జ్వలిత కౌసల్య

(ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి కావ్యంపై సమీక్ష)

-డా. సిహెచ్.సుశీల

 ” నన్ను మీ తండ్రి పెండ్లాడే, నాటినుండి ఒక్క శుభముగానీ,  సుఖమే ఒకటి గాని ఇంతవరకు నే జూచిన ఎరుక లేదు”…
       రామాయణంలో *కౌసల్య* ఒక సాత్విక పాత్ర. కానీ అలాంటి సత్త్వ గుణం గల స్త్రీలోనూ సవతుల పోరు, భర్త నిరాదరణ వల్ల ఎన్ని ఆవేశాగ్నులు రగులుతాయో భావన చేశారు ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు జ్వలిత కౌసల్య కావ్యంలో.
       కౌసల్యలో ఇంత ఆవేదన, అంతర్మధనం వుందా! ఇంతగా జ్వలించిపోతోందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది పాఠకులకు.
   వేల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిన రామాయణ, మహాభారతాలు భారతీయ సంస్కృతిలో విడదీయరాని భాగాలుగా కలిసిపోయి, ఈనాటికీ సమాజం పైనా, మనుషుల పైనా ప్రభావం చూపుతున్నాయి. ఎంత ఆధునికులైనా, ఎంత అభ్యుదయ భావాలు వెల్లడిస్తున్నా వాటికి ఆధారం, మూలాలు రామాయణ భారతాల్లో ఉన్నాయి. అయితే వాటి లోతుల్లోకి వెళ్లి పరిశీలించి కొందరు  “కొత్త కోణం”లో  ఆవిష్కరిస్తున్నారు. 
     రామాయణ భారతాల్లోని, సాంప్రదాయిక పాత్రలనే “భిన్నంగా” ఆలోచించి, వారి మనోభావాల్ని విశ్లేషిస్తున్నారు. త్రిపురనేని , నార్ల నుండి ఓల్గా వరకు ఈ నూతన పంధాలో రచనలు చేసి సంచలనం సృష్టిస్తున్నారు.
          పౌలస్త్యుడు, మంధర, చివరికి శూర్పణఖ  పాత్రలను కూడా ఉన్నతీకరించ ప్రయత్నించారు.
     ఈ ఒరవడిలో వచ్చిన మరో కావ్యం ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి జ్వలిత కౌసల్య. బహుభార్యత్వం సహజంగా పరిగణించే ఆనాటి సమాజంలో పట్టమహిషి అయి ఉండి కూడా తనకు సుఖం లేదని ఆక్రోశించింది. అంత మంది స్త్రీలను వివాహం చేసికొన్న భర్త పట్ల కోపంతో రగిలి పోయింది. ఆవేదనతో మండిపోయింది. ఆవేశంతో జ్వలించి పోయింది ఆ జ్వలిత కౌసల్య. శ్రీరాముడు జన్మించిన తర్వాత తన కన్నీరు కాస్తంత తొలగిపోయింది. పైగా పట్టాభిషేకం వార్త తో మరింత ఆనందతరంగిత అయింది. కానీ అరణ్యవాసానికి వెళ్తున్నాడు అని తెలిసి అన్నేళ్ల నుండి తన మనసులో గూడుకట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. దశరథుడికి ముగ్గురు భార్యలు అని పైకి  చెప్తారు కానీ మూడువందల యాభై మంది భార్యలు ఉన్నారు. పైగా చిన్న భార్య కైక అంటే మరీ మోజు. అది కౌసల్య గుండెల్ని జ్వలింప జేసింది. సంసారసుఖం లేదు. సపత్నీ బాధ మెండు.
   రాముడు వనవాసానికి వెళ్ళబోతూ ఆశీస్సులు కొరకు తల్లి వద్దకు వచ్చినపుడు ‘తననూ అరణ్యాలకు తీసుకుపొమ్మంటూ’ దుఃఖ పడడం  వాల్మీకి రామాయణంలో ఇరవై శ్లోకాలు లో ఉంది. వాటిని చదివిన భూమయ్య గారు కదిలిపోయారు, కనలి పోయారు. 109 పద్యాలలో ఆమె దుఃఖాన్ని వివరించారు.
     సామాన్యంగా స్త్రీలు తమ మనసులోని దుఃఖాన్ని –  ముఖ్యంగా భర్త వల్ల కలిగిన పరాభవాన్ని నిరాదరణను  వయసు వచ్చిన కుమారునికి చెప్పరు. కానీ ఇక్కడ కౌసల్య బాధ, ఇన్నేళ్లు తాను అనుభవించిన హింస తో పాటు కన్న కొడుకుకి అన్యాయం జరగడంతో దుఃఖం కట్టు తెంచుకొంది. పెల్లుబికిన ఆవేదనతో బ్రద్దలయింది. 
    “నా బతుకు దాసి కన్నా హీనమైపోయింది. ప్రజల దృష్టిలో మహారాణి, పట్టపురాణి కానీ ఈ సపత్నుల గూర్చి నేనేమందును! నా కంటే చిన్న వారైనను నన్నెన్ని మాటలాడి కష్టపెడ్డారు!” అంటూ భర్త ప్రేమ లేకపోవడంవల్ల, దానికి తోడు సవతుల మాటలను తలచుకుని బాధ పడింది. కైక  మోజులో పడి దశరథుడు తనను ప్రేమించలేదు. గౌరవించలేదు. స్వేచ్ఛని ఇవ్వలేదు. చివరికి కైక యొక్క దాస జనుల తో సాటిగా నైనా తనను చూడలేదు.  
   “ఇప్పుడు నిన్ను కన్న తండ్రి అడవులకు పంపితే ఆ తర్వాత ఇక మర్యాద నాకేం ఉంటుంది! ఆ తర్వాత ఇక  ఈ మాత్రం కూడా నా వైపు ఎవరు చూడరు. పలకరించరు. కడుపు చించుకున్న కాళ్ళపై పడును అనుకొని ఇంతవరకు ఈ బాధను ఇష్టసఖులకైనా  చెప్పలేదు. కొడుకైన నీకైనా చెప్పలేదు. నీతో అడవికి వస్తే నాకు పోయేదేముంది. అది ఒకప్పుడు ఏదైనా ఉంటే కదా ఇప్పుడు పోయేందుకు! ఒకవేళ పోతే ఈ దుఃఖమే పోతుంది”  అంటుంది విరక్తి గా.
          పద్నాలుగేళ్ల తర్వాత రాముడు వనవాసం నుండి తిరిగి వచ్చే వరకు తాను బ్రతికి ఉంటానా అని బేలగా భయపడింది. “ఇలా అరణ్యాలకు వెళ్ళవలసి వస్తుంది అంటే నిన్ను అప్పుడు కనకుండా ఉండేదాన్ని. దానివల్ల ” వంధ్య” అన్న పేరు ఒక్కటే చింతకాని, ఈ గుండె కోత ఉండేది కాదు కదా!” అన్నది.
           వింటున్న రాముడు ఆశ్చర్యపోయాడు. “గుండెలో నింత   దుఃఖమును దాచి నవ్వుతూ ఎలా ఉండేదో అమ్మ!  సముద్రపు కట్ట తెగ కొట్టుకునినట్లు ఈనాడిలా పలుకుతోంది! ఇందరు సవతులు ఎలాంటి  మాటలాడి నొప్పించారో ! ” అనుకొన్నాడు. 
          భర్తల బహుభార్యత్వం వల్ల భార్యల ఆత్మక్షోభ తల్లి ద్వారా విన్నాడు రాముడు.
      రాముడు పితృవాక్య పరిపాలకుడు, కానీ పితృ మార్గానుయాయి కాదు. అందుకే తండ్రి చేసిన తప్పును విమర్శించే బదులు ఆ తప్పు చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. “ఒక్కసీతయే ఈ జన్మకున్న  భార్య” అని నిర్ణయించుకున్నాడు.  తాను  “ఏకపత్నీవ్రతాని”కి కట్టుబడి వుంటానని ప్రతిజ్ఞ చేశాడు.
   *జీవితాంతం రాముడికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమైన సన్నివేశం ఇది.*
    సకల సద్గుణాభిరాముడు తండ్రి చేసిన తప్పు ఏమిటో,  ఏమి చేయాలో, కన్నతల్లికి ఉపశమనం ఎలా కలిగించాలో తెలిసినవాడు. అందుకే ఇంతటి నిర్ణయం, భవిష్యత్ కాలానికి ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నాడు.
       రామాయణ కథ మనకు తెలిసిందే. కానీ కౌసల్య మానసిక వ్యధను, ఆత్మ జ్వాలను  దర్శించారు ఈ కవి.  కౌసల్య మానసిక క్షోభను  ఆవిష్కరించిన తీరు కరుణ రసాత్మకంగా సాగింది. కౌసల్య ప్రధాన పాత్రగా చిత్రించిన ప్రథమ కావ్యం ఇదే. కౌసల్యను ఈ కోణం నుండి చూసిన వారు భూమయ్య గారు ఒక్కరే. రాముని ఏకపత్నీ వ్రతానికి కౌసల్య ఆత్మ క్షోభను కారణంగా చూపించారు. రాముడు కౌసల్య దగ్గరకు వచ్చే ముందు జరిగిన సంఘటనలన్నీ ఏకరువు పెట్టక భూమయ్యగారు క్లుప్తంగా నాలుగు పద్యాలలో చెప్పారు. కథ అందరికీ తెలిసిందే కాబట్టి ఆయా సంఘటనల మీద దృష్టి పెట్టలేదు. ఆయన ధ్యాసంతా కౌసల్య గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం మీదే.
     కౌసల్య ఆంతర్యావిష్కరణ, మానసిక ప్రవృత్తి , సవతుల వల్ల ఆమె ఎదుర్కొన్న దూషణ తిరస్కారాలు, ఆమె గుండెల్లో ఎంతటి బాధని కలిగించాయో,  కష్టాలలో కన్నీళ్లలో పండిపోయి “బతుకు మీద ఆశ సన్నగిల్లి, తననూ అరణ్యాలకు తీసుకుపొమ్మని” రాముని ఎదుట వాపోవడం – కౌసల్య “మహా మౌనం” వెనుక ఉన్న  “జ్వలిత కౌసల్య ” ను కళ్ళ ముందుంచారు *ఆచార్య అనుమాండ్ల భూమయ్య.

****

Please follow and like us:

2 thoughts on “జ్వలిత కౌసల్య (ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి కావ్యంపై సమీక్ష)”

  1. ఎంత బాగా చెప్పారు. “ఒకప్పుడు ఏదయినా ఉంటే కదా! ఇప్పుడు పోయేందుకు.. ఒక వేళ పోతే ఈ దుఃఖమే పోతుంది”.. చాలా మంది మహారాణుల గాథలు, బాధలు ఇంతే కదా!

  2. రామాయణాన్ని రాముడి ప్రాధాన్యత తోనే అందరికీ చదివే అలవాటు మొదటినుంచీ ఉంది.కౌసల్య మానసిక సంఘర్షణను జ్వలిత కౌసల్య ను భూమయ్య గారు ఒక కొత్తకోణంలో చూపించటం ముదావహం.ఆ కావ్యాన్ని సమీక్షరూపంలో సుశీల గారు అందించటం సాధారణ పాఠకులకు కూడా అర్థమయ్యేలా ఉండటంతో రచన సార్థకం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published.