే బహు తక్కువ. మానసిక రోగులను పిచ్చివారుగా ముద్రవేసి వెలివేసే నేటి పరిస్థితులలో అది ఒక జబ్బు అని దానికి వైద్యం ఉందని వైద్యులను సంప్రదిస్తే ఇటువంటి రోగులు మామూలుగా జీవించే అవకాశాలున్నాయని మన దేశంలో బెంగుళూరులో NIMHANS లాంటి సంస్థలు వైద్య సేవలు మానసికరోగులకు అందిస్తున్నారని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇంగ్లీషులో Preethi Shenoy లాంటి వారు, ప్రయత్నం చేసారు. తెలుగులో మల్లారెడ్డి గారు తన ఆత్మకథను స్కిజొఫ్రెనియా తో తాను చెసిన పోరాటాన్ని ప్రచురించారు. అతి తక్కువ మంది రచయితలు సమస్యను ఇతివృత్తంగా తీసుకుని మంచి అధ్యయనంతో పుస్తకాలు తెలుగులో వ్రాసారు. అలాంటి సమయంలో వచ్చిన గంటి భానుమతి గారిపడి లేచిన కెరటంనవల డిప్రెషన్ పై చాలా ప్రశ్నలకు తెలుగు పాఠకులకు జవాబులు ఇవ్వగలిగిన రచన.

 

నవలలో శ్రుతి పాత్ర ద్వారా ఒక మానిక్ డిప్రెషన్ పేషంట్ పోరాటాన్ని భానుమతి గారు చూపే ప్రయత్నం చేసారుశ్రుతి మంచి తెలివైన విద్యార్ధి. మధ్యతరగతి కట్టుబాట్లతో పెరుగుతున్న సామాన్యమైన ఆడపిల్ల. తల్లి తండ్రులు ఆమె డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. ప్రెషర్ ఆమెపై ఎప్పుడూ ఉంటుంది. ఆమెను స్నేహితుల నుండి దూరం వుంచే ప్రయత్నం చేస్తారు. అలాంటి సమయంలో నే ఒక స్నేహితురాలి అన్న ఆమెను ప్రేమించడం,ఆమె తిరస్కరించిందనే బాధతో అతను తాగి బండి నడిపి ఆక్సిడెంట్ లో చనిపోవడంతో శ్రుతిలో భరించరాని గిల్ట్ బైలుదేరుతుంది. ఎమ్సెట్లో రాంక్ సాధించలేకపోవడం, తాను ఇష్టపడే స్నేహితునికి తాను రాసుకున్న ఉత్తరాలను తల్లితండ్రులు కాల్చివేయడం ఆమెలో ఎంతో మానసిక ఒత్తిడిని పెంచుతాయి, క్రమంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంది. ఆమె స్థితిని స్టడి చేసి తల్లి తండ్రులు ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళతారు

 

ముందు తీసుకెళ్ళిన వైద్యులు ఆమెకు సహాయం చేయలేరు. (మన దేశంలో ప్రతిభావంతులైన మానసిక వైద్యులను వెతకడం చాలా కష్టం) కాని ఆమె తండ్రి తన బుద్దికి పదును పెట్టి సరి అయిన వైద్యుని కోసం వెతికి ఆమెను ఆసుపత్రిలో చేరుస్తాడు. అక్కడ అమె ఎలా తనను తాను అర్ధం చేసుకుని డాక్టర్ల సహాయంతో బాగుపడి మెరుగైన జీవితం వైపు ప్రయాణం చేసిందన్నది కథ

ఈ నవలలో రచయిత్రి హోంవర్క్ కనిపిస్తుంది. డిప్రెషన్ పేషంట్ మూడ్స్, ఆత్మహత్య కోసం వారు పడే తాపత్రయం, తమకే తెలీయకుండా తమకు తాము చేసుకునే హాని, హింస, వారు పడే మానసిక వేదన అన్నీ తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయత వల్ల వాళ్లలో పెరిగే ఆత్మన్యూనతా భావం, అభద్రత, అసహాయత, అకారణ కోపం,వీటన్నిటిని శ్రుతి పాత్ర ద్వారా బాగా చూపించగలిగారు రచయిత్రి. మానసిన మైన సమస్యలతో ఉన్న వారికి చుట్టూ ఉన్న వారి సానుభూతి సహకారాలు చాలా అవసరం. కాని ఏ కాస్తా మానసిక సమస్య వచ్చినా అది పిచ్చి అని సైకియాట్రిస్ట్ అంటే పిచ్చివాళ్ళ డాక్టర్ అనే నానుడి నుంచి మనం బైటపడలేకపోతున్నాం. శరీరానికి జబ్బు చేసినట్లే, మనసుకు జబ్బు చేస్తుందని, సరైన సమయంలో సరైన మందులు వాడితే తగ్గిపోయే జబ్బులను నిర్లక్ష్యం చేసి, లోకం ఏం అనుకుంటుందో అని భయపడి, పిచ్చివాళ్ళమన్న ముద్ర వేస్తారని జడిసి డాక్టర్ల వద్దకు వెళ్ళని వారు ఎందరో. చాలా మందికి కాన్పులపుడు స్త్రీలలో ఒక ఐదు శాతం మందికి డిప్రెషన్ సహజమని, వారికి వైద్యం చేయిస్తే త్వరగా కోలుకుంటారన్న సంగతే తెలియదు. అలా నిర్లక్ష్యం చేసి నష్టపోయిన జీవితాలు ఎన్నో.

 

ఇన్ని అపోహల మధ్య పెరుగుతున్న డెప్రెషన్ కేసులు ఆత్మహత్యల మధ్య గంటీ భానుమతి గారు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ నవల తీసుకురావడం మెచ్చదగిన పరిణామం. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి,మారుతున్న మానవ సంబంధాల మధ్య, వేగవంతమవుతున్న జీవితాల నడుమ తీవ్రమైన ఒత్తిడిని భరిస్తూ మానసికంగా అలసిపోయి అనారోగ్యానికి గురవుతున్న వారందరిని సరయిన అవగాహనతో వైద్యంతో రక్షించుకోవచ్చు. ముఖ్యంగా మానసిక సమస్యలున్న వారిలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయి. దీనికి కారణం వారి పట్ల ఇతరులు ప్రదర్శించే నిర్లక్ష్యం, ఉదోసీనత, మరీ ముఖ్యంగా అవగాహన లోపం. అందుకే మానసిక సమస్యల పట్ల సహేతుకమైన చర్చ అవసరం. గంటి భానుమతి గారి పుస్తకం అటువంటి చర్చకు తెర తీసింది. 

 

అయితే మానసిక వైద్యం ఇప్పుడు సాధించిన ప్రగతి వారు చేసే ప్రయోగాల గురించి కూడా వైద్యపరమైన ఇంకొంత హోమ్ వర్క్ రచయిత్రి చేసి  ఉంటే బావుండేది అనిపించిందిఆత్మహత్యల పట్ల డాక్టర్ ఇచ్చే అనాలిసిస్ లో కొంత నిజం లోపించింది. మానసిక చికిత్సకులు ఆత్మహత్యను బలహీన, ఆలోచనలేని చర్యగా చూడరు. అది సహాయం కోసం అర్ధించే చర్యగా చూస్తారు కాబట్టే రోగులకు కనెక్ట్ కాగలుగుతారు. విషయంపై కొంత స్పష్టత తగ్గింది. ఒక్క పాయింట్ తప్ప నవలను సరళమైన భాషలో ఒక రోగి మానసిక స్థాయి నుండి ఊహించి ఎక్కువ సాతం నిజాయితితో రచయిత్రి రాయగలిగారు. దానికి వారిని అభినందించాలి. స్ట్రెస్ ఎక్కువ అయిన సందర్బాలో రోగిలో లక్షణాలు బైటపడతాయి. వీరికి వాడే మందులలో ఎక్కువగా వారిని నిద్రకు అలవాటు చేసే డ్రగ్స్ ఉంటాయి. ఇది డ్రగ్స్ కున్న సైడ్ ఎఫెక్ట్. దీని వలన చాలా మంది రోగులు మందులు వాడడానికి మొదట ఇష్టపడరు. వారిని మందులు ఆపకుండా చేయగలగడం ఒక పెద్ద పరీక్ష. ఇక్కడే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చాలా అవసరం అవుతాయి రోగికి. ఈ విషయాన్ని విపులంగా రచయిత్రి చర్చించిన విధానం బావుంది. 

 

మానసిక రోగుల సపోర్ట్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే వారు కోలుకునే అవకాశం తక్కువ. వారి చూట్టూ ఉన్న వారి భాద్యతతో కూడిన ప్రవర్తన వల్లే వీరు మామూలు స్థితికి రాగలుగుతారు. దీన్ని శ్రుతి తల్లి తండ్రుల పాత్రల ద్వారా రచయిత్రి చక్కగా చెప్పారు. డిప్రెషన్ ప్రేషంట్లు మందులు జీవితాంతం వాడవలసిన అవసరం కూడా చాలా సార్లు ఉంటుంది. సంగతీ వీరు స్పష్టంగా కన్వే చేయగలిగారు. డయాబిటిస్, బీపీ కి మందులు వాడటం జీవితాంతం తప్పదని తెలిసినా ఆ విషయాన్ని యధావిధిగా స్వీకరించగలిగే మనం, మానసిక రోగుల మందుల విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తాం. ఆంటీ డిప్రెసెంట్శ్ వాడడం అవమానం అని భావిస్తాం. ప్రపంచంలో మానసిక రోగుల పట్ళ ఉన్న ఈ చులకన భావమే వారిని సమాజం నుండి వేరు చేస్తుండి. మానసిక సమస్యలు బ్రెయిన్ లో కెమికల్ ఇంబాలెన్స్ కారణంగా వస్తాయి. ఇన్సులిన్ ఇంబాలెన్స్ లో డయాబిటీస్ వచ్చినట్లే ఇదీ జరుగుతుంది. సరైన డాక్టర్ పేషంట్ సరిగ్గా స్పందించే మందుని ముందు వెతికి పట్టుకోవాలి. దాని డోసేజిని సరి చూసుకోవాలి. ఇంత జరిగిన తరువాతే అది పేషంటు పై ప్రభావం చూపుతుంది. దీనికి రోగి తో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా అవసరం. ఇది తెలుసుకుంటే ఎంతో మందికి సహాయమ్ చేసిన వాళ్ళమవుతాం.

 

ఈ అవగాహన కోసం మానసిక సమస్య ల గురించి  తెలుగులో సాధారణ పాఠకుల సరళమైన భాషలో వచ్చిన మంచి రచన ఇది. ప్రస్తుతం ప్రపంచంలో పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య మనసిక రోగుల సంఖ్య గుర్తుకు తెచ్చుకుంటే రచయిత్రి ఈ నవల రాసి ఎంత మంచి సమాచారం ఇచ్చారో అర్ధం అవుతుంది. ఇంత సరళంగా మానసిక సమస్యల గురించి చర్చించిన మరో నవల తెలుగులో ఇప్పటికాదా రాలేదన్నది నిజం. దానికి గంటి భానుమతి గారిని మనస్పూర్తిగా అభినందించాలి.

Note – డిప్రెషన్ ఆత్మహత్యలకు దారి తీస్తుంది. డిప్రెషణ్ తో బాధ పడుతున్న వారికి, అవసరమైన సమాచారం ఇవ్వడానికి మానసిక చేయీత ఇవ్వడానికి పని చేసే వాలంటరీ సంస్థలు ఎన్నో… 

హైదరాబాద్ లో రోష్నీ సంస్థ కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు 040 66202000, 040 66202001

   

            (అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినోత్సవం సెప్టేంబర్ 10 సందర్భంగా)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.