నిష్కల – 11

– శాంతి ప్రబోధ

వాళ్ళు కలిసుండటం విడిపోవడం సెక్స్ చేసుకోవడం చేసుకోకపోవడం వారి ఛాయిస్….పూర్తిగా వారి వ్యక్తిగతం…
ఎక్కడో చోట చిన్న రిలవెన్స్ సంపాదించి  విశ్లేషణలు తీర్పులు చెప్పేయడమేనా …
ఎమోషనల్ గార్నిష్ చేయడమేనా…
సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వైవాహిక లైంగిక సంబంధాలతో మనకేం సంబంధం? పబ్లిగ్గా చర్చించాల్సినంత ఏముంది ఇందులో..
సెలబ్రిటీల లైఫ్ లో నాకు బాగా నచ్చిన విషయం విడాకులు వాళ్ళు చాలా లైట్ తీసుకోవడం.  కుదిరితే కలిసి ఉంటారు. లేకుంటే అంతే ఈజీగా విడిపోతారు. కలిసి ఉండటం అనేది వాళ్ళ స్వేచ్ఛ అని నా అభిప్రాయం.” అని సారా జలాల అంటుంటే ఆమెనే పరీక్షగా చూస్తూ ఉన్నది నిష్కల
ఆమెను చూస్తుంటే తన నాన్నమ్మ గుర్తొస్తున్నది.  నాన్నమ్మ రూపు రేఖలు ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 
 
బహుశా ఈ వయసులో నాన్నమ్మ కూడా ఇలాగే ఉండేదేమో.  నాన్నమ్మ పసిడి రంగు అయితే సారా యాపిల్ ఎరుపులో ఉంటుంది.  జుట్టు నలుపు కాకుండా డార్క్ బ్రౌన్ లో ..అని ఇద్దరినీ పోల్చుకుంటున్నది నిష్కల
అంతలోనే ఇదేంటి ? 
ఇలా ఆలోచిస్తున్నానేంటి ? అయినా ఈ అమ్మాయికి నాన్నమ్మకి ఏమిటి సంబంధం? అని తనను తాను ప్రశ్నించుకుంది నిష్కల 
ఈ మధ్య కాలంలోనే మూడు సార్లు సారా నిష్కల కలిశారు. 
సారా స్నేహితురాలు, రూమ్ మేట్, కొలీగ్  అయిన గీత విషయంలో.  
సారా జలాల ను కలసిన ప్రతిసారీ నిష్కలకి ఆమెలో తన నాన్నమ్మే అగుపిస్తున్నది. 
 
***  
గీత భారతీయురాలు .  సారా అమెరికన్ .  ఈ ఇద్దరి పరిచయం ఆఫీసులోనే . 
అందరితో త్వరగా కలిసిపోయే సారా గీతకి చాలా సన్నిహిత మిత్రురాలయింది.  మొదట్లో గీత వేరే అపార్ట్ మెంట్ లో ఉండేది .  
కొద్ది కాలం క్రితం సారా అపార్ట్మెంట్ కు వచ్చింది.  ఇద్దరు ఒకే అపార్ట్మెంట్ షేర్ చేసుకుంటూ ఉండడం తో వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునే సాన్నిహిత్యం వారి మధ్య పెరిగింది. 
 
మూడున్నర ఏళ్ల క్రితం గీతకి  వినోద్ తో పెద్దలు సంబంధం కుదిర్చారు. ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. 
అప్పుడు వినోద్  బోస్టన్ లో  రెసిడెన్సీ చేస్తున్నాడు .   న్యూజెర్సీ లో ఉంటూ న్యూయార్క్ లో  సాఫ్ట్ వెర్ డెవలపర్ గా ఉద్యోగం చేస్తున్న  గీతను అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు.  వారాంతాల్లో ఇద్దరూ కల్సి తిరుగుతూ ఉండేవారు.  
అలా వెళ్ళినప్పుడు తన కోరిక వెలిబుచ్చాడు వినోద్.  మొదట కాదని చెప్పిన గీత అతని మాటలకు కన్విన్స్ అయింది.  తన సందేహాలను వదిలేసింది . 
ఎలాగూ పెళ్లి చేసుకునే వాళ్లమే  కదా కలిస్తే తప్పేంటి అని ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు.  భార్యాభర్తలుగా మెలిగేవారు. 
రెసిడెన్సీ పూర్తి అయిన తర్వాత  స్వదేశానికి వెళ్లి ఘనంగా పెళ్లి చేసుకుందాం అని చాలా ప్రణాళికలు వేసుకునేవారు.  సంతోషంగా కాలం గడచిపోతున్నది . 
 
అంతా సవ్యంగా జరిగితే ఇక చెప్పుకోవాల్సిన దేముంది?
మూడేళ్లు గడిచాయి . వినోద్ రెసిడెన్సీ అయిపోయింది.  
ఒహాయో లో ఉద్యోగంలో చేరాడు.  పెళ్లి ముహూర్తం చూడడం మొదలు పెట్టారు పెద్దవాళ్ళు. 
అప్పటి నుంచి గీతను కలవడం క్రమంగా తగ్గిపోయింది. గీతకు చేసిన బాసలు మర్చి పోయాడు. ఫోన్ నెంబర్ మార్చేశాడు.  
విషయం అర్ధం కాని గీత ఎన్నో ఈ మెయిల్స్ చేసింది.  జవాబు లేదు. 
అతని మోసం పసికట్టని గీత అతని ఆచూకీ గురించి ఆదుర్దా పడుతూ విషయం ఇటు అటు పెద్దలకి తెలిపింది. 
వినోద్ కి ఆరోగ్య సమస్య రావడంతో అందరికీ దూరంగా ఉంటున్నాడు. ఫోన్ ఎత్తడం లేదని జవాబు చెప్పారు అతని తల్లిదండ్రులు. 
కరోనా కాలం కాబట్టి , అందునా వైద్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి అతనికి కూడా కరోనా సోకిందేమోనన్న కంగారు పడింది గీత   తనకు పరిచయం ఉన్న అతని స్నేహితులకు ఫోన్ చేసింది . 
అతను బాగానే ఉన్నట్లు తెలుసుకుంది .  అతను తనను కావాలనే దూరం పెడుతున్నాడని అర్థం చేసుకుంది.  
అయితే తాను చేసిన తప్పేమిటో, ఎందుకు దూరం పెడుతున్నాడో  గీతకు అర్థం కాలేదు.  ఆ విషయమే అడుగుతూ అతన్ని నిలదీస్తూ ఈ మెయిల్స్ చేసింది .
అదేమీ అతని హృదయాన్ని తాకలేదు .  స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.  కొత్త బంధాలలోకి వెళ్లే వెంపర్లాటలో ఉన్నాడు. 
గీత తనను వేధిస్తున్నదని , ఆమె నుండి తనకు రక్షణ కావాలని ముందస్తుగా అప్పీల్ చేసుకున్నాడు . 
 
న్యూ జెర్సీ లో ఉన్న గీత భయంతో , తప్పు చేసిన బాధతో కుమిలిపోతున్నది.  తన జీవితమే పోయినంత బాధగా ఉన్నది ఆమెకు.  
పెళ్లి అయిన తర్వాత కొందరు మోసపోతుంటే , పెళ్లి కాకుండానే తను మోసపోయింది అని ఆమె బాధ పడుతున్నది. వేదన పడుతున్నది.  
తన జీవితం ఏమైనా సరే అతడు చేసిన మోసాన్ని ఎలాగైనా బయట పెట్టాలని ప్రయత్నం మొదలు పెట్టింది.  ఇక ముందు ఎవరూ అతని మాయమాటలకు మోసపోకూడదని కృత నిశ్చయంతో అతని గురించి వాకబు చేయడం మొదలు పెట్టింది. 
 
హైదరాబాదులో ఉన్న ఆమె తల్లి దండ్రులు కూతురు పెళ్లి విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
పెళ్లి కుదిరిందని, అబ్బాయి డాక్టర్ అని అమెరికాలోనే కొద్దీ మంది మిత్రుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరిగిందని బంధు మిత్రుల ముందు చాలా గొప్పగా చెప్పుకున్నారు.  
చాలా మంచి సంబంధం కుదిరిందని ఆనందోత్సాహాలతో ఉన్న గీత తల్లిదండ్రులకు పెళ్లి ఆలస్యం కావడం కొంత ఇబ్బందిగానే ఉన్నప్పటికీ కాబోయే అల్లుడి మాట తీసివేయలేక పోయారు.  అతను రెసిడెన్సీ అయ్యేవరకు ఆగారు. 
 
ఇంతకాలం ఆగినాక కూడా అతను దాటవేయడం, ఫోన్ అందుబాటులోకి రాకపోవడం తో  వారికి అసహనంగా ఉంది. 
 
తరచూ వినోద్ తల్లిదండ్రులతో టెలిఫోన్ సంభాషణలు చేస్తూనే ఉన్నారు.  అయితే, ఈ మధ్య వాళ్ళు గతంలో లాగ ఆత్మీయంగా మాట్లాడడం లేదు.  అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.  అందువల్ల గీత తల్లిదండ్రుల్లో కొత్త భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి.  
వాటికి  తోడు  ఇరుగు పొరుగు, బంధుమిత్రులు ఇంకా ఎప్పుడు మీ బిడ్డ పెళ్లి అని అడగడం , ఇంకెంత కాలం ఆగుతారని తలా ఓ మాట అనడం పరిపాటి అయిపోయింది.  
 
ఇక గీత తల్లిదండ్రులు ఏ మాత్రం జాప్యాన్ని సహించలేకున్నారు.  అందుకే గీత తల్లిదండ్రులు వినోద్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు.  
మా వాడు మాకు కూడా అందుబాటులో లేడు . ఆరోగ్యం బాగోలేదని మాత్రం తెలిసింది అని బొంకారు .  
ఇప్పటికే మూడేళ్ల కాలం గడచిపోయింది. ఈ ఫిబ్రవరి లో పెళ్లి  జరిగిపోవలసిందే అంటూ పట్టు పట్టారు గీత తల్లిదండ్రులు . 
మా అబ్బాయి కావాలనుకుంటే మా వాడికి కుదిరే వరకు ఆగండి. లేకపోతే మరో సంబంధం చూసుకోండి అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. 
కుల పెద్దల ద్వారా సమస్య పరిష్కరించుకొందామని ప్రయత్నం చేసారు. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న వారి వైపే నిలిచింది కుల సంఘం. 
 
పెద్దల సమక్షంలో మూడుముళ్లు పడతాయని అతనికి మనస్ఫూర్తిగా తన శరీరాన్ని , మనసుని అప్పగించిన గీత విషయం ఆమె తల్లి దండ్రులకు తెలియదు. అతని తల్లుదండ్రులకు తెలుసో లేదో కానీ అతని చెల్లెలుకి మాత్రం తెలుసు. 
గడచిన మూడేళ్ళ కాలం తుడిపేయలేక పోతున్నది గీత . 
 
అతను తనను వదిలించుకునే ఉద్దేశంలో ఉన్నాడని స్పష్టంగానే తెలుస్తున్నది.  అందుకు అతని కుటుంబం కూడా వత్తాసు పలుకుతున్నదని అర్ధమవుతున్నది.  
గీత మనసు కుతకుత అన్న ఉడికినట్లు ఉడికిపోతున్నది .  
ఆ ఆవేశంలో అతని ఇంటి ఫోన్  చేసింది . వినోద్ నిర్వాకాన్ని తెలిపింది . 
వినోద్ తల్లి ఎదురుదాడి ప్రారంభించింది.  నువ్వు గయ్యాళివి కాబట్టే నా కొడుకు దూరం అయ్యాడని ఒకసారి , పెళ్లి కాకుండానే ఒళ్ళు అప్పగించావంటే .. అంతకు ముందు ఎందరితో … అంటూ విచ్చలవిడిగా మాట్లాడింది . 
ఆ మాటలు గీత ను మరింత బాధించాయి . పదిమందిలో అతను చేసిన మోసాన్ని బయట పెట్టాలనే పట్టుదలను మరింత పెంచాయి . 
కానీ ఎలా ..?
 
కరోనా కాలంలో ఇంటికే పరిమితమై పనిచేసుకుంటున్న చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది. 
అది గమనించిన సారా ఒంటరిగాఉండడం మంచిది కాదని తన అపార్ట్ మెంట్ కి ఆహ్వానించింది . 
అలా ఇద్దరి స్నేహం మరింత చిక్కనైంది. 
 
గీత కథంతా విన్న సారా గీతకి కౌన్సిలింగ్ చేయడం మొదలు పెట్టింది. 
వినోద్ ధ్యాస నుండి బయట పడటం కోసం తన వంతు సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టింది. 
 
ఆ క్రమంలోనే నిష్కల దగ్గరకు తీసుకొచ్చింది సారా . 
 
***        
 
ఇంకా పెళ్లి కానీ గీత మాత్రమే  కాదు . 
పెళ్లయిన ఎంతో మంది యువతులు  విదేశాలకు వచ్చిన తర్వాత భర్త నిరాదరణకు లోనవుతున్నారు . 
దేశం వదిలి వేలాది మంది యువకులు ఉద్యోగాల వేటలో ఉన్నతమైన భవిష్యత్ కోసం , మంచి అవకాశాలు కోసమో  అమెరికా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , కెనడా చేరుతున్నారు . విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న 32 మిలియన్ భారతీయులు , భారతీయ సంతతి వారు ఉన్నారు .  
వారు పెళ్లి విషయానికి వచ్చేసరికి మాతృదేశం వచ్చి తల్లిదండ్రుల ఇష్టప్రకారం , తమ కులం అమ్మాయిని సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నారు. 
 
విదేశీ పెళ్లి కొడుకు మోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ . ఇదే అవకాశంగా అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయడం చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంది.  
కొందరు పెళ్లి చేసుకుని భార్యను స్వదేశంలో వదిలి మళ్ళీ వెనక్కి తిరిగి చూడని వారు కొందరైతే , కొందరు కట్నకానుకలు ఘనంగా తీసుకుని ఆమెను విదేశాలకు తీసుకుని వెళ్లి అక్కడ వదిలేయడం, నరకయాతనకు గురిచేయడం  జరుగుతున్నది. 
 
విద్యార్థిగా ఉన్నప్పుడే ఇటువంటి కేసులు డీల్ చేసిన నిష్కల ఇప్పుడు  న్యాయపరంగా  సేవలు అందిస్తున్నది . 
 
అయితే గీత కేసు వాటికి భిన్నం. పెళ్లి కాకుండా జరిగిన మోసం . అందుకు సాక్ష్యాలు , రుజువులు కావాలి ఇవన్నీ సంపాదించడం ఎలా .. ?  ఆలోచిస్తూ ఉన్న నిష్కల 
సారా కళ్ళలోకి చూస్తూ “మన ఇద్దరి ఫ్యామిలీ నేమ్ ఒక్కటే ..” అన్నది 
 
“వ్వాట్ .. అదెలా సాధ్యం ?” కళ్ళెగరేసి అన్నది సారా …
 
ఓ ఆడపిల్ల జీవితంలో  
గీతను  వదిలించుకునే ఉద్దేశంలో ఉన్నారని వాళ్ళ మాటలే చెబుతున్నాయి. 

(మళ్ళీ కలుద్దాం )

* * * * *

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.