జ్ఞాపకాల సందడి-28

-డి.కామేశ్వరి 

మా చిన్నతనంలో పచ్చళ్ళు పెట్టడం అంటే ఆదో  పెద్ద ప్రహసనం. పెద్ద గంపెడు ఉసిరికాయలు  చింతకాయలూ  తెచ్చి ,ఏడాదికి సరిపడా పెట్టి ,జాడీలలో  పెట్టి, వాసినికట్టి ,కావలసినపుడు కాస్త తీసి పచ్చడినూరుకునేవారు . ఏ  సీజన్లో లో దొరికేవి అప్పుడు పెట్టునేవారు. పదిమంది ఇంట్లో జనం ,వచ్చిపోయే బంధువులు విడికాపురాలుండే కూతుళ్ళకి వచ్చినపుడు ఇంత  సీసాల్లో పెట్టివ్వడానికి ,ఇలా కనీసం పెద్దగంపెడు కాయలుండేవి . ఉసిరికాయలు కడిగి బట్టమీద ఎండలో ఆరబెట్టి , సాయంత్రం  కింద తాటాకుచాపమీద కర్ర రోట్లో  రోకలితో పనిమనిషి  దంచేది ,కింద కూర్చుని అమ్మ చేత్తో తోసేది కాయ. దంచాక చాటలో పోసి చెరిగితే ముక్కలు గింజలు వేరు చేసి ఏరేసేవారు.  కచ్చాపచ్చాగా నలిగినదానిలో అపుడు అమ్మ మడికట్టుకు పసుపువేసి జాడీలో వేసి గట్టిగ నొక్కి పెట్టాలిట. ఉప్పు ముందు వేయకూడదు ముక్కగట్టిపడుతుందిట. మూడోరోజుకి ముక్క చీకి మెత్తపడ్డాక ఉప్పుకలిపి మళ్లీ మూడురోజులకు అంటకలిసి ముద్దలా అయ్యాక  పెద్ద ఇంగువముక్క పచ్చడి మధ్యలో పెడితే పచ్చడి ఇంగువసనతో ఘుమ ఘుమలాడుతూవుంటుందిట. ఎండుమిర్చి మెంతులు ఆవాలు ఇంగువ పోపు వేయించి పచ్చిమిర్చి కొత్తిమిరి వేసి, చిన్న జాడీలో వేసి పెట్టి రోజు ముందు ముద్దలో కాస్త పచ్చడి కలుపుకుని నెయ్యివేసుకు తింటే ఇప్పుడంటే సీవిటమిన్ తెలుసు అపుడు వంటికి మంచిదనేవారు.

చింతకాయ పండుమిరప అంతే. ఈనెలు తీసి కర్రరోట్లో దంపించేవారు.  దానికయితే ఉప్పు పసుపు ముందెవేసి మూడోరోజు మెత్తపడ్డాక గింజలన్నీ తీయడం అపుడు జాడీలలో పెట్టడం  ఎంత పెద్ద చాకిరో ఆడవాళ్ళకి  వంటలు పచ్చళ్ళు ఊరగాయలు అప్పడాలు వడియాలు అంటూ ఏడాదంతా ఏదో పనితో వంటింట్లోనే సరిపోయేవి వాళ్ళ బతుకులు.

ఎందుకు చెప్పేనంటే ఇలా చిన్నప్పుడు రుచులు మరిగిన నోరు ఉసిరికాయలు చింతకాయలూ మిరపకాయలు కనపడగానే చటుక్కున కళ్ళు అటు లాగేస్తాయి.  మొన్న కింద కూరలకు వెళ్ళగానే పెద్దఉసిరికాయలు నవనవలాడుతూ కనపడ్డాయి. ఇంకా పచ్చడి వుంది సీజన్ రాలేదు కానీ  అసలు ఏమిటో అన్ని సీజనుల  కంటే ముందే వచ్చేస్తున్నాయ్,  ‘తొందరపడి ముందే కూసేస్తున్నాయి, ‘కోయిలలు  సరే బాగున్నాయి. కాస్త కొత్తపచ్చడి తిందాం అని పావు ఎంత  అంటే  పదిహేనంది.  చూస్తే ఏడుకాయలొచ్చాయి.  అంటే ఒక ఉసిరికాయ రెండురూపాయలన్నమాట ఏడవలేక ఓనవ్వునవ్వి పావుతీసుకున్నా. రోళ్ళలో కొట్టే రోజులు కావని కుక్కరులో కాస్త నూనె వేసి సిం లో ఓ  రెండు విజిళ్ళువేయగానే ఆపేస్తే చల్లారాక గింజ నిమిషంలో వచ్చేస్తుంది.  పసుపేసి మూడోరోజు ఉప్పుకలపడం అదంతా సరే  ఇపుడు ఇంకా సులువు పద్ధతి కనిపెట్టా.  ఇడ్లీ పళ్లేల మీద కాయలుపెట్టి ఇడ్లీలా ఐదునిమిషాలు వుడికిస్తే చక్కగా గింజలు ఊడి వస్తాయి.  ఇంతేకాదు నిమ్మకాయలు  ఊరగాయపెట్టడానికి ఎండలే లేవు.   దానికి తోడు తొక్క దళసరిగా వుండి  ముక్క ఎప్పటికి మెత్తపడడం లేదు. అందుకే నిమ్మకాయలు కూడా ఇడ్లీ పళ్లెం మీద  పెట్టి కాస్త ఆవిరి తగిలిస్తే  తొక్క మెత్తపడుతుంది.  చల్లారాక ముక్కలుకోసుకుని ఉప్పు, పసుపు వేసి మూడురోజులు ఊరపెట్టుకుని మిగతా పచ్చడి ఎలా పెట్టాలో తెలుసు గదా.  అలా ఆవిరిమీద పెడితే పాడవదా ఊరగాయ అనుమానం వద్దు.   మరీ  మెత్త  పడనీయద్దు.  ఐదునిమిషాలలా ఆవిరి చాలు  నూనె ,ఉప్పు సరిగా పడిన ఊరగాయ పాడవదు. డజనుకాయలు అంటే హార్లిక్స్ సీసాడు ఫ్రిజ్ లో పెడితే ఎన్నాళ్లయినా నల్లపడదు.  అపార్ట్మెంట్స్ వచ్చాక మంచి ఎండ లేదు,   అందుకు ఈ పద్ధతి నచ్చింది నాకు.  కొద్దిగా పెట్టుకునేవారికి ఇది సులువు అని మీకు చెప్పా. ఎక్సపెరిమెంట్ చేసి చూడండి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.