యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-14

సీవార్డ్  డౌన్ టౌన్

రిసార్టు ఎంట్రైన్సు దగ్గర నుంచి డౌన్ టౌన్ కి షటీల్ సర్వీసు ఉండడంతో అక్కడి వరకు నడిచి అక్కడి నుంచి డౌన్ టౌన్ కి పది పదిహేను నిమిషాల్లో చేరుకున్నాం.

డౌన్ టౌన్ కి చేరుకున్న షటీల్ సర్వీసు సముద్రతీరంలో ఆగింది. అక్కణ్ణించి చూస్తే ఎత్తున కొండమీదికి అధిరోహిస్తున్నట్టు విశాలమైన రహదారి. ముందు చెప్పినట్టు సీవార్డ్ లోని ఈ డౌన్ టౌన్ మొత్తం ఒక్కప్పుడు గ్లేసియర్ అట. ఎత్తున కొండ మీద నుంచి సముద్రంలో కలిసేవరకు ఉన్న సహజ సిద్ధమైన ఈ రహదారే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 

ఓ పక్క ఊరించే సముద్రతీరం మరోపక్క స్థానికతని ఉత్సుకతతో కళ్ళకి కడుతున్న ఊరు. 

ఎప్పటిలాగే ముందు సముద్రతీరానికి పరుగుపెట్టడానికి వీల్లేకుండా సమయం కాళ్ళు కట్టిపడేసింది. 

సాయంత్రం ఎనిమిది దాటితే దుకాణాలు మూసేస్తారు కాబట్టి అటు నడిచేం. 

త్రోవ పొడవునా దుకాణాల్ని చూసుకుంటూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ నడకసాగించేం.  

ఎదురుగా అతిపెద్ద పర్వతాలు, వాటిమీద ముసుగుల్లా కప్పుకున్న మేఘాలు, పర్వత సానువులకు అప్పుడప్పుడే గోరింటాకు పెట్టినట్లు ముదురు ఆకు పచ్చని ఎత్తైన చెట్లు, పక్కనే లేతాకుపచ్చ గడ్డిభూములు, దడులనల్లుకున్న చిన్న గులాబీ రంగు పూలు… స్వర్గలోకమంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేటంత అందంగా ఉంది ఆ ఊరు. 

సీవార్డ్ అందమైనదే కాకుండా చరితాక ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ ఉన్న సహజసిద్ధమైన ప్రధాన ఓడరేవులో  పెద్ద పెద్ద ఓడల నుండి చిన్న చేపల పడవల వరకు నిలిచి ఉంటాయి. ఇక్కడి తీరం సాలమన్ చేపలకు ప్రసిద్ధి.  ఇక్కడినుండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకే కాక కెనడా, అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాలకు ఓడ రవాణా సౌకర్యం ఉంది. అంతేకాకుండా అలాస్కా లోని చారిత్రక రైల్వే లైనుకి దక్షిణ కొన సీవార్డ్. 

మేం మర్నాడు ఈ ఓడరేవు నించే రెండవ గ్లేసియర్ టూరుకి వెళ్లాల్సి ఉంది. 

ఇక డౌన్ టౌన్ లో ప్రసిద్ధి చెందిన బిగ్ ఫుట్ అనబడే అతిపెద్ద గాడ్జిలా వంటిది ఉన్న దుకాణానికి వెళ్లి ఫోటోలు తీసుకున్నాం. అమెరికాలో ఇటువంటి పెద్ద జంతువులు అక్కడక్కడా ఉంటాయని, వాటిని అక్కడా ఇక్కడా చూసాం అని కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉంటూ ఉంటాయి. అక్కడ ఏమీ కొనకుండా కేవలం ఫోటోలు తీసుకోవడం బాగోదని పిల్లల కోసం బొమ్మలు కొన్నాం. దుకాణాదారే స్వయంగా ముందుకొచ్చి రెండు మూడు ఫోజుల్లో మాకు ఫోటోలు తీసేడు. 

ఇంకాస్త ముందుకెళితే ఒక చోట దుకాణాలు ఉన్న పక్క గోడలన్నీ చక్కని పెద్ద పెద్ద వర్ణ చిత్రాలు గీసి ఉన్నాయి. 

అది  సీవార్డ్  ఆర్ట్ మ్యూజియం. అయితే అప్పటికే సమయం అయిపోవడం వల్ల మూసేసి ఉంది. కానీ చుట్టూ ఉన్న వర్ణ చిత్రాలు చూస్తూ, వాటిలో విశేషాలు గమనిస్తూ కాసేపు గడిపేము. 

దార్లో మాకు ఆ అలాస్కా  ప్రయాణంలో అక్కడక్కడా కనిపించిన మరో జంట ఎదురయ్యేరు. పరిచయంగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాం. వాళ్ళేదో భోజనం చెయ్యడానికి ఆగిపోయేరు. మేం ముందుకు వెళ్లి పిల్లలకి మరిన్ని బొమ్మలతో పాటూ ముప్ఫయి డాలర్లు పెట్టి ఊలూ (ULU) కత్తి ఒకటి కొన్నాం. ఊలూ కత్తి అలాస్కాలో మాత్రమే వాడే అర్థచంద్రాకారపు కత్తి. పైన అరచేతితో పట్టుకునే పిడి ఉండి కిందన కొయ్యడానికి చెక్క పలకతో బాటూ ఉంటుంది. ఇది ప్రధానంగా చేపలు కోసే కత్తి. ఇక్కడి వాళ్ళు అతి లాఘవంగా చేపల తోలు వలవడానికి కూడా ఈ కత్తి వాడతారు. మేం అలాస్కాలో ప్రతి దుకాణంలోనూ ఈ కత్తిని చూస్తూ వస్తున్నాం కానీ ఇక ఎలాగూ రెండురోజుల్లో వెనక్కి తిరిగి వెళ్ళేది ఉంది కాబట్టి అని ఇక అక్కడ మొత్తానికి కొన్నాం.   నేను ఊలూ కత్తి ఆకారంలో అలాస్కన్ జేడ్  లాకెట్టు, చెవులవి కూడా కొనుక్కున్నాను. అయితే ఈ కత్తి  ఆ తరవాత ఎయిర్ పోర్టులో పెద్ద కథగా మారింది. కత్తి కొనేటప్పుడు మేం అలాస్కాకి విమానంలో వచ్చామన్న విషయం ఇద్దరం మర్చిపోయేము. తిరిగి వెళ్ళేటపుడు సరిగ్గా  లైనులో ఎయిర్ పోర్టు చెకింగు లైనుకి వెళ్లే ముందు అక్కడ నిషేధిత వస్తువుల జాబితాలో ఊలూ కత్తి బొమ్మ చూసి నిశ్చేష్టులయ్యేం. అంటే చేత్తో పట్టుకెళ్ళే కేబిన్ బ్యాగేజీలో పట్టుకెళ్ళకూడదు. అసలు చిన్న నెయిల్ కట్టర్ ని కూడా అనుమతించని వాళ్ళు ఇంత కత్తిని పెట్టుకెళ్ళనిస్తారా మా పిచ్చి కాకపోతే. అంత ఇష్టపడి కొనుక్కున్న వస్తువుని అక్కడ పడెయ్యడం ఇష్టం లేక మొత్తానికి ఒక సూట్ కేసుని మరో ముప్ఫయి డాలర్లు పెట్టి చెకిన్ చేసేం. వెరసి దాని ఖరీదు అరవై డాలర్లు అయ్యింది. నిజానికి ఆన్ లైను లో కూడా అమ్ముతారు. లేదా అక్కడే కొనుక్కున్న చోట దుకాణంలో మరో పది డాలర్లు కడితే ఇంటికి పార్సిల్ పంపుతారు. ఇలా చేత్తో కొనుక్కుని తెచ్చుకోవడం వంటివి మాత్రం అస్సలు చెయ్యకూడదని అర్థం అయ్యింది. మొత్తానికి ఈ ప్రయాణంలో ఈ కత్తి ఒక కథ అయిపోయింది. 

సరిగ్గా గంట సేపు సీవార్డ్  డౌన్ టౌన్ లో మమ్మల్ని వెనక్కి రిసార్ట్ కి తీసుకెళ్లే బస్సు సమయం అవుతుండడంతో తిరిగి వెనక్కి సముద్రతీరానికి వచ్చాము. అక్కడే ఉన్న పార్కులో ట్రైల్ బ్లేజర్స్ అనే పేరుతో పెంపుడు కుక్కని చేత్తో పట్టుకుని, నడకదారిలో అలాస్కాలోని బంగారు గనులని వెతుక్కుంటూ బయలుదేరిన తొలితరం ప్రతినిధి విగ్రహం  దగ్గర ఫోటోలు తీసుకున్నాం. 1910 ప్రాంతంలో తొలి తరం గోల్డ్ రష్ అమెరికన్లు  సీవార్డ్  లో ఓడ దిగి అక్కడి నుండి ఇదితరోడ్ పుంత మార్గం  (Iditarod Trail) గుండా  సీవార్డ్ నుండి 958 మైళ్ళు ఉత్తరానికి బంగారు గనుల అన్వేషణలో నడిచి వెళ్ళేవాళ్ళట. ఈ తీరం నుండి మిలియన్ల కొద్దీ బంగారం, వ్యాపారం జరుగుతూ ఉండేదట. ఇలా బంగారం అన్వేషణ కోసం వచ్చిన వారి జీవనావసరాల కోసం కావాల్సిన తిండి, సౌకర్యాల వ్యాపారం బంగారాన్ని మించిన మరింత పెద్ద వ్యాపారం. వీటన్నింటికి ఆ రోజుల్లో సీవార్డ్ అతిపెద్ద కేంద్రమట. 

అక్కడి సముద్ర తీరం పెద్ద  పెద్ద రాళ్లతో, చెక్క ఫెన్సు తో దిగడానికి వీలులేదు. కానీ అత్యంత అందమైన ఆ సముద్ర తీరాన్ని వదిలి రావాలనిపించలేదు.  ఇక సరిగ్గా పది నిమిషాల్లో అక్కణ్ణించి బస్టాపుకి వచ్చే సరికి  సరిగ్గా అనుకున్న సమయానికి బస్సు వచ్చి అక్కడ వేచి ఉంది. 

****

(ఇంకా ఉంది)

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.