“నిత్యకల్లోలం” ముదిగంటి సుజాతారెడ్డి పుస్తక సమీక్ష

   -అనురాధ నాదెళ్ల

సుజాతారెడ్డిగారి ఆత్మకథ ‘’ముసురు’’ మన నెచ్చెలి పాఠకులకు ఇంతకుముందు పరిచయం చేసాను. వారి నుంచి వచ్చిన ఐదవ కథల సంపుటి ఈ పుస్తకం. ఇది 2018 సంవత్సరంలో వచ్చింది.  

                            పుస్తక మకుటమే ఇప్పటి మన జీవితాల్లో కనిపిస్తున్న అశాంతిని, అల్లకల్లోలాన్ని స్ఫురింపజేస్తోంది. మనిషి జీవితమైనా, ఒక సమాజ గమనమైనా అభివృధ్ధి దిశగా సాగాలని, సాగుతుందని ఆశిస్తాము. మెరుగైన భవిష్యత్తు కోసమే పరుగులు తీస్తాం. కానీ ఇప్పటి ఆధునికత, శాస్త్ర సాంకేతికత తాలూకు నూతన ఆవిష్కరణలూ మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయో ఈ కథలు నిజాయితీగా చెబుతున్నాయి.  

మనం సాధించామనుకున్న గెలుపు, వృధ్ధి మనిషి జీవితంలో తెస్తున్న కల్లోలం చూసి నివ్వెరబోతాం. అయితే అభివృధ్ధి అంటే ఇలా ఉంటుందా? ఇన్ని జీవితాల్ని అల్లకల్లోలం చేసేది అభివృధ్ధి అవుతుందా అనే ప్రశ్న మనల్ని వెంటాడుతుంది.

                           ఈకథల్లో కనిపించే జీవితాలు మన మధ్యనే ఉండి, మన కంటికెదురుగా మసలుతున్నవే. వాస్తవ జీవన దృశ్యాలు! ఏ ఒక్క కథలోని అంశంతోనూ విభేదించలేము. అవాస్తవాలనలేము. 

సంపుటిలో ఇరవైరెండు కథలున్నాయి. కొన్ని కథలను చూద్దాం.

కుటుంబం కోసం అహర్నిశలూ కష్టపడి వయసు పైబడిన తరువాత పిల్లలకు భారంగా మిగిలిపోయి, జీవిత భాగస్వామిని కూడా కోల్పోయిన ఒక స్త్రీ, ఒక పురుషుడు రోజు గడిచే దారి లేక పట్నం దారి పడతారు. అక్కడ పనికోసం వెతుక్కుంటుంటే రాజకీయ సమావేశాలకి జనాన్ని సమీకరించే ఏజెంట్ ఎదురవుతాడు. సమావేశానికి వస్తే రోజుకూలి ఇచ్చి, భోజనం పెడతారని జనాన్ని లారీలలో తీసుకెళ్తాడు. తిండి, కూలి దొరుకుతోందన్న సంబరంతో వెళ్లి, సమావేశంలో జరిగిన తొక్కిసలాటకి నలిగి ఎందరో చనిపోతారు. ఆ శవాలను మీడియా కంట పడకుండా మాయం చేసిన పార్టీ కార్యకర్తలు, పోలీసులు సభ విజయవంతమైందని వార్తలు రాయిస్తారు పత్రికల్లో. భారతదేశంలోని ఇన్ని కోట్ల జనాభాలో ఈ మాయమైన మనుషుల లెక్కలు ఎవరికి కావాలి? ఇది మొదటి కథ ‘’లెక్కకెక్కని మనుషులు.’’

                              దొరల దగ్గర పనిచేస్తూ, అవసరాలకు వారి దగ్గరే అప్పుచేసి, తీర్చలేక తరతరాలు బానిస జీవితాలను వెళ్లదీస్తున్న బడుగు జీవితాలను గురించి కొన్ని కథలు చెబుతాయి. పని చేయించుకోవటమే కానీ పనివారి ఆకలిని కనిపెట్టి తీర్చగల పెద్ద మనసులు లేని దొరలు, దొరసానులను ‘’వలస’’, ‘’డబుల్ మర్డర్’’ కథల్లో చూస్తాము. 

’’ముట్టడి’’ కథలో సారాబట్టీలను ధ్వంసం చేసే ఎక్సైజు డిపార్ట్మెంటు, పోలీసుల    దౌర్జన్యం చూస్తాం. మద్యనిషేధం కాలంలో సారాబట్టీలు పెట్టి బతుకు లాక్కొచ్చిన మెగ్యా నాయక్ మద్యనిషేధం తీసివేసాక తన బట్టీలమీద జరిగే దాడులతో కుదేలవుతాడు. దీనికి కారణం పెద్దపెద్ద మద్యం కంపెనీల అధికారం, శక్తియుక్తులే అనే విషయం అతనికి తెలియదు. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకే సారాబట్టీల్ని ధ్వంసం చేస్తున్నామనే ప్రభుత్వాలు ఆ పెద్ద కంపెనీల వ్యాపారాలకు కొమ్ముకాస్తున్నాయన్నది అసలు వాస్తవం. మనం నిత్యం వార్తాపత్రికల్లో చూస్తున్న కథనాలే సాక్ష్యం. పేదవాడి బతుక్కి ఎలాటి భరోసా ఇవ్వలేని సంక్షేమ ప్రభుత్వాలు వ్యాపారవేత్తలకు లాభాల పంటను పండిస్తాయి. 

                              అనునిత్యం పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న ప్రజలకు విముక్తి లేదు. ప్రభుత్వం పెంచే డి. ఏ. కంటినీటి తుడుపే. ఒక పక్క బంద్ లు, ధర్నాలు, నిరాహారదీక్షలు, కరెంటు కోతలు, స్కాం లు, అవినీతిని అంతం చెయ్యాలంటూ చేసే ప్రదర్శనలూ, అన్నీ కూడా మధ్యతరగతి మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చెయ్యటానికే. కాస్తంత సుఖశాంతులను పొందే మార్గం ఎక్కడా కనిపించదన్నది ‘’ నిత్య కల్లోలం’’ కథ కళ్లకు కట్టినట్టు చెబుతుంది.

‘’దీనికి అంతం లేదా’’ కథ ఎంత పెద్ద చదువులు చదివినా ఆడపిల్ల పెళ్లికి కట్నమనే దురాచారం ఎలా అడ్డుపడుతోందో చెబుతుంది. ఇది నిత్యనూతనం మనకు. ‘’ఎక్కలేని మెట్లు’’ కథలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ఒక యువకుడు తనకంటే ఎన్నో మెట్లు పైనున్న అమ్మాయి పట్ల ఆకర్షితుడై, ఆమెను తాను అందుకోలేడన్న నిస్పృహతో ఆత్మహత్య చేసుకుంటాడు. కూలిడబ్బుతో కొడుకును చదివిస్తున్న తల్లి హృదయం ముక్కలవుతుంది. పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని చదువులు దేనికి?

                               ‘’ఆధునికత వైపు’’ కథలో కెరీర్ లో పైమెట్లు ఎక్కే దశలో ఏమేం పోగొట్టుకోవలసి వస్తుందో స్నేహితురాలి జీవనశైలిని ఒక్కరోజు చూసి అవగాహన కొస్తుంది కథలో నాయకి. జీవితాన్ని పణంగా పెట్టే అవసరం ఉందా అని ఆలోచనలో పడుతుంది. జీవితపు మాధుర్యాన్ని కెరీర పరుగుల్లో కోల్పోతున్నవారు అవగాహన చేసుకోవలసిన విషయం. 

‘’ఈ పెండ్లి నిలుస్తుందా?’’ కథలో ఉన్నతోద్యోగంలో ఉన్న భర్త అనుక్షణం కంప్యూటర్ ముందు బిజీ. భార్య విడాకులు అడుగుతుంది. నచ్చజెప్పబోయిన పెద్దలకు తను ఒక కంప్యూటర్ ని పెళ్లాడినట్టుందని, ఈ నిస్సార జీవితం వద్దని నిక్కచ్చిగా చెబుతుంది. ఇప్పటి సమాజం భుజాలు తడుముకోవలసిన స్థితి ఇది. ఇప్పటి తరానికి పెళ్లిళ్లు కావటంలేదనో, వయసు మీద పడేవరకూ కెరీరు వెంట పరుగులెడుతున్నారనో, పెళ్లిళ్లైనా వాటిని నిలుపుకోవాలన్న నిబధ్ధత లేకుండా ఎవరి జీవితాలు వారివిగా బతుకుతున్నారనో విమర్శించే పెద్దలు దీనికి తమ బాధ్యత ఎంతవరకు ఉందో ఆలోచించాలి. యువతరం కూడా జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పరచుకోవాలి. జీవితం అంటే కెరీరూ, డబ్బు సంపాదన, తమ ఇగోలను కాపాడుకోవటమే కాదన్నది అర్థం చేసుకోవలసి ఉంది. 

                          ఈ సంపుటిలో ఒక కథ పాఠకులను దుఃఖంతో మూగవాళ్లను చేస్తుంది. ‘’ఉన్మాదంలోకి’’ కథలో ఒక ఆధునిక జంట జీవితంలోకి చిన్న పాపాయి వస్తుంది. ఆ పాప బాధ్యత తల్లిగా కేవలం ఆమెది! అతను పాపవైపు చూసే ఆసక్తి, సమయం, ప్రేమ లేని తండ్రి. పైగా పాప పుట్టి మూణ్ణెల్లైంది కనుక భార్య తిరిగి ఉద్యోగంలో చేరాలన్న ఒత్తిడి. భార్య సంపాదన తనకంటే ఎక్కువని అసూయ. ఆమె ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ తట్టుకోలేని భర్త ఆమె సంపాదన తెచ్చే సుఖాలను మాత్రం ఆస్వాదిస్తాడు. ఇంటా, బయటా పని, పని! పాప పెంపకం! ఆఫీసులో ఒత్తిడి, ఇల్లు దాటితే ట్రాఫిక్ ఒత్తిడి ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్రమైన మానసికస్థితి వైపు నెడితే ఎవరిది తప్పు? ఆమెను బిడ్డను చంపుకునే హంతకురాలిగా చేసిందెవరు? ఎవరు నేరస్థులు? సమాజం ఆమెవైపు వేలు చూబిస్తుంది! ఇలాటి సన్నివేశం ఎవరమైనా మరచిపోగలమా? పెద్ద చదువులు చదివి, ఆర్థికంగా నిలబడిన అమ్మాయిలకు జీవితం ఏమిస్తోంది? 

కష్టమైనా నష్టమైనా భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులనుంచి కార్ల కంపెనీ వస్తోందని చెప్పి భూముల్ని బలవంతంగా అమ్మించిన పెద్దలు ఆనక తమ స్వంత లాభాలకి, వ్యాపారాలకి తగిన భూమిని సంపాదించామని సంతోషించారు. కార్లకంపెనీ కబురు ఉత్తదేనన్న నిజం అక్కడి ప్రజల జీవితాల మీద చావుదెబ్బ కొట్టింది. నిత్యం మనం చూస్తున్న రాజకీయ దృశ్యాలు కంటిముందుకు రాక మానవు ‘’వైరస్’’ కథ చదివినప్పుడు.

                               పెద్దపెద్ద వ్యాపార కంపెనీలు తమలో తాము పోటీలు పడుతూ, ఎదుటి వ్యాపారాన్ని అన్యాయంగానైనా దెబ్బతీసి తమ పబ్బం గడుపుకోవటం ‘’మార్కెట్ యుధ్ధం’’ కథ చెబుతుంది.

                               నిపుణులు విదేశాల బాట పట్టడాన్ని నిరసిస్తూ, అది హర్షించదగ్గది కాదనటం సరే, కానీ వారి ప్రతిభను గుర్తించి, భవిష్యత్తు పట్ల భరోసా ఇచ్చే పరిస్థితులేవి? అలాటివారికి స్వదేశంలో ఎదురయ్యే అవినీతి, రాజకీయాలు ఎలా ఉంటాయన్నది అద్దంపట్టి చూపిన కథలు ‘’బ్రెయిన్ డ్రెయిన్’’, ‘’సారీ తప్పలేదు.’’ 

అర్హతలుండీ అవకాశాలు లేక, తమ కలలను వాస్తవం చేసుకుందుకు తల్లిదండ్రుల్ని, మాతృభూమిని వదలలేక వదిలివెళ్లే పరిస్థితుల్ని మార్చే మంత్రదండమేదైనా ఉంటే బావుణ్ణు! వ్యవస్థ, రాజకీయాలు, ధనబలం మనుషుల్ని మనుషులుగా కాక సంపదని ఉత్పత్తి చేసే సాధనాలుగా మాత్రమే చూస్తున్న నేపథ్యాన్ని ఎవరు ప్రశ్నించగలరు? 

                                కొన్ని కథల్లో తెలంగాణా సాయుధపోరాటం కారణంగా దొరలు స్వంత ఊళ్లను వదిలి, పట్టణానికి వలస వెళ్లటం, అక్కడ నిలదొక్కుకోవటం చూస్తాం. వందల, వేలకొద్దీ ఎకరాల భూములు, బంగారం, విశాలమైన భవంతులు ఉండి, తమ అధికారం కింద అణిగిమణిగి సేవలు చేసే పనివాళ్లెందరున్నా దొరలకు డబ్బు మాత్రం అంతగా అందుబాటులో ఉండేది కాదు. పట్టణం చేరి, చిన్నచిన్న ఇళ్ళల్లో అద్దెకు ఉంటూ, జీవికకోసం కష్టపడి, కష్టానికి తగిన ఫలితాన్నిపొంది, క్రమంగా ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా పుంజుకుంటూ, పిల్లల్ని చదివించుకుని, సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకున్న దొరల కుటుంబాలను చూస్తాం. వారు వలస రావటం వల్లనే తాము మెరుగుపడ్డామనుకుంటారు.                               

ఉన్నత విద్యార్హతలు కలిగి, ఉపాధ్యాయ వృత్తిలో దశాబ్దాలు గడిపి, భర్త ఉద్యోగరీత్యా విదేశాల్లోని పరిస్థితుల్ని ఆకళింపు చేసుకున్న రచయిత్రి చుట్టూ జరుగుతున్న కల్లోలాన్ని చూస్తూ తన ఆవేదనని సాహిత్యరూపంలోకి తీసుకొచ్చారు. ఆమె ఆలోచనలు, దృక్పథం, తోటివారి సమస్యలపట్ల సహానుభూతి ఆమెను తనకెందుకులే అని ఊరుకోనివ్వ లేదు. తన పరిశీలనను ఆలోచనాపరులైన పాఠకులకు అందించారు. ఎలాటి అలంకారాలూ, హంగులూ లేని సరళమైన శైలి, స్థానిక భాష ఈ పుస్తకానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తెచ్చాయి. జీవితపు విలువలను ఆకళింపు చేసుకుని, ఆచరించవలసిన అవసరం అందరిదీ. ఒక సుహృద్భావ వాతావరణంలో శాంతిగా జీవించే పరిస్థితులకోసం మనమంతా ప్రయత్నించి, ఆ దిశగా అడుగులు వెయ్యాలి. 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.