ప్రతిఫలం

-ఆదూరి హైమావతి 

  అనగా అనగా ఒక అడవిప్రాంతంలో ఒక వేపచెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుని నివసించేది. దానికి రెండుపిల్లలు . వాటికి బయటి నుండీ తిండి తెచ్చిపెడుతూ ఉండేది. కాస్త పెద్దవి అవుతుండగా , ‘అమ్మఒడి ప్రధమబడి’ కదా!అందుకని తనపిల్లలకు బుధ్ధి మాటలు చెప్పేది.

     “బలవంతులతో విరోధం పెట్టుకోకండి. మనస్థాయికి తగినవారితో స్నేహం చేయండి. మనకడుపు నింపే విత్తనాల మొక్కలపట్ల  కృతజ్ఞత తో ఉండండి. ఎవరికీ హానిచేయకండి. ఐకమత్యమే మహా బలం అని మరువకండి. కలసి మెలసి ఉండండి, మీరు తిన్న ఏ విత్తనాన్నైనా రెండు గింజలను వేరే  ప్రదేశంలో వదలండి.  అవి మొక్కలై మనజాతికేకాక , ఇంకా చాలా మన జాతి పిట్టలకు తిండి నిస్తాయి” ఇలా అనేక మంచి మాటలు చెప్పేది.

   పిల్లలు తల్లి మాటలను బాగా గుర్తుంచుకున్నాయి.  

   అవికాస్త పెద్దవి కాగానే తమ తిండి తామే సంపాదించుకుంటూ ఎగిరి వెళ్ళిపోయాయి .ఒక రోజున అవి తియ్యని వేప పండ్లు తింటూ అమ్మ మాట గుర్తు వచ్చి చెరో విత్తనాన్నీ పట్టుకుని వెళ్ళి దూరంగా వదిలాయి.   

             వానా కాలం వచ్చింది. ఆవిత్తనాలు మొక్కలుగా మొలిచి క్రమేపీ పెద్ద మొక్కలై , కాలక్రమాన  వేప మానులుగా పెరిగాయి. రెండు మొక్కలూ పక్క పక్కనే మొలవటాన రెండూ కలసి పెద్ద మానుగా కలసిపోయాయి. 

     ఒకరోజున వానాకాలాన రెండు పిచ్చుకలు వానలో తడిసి ఆవేప వృక్షాల క్రిందకు చేరి ,రెక్కలు ఆర్చుకుంటుండగా చూసిన వేపమాను ” పిచ్చుకలారా! మీజాతి తాత ముత్తాతలు విత్తనాలు వేసి మాకు జీవ మిచ్చాయి. మేము రెండు వృక్షాలమూ కలసి పెరగటాన మా కొమ్మలు రాచుకుని మధ్య ఒక చిన్న తొర్ర ఏర్పడింది.మీరా తొర్రలో నివాసం ఉండవచ్చు. మీ జాతి పిట్టల వలన  పెరిగిన మేము   మీకు నివాసం ఇవ్వడం మా  అదృష్టంగా భావిస్తాము.  ” అనిచెప్పగా వానలో తడిసి నివాసం లేని ఆరెండు పిచ్చుకలూ , వేప మానుకు ధన్యవాదాలు చెప్పు కుని, తమ తాతముత్తాతలు చేసిన మంచి పనికి వారికీ ధన్యవాదాలు చెప్పుకుని , వారిలాగే తామూ తప్పక అలా చేయాలని అనుకుంటూ   ఆ చెట్టు తోర్రలో నివాసం ఏర్పర్చుకుని హాయిగా జీవించాయి.

      అదన్నమాట పిల్లలూ! మనం ఎవరి వలననైనా సాయం పొంది నపుడు ,అమ్మచెప్పిన మాట గుర్తుంచుకున్న  ‘ఈ పిచ్చుకల్లా ,చిన్న సాయం చేస్తే తిరిగి అది మన జాతికి తప్పక ప్రతిఫలంగా అందు తుందని ‘మర్చిపోకండేం.    

      *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.