సాధికార స్వరం

-శిలాలోహిత

ఒకప్పుడు

నేనెక్కడున్నాను

అని ప్రశ్నించుకునే తరుణం

శతాబ్దాల పాటు సాగుతున్న

అణచివేతల సారాన్నంతా

గుక్కపడుతున్న కాలం

ఇప్పుడు

సముద్రాన్ని ఈదిన రోజులు

పెనుతుఫాన్లకి ఎదురొడ్డిన రోజులు

స్త్రీలంటే కొలతల సమూహం కాదని

ఒక మనిషిని

తనలాంటి తోటి మనిషేనని

తెలియజెప్పిన కాలజ్ఞానం

బానిసత్వానికి సంకెళ్ళువేసి

పావురపు రెక్కలతో

నక్షత్ర వీధిని చేరి, అన్నింటా గెలిచి

తనహేతుబద్ధ వాదనతో నిజాల్ని వెల్లడించింది

ఇప్పుడిప్పుడే

కొత్త కొత్త న్యాయసూత్రాలను బట్టీయం

వేస్తున్న వారి డొల్లతనాన్ని, విద్వేషాల్ని

పసిగట్టి, లోకమంతా చైతన్యాన్ని జల్లుతున్నారు

సాధికారికత అంటే

ఇన్నాళ్ళూ విన్న, వింటున్న ఊకదంపుడు మాటలకు

చెక్ పెట్టిన రోజులు

రాతి గుహల్ని దాటి

దుర్నీతిని బట్టబయలు చేసి

విడిపోయిన ఆకాశాలను ఒకటిగా చేసి

కుటుంబాలలో

పూర్తిగా మానసిక చైతన్యం వచ్చినప్పుడే

పిల్లల పెంపకంలో జెండర్ వివక్ష చూపనంత వరకూ

సాటి మనిషేనన్న స్పృహ లేనంతవరకూ

ఈ సమాజమూ, మట్టీ, మన్నుగడ్డ మారవన్న

బలోపేత నిర్ణయంతో

మళ్ళీ మళ్ళీ కొత్త పుట్టుకతో, కొత్త జీవితాల్ని

సమాజాన్ని నెలకొల్పాలన్న ధీరత్వంతో

ఎలుగెత్తి చాటుతున్న రోజది

ఇప్పుడు స్త్రీలు సాధించిన విజయమిది

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.