గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే (కథ)

-ఎండపల్లి భారతి

”మేయ్ ఇంటికోమనిసిని  బండమీదకు రమ్మన్నారు జాతర గురించి మాట్లాడాలంట నేను పోతాండ” అనేసి నిదర మొగాన నీల్లు సల్లు కొన్ని తువ్వాలి గుడ్డ బుజానేసుకుని  పన్లన్నీ నా మీద సూపడ ఏసి ఎలిపాయ నా మొగుడు  ! అత్త చెప్పిన పని చేయాలని ఇసురురాయి కాలి మింద తోసుకొని కుసున్నంట వొగాయమ్మ. అట్లా ఈ గంగజాతర  అయిపోయినంతవరకు ఇంట్లోపనులు బయటి  పనులు ఒగొటి గూడా జేయకుండా తప్పించుకుంటాడు నా మొగుడు .
 
                      పని చేసుకుంటుండా . ఇంతలో  ఏమో పానం  మీద పడినట్లు చీరకట్టు సెరుగు  కిందనుంచి  తీసి నడుములో చెక్కోని , చెయులు ఇసరతా  పెద్దపొంత  వచ్చినట్లు వచ్చింది మా ఈరపెద్దమ్మ. ఆయమ్మది ఎగదాల ఇల్లు .ఆయమ్మకు ముందు నుంచి ఒక అలవాటు ఊర్లో ఏం జరిగినా మాకు మేయిచ్ఛను వస్తుంది.ఆ యమ్మ ముందే బెంజిది. ఆయమ్మ వాలకం అట్లుంటుంది.ఎంత అనగదుగినా ఆ యమ్మ మాట ఇనకుండా  లేసుకొని ఉంటాయి ఆ చింపిరి ఎంటుకులు. పూసర కండ్లు. సొరకాయ ముక్కు. పాసిపండ్లు.బరగొంతు.మసిగుడ్లు. వారంగానీ నీల్లు పోసుకోదు. మనిషి బెంజి అయినా బుద్ధి మంచిది. కుసాల ఆడది. వొగతి ఉన్నా పదిమంది ఉన్నట్లే. ఎంత బాదలో ఉన్నా నగిస్తుంది.  ”కాదే పాపా ఈ మొగోల్లు ఆ ఊరికి ఈ  ఊరికి జాతర్లకు పోయి ఆడ యమక  కొరికేసి వచ్చేది  ఆషాడంలో పండగ గురించి ఎత్తుకుందురు . ఈ పండగ ఎల్లి పోయేంత వరకు మీ నాయన తో నాకు “ఎలి బెరికి  లోబెరికి”. పానం పికోపికో అంట ఉంటుంది ” అనే .
 
                           నిజమే ఆయమ్మన్నా బయట పడింది. బయటపడకుండా లోలోపలే కుమిలి పోయే  ఆడోల్లు ఎంతోమంది ఉన్నారు . బండమీదకు మగాల్లంతా  పోయినారంటే  ఇండ్లల్లో ఆడోల్లకి మన్సశాంతి ఉండదు యాడ కొట్లాడుకుంటారో అని. ఈరపెద్దమ్మ మొగుడు అయితే గమ్మున ఉండే వాల్ల ను కూడా “రాయే గుద్ధ- రచ్చకు పోదాం ” అంటాడు.ఊరికే ఉంటే ఊరాపేరా అని యాడఉండే రంపులు కొని తె స్తాడు. అందుకే మా పెద్దమ్మ ఆ యప్పయాడికి  పోయినా ఆయప్ప ఈపలమీదనే ఉంటుంది. తాగి రంపులుకు  పోయే మొగోల్లు  ఉండే ఇంట్లో  ఆడాల్ల కు నెమ్మితి  ఉండదు. గంగ జాతర అంటే ఎట్ల లేదన్న ఇంటికి పది పదిహేను వేలు కర్సు అవుతుంది.కూలినాలి చేయల్ల. సరిపోకపోతే అప్పులుచేయల్ల .అదీ సరిపోకపోతే సొమ్ములు కుదువ పెట్టల్ల . పది మందిలో తక్కువగా గూడదని పాకులా డుతారు.
 
                   ఎప్పుడు పండుగ గురించి మాట్లాడాలనుకున్నా  నడీది బండ్ల మీద జరిగే తంతు ఇదే . తొలిత పెద్ద మనుషులుగా ఉండేవాల్లు  నడాన కుసోని  ఉంటారు.మిగిలినోల్లు  అందరూ సుటకారం వుంటారు.పలాన్నాడు  పండగ అనుకుంటారు.దానికి కాచేడు చర్చ జరుగుతుంది.  ఆ దినం మంచిదా ,ఈ దినం మంచిదా అని,ఇంటింటికి ఎంత తీర్వ అని,ఆడ కూడా ఇంత అయితే ఎక్కువ అంత అయితే తక్కువ అని మాట్లాడి  కాంచేడికి  సర్దుబాటు కి వస్తారు.  ఎన్ని ఇండ్లు అని లెక్క రాస్తారు. పెద్ద మనుషులు  బీముకార్డు ప్రకారం లెక్కేస్తే కొంతమంది మాది ఒక తీరవే నేను నా కొడుకు కూడగానే ఉన్నాము  అంటే, ఇంకొకరు మా ఇంట్లో ఒక పొయ్యే  ఎలిగేది అంటారు. ఇంకొకడు అదేందిరా నా దగ్గర అయితే రెండు తీరవల్లు  కట్టించుకున్నారు అంటారు   మండే అగ్గిలో ఆజ్యం పోసినట్టు ఊరు పని ఏది చేద్దామన్నా మెంటు పెట్టుకొని  ఆపని కానీకుండ చేసే వాల్లు  కొందరు. వాల్లు  ఊర్లో పలానా వాల్లు  అని పేరుబోయి ఉంటారు. వాల్లు  సచ్చిపోయినా వాల్ల  బిడ్డలు కూడ  అదే సాలు తిప్పుతారు. ఇట్లా ఊర్లో పెద్ద మనిషి గా నిలబడే అంత ఎర్రి పని  ఇంకొకటి ఉండదు.వొగడు కాదంటే  వొగడు అవునంటాడు. అందుకే ఇట్లాంటి చర్చలన్నీ పొగులే పెట్టుకుంటారు. రేయి అయితే సగానికి సగం మందికి బుజ్జిగాడు పూని ఉంటాడు  అంటే తాగేసి ఉంటారు ఒకరి మాట ఒకరు ఇనరు.వచ్చి నోడల్లా పెద్ద మనుషుల్ని తిడతాడు ఎవర్రా పెద్దమనిషి బోడి బొచ్చు, అమ్మ అక్క ఆలి అని. కొంతమంది అయితే ఈ ఊరికి తొలీత రాయి ఏసింది మా నారునీరే మాకు లేని అక్కు ఎవునికీ లేదు అంటారు.పొరపాటున ఇల్లరికం అల్లుల్లు  ఏమన్నా మాట్లాడితే  “ఏఊరు నాకొడుకురా నువ్వు నీకు ఏమి అక్కుంది మాట్లాడేదానికి” అని వాల్ల  మగంనీల్లు  దించేస్తారు
 
                            మా ఊరు సుటకారం నలుగురు గంగమ్మగార్లున్నారు .దూముగంగమ్మ,మాతమ్మ బోయకొండ గంగమ్మ,దావలోగంగమ్మ, జాతరకు ఒక్కొక్క గుడికి వొకయాట వొక దున్నపోతుని  బలివ్వాలి .నడీది లో సాసవరాయికి కి ఒక యాట బలివ్వాలి .ఐదు యాటలు, నాలుగు దున్నపోతులు, ఊరేగింపు, పూజ  తిరునాల్ల కర్సు అంతా లెక్కేసి ఇంటికింత  తీర్వ  ఏస్తే సరిపోతుందని  అందరూ సానుకూలంగా మాట్లాడుకొని,దున్నపోతులకు ఎప్పుడు  బయలుదేరాలని ,ఒక్కొక్కరు ఏ ఏ పని చేయాలా అని వాల్ల  వాల్ల  పనులు పూరమాయిచ్చుకొన్నారు . 
 
                             ఏది ఏమైనా నెల దినాలు ఉంది జాతరకు .
                             “ఎబుడన్నా పొద్దు గూకి  పొయ్యి మబ్బయ్యి మల్లా  ఆకాశంలో ఎర్ర పటం  ఏస్తే ఊరంతా బంగారు సాయి తిరిగినట్టున్న ఆ  ఎలుగు చూస్తే  అదో ఆనందం” అట్లా గంగ జాతరపుడు  మా ఊరి జనాలంతా ఆనందానికి బాదకు నడన  తనకలాడతా ఉంటారు. పిల్లలు అయితే బొలువ-సులువ  అంతా మాయమ్మ, నాయన్లు చూసుకుంటారులే అని వాళ్ళ ఆటల్లో వాల్లు మునిగిపోతారు. 
 
                             బండ మీదకు పోయిన మగోల్లు ఇండ్లకు వచ్చిరి.అంత వరకు ఉన్న మా ఈరపెద్దమ్మ కూడా మా పెద్దమనుసుడు వచ్చేసి ఉంటాడు  నేనుబాతా  అనిపాయె . 
 
                            నా మొగుడు ”మేయ్ రేపు మబ్బుతోనే దున్నపోతులకోసం పావాల.మబ్బుతోనే  అన్నంచెయ్ అనే . ఈ పండుగ అయిపోయినంతవరకు  సేద్యం పనులతో, ఇంటిపనులతో   నా  సావునోములు తీరిపోతాయి అనుకున్నా . ఆ మరుసు నాడు దున్నపోతులకోసం  ఉత్తరం దిక్కు పోదాము అని మాట్లాడుకుని నామొగునితో పాటు ఊరులోని  ఆరుమంది జమై పొయిరి.  మా ఊర్లో ఎట్ల లేదన్నా  ఇంటికి రెండు మూడు ఆవులో  గొర్రెలో మేకలో ఉంటాయి. వీటిని ఊరిలో మేపతాము. సుమారు మా చుట్టుపక్కల పల్లెలో కూడా ఇవే ఉంటాయి. ఎనుములుకానీ ఎనుబోతులుకానీ లేవు.మా పక్క వాటిని ఎందుకు మేపరో నాకు తెలియలే  . 
 
                  నేను మడి కాడికి ఆవులనుమేత కోసం తోలుకొని పోతా ఉండా. మా ఊరు నడీది  రచ్చబండ కాడ మా గంగ తాత కొండ మామ కూర్చొని బీడీలు అంటించి పొగలు వదలతా   పురాణం ఎత్తుకోని ఉండారు . మా ఊర్లో ఈ దినానికి పెద్ద తలకాయ ఎవరన్నా ఉన్నారంటే అది మా గంగ తాతే! బొంబాయి ఏండ్లు ఉంటాయి .తాతకు టీఆకు పిచ్చి.రోజూ మైలు దూరంలో ఉండే టీ అంగడికి పోయి టీ  తాగొస్తాడు.పెండ్లాము సచ్చిపోయి ముప్పైఏల్ల  పైనే అయింది. బిడ్డలకు బిడ్డలు ఇట్ల నాలుగు తరాలు చూసినాడు.  
            నేను ఉండుకోని  గంగతాతను అడిగితి ” ఎనుములు ఎందుకు మేపంది ఆవులు ఎట్లానూ మేపతా ఉండాము  అట్లే ఎనుములు కూడా మేపచ్చు కదా  దున్నపోతులకోసం ఊరూరు తిరిగే పని ఉండదు కదా” అని 
 
              దానికి  ”ఎప్పుడో మేము చిన్నప్పుడు ఉన్నాయంట ఎనుములు .మల్ల రాంగా  రాంగా తగ్గిపోయి ఇబుడు ఉరివే  లేకుండా బొయినాయి. అబుడైతే నెలకు వొక  వాన పడేది. చెర్లలో ,ఏట్లో నీల్లుండేవి .ఎనుములకు తోలు పలచన. ఎండకు తట్టుకోలేవు.  ఆటికి మైదానం ఉండల్ల. మనకు చుట్టుపక్కల గుట్టలు కొండలు,రాళ్ళు రప్పలు. అవి కాంచేడు   మేసినా  కాంచేడు  బురదలో పొల్లాడల్ల.అదే ఆవులు అయితే అడవుల్లో కొండల్లో గుట్టల్లో తోలేస్తే  మేసుకొని వస్తాయి.చురుకైనా  తట్టుకుంటాయి. ఇప్పుడు జెర్సీ ఆవులు, క్రాస్ ఆవులు, ప్యాచ్ ఆవులు,జాతి ఆవులు ఇట్ల రకరకాలు కని పెట్టినారు లాబాల కోసం. తలుచుకుంటే మనిషిని కూడా నానారకాలుగా పుట్టిస్తారు. ఇంగ నోరులేని  జీవాలతో ఆడేది ఎచ్చా!  అందులో మనం ఎనుములు తినము . దున్నపోతుల్నే తింటాము . ఆ దున్నపోతును కూడా గంగమ్మ కోరింది. అది కూడా ఎట్లా…. మదమెక్కిన దున్నపోతు పాయానికి వచ్చి గంగమ్మ  నే తరిమిందంట . అప్పుడు ఆ తల్లి దాని తల నరికి దాని తలమీద దీపం పెట్టండి అని అడిగిందట. అందుకే గంగమ్మ కన్నంతా  దున్నపోతు మీదనే  అంటారు. అదీకాక ఎనమల్ని మేపేది యాడికీ ఎక్కని  ఎల్లమోల్లు మనం కాదు” అనే  గంగతాత 
 
                           యాల అట్లంటావు తాతా  అంటి  ”అవునమ్మా అది కతై నిలిచింది. వొగ బాపనోల్లమ్మాయి జంగమోల్ల అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు.పెండ్లి చేసుకున్నారు. వాల్లను వాల్ల ఊరోల్లుకానీ  వీల్లఊరోల్లుకానీ రానీయ లేదంట.  అప్పుడు మనం యాడికీ  ఎక్కని వాల్లం  అయిపోయాము అని  ఎల్లమ్మోల్ల  కులం పెట్టు కొని  ఎనుములు మేపినరంట.  యాడికి ఎక్కని  ఎల్లమోల్లే  ఎనుములు మేపేది మనకేమి కర్మ” అనే.  ఆయాలకే  నాకు పొద్దాయ . ఆవులను తోలుకొని పోతి. 
                             వారం దినాలు తిరిగి దున్నపోతులని తెచ్చిరి . నెలరోజులు అవిటి పోజాపన చెయల్ల. ఆ దున్నపోతులకు అమ్మవార్ల పేర్లు పెట్టి ఊరిపెద్ద మనుషులకి  మేపడానికి  అప్పగిచ్చినారు . అవిటిని  మేపేటప్పుడు  కూడా కొన్ని రంపులు జరుగుతాయి .యాడన్న పొరపాటున పొలములో మేస్తే  ముక్కాలు వాసిమంది  దేవుని పోతులే అని వదిలేస్తారు. కొంతమంది పరమచెన్నోల్లు  ”బద్రిచ్చుకోవల్ల,కాళ్లు తలకాయి తీసుకోరా” అని ఎదురు  మాట్లాడతారు. ఇవన్నీ సమాలిచ్చుకుని నెల దినాలు వాటిని మేపినారు.  
 
                పూజతంతు మొదలై  దున్నపోతు గోరుమాను ఎక్కేంత వరకు ఒకటే శర.  తెల్లవారుజామున దున్నపోతులు బలి ఇస్తామంటే రేయంతా  నాలుగు పోతుల్ని దామినికట్టి  వాటిని కొట్టుకుంటూ ప్రతి ఇంటికి మెరివిని  తిప్పతారు. ఇంటింటికాడ  కడవ నీల్లు  వాటి నెత్తిన పోసి పూజ చేసి పలకలు మేలాలు కొడతా శబ్దాలు చేస్తారు. రేయి  చల్లగాలికి  పోసిన నీల్లల్లో తడిసి ముద్దయి జిడ, జిడ అదరతా ఉంటాయి.అవిటికీ  నోరుంటే మనమెంత  కర్కోటకలం అన్నది చెప్పేవి. యాట కొడివిల్లతో  గంగమ్మకు ఎదురుగా గోరుమాను  తీసి ఏటికి ఒక తలకాయ నరికి  అమ్మ దగ్గర పెట్టి దీపం ఎలిగించి వరాలు అడిగిరి.తొగటోడుకి,పెగటోడు కి,పిన్నపెద్దకి,రాసింటోడుకి, కాళ్లు,తలకాయిఊరికే ఇస్తారు.  మిగిలిందంతా కోసి  ఇంటింటికి బాగాలేసిరి.  ఆ బాగాల్లోకి  గుండెకాయి, ఈరుగులు,  దొమ్మ, పొట్ట,పేగులు, ఇస్తర పేగు, నడుమెమక,పక్కటెముకలు, పొప్పెమకలు,బర్రెమకలు, తొడ కండలు ,యద కండ, పొదుగు కండ, ఉలవ కాయ, ఇవన్నీసల్లా సగుటున ఏసుకోని ఇండ్లకు ఎత్తక బొయిరి . 
 
            పండగలకు ,పెళ్లిళ్లకు ,చావులకు తెలుస్తుంది ఎవరెవరికి ఎంత బలగం ఉందని . జాతర అంటేనే ఎట్ట లేదన్నా ఇంటికి పదిమందన్నా చుట్టాలు వస్తారు.
 
            ఇళ్లల్లో ఆడోల్లు చలిబిండితో దీపాలు చేసి కొత్త సట్లో బానపు కూడు వండి ముందు రోజు  రెయ్యంతా దేవుళ్ళకు దీలు బానాలు మోసినారు  . తెల్లారేసరికి కోడికూర తినే వాళ్లకు కోడికూర ,పొట్లు తినే వారికి పొట్లి , ఎనుబోతు తినేవాల్ల కు ఎనుబోతుకూర . ఈ కూరలు వండే  దానికి కేజీలు కేజీలు అల్లం తెల్లగడ్డ ఒల్సుకోని నూరిపెట్టుకొనేది ఒక ఎత్తు అయితే వండతా ఉంటే, వచ్చే సుట్టం వస్తావుంటే పొయ్యే సుట్టం పోతా ఉంటే ఆకేసి అన్నం బెట్టి ,అవి ఎత్తను, కడగను,మర్యాదలు జెయ్యను ,సాగనంపడంతో సగం నడుములు ఇరిగి పోతా యి ఆడోల్లకు   .  
           అట్లనే ‘సుక్క ముక్క’ లేనిదే జాతర పూర్తి గాదు  అని తాగుబోతు మొగుడ్లు ఉన్న ఇల్ల ల్లో ఫుల్ గా తాగేసి బజార్లో నిలబడి పక్కింటికి ఇరిగింటికి బోయే సుట్టాన్ని కూడా రెట్టబట్టి లాక్కొని వచ్చి  పెల్లాన్ని బెదిరించి  ‘మా మామొచ్చే మా అక్కోచ్చే’ అని సట్లోని కూరంతా లోడి  లోడి  ఏస్తారు . ఇంట్లోవాల్లు  తిన్నారా లేదా అని పట్టించుకోరు . ఈ అడావుడిలో  ఆడాల్ల కు కడుపునిండా తిండి కూడా ఉండదు . ఎబుడెపుడు పొద్దు గూట్లో పడుతుందా అని కాసుకోనుంటారు  . అలుపు నిద్ర గంగమ్మ బూని సోటెరగ కుండా నిద్రబోతారు ఆ రెయ్యి .  
 
                   ఆ పొద్దు   ఊరంతా చుట్టాలతో, తునకల కూర గుమగుమలతో మునిగిపోయింది. 
                  ఆ మరునాడు సద్ద కంకులు సలాములు అయిపోయి ఆరు నెలల అప్పు గుర్తుకొచ్చి సప్పగిల్లి పోయినాయి  పానాలు !
 
*****
 
    అర్థాలు 
 
సూపడ-పైన 
బెంజి -గలీజు 
తీర్వ- డబ్బులు
మెంటు – వ్యతిరేకం  
మగంనీల్లు  -అవమానం 
గోరుమాను – తల నరికే తమర 
 పోజాపన – పోషణ
 పరమచెన్నోల్లు – చానా చెడ్డోళ్లు 
 దామినికట్టి – ఒకదానికొకటి జోడించి  
 మెరివిని – ఊరేగింపు 
 సద్ద కంకులు సలాములు అయిపోయి-సంబరాలు 
 శర – హింస 

*****

Please follow and like us:

One thought on “గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే (కథ)”

  1. కరుణ లేని మనిషి. సుఖమెరుగని ఆడజన్మ. కథ బాగుంది. నా చిన్నప్పటి రోజులు గంగమ్మ (గంగానమ్మ ) జాతర గుర్తుకొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published.