షర్మిలాం “తరంగం”

-షర్మిల కోనేరు 

యోలో you only live once “ ఉన్నది ఒక్కటే జీవితం “అనేదియువతరం ఇటీవల తరచూ ఉపయోగించే మాట.

నాణానికి రెండు ముఖాలున్నట్టు 

ఉన్న  ఒక్క జీవితాన్ని తమ ఇష్టానుసారంగా విచ్చలవిడిగాబతుకుతామనడం ఒకటి.

 ఉన్నది ఒకే జీవితం కాబట్టి అర్ధవంతంగా జీవించాలనుకోవడం రెండోది!

జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలంటే ఎన్నో దశలు దాటాలి.

బాల్యంలో తల్లితండ్రుల, తాతముత్తవల లాలనలో మాధుర్యం చవిచూస్తాం.

కొంచం పెద్దయ్యాకా స్నేహితులే ప్రపంచంగా కనిపిస్తారు.

ఈ దశలో కుటుంబం కన్నా ఫ్రెండ్స్ ముఖ్యం అనుకుంటాం.

ఈ టీనేజ్ లో పిల్లల పెంపకాన్ని కత్తి మీద సాము తో పోల్చవచ్చు.

వాళ్ళ మూడ్స్ ప్రకారం మనం నడుచుకోవాల్సి వస్తుంది.

ఫోన్ చాటింగ్ ల కోసం ఫోన్లు ఇవ్వమని డ్రగ్ ఎడిక్ట్ ల్లాగా తహ తహలాడతారు.

ఇవన్నీ తగ్గించుకోమంటే వాళ్ళను శతృవుల్లా చూడడం మొదలెడ్తారు. 

డ్రగ్స్ అంటే గుర్తొచ్చింది టీనేజ్ దాటి యుక్తవయసు వచ్చి స్వతంత్రంగాతిరగడం మొదలెట్టాకా మత్తుకు బానిసలవుతున్న యువతరం కూడాగతంతో పోలుస్తే ఎక్కువయ్యింది.

బడాబాబుల పిల్లలైతే డబ్బు కొదవ వుండదు.

కానీ వాళ్ళని చూసి వాతలు పెట్టుకునే మధ్య తరగతి పిల్లలుకుటుంబానికి నరకం చూపిస్తున్నారు.

నాకు తెలిసిన కుటుంబం గురించి చెప్తాను.

తండ్రి చనిపోతే తల్లి ఇద్దరు మగపిల్లలని. ఉన్న ఆస్తులు అమ్మి బ్యాంక్లో వేసుకుని ఆ వడ్డితో సాకుతోంది.

ఆ ఇద్దరు పిల్లలూ 19,21 ఏళ్ళవాళ్ళు . 

డిగ్రీ చదివే ఈ ఇద్దరు పిల్లలూ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు.

తల్లిని డబ్బులివ్వమని డిమాండ్ చెయ్యడం ఆమె ఇవ్వనని అంటేఇంట్లో వున్న పప్పులు నూనెలు పారబోసి బిభత్సం సృష్టించి డబ్బుతీసుకునే వారు.

తలుపులు వేసుకుంటే బద్దలు కొట్టడానికి కూడా వెనుకాడడం లేదట.

ఒక ఫంక్షన్ లో కనిపించి ఆ తల్లి ఇవన్నీ చెప్పి ఏడ్చింది.

ఏం చెయ్యాలో తెలియడం లేదని అంటే నాకూ పాలు పోలేదు.

చాలా కుటుంబాల్లో పిల్లలు మత్తు పదార్ధాలకి తాగుడికిబానిసలవుతున్నారు.

అందరూ అని కాదు గానీ 18 నుంచి  25 ఏళ్ళ కీలక  దశ సజావుగాదాటిన పిల్లలు వుంటే  అది ఆ తల్లితండ్రుల అదృష్టమని చెప్పాలి.

ఇక పెళ్ళి వయసు వచ్చినా చాలామంది ఒంటరి జీవితానికేఇష్టపడుతున్నారు.

పెళ్ళిళ్లు చేసుకున్న వాళ్ళు కొందరైతే చిన్నచిన్న కారణాలకే విడాకులవరకూ వెళ్తున్నారు.

కొన్ని జంటలు పిల్లల్ని కనబోమని చెప్పేస్తున్నారు.

చెప్పానుగా నాణానికి ఒక వైపు కధలు ఇవి.

నాణానికి రెండో వైపు పిల్లలు బుద్ధిగా చదువుకుని ఒక ఉద్యోగంసంపాదించి, పెళ్ళి చేసుకుని సాఫీగా జీవితాన్ని సాగిస్తారు.

మన దేశంలో కొత్తగా కనిపిస్తున్న ఈ ధోరణులు కలవరపెడుతున్నాయికానీ కొంత కాలానికి అలవాటవుతాయి.

షారుఖ్ ఖాన్ తన కొడుకును ” డ్రగ్స్ ,అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యి ! నేను ఎలాగూ ఆ జీవితాన్ని అనుభవించలేదు ” అని చెప్పిన వీడియోఒకటి వైరల్  

అవుతోంది. 

ఒక సెలిబ్రిటీ నోటి నుంచి సరదాగా వచ్చినా ఆ మాట రేపు నిజంఅవ్వొచ్చు.

మిగతా జనం అవేమీ తప్పుకాదన్న ధోరణికి అలవాటు పడొచ్చు.

ఉన్న ఒక్క జీవితాన్ని వాళ్ళకు నచ్చినట్టు బతకడమా లేక అర్ధవంతంగాబతకడమా అనేది వారి విజ్ఞత.

మనం కోరుకున్న విధంగా పిల్లలు తయారవ్వరు.

వారికీ ఒక మెదడు వుంది.

వారికి యుక్తాయుక్త విచక్షణతో అలోచించగలగడం నేర్పాలి.

మన వాళ్ళు సామెతల్లో అన్నీ పొందుపరిచారు.

” మొక్కై వంగనిది మానై వంగునా “ అన్నట్టు పసితనం నుంచిమొక్కదశ నుంచే పిల్లలికి అర్ధవంతంగా బతకడం నేర్పాలి!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.