అనుసృజన

ధ్రువస్వామిని

హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్

అనువాదం: ఆర్. శాంత సుందరి

‘ధ్రువస్వామిని’ నాటకకర్త జయశంకర్ ప్రసాద్ హిందీ సాహిత్య రంగంలో సుప్రసిద్ధ సాహితీవేత్త. ఈ నాటకంలోని ఇతివృత్తం గుప్తుల కాలానికి సంబంధించినది. పరిశోధకులు చారిత్రాత్మకంగా కూడా ఇది ప్రామాణికమైనది అని భావిస్తారు.ఈ నాటకం ప్రాచీన చరిత్రలో జరిగిన సంఘటనల్లో వర్తమాన సమస్యని మన ముందుంచుతుంది. చరిత్రని నాటకంగా రూపొందించి రచయిత శాశ్వత మానవ జీవితపు స్వరూపాన్ని చూపించాడు.సమస్యలకి పరిష్కారాలు సూచించాడు.జాతీయ భావాలతో బాటు విశ్వప్రేమ అనే సందేశాన్ని కూడా అందించాడు. ధ్రువస్వామిని చాలా బలమైన పాత్రగా మన ముందుకొస్తుంది. రంగస్థలం దృష్ట్యా కూడా మూడు అంకాలున్న ఈ నాటకం ప్రసాద్ రాసిన నాటకాలన్నిటిలోనూ గొప్పది. పాత్రల సంఖ్య తక్కువ.సంభాషణలు కూడా చిన్న చిన్నవి.ఈ నాటకంలో రచయిత చరిత్రలో నుంచి ఆధునిక సమాజంలో స్త్రీ స్థితి, పురుషుడికి లొంగి ఉండటం, కనపడని సంకెళ్ళు ఆమెని బంధించి ఉండటం , వాటినుంచి ఆమె కోరుకునే విముక్తి లాంటి సమస్యలనీ, కొన్ని పరిస్థితుల్లో ఆమెకి పునర్వివాహమనే వెసులుబాటు కలిగించటం లాంటి సమస్యలని తీసుకొని చాలా ధైర్యంగా, ఎక్కడా హద్దు మీరకుండా,ఆలోచనా, తర్కం ఉపయోగించి పరిష్కారాలు సూచించాడు.
 
మొదటి అంకం:
(శిబిరం వెనక భాగం.దాని వెనుక పర్వతాలు ప్రహరీ గోడలా కనిపిస్తున్నాయి.శిబిరంలో ఒక మూల కనిపిస్తూ ఉంటుంది.దానిమీద షామియానా వేసి ఉంది.స్తంభాలకి మందమైన పట్టుతాళ్ళతో జరీ పరదాలు కట్టిఉన్నాయి.రెండు మూడు అందమైన వేదికలు అమర్చి ఉన్నాయి.శిబిరానికీ, పర్వతాలకీ మధ్య చిన్న ఉద్యానవనం ఉంది.పర్వతాల్లోంచి ప్రవహించే సన్నటి నీటి ధార ఆ పచ్చని తోటలో నుంచి పారుతోంది.ఆ జలపాతం దగ్గర శిలలమీద అల్లుకున్న పూల తీగలు గాలికి కదులుతున్నాయి.నాలుగైదు చిన్న చెట్లు, వాటిమీద పాకిన తెల్లగులాబీ కొమ్మలనిండా పువ్వులు పూసి అక్కడ ఒక చిన్న పొదరింటిని సృష్టించాయి.శిబిరం ఒక పక్కనుంచి ధ్రువస్వామిని ప్రవేశిస్తుంది.ఆమె వెనకాలే పొడవాటి ఒక అనాకారి స్త్రీ చేతిలో కత్తి పట్టుకుని వస్తుంది.)
ధ్రువస్వామిని ః (ఎదురుగా ఉన్న పర్వతాల కేసి చూసి) నిలువెత్తుగా , తన గొప్పతనాన్ని, కఠోరత్వాన్ని ప్రదర్శిస్తూ ఆకాశాన్ని ఛేదిస్తున్నట్టుంది ఆ శిఖరం! ఇక ఈ తుచ్ఛమైన ,కోమలమైన లతలూ, మొక్కలూ దాని పాదాలవద్ద పొర్ల వలసిందే గా?( పక్కన ఉన్న స్త్రీ వైపు చూసి )మందాకిని రాలేదేం?( ఆమె సమాధానం చెప్పదు) మాట్లాడవేం?ఈ రాజాంతఃపురంలో నిశ్శబ్దమైన అవమానం నాకోసం ఎప్పట్నుంచో దాచిఉంచారని నాకు తెలుసు.నేను వచ్చినప్పట్నుంచీ దాన్ని అనుభవిస్తూనే ఉన్నాను.కానీ నీలాంటి దాసీలు కూడా నన్ను అదే విధంగా అవమానిస్తారా? ఆ పర్వతాలలా అలా మౌనంగా ఉన్నట్టు నటించకు, మాట్లాడు!(ఆమె పళ్ళు బైట పెట్టి వినయంగా ముందుకు నడవమన్నటు సైగ చేస్తుంది)అరే, ఇదేమిటి విధాత నా నొసట ఏమి రాశాడో! ఇదేం ఇంద్రజాలం భగవంతుడా! ఆ రోజు రాజపురోహితుడు వివాహసమయంలో నన్ను దీవించాడు, అది దీవెన కాదా, శాపమా?ఈ అంతఃపురంలో అందరూ నాదగ్గర ఏదో రహస్యం దాస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారేమిటి?మాట్లాడినా మరుక్షణం మౌనంగా ఉండిపోతారు.(కత్తిపట్తుకున్న స్త్రీ తను అసహాయురాలైనట్టు, భయపడుతున్నట్తు మొహం పెట్టి ముందుకి నడవమని మళ్ళీ సైగ చేస్తుంది)అయితే నువ్వు మూగదానివా?నువ్వు ఏమీ మాట్లాడలేవనీ, నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేవనీ నిన్ను నా దాసిగా నియమించారా? ఇది చాలా ఘోరం!ఈ రాజవంశంలో ఒక్కరు కూడా సంపూర్ణమైన మనిషిలా కనిపించలేదేమిటి?ఎక్కడ చూసినా గూనివాళ్ళూ, మరుగుజ్జులూ, కొజ్జాలూ,మూగా,చెవిటివాళ్ళేనా? ( విసుక్కుంటూ ధ్రువస్వామిని ముందుకి నడిచి జలపాతం ఒడ్డున కూర్చుంటుంది.ఖడ్గధారిణి అటూ ఇటూ చూసి ధ్రువస్వామిని కాళ్ళదగ్గర కూర్చుంటుంది)
 
ఖడ్గధారిణి ః (అటూ ఇటూ అనుమానంగా చూస్తూ) దేవీ, అన్ని చోట్లూ,సమయాలూ మాట్లాడేందుకు అనువుగా ఉండవు. అప్పుడప్పుడు మౌనంగా ఉండటం తప్పేమీ కాదు.నేను ఎంతైనా మీ దాసిని. ఏదైనా అడ్డంకి కనిపించినప్పుడు నేను మూగదానిలా మారిపోతాను.ఎవరికీ నా మీద అనుమానం రాకుండా ఉండాలంటే నేనలాగే ప్రవర్తించవలసి వస్తుంది.
ధ్రువస్వామిని ః ఓ,అలాగైతే నువ్వు మాట్లాడగలవన్నమాట ! కానీ ఇలాంటి కపట నాటకం ఎందుకో కాస్త చెప్పు?
ఖడ్గధారిణి ః బాధలో ఉన్న ఒకరి కోరిక తెలియజేసేందుకు. చంద్రగుప్తుడు మీకు గుర్తుండే ఉంటారు కదా?
ధ్రువస్వామిని ః (కుతూహలంగా) నన్ను బంధించి తెచ్చేందుకు వచ్చారు, ఆయనే కదా?
ఖడ్గధారిణి ః (పళ్ళతో నాలుక నొక్కి) ఏమంటున్నారమ్మా? ఆయనకు తన భయంకరమైన భవిష్యత్తు గురించి ఏమీ తెలీదు .ప్రతిక్షణం ఆయన ప్రాణాలకు ఆపదే. నేను చేసిన నేరమేమిటని ఆయన అడుగుతున్నారు.
ధ్రువస్వామిని ః ( విరక్తిగా నవ్వుతూ) ఆ నేరమేమిటో నాకేం తెలుసు? అయితే రాజకుమారుడు కూడా బందీ అయాడా?
ఖడ్గధారిణి ః అలాగే అనుకోండి దేవీ ! మహారాజుగారికి చెప్పి మీరు ఆయనకి ఏమైనా సహాయం చెయ్యగలరా?
ధ్రువస్వామిని ః నేనేం చెప్పగలను? నా ప్రాణం విలువే నాకు తెలీదు .నా మీద రాజు గారికి ఎంత అనుగ్రహం ఉందో కూడా ఈనాటివరకూ తెలుసుకోలేకపోయాను.ఆయన నాతో మాట్లాడిందీ లేదు.విలాసినులతో ఎప్పుడూ మధువు మత్తులో ఉండే ఆయనకి తన సుఖాలనుంచి తీరిక లభిస్తే కదా?
ఖడ్గధారిణి ః అలాగయితే రాజకుమారుడికి ఆ విధాతే సహాయం చెయ్యాలి.తండ్రి తనకిచ్చిన అధికారాన్నీ, రాజ్యాన్నీ ఆయన వదిలేశారు; దానితో బాటు తనకి దొరికిన ఒక అమూల్యమైన నిధిని కూడా…(అంటూ హఠాత్తుగా ఆగిపోతుంది)
ధ్రువస్వామిని ః అమూల్యమైన నిధి? అదేమిటి?
ఖడ్గధారిణి ః అది పరమ రహస్యం దేవీ.నా ప్రాణం కాపాడతానని మాటిస్తే చెపుతాను.
ధ్రువస్వామిని ః (ఏదో ఆలోచించి) అయితే పోనివ్వు.ఈ రహస్యాలని చూస్తే ఇప్పటికే నాకు చాలా భయంగా ఉంటోంది.ఆయన్ని నేను చూశాను.మేఘాలు లేని ఆకాశంలో ప్రాచీ దిశలో ఉదయించే బాల సూర్యుడిలా ఉన్నారు! రాజ్యచక్రం అందరినీ మట్టగిస్తుంది .మాలాంటి అసహాయులనీ, బలహీనులనీ వాటికింద నలిగిపోనీ!
ఖడ్గధారిణి ః దేవీ,జలపాతం దగ్గర గుట్ట మీదికి ఆ లత ఎలా పాకిందో చూడండి.దాని చిన్న చిన్న ఆకులని చూస్తే అది ఏ జాతికి చెందిందో మీకు తెలిసిపోతుంది.తనలోని సామర్థ్యాన్ని పెంచుకుంటే అది పాచిగా మారి నడిచేవారిని జారిపడేట్టు చెయ్యగల ఆ చిన్ని మొక్క ఇప్పుడు ఇతరులకు పైకెక్కేందుకు సాయం చేసే ఆలంబన గా మారింది.
ధ్రువస్వామిని ః ( ఆకాశం వైపు చూసి) అలా జరగటం చాలా కష్టం.అబ్బ, ఎంత కఠినత్వం! మనిషి హృదయంలోనుంచి దైవాన్ని తొలగించి రాక్షసుడు ఎలా దూరగలిగాడు చెప్మా? రాజకుమారుడి స్నిగ్ధ సౌందర్య మూర్తి చూస్తే , ఆయన అమాయకత్వానికి ఎవరైనా ఆయన్ని ప్రేమించక మానరు. కానీ ఆయన అన్నగారే…ఎంత ఆశ్చర్యం!
ఖడ్గధారిణి ః ఆయన్ని ఎవరో ఒకరు విశ్వాసంతో జ్ఞాపకం చేసుకుంటున్నారన్న విషయమే రాజకుమారులవారికి సంతృప్తి కలగజేస్తుంది.ఇక ఉన్నతి సాధించటమంటారా, ఆయనకి తన భుకశక్తి మీదా, అదృష్టం మీదా ఉన్న నమ్మకం చాలు.
ధ్రువస్వామిని ః కానీ తన పరిస్థితి మరింత దారుణంగా మారే పనేదీ ఆయన చెయ్యకూడదు.
( ఖడ్గధారిణి లేచి నిలబడుతుంది)
సరే నువ్విక వెళ్ళు. మరో దాసికి సైగ ద్వారా నేను పిలుస్తున్నానని చెప్పి ఇక్కడికి పంపించు.నాకింకా కొంతసేపు ఇక్కడే కూర్చోవాలని ఉంది.
(ఖడ్గధారిణి నమస్కరించి వెళ్ళిపోతుంది-మరో దాసీ ప్రవేశిస్తుంది)
దాసీ ః (చేతులు జోడించి) దేవీ సాయంకాలమైంది.చెట్లూ చేమలూ నిద్రకి ఉపక్రమించాయి.చూశారా, ఆకాశంలో విహరించే పక్షి సమూహాలు కోలాహలంగా అరుస్తూ తమ గూళ్ళవైపు ఎగురుతున్నాయి.ఇంకా మీకు అంతఃపురం లోకి వెళ్ళాలని లేదా?
ధ్రువస్వామిని ః ఎందుకు వెళ్ళను? కానీ నా గూడెక్కడుంది? ఇది బంగారు పంజరం కదా!
(దీనంగా లేచి దాసీ భుజం మీద చెయ్యి వేసి బయలుదేరటానికి కదులుతుంది.నేపథ్యంలో కోలాహలం-మహాదేవి ఎక్కడ? ఆమెను పిలుచుకు రావటానికి ఎవరు వెళ్ళారు?)
ధ్రువస్వామిని ః ఆఁ, ఏమిటీ అలజడి? ఈ తొందరపాటు దేనికి?
కాపలా స్త్రీ ః ః (ప్రవేశించి…కంగారుగా) మహాదేవీ ! మన్నించండి. యుద్ధానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని మహారాజుగారికి అందించాలని వారిని వెతుక్కుంటూ ఇటు వచ్చాను.
ధ్రువస్వామిని ః (వ్యంగ్యంగా నవ్వుతూ) నా పయ్యెదలో ఏమీ దాక్కుని లేరు, ఏ ఉద్యానవనంలోనో ఉంటారు, వెళ్ళి అక్కడ వెతుకు.ఇక్కడ లేరు.
( ధ్రువస్వామిని విచారంగా దాసీ వెంట నిష్క్రమిస్తుంది.మరోవైపునుంచి ఖడ్గధారిణి ప్రవేశిస్తుంది.పొదరింట్లోంచి తన ఉత్తరీయాన్ని సర్దుకుంటూ రామగుప్తుడు బైటికి వచ్చి , కాపలా స్త్రీకేసీ,ఖడ్గధారిణికేసీ చూస్తాడు)
(ఇంకా ఉంది)

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.