బతుకు చిత్రం-10

– రావుల కిరణ్మయి

మా అన్నలు లగ్గాని కన్న వత్తె బాగుండని పాణం కొట్టుకుంటాందే.నాయ్న ముంగట ఏదో వాళ్ళు వత్తేంది?రాకున్టేంది?అన్నట్టు ఉంటాన గని ,లోపల రావాలనే కాయిశు బాగున్నదే కోమలా !

అంతేగదెనే!ఆడపిల్లకు తోడబుట్టినోళ్ళు ఎంబడుంటే ఎయ్యేనుగుల బలముంటది.నువ్వే రంది వడకు.మా అన్న గా పొద్దు మీ పెద్దన్న ఏడో కల్సిండని చెప్పిండు.అటెన్కల ఉన్నడేమో!మల్లో పారి ఎవరి ద్వారానైన కనుక్కోమంట,గని నువ్వు ఇప్పుడపుడే మీ నాయ్నకు చెప్పకు అన్నది కోమల.

నేనేం జెప్పను గని,నువ్వైతే ఆ పనిలోనే ఉండే.నా లగ్గానికి ఆళ్ళు అచ్చుడే నాకు పెద్ద కట్నం ఇచ్చినట్టు.గంతే.అన్నది అన్నలు రావాలని బలంగా కోరుకుంటూ.

సరే!సరే ! ఇట్నే ముచ్చట వెడ్తాంటే,పని ఆగుతాంది.పా …పా ….ఇంక చాన పనున్నదని జాజులమ్మను ఏగిరపెట్టింది కోమల.

మళ్ళీ ఇద్దరూ పనిలో మునిగి పోయారు.

***

అక్కడొక కొత్త భవన నిర్మాణం పనులు జోరుగా జరుగుతున్నాయి.భవన నిర్మాణం చేయిస్తున్న మేస్త్రీ తన కింది వాళ్ళను పురమాయిస్తున్నాడు.తొందరగా మరో పది రోజుల్లో కలరింగ్ మాత్రమే మిగిలేటట్టు ఉండాలని.

పని మొదలు పెట్టినప్పటినుండి ఇదే తొందరను గమనిస్తున్న జాజులమ్మ పెద్దన్న ముత్యాలు,

ఏంది ? మేస్త్రీ ! ఇదేమన్న బొమ్మరిల్లా?ఆ ఇంటాయన ఎప్పుడచ్చినా,ఏగిర పెడ్తనే ఉంటడు.ఇప్పుడాయన ఇల్లు లేక సుతం లేదు కదా!ఎన్ని పైసలైనా కూలీలకు ఎక్కువిత్త గని, పని గానియమంటాండు.అంత ఎగిరమేమున్నది?అ పటేలుకు అడిగాడు అతనితో తనకున్న చనువు కొద్దీ.

ఏగిరమా?ఏగిరమా?ఏ అన్నకైనా ఇంత ఆపతి ఉంటదో,లేదో గని,ఈయనకైతే మహా ఆపతున్నది.ముగ్గురి తోడుత ఒక్కతే చెల్లెలు.ఆమె ను కాలికి మట్టంటకుంట పెంచుకున్నరు.ఇప్పుడా చెల్లె పెండ్లికి ఈ ఇల్లునే కానుక గా ఇద్ధామనుకున్టాండ్రు.వచ్చే నెలలోనే చెల్లె పెండ్లి.పెద్దన్న ఇల్లుగట్టి ఇత్తాండు.నడిపన్న నగలు మొత్తం పెట్టుకుంటాండు.చిన్నన్న ఒక్కడే కొద్దిల లేనోడు అయ్యేపటికే గంత గంత పెద్ద మొత్తాలు నేను పెట్టుకోలేనని తన పాలు కు వచ్చే ఆస్తిల కొంచెం రాసిత్తనన్నడట.ఎవలన్న గింత బాధ్యతగ ఉంటరా?అని వివరంగా చెప్పాడు.

ముత్యాలు లో అలజడి మొదలైంది.తోడబుట్టిన చెల్లెలు కోసం గింత తండ్లాట పడుతరా?అదీ, తల్లీదండ్రి ఉండంగా.ఎంత పావురం లేకుంటే ,ఇంత సోచాయించుతరు?మరి,నేను జాజులమ్మను గురించి  ఏమి ఆలోచిస్తున్న అని తనను తానే ప్రశ్నించుకుంటూనే  పని చేసుకోసాగాడు.

మేస్త్రీ ఇది గమనించి ,

ముత్యాలూ !ఓరి ముత్యాలూ ..!ఏందో సోచాయించుతున్నవేమిరా ?నీకో చెల్లెలున్నట్టు ?అన్నాడు నవ్వుతూ.

ఔ ..!మేస్త్రీ ..!నాకు ఓ చెల్లున్నది.చెల్లే గాదు ఇద్దరు తమ్ముళ్ళు సుతం ఉన్నరు.చెల్లె లగ్గానికున్నది.చేసే స్తోమత మా ముగ్గురికి లేక ఇంట్లకెళ్ళి,ఆ ఊర్లకెళ్ళి బైటికచ్చి ఎవలకు తోచిన పని వాళ్ళం చేసుకుంటున్నం.ఇంటి మొగాన ఓతె నలుగురు ఎదురువడి అడుగుతరని గూడ పోవుడు బందు వెట్టినం.చాతగాకుంటున్న మా నాయ్న ను జూసుకుంట మా చెల్లె ఆ ఇంట్ల ఈ ఇంట్ల పన్జేసుకుంట ఎల్లదీస్తాంది.ఇప్పుడు నువ్వు జెప్పిన ముచ్చట ఇన్నంక నా లోపల ఏదో పురుగు జేరి కెలుకుతున్నట్టు ఒకటే బాధయితాంది.అన్నాడు నిమ్మళంగా.

ఎంత పాపం రా ?తోడబుట్టిన దాని ఉసురు పోసుకుంటాండ్రు.ఇంటాడిబిడ్డ ఇలవేల్పసొంటిది.ఆమెను గోస వెడితే మీకే మంచిది గాదురా.మీలాంటోన్ని ఎవన్నన్న దెచ్చి చెయ్యుండ్రి.నా ఎరుకల నేను సుత సూసుకుంట ఉంట అన్నాడు.

ముత్యాలు సరే అన్నట్టుగా తలూపాడు.

***

ఆ రాత్రి ముత్యాలు,భార్య తో పని కాడ జరిగిన ముచ్చట గురించి చెప్పాడు.

చెప్పేటోళ్ళు చెప్తనే ఉంటరుగని,ఇనేటోళ్ళం మనకన్నుండాలే.

అంటే ..?ఏందే ?నువ్వనేది ?

అనేదేమున్నది ?నువ్వు చెప్పే ముచ్చట ఎంటికకు కొండను గట్టి గుంజుకచ్చుడసో0టిది.ఆడపిల్ల లగ్గమంటే అరవై ఏండ్ల కరువసో0టిది.

అట్లని లగ్గాలు చెయ్యకుండనే ఉంటాండ్రానే ?దునియాల లేనట్టు చెప్తవ్?అన్నాడు కొంచెం కోపంగా.

ఔ .!మల్ల ఆడపిల్లను కన్నతండ్రి చెయ్యకుండ అన్నలు చేత్తరని చకురం పిట్టోలె జూసుడు దునియాల ఏడన్నఉన్నదా ?చిల్లి గవ్వ సంపాయించకుంట నెత్తిల చేతులు వెట్టుకొని కూసోని మందిల కొడుకు లను బద్నాం జేసుడు గాకుంటె ?అన్నది ఒకింత ఆవేశంగా. 

అబ్బా ..!నీ లొల్లి ఆపు.ఆయన జేసిన సంపాదన అంత ఎవలు తిన్నరన్నది ఎన్కకు జూసుకుంటే మనకే అర్థమైతది.ఎంతైనా గురివిందగింజ తన ఈపున ఉన్న నలుపు ఎరుగక ఎర్రగున్ననని నానా తీర్ల షోకుల వడ్తదట.నీ యవ్వారం సుత గట్నే ఉన్నది.

అంటే ..?అన్నది ప్రశ్నార్థకంగా మొహం పెట్టి. 

అన్టేందే?నిన్ను లగ్గం జేసుకున్నప్పుడు మా అవ్వయ్యలు ఏమన్న పెట్టుపోతలడిగిండ్రా?మీవోళ్ళు గిన ఇచ్చిన్డ్రా?అంత అవ్వయ్యలే ఉన్నదో ,లేందో పెట్టి చేసుకునిరి.అప్పుడే చేతులెత్తి నా తోని గాదంటే ఏమ్జేత్తువే ?నీ లగ్గమయ్యేదా?మీ యన్న జేసెటోడా?

అయ్యో ఉండి,ఇయ్యక పొయినారయ్య ? నావోళ్ళను ఎత్తెయ్య వడితివి !అన్నది.

ఎత్తేసుడు గాదే !సచ్చెం జెప్తాన.తనదాకా వస్తే తప్ప ఎవలకైనా ఏం ఎరుక గాదని జెప్తాన.నేను నీకు దొరికినట్టే నా చెల్లె కు సుతం దొరికితే బాగుండంటాన.

సరే గని ,నువ్వొక్కనివే గాదు గదా!నీ కింద ఇద్దరున్నరు.వాళ్ళకు సుత సోయి ఉండాలె గదా!

మీ ముగ్గురు కల్సి చేత్తే చెయ్యంగ నేను కాదంటినా?అన్నది ఆఖరికి.

ఏదో ఓటి జేసి ఈ ఏడు మా చెల్లె కు లగ్గం జెయ్యాలె.రేపే మా తమ్ముళ్ళ కాడికి మత్లావ్ వంపుత అని నిమ్మలవడి నిద్ర పోయిండు ముత్యాలు.

***

సారయ్యా……సారయ్యా …..గుడిసె ముందు కూసోనే బాటెమ్మటి సైకిలు కు సద్ది గట్టుకొని పోతున్న సారయ్యను ఆగమన్నట్టు కేకేసిండు.ముత్యాలు.

కేకిని ,ఏందోనని ,పోయేటోడల్ల ఎన్కకచ్చిండు సారయ్య.

ముత్యాలన్నా !జర జల్ది జెప్పే.ఏగిరమున్నది .పనికి యాల్ల అయింది .ఏమాపతోనని ఆగిన.అన్నడు.

అవునే,ఆపతే…!మా తమ్ముడు అంజులు మీ తానకే పనికత్తాండాని ..?అడుగుదమని అన్నడే.

నిన్న మొన్న రెండొద్దులైతే రాలేదే,ఈ నడుమ పాణం బాగుంటలేదని సోపతి గాడు సెప్పిండు.

పోనీ …ఏడుండేదీ ఎరికేనా ?అన్నడు .

నాకెరుక లేదుగని, ఇయ్యాల ఆన్నే అడిగి జెప్త తియ్ !అని వెళ్ళిపోయాడు.

అంజులుగాడు కలువకున్నా,శివుడన్న కలుత్తడో సూడాలె .అనుకుంట పనికి బయల్దేరుతుంటే ,

భార్య అన్నది ,నేను సుత ఇయాల పనికత్తనయ్యా !అని .

ఎందుకే ?పాణం బాలేకుంటనే ఉంటివి.ఇంకో రెండొద్దులు పోనీ.అంటే ,

నాకేం గాలే .మంచిగనే ఉన్న.పని దొరికినప్పుడే చేసుకొని నీకు నేను సుత ఆసరయితే ,చెల్లె లగ్గం సుత జెల్ది జెయ్యచ్చు అన్నది. 

ఆమెలో ఆ మార్పును చూసి ఆశ్చర్యపోతున్న ముత్యాలుతో ,

ఆడబిడ్డను ఇన్నొద్దులు పట్టింపు చెయ్యపోతి.ఇంటి పెద్ద కోడలిగా నా పెత్తనం తోటి ఇప్పుడన్న లగ్గం జెయ్య అనుకున్టినయ్య అన్నది.

మారు మాట్లాడకుండా ముత్యాలు ,భార్యను సైకిల్ పై కూర్చో బెట్టుకొని పనికి బయలుదేరాడు.

***

 సారయ్య పనికి వచ్చిన అంజులు తో ముత్యాలు కలిసిన ముచ్చట జెప్పగా,

మా అన్నకు అమాస కోసారి పున్నానికోసారి నాతోని పనివడుతది.లేకుంటే ఇయ్యలేందుకు అడిగిండు అన్నాడు.

ఏమో !అదంత నాకెరుక లేదు గని ,చెప్పమంటవా?వద్దంటవా?అన్నడు.

ముందుగాల పనేందో కనుక్కో .అటెన్ చెప్పుడా ?వద్దా ?నేను జెప్తా !

సరే !కనుక్కుంట తీ .అని సారయ్య ఆ సాయంత్రం పని దగ్గర నుండి ఇంటికి వెళ్తూ ముత్యాలు ను కలిసిండు.

ముత్యాలన్నా !మీ తమ్ముడు పనికయితే అచ్చిండు గని ఇయ్యాల మాట్లాడనీకి కుదురలేదే.అర్జంటు ముచ్చటయితే చెప్పు నేనే ఎట్లనన్న  గల్సి మాట్లాడుతా !అన్నడు .నిమ్మళంగా విషయం కనుక్కోవాలని.

అర్జంటేనే !మా చెల్లె లగ్గం జెయ్యలనుకున్టానం.వాని చెవుల సుత ఓ మాటేసి వాడేమిత్తడో కనుక్కుందామని అన్నాడు .

అయ్యో ..!లగ్గం ముచ్చటానే?రేపు ఎట్లన్న మాట్లాడుత తియ్ .

మాట్లాడుడు గాదే !ఓ పారి మా గుడిసె కే రమ్మను.ఆన్ని చూడక సుతం చాన్నాళ్ళయింది.అన్నాడు .

సరే నని వెళ్తూ …సారయ్య మనసుల అనుకోవట్టిండు.ఒగన్న బాద్యత కోసం తండ్లాడుతుంటే మరో అన్న సార్థం తో సోచాయించ వట్టె.అన్ని తోబుట్టు బంధాలు కొసల్లేటివి గాదని  అనుకోని నవ్వుకున్నడు .

***

           చక్కురాలున్నట్టు  చక చక తిరిగేవు …………

           చందమామంటి ఇంతి ఓ చందురమ్మ …………

           చారడేసి కళ్ళు చక చక తిప్పేవు ……………….

           చందమామంటి ఇంతి ఓ చందురమ్మ ………….

           చామంతులు తెస్తి చాయ పసుపు తెస్తి ……….

           మోచేతుల్లవడ మట్టి గాజులు తెస్తి ……………

           మనువాడ రాదే ఇంతి ఓ చందురమ్మ ……….

          ……………………………………………………..

          …………………………………………………….

పాటను శివుడు గొంతెత్తి పాడుకుంట గుంటలు తీస్తాంటే అందరు మైమరిచి పోయి పని కానిస్తున్నారు. 

నడీడు కచ్చినా ఇంత సక్కంగ పాడుతున్నవంటే ఈడు మీదున్నప్పుడు ఇంకెట్ల పాడుతుంటివో గదా!అని కూలోళ్ళు సోపతిగాళ్ళు అంటుండగా ,శివుడు మురిసిపోబట్టిండు.ఇంతల్నే సారయ్య ..శివుని దగ్గరికచ్చి ..

శివుడూ …పైటాల్లయిన్దిగదా…!పని దిగపోయిండ్రా.అన్నడు.

వత్తానమే ..!పాట సంబురాన ఆకలి సుత మర్సినం,అని మిగతా కూళీలు కూడా వచ్చి సద్దులు విప్పసాగారు.

సారయ్య ,శివుడు వారికి కొంచెం దూరం లో కూర్చొని తినుకుంటూ ..

శివుడూ..!నిన్న అన్నను ఇచారించిన ఇషయమేందని.అంటే మా చెల్లె లగ్గం జెయ్యాలె గదెనే.నా తమ్ముళ్ళ గూడ కలుపుకొని సోచాయిన్చుదామనుకుంటాన.ముగ్గురి పొత్తుల ఓ ఇంటి దాన్ని చేస్తే మాకు ఇంత ఇంటాడిబిడ్డ ఋణం తీరి మా కాపురాలు సుత సల్లగుంటయ్.గదా !అని అనుకుంటాన అని అనుకచ్చిండని చెప్పిండు.

శివుడు ,అన్నం ముద్ద నోట్లో పెట్టుకునే కళ్ళలో నీళ్ళు తీస్కుని,

నా పాణం బాగుండక నేను తొక్కులాడవడితి.ఇప్పుడు రాయే ఎత్తలేకున్నట్టుంటి.కొండనేనెట్ల ఎత్త గలుగుత.అని బాధపడసాగాడు.

అదంతా తరువాత ముందు మీ అన్న తో నువ్వు ఈ సంగతయినా చెప్పుకోవాలె గదా!అందుకని నువ్వు నాతో వస్తే మంచిగుంటదేమో!అన్నాడు.

సరేనే !ఓ రెండొద్దులు పోయినంక వస్తనన్ననని చెప్పు.అన్నాడు శివుడు.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.