మంచి కూడుకి మంచి కూర అమరదు

(కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)

  -వి.ప్రతిమ

“స్నానం చేసిన వాన చెట్టు
పూలు కోయబోతే
నాకూ నీళ్ళు పోసింది”
అంటూ నేనే ఎక్కడో రాసుకున్నాను.

వరలక్ష్మి గారి ఆత్మ కథ చదువుతూ నా బాల్యం లోనూ, యవ్వనం లోనూ, మొత్తంగా నా జీవనయానంలోని వివిధ వెలుగునీడల్ని తడుముతూ తడిసి ముద్దయ్యాననే చెప్పాలి
ఆ మాటకొస్తే ప్రతీ పాఠకురాలిదీ ఇదే అనుభూతి కావొచ్చు.

“వ్యక్తిగతమంతా రాజకీయమే”అని ఎప్పుడో గుర్తించింది స్త్రీ వాదం.

“వ్యక్తిగత అనుభూతులకు, అనుభవాలకూ కూడా ఒక రాజకీయ కోణం ఉంటుందనీ, సబ్జెక్టివిటీ నుండి గ్రహించగలిగిన సారాంశం ఎంతో వుందనీ, సాంఘిక చరిత్ర అభివృద్ధిలో దీనికున్న రాజకీయ ప్రాధాన్యత ఎంతో ముఖ్యమైనదని స్త్రీవాదం ప్రతిపాదించి స్థిరపరిచింది. ఆ దృష్టి నుండి చూసినపుడు స్త్రీల జీవిత చరిత్రలు సాంఘిక చరిత్ర నిర్మాణానికి ఎంతో దోహద పడతాయి” అంటారు ఓల్గా. 

వరలక్ష్మి గారి జీవిత చరిత్ర చదువుతూ నా లోపలి నుండి బయటికి, బయటి నుండి లోపలికీ తిరిగి, తిరిగి ప్రయాణిస్తూ తెలుగు లో స్త్రీల జీవిత చరిత్రలు అరుద గా రావడాన్ని గురించి ఆలోచనలో పడ్డాను.

స్త్రీల జీవితాలు వ్యక్తిగతమే అయినా సామాజిక చరిత్రలో భాగం కావాల్సిన అవసరం వుందనీ, అందుకే స్త్రీల జీవితాలు మరిన్ని వెలుగులోకి రావాలని పదే పదే అన్పించింది. 

స్త్రీల జీవిత సముద్రల్లోంచి ఎన్నెన్ని ముత్యపు చిప్పలని, పంకం లో జీవించే పద్మాలనీ ఏరుకోవచ్చో  అర్థమవుతుంది.

ముఖ్యంగా ఈ పుస్తకానికి డా. కె. గీత రాసిన ఆర్ధ్రమైన ముందుమాట చదివి గుండె గొంతులోకి వచ్చినట్టై వెంటనే వరలక్ష్మి గారిని ఆలింగనం చేసుకోవాలన్న భావన నిలవనీయదు. మనందరికీ తెలుసు గీత వరలక్ష్మి గారికి కేవలం కూతురు మాత్రమే కాదు, గొప్ప స్నేహితురాలు కూడా. 

***
వరలక్ష్మి గారిది ఒక అందమైన, అనురాగవంతమైన, ఆహ్లాద మైన, అధ్యయన పూరితమైన బాల్యం. ఆ బాల్యం ఎంతగా ఆమె హృదయాన్ని హత్తుకు పోయిందంటే ప్రతీ చిన్న సంఘటన, ప్రతీ కోణం మరుపన్నది లేకుండా పాఠకులని చేయిపట్టి వెంట నడిపించేంత హృద్యo గా ఆవిష్కరించారు. అదే సమయంలో తన తోటి ఆడ పిల్లల అర్ధాంతరపు పెళ్ళిళ్ళు, 
చాకలి పద్దు చదువులూ, మగ పిల్లలకు కూడా పదో క్లాసు లో పెళ్ళిళ్ళు అవడం, ఆనాటికి ఏమాత్రం చైతన్యపు కదలికలు లేనటువంటి కుటుంబ నేపథ్యాల నుండి అమ్మాయిలు తమ కలలను సాకారం చేసుకోవడం కోసం ఎంతగానో పెనుగులాడాల్సి వచ్చేదని కూడ మనకి అర్థమవుతుంది.

అంటే ప్రత్యేకించి ఆనాటి సాంఘిక, రాజకీయ, సాంఘిక పరిణామాలను గురించి వివరించక పోయినప్పటికీ మనకి ఆనాటి సాంఘిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలు తమ చుట్టు పక్కల వారి ఆహార్యమూ, వారి ఆటపాటలు, ఆహార పద్ధతులు, ఆర్థిక స్థితిగతులు, సంస్కృతి, ఆనాటి వైద్య పరిస్థితులు, విద్య పట్ల ఎక్కువ మందికి ఆసక్తి లేకపోవడం, బిసి సామాజిక వర్గాల్లోని సాంప్రదాయాలు, సంస్కృతులు, పండుగలూ, పబ్బాలూ మొత్తంగా ఒక సామూహిక గ్రామ జీవితం తాలూకూ వివిధ కోణాల నుండి రాజకీయం మిసమిసలాడుతూ స్పష్టమవుతూనే వుంటుంది. 

ఈ బాల్యపు ఘట్టంలో నన్ను మరింతగా ఆకట్టుకుని గుండె తడి పెట్టించింది”నాన్నమ్మ”, ఆమె బలమైన వ్యక్తిత్వం. 

వరలక్ష్మి గారి నాన్నమ్మ చాలా సౌందర్యరాశి. బహుశా ఆమె వర్చస్సే వరలక్ష్మి తండ్రికి, ఆ తండ్రి నుండి వరలక్ష్మి గారికి వచ్చి వుండొచ్చు. ఆ నాన్నమ్మ సత్తెమ్మ పెళ్ళైన రెండు మూడేళ్లకే భర్త మరణించడం తో ఆ పసి గుడ్డు (వరలక్ష్మి తండ్రి)తో ఒంటరిగా బావగారు పంచి ఇచ్చిన తాటాకుల ఇంట్లో జీవించేది. బావగారి కుటుంబం పెద్ద పెంకుటింట్లో వుండేవారు. 

“మా పెద్ద తాత అర్ధరాత్రి వచ్చి తలుపులు బాదేవాడట. తియ్యడం లేదని ఆ పూరింటి తాటాకుల  మీద కర్రతో కొట్టి ఆకులన్నీ రాల్చేసే వాడట. రాత్రులు భయంతో పసి వాడైన మా నాన్నని  గుండెలకు హత్తుకుని పడుకునేదట. నాన్నమ్మ పొలాల్లో కూలికి వెళ్లి మా నాన్నను పెంచుకుంది” అంటూ ఈ మగ రాక్షసులతో ఒంటరిగా ఎన్నెన్ని కష్టాలు పడ్డదో బావగారి దురాగతాలను ఎంత ధైర్యం గా ఎదుర్కొందో చెప్తూ  “కొడుకు సంపాదనా పరుడై ఇంట్లో డబ్బు కనిపిస్తున్నా సరే ఏమాత్రం పట్టించుకోని యోగి పుంగవురాలు మా నాన్నమ్మ” అంటుంది వరలక్ష్మి.

ఇటువంటి బాల్యంలో ఎప్పుడు ఎలా మొదలైందో గానీ సాహిత్యం పట్ల ఆసక్తి ఒక పూల తీగలా ఆమెను అల్లుకు పోయింది.

సాహిత్యానికి చేరువవడం ఆమెని చుట్టుపక్కల వారి నుండి ప్రత్యేకంగా నిలబెట్టింది.  ఆ చిన్న వయసు సాహిత్య స్పర్శ ఆమెని నేల మీద నుండి జానడెత్తు లో నడిపించేది. సాహిత్యం లోని పాత్రలని దగ్గరగా అర్థం చేసుకుని నిజజీవితం లోని మనుషుల ప్రవర్తనలతో బేరీజు వేసుకునేది. 

సూర్యోదయాలు, సూర్యాస్తసమయాలు,  కొబ్బరి ఆకుల సందు నుండి తొంగి చూసే వెలుతురు నీడలు, నీటి మీది నుండీ ఒక్కసారిగా పైకెగిరే కొంగలూ,  గాలిలో తేలి వచ్చే పూబాలల స్నేహ పరిమళాలు ఆమెని మైమరచి పోయేలా చేసేవి. ఇంటి పనులేవీ ఆమెకి పట్టేవి కావు. ఇత్తడి బిందెతో చెరువుకి నీళ్ళ కోసం వెళ్లి చెరువు నిండా విరిసిన తామర పూల అందాలను చూస్తూ బిందె ముంచకుండా కూర్చుండి పోయే లాంటి భావుకత్వాన్ని ఇచ్చిందామెకు సాహిత్యం.

చదువు పట్ల తీవ్రమైన ఆసక్తి, సంగీత సాహిత్యాల తోడు, తండ్రి ఆదరణ ఎన్ని అవరోధాలొచ్చినా ఆమెని ముందుకు నడిచేలా చేశాయి. 
ప్రతీ ఏటా ఉత్తమ విద్యార్థిని గా ఎన్నికవడం ఆమె విద్యార్థి జీవితం లోని ప్రత్యేకత.

***
జోగారావు మాస్టారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. 
“మంచి కూడుకీ మంచి కూర అమరదు” అని. అది వరలక్ష్మి జీవితానికి సరిగ్గా వర్తిస్తుంది. 

ఇటువంటి సుందర, సుకుమార సౌందర్య రాశి, ఊరందరి ప్రేమలతో నిండిన బాల్యాన్ని గడిపిన వరాల పట్టి,  తన నడవడిక తోనూ, చదువు తోనూ, శ్రావ్యమైన స్వరం తోనూ, ఏటా ఉత్తమ విద్యార్థిని గా ఎంపికవుతూ వచ్చిన ఈ సుగుణాలరాశిని పెళ్లి ఎంత దారుణం గా వంచించిందో చదువుతుంటే వూపిరాడదు మనకి. చాలా సార్లు సావిత్రి రాసిన “బందిపోట్లు” కవిత మనసులో మెదిలి “పెళ్లంటే పెద్ద శిక్ష ” అన్న వాక్యం వెంటాడి వేధిస్తుంది మనని. చాలా ఏళ్ళ క్రితం బందిపోట్లు కవితని స్వర పరిచి గీత పాటగా పాడినప్పుడు “మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడనీ” అన్న చోట ఆమె గొంతు లోని విరుపు నాకింకా గుర్తే.

వరలక్ష్మికి బాల్యం సుందరమైన ఉషస్సు అయితే పెళ్లి తర్వాతి జీవితం అగ్ని సరస్సులలో ఈత…..చెప్పడానికి కష్టంగా అనిపిస్తున్నా ఇదే వాస్తవం.

వరలక్ష్మి నాకు మంచి స్నేహితురాలు. లైక్ మైండెడ్ అని అంటుంటాం కదా అలా. ఎక్కడ మీటింగులు జరిగినా మేమిద్దరమూ గదిని పంచుకునే వాళ్ళం. ముఖ్యంగా ఏటా జరిగే “అజో విభో కందాళం” సంస్థ వారి సాహిత్య సభల్లో మేమిద్దరం రెండు మూడు రోజుల పాటు కలిసి వుండేవాళ్ళం. ఆ సమయం లో హృదయాలు విప్పి ఎడ తెరిపి లేకుండా మాట్లాడుకునే క్రమంలో వరలక్ష్మి చాలా విషయాలు నాతో పంచుకునేది. ఎప్పుడూ ఆమె పెదాల మీద చెరగని చిరునవ్వు నన్ను ఆశ్చర్యచకితను చేస్తుంది. ఆ నవ్వుని ఆమె పుట్టుక తోనే వరంగా తెచ్చు కుందేమో అన్నంత సహజం గా వుండి అసలామెకి కోపమన్నదే రాదా అన్పించేది చాలాసార్లు. 

ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా నంటే ఆమె జీవితమంతా కూడా ఇదే చిరునవ్వు తో సర్దుకు పోవడంతో, మౌనంగా, గుట్టుగా భరించడంతో నడిచింది అన్పిస్తుంది. 

ఆమె కళ్ళల్లో నూ, మనసులోనూ ఎప్పుడూ గోదావరి ప్రవహిస్తూ వుండేది. కాళ్ళూ, చేతులూ సంకెళ్ళతో బిగింపబడినట్లుగా ఒక ఊపిరాడని నిర్భంధం, నిస్సహాయత …అధవా ఎప్పుడైనా తలెత్తాలని ప్రయత్నిస్తే తగిలే దెబ్బలకి ఎదురీదడం,  కష్టమైనా సుఖమైనా గడప దాటి రావద్దన్న తల్లి మాటలు, కదులు చూద్దాం నరికి పోగులు పెడతాననే భర్త బెదిరింపులు, అత్తమామలు, భర్త పిన్నులు, బాబాయిలూ అందరి దాష్టీకానికి తల ఒగ్గుతూ తనకి చదువూ, తండ్రీ అంతా వుండి కూడా ఆమె ఎందుకలా వుండిపోయింది. అన్న ప్రశ్నకు ఆమె సహజపు చిరునవ్వే సమాధానమా?… ఈ సమాజం స్త్రీలను ఎంత కట్టుదిట్టంగా, ఎంత ఒడుపుగా మలుచుకుంటూ వస్తుందో మరోసారి తేటతెల్లమవుతుంది. 

ఒక్క సన్నివేశం నన్ను అతలాకుతలం చేసి మూడు నిద్ర లేని రాత్రులను ప్రసాదించింది అంటే అతిశయోక్తి కాదేమో… మేనమామతో కడపకు వెళ్లి అక్కడ చదువుకోవాలని ప్రయత్నించి సాధ్యపడక తిరిగి వచ్చాక అత్తగారు (ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమని బోధించిన మహోన్నతుడైన క్రీస్తు ప్రభువు అనుయాయి) వరలక్ష్మి జడని చేతికి చుట్టుకుని కొబ్బరి పుల్లల చీపురుతో ఎడా పెడ బాది వదిలిపెట్టారు. నిజానికి నేను ఏడ్చింది అందుకు కాదు. ఇటువంటి అత్తగారిని, ఆడపడుచులనీ ఆమె భర్త మరణం తర్వాత కూడా వరలక్ష్మి  ప్రేమగా చూడ్డం గుర్తొచ్చి ఏడుపొచ్చింది. 

వరలక్ష్మికి స్థిరంగా ఒక చోట, ఒక ఇంట్లో వుండడం ఇష్టంగా వుండేది.  కానీ జీవితమంతా ఆ జంగమ సంసారాన్ని మోసుకుంటూ, భరిస్తూ, పిల్లలని కాపాడుకుంటూ, స్కూలు నడుపుతూ కూడా అట్లాస్ లా వొంగి పోకుండా భుజాలని నిటారుగా నిలబెట్టుకోగలగడం ఆమె లోని ప్రత్యేకత. 

చాలా హాయిగా, ఆహ్లాదంగా,  అందమైన పూల వనం వంటి ఆమె బాల్యంలోకి చేయిపెట్టి నడిపిస్తూ ప్రారంభమైన ఈ ఆత్మకథ పూర్తయ్యేటప్పటికి పాఠకుడి లో తీవ్రమైన ఆగ్రహావేశాలను, దిగులునీ మిగులుస్తుంది.

ఈ జీవిత చరిత్ర చదివి చెరువై పోయిన గుండెతో ఓల్గా గారు “లక్షలాది మంది స్త్రీలు ఎందుకిలాటి దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఎవరి కారణాలు వాళ్ళకున్నప్పటికీ సామాజికమైన కారణాలు మాత్రం అందరికీ ఒకటే.  ఈ వివాహ వ్యవస్థకు ఇంతటి బలం ఎక్కడి నుండి వచ్చింది?
అన్న ప్రశ్నకు స్త్రీ పురుషులిరువురూ సమాధానం వెతకాల్సి వుంది. దీన్ని ప్రజాస్వామకంగా మార్చు కునేందుకు ప్రపంచంలో ఇప్పటి వరకూ జరిగిన విప్లవాలు అన్నిటికంటే పెద్ద విప్లవం జరగాలి” అని అంటారు. 

వాస్తవం కూడ అదే…పెద్ద విప్లవం అన్న పదం కింద అండర్ లైన్ చేయాలి. 

స్త్రీల మీద ఈ వ్యవస్థ మోపిన భారాలను కిక్కురుమనకుండా మోస్తూ, అదే జీవితమని భ్రమిస్తోన్న స్త్రీలకి, తమకంటూ చోటు లేకుండా చేసి,  ఈ వ్యవస్థ స్త్రీల లోని సామాజిక శక్తుల్ని ఎట్లా కత్తిరించి వేస్తోందో వేయినోళ్ళ అరిచి చెప్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఈ “తొలి జాడలు”పుస్తకం చాలా తీవ్రంగా మనందరికీ ఆ విషయాన్ని గుర్తుచేస్తోంది. పితృస్వామ్యం, కుటుంబ హింసల గురించి మళ్ళీ పదునైన చర్చలు మొదలు కావాల్సిన అవసరాన్ని అర్థం చేయిస్తుంది. 

అర్థాంతరంగా ఆగిపోయినట్టన్పించిన ఈ జీవిత చరిత్ర రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ వరలక్ష్మి గారికి స్నేహాభినందనలు… ఆలింగనాలూ…

****

పుస్తకాలు దొరుకు చోట్లు:

Hyderabadbooktrust.com, flipcart, amazon-
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.