జి. ఉమామహేశ్వర్ కథా సంకలనం “భరోసా” పై సమీక్ష

  -పి.జ్యోతి      

 మానవత్వాన్ని విశ్వసించే రచయిత కలం నుండి వెలువడిన కథాసంకలనం “భరోసా”

జి. ఉమామహేశ్వర్ గారి కథా సంకలనం “భరోసా” చదివిన తరువాత తెలుగులో “కథ” స్థాయిని ఈ తరంలో కూడా నిలపగలిగే రచయితలు ఇంకా ఉన్నారని ఆనందం కలిగింది. ఈ రచయిత పేరు పెద్దగా సాహితీ చర్చలలో వినిపించదు. ఏ పోటిలలో కనిపించదు. ఎంతో హైప్ తొ వెలువడే కథా సంకలనాల మధ్య వీరి పుస్తకాలను ఎవరూ పరిచయం చేయరు. మంచి కథలు పాఠకులకు దూరం కాకూడదనే సంకల్పంతో ఈ కథా సంకలనాన్ని, ఇందులోని కథా వస్తువును ఇలా పరిచయం చేస్తున్నాను. కథ అంటే మానవ జీవితాలను, అనుభూతులను, అనుభవాలను భాష అనే మాధ్యమంతో ప్రకటించగలిగే ఒక ప్రక్రియ. మనిషి ఆలొచనల సుడిగుండంలో కొట్టుకుపోతున్న సమయంలో అతని ఆలోచనలకు ఒక రూపాన్ని, సంకల్పాన్ని కల్పించగల శక్తి సాహిత్యానికి ఉంది. అయితే ఇది జరగాలంటే సాహిత్యాన్ని సృష్టిస్తున్న రచయితకు జీవితం పట్ల ఒక స్పష్టత, కొంత అనుభవం అవసరం. ఇవేమీ లేకపోయినా కథకులకు ఉండవలసింది నిజాయితి, తాను రాస్తున్న విషయాలపట్ల స్పష్టమైన అవగాహన. ఇది లోపించినపుడు కథకుల కలం నుండి సారవంతమైన సాహిత్యం జన్మించదు. ప్రస్తుతం కథకులం అని చెప్పుకుంటున్న చాలా మందిలో భాషాపరిజ్ఞానం ఉన్నా, భావాల వ్యక్తీకరణకు అనువైన శైలి ఉన్నా వారి కథలు పాఠకుల మనసులకు చేరువ కాలేకపోతున్నాయి. అందుకని రకరకాల ప్రలోభ పద్దతులతో సాహిత్యం మార్కెట్ అవుతుంది. వీటి మధ్య నిక్కార్సైన కథలు కొన్ని వస్తున్నా అవి పాఠకుల దగ్గరకు మార్కెట్ మాయాజాలం కారణంగా చేరలేకపొతున్నాయి. అందుకే అటువంటి సాహిత్యం కనిపించినప్పుడు వాటికి సరైన గుర్తింపు ఒక పాఠకురాలిగా ఇవ్వాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. “భరోసా” ఒక పరిణితి కలిగిన రచయిత సృష్టించిన కథా సంకలనం. సున్నితమైన మానవీయ స్పందనలను అందులోని మానవ కోణాలను, వాటిని మరుగు పరుస్తున్న మానవ  మూర్ఖత్వాన్ని బట్టబయలు చేసే పదిహేను కథల సమాహారం ఇది.

 పెద్ద తరం యువతరం లోని నిర్లక్ష్యాన్ని, నిబద్దత లేని జీవితాలను గమనిస్తూ వీరిలో ఇక  పద్దతి, ఆదర్శవంతమైన జీవితం ఉండదని నిరాశలో కొట్టుకుపోతున్న రొజులివి. కాని గమనిస్తే ఈ పరుగుల తరంలో కూడా నమ్మిన వారి కోసం ఎంతటి కష్టానికైనా ఒర్చి పని చేసే యువక శక్తి ఉంది. వీరి సంఖ్య తక్కువయిందేమో కాని ఇటువంటి యువత ప్రతి తరంలో కనిపిస్తూనే ఉంటారు. వీరే పాత తరానికి మానవజాతి గమనానికి భరోసాగా నిలుస్తారు. అటువంటి యువత కథ ఇది. అతి క్లిష్టతర పరిస్థితులలో కూడా మాట ఇచ్చినందుకు, దాన్ని నిలుపుకోవడానికి పాటుపడుతూ, నేటి టేక్నాలజీని తెలివిగా ఉపయోగించుకుని తన నిజాయితీని, నైపుణ్యాన్ని ప్రదర్శించి తాను పని చెస్తున్న్ సంస్థకు న్యాయం చేసిన ఒక యువతరం ప్రతినిధి  మనకు ఈ కథలో కనిపించి ఆనందాన్ని  కలుగజేస్తాడు. భవిష్యత్తు గురించి నిరాశలో కూరుకుపోయిన ఒక తరానికి మంచి రోజులు ఉన్నాయని భరోసా కలిగిస్తాడు “సాయీ” అనే ఆ యువకుడు.

జీవితం అంటే డబ్బు సంపాదించడం కోసం పరుగు పెట్టడం కాదని, మనిషికి సాటి మనిషిపై గౌరవం, ప్రేమ ఉండాలని, ఇతరుల మనసులలోకి తొంగి చూసి వారి వ్యధను అర్ధం చేసుకోలేని మనిషి ఎన్నటికీ ఉన్నతుడు కాడని నమ్మే ఒక వ్యక్తి ని అతని కుటుంబ సభ్యులు క్రూర మృగాల మధ్య గొర్రె ను చూసినట్లే చూస్తారు. అతనికి బ్రతకడం రాదని బాధపడతారు. ఈ నాటకీయ ప్రపంచంలో నిజంగా బ్రతుకుతున్నది అతనే అని మిగతావారిది కేవలం నటన అన్న నిజాన్ని వారు అర్ధం చేసుకోలేరు.  ఒక మంచి  మనిషితో జీవిస్తూ భర్తగా అతన్ని దగ్గరగా పరిశిలిస్తూ, తెలివైన వారిలా విజయం వైపుకు ప్రయాణించలేని అతన్ని చూసి జాలి పడుతూ, చివరకు అదే మంచితనం తన కోడుకులో చూసి ఆ బిడ్డ భవిష్యత్తు గురించి ఆరాటపడే ఒక తల్లి కథ “ఎట్లా బ్రతుకుతాడో” మంచితనాన్ని చేతకానితనం అని తలచే వ్యవస్థ మూర్ఖత్వాన్ని ప్రశ్నించే కథ ఇది. డబ్బు సంపాదనలో పడి ప్రతి దాన్ని కేవలం సంపాదించుకునే వస్తువుగా చూసే సామజిక వాతావరణంలో దళారీలు గా మారుతున్న వ్యాపారస్తుల స్వార్ధం “ఒక దళారీ పరాభవం” అన్న కథలో చూస్తాం. లక్షలు కోట్ల మాయలో పడి ఈ దళారీ చేతులో నిత్యం మొసపోతున్న మనుష్యుల మధ్య ఒక పేద రైతు వేసిన ప్రశ్న, దళారి ప్రలోభాలకు లొంగని అతని నిబ్బరం చూసిన తరువాత డబ్బు మీద యావ మనిషి మెదడును ఎలా ఆడిస్తుందో స్పష్టంగా చూస్తాం. దళారీల మాయలో పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో, మన ఆత్మగౌరవాన్ని ఎలా రక్షించుకోవాలో అని ఆలోచిస్తాం. 

ఈ సంకలనంలో  నాకు బాగా నచ్చిన కథ “క్విజ్ మాస్టర్”. గెలుపే జీవితంలో ముఖ్యం అని బోధిస్తున్న విద్యా వ్యవస్థ పిల్లలను ఎంత స్వార్ధపరులుగా తయారు చేసుందో ఒక క్విజ్ పోటీ లో కనిపిస్తుంది. వ్యాపారస్తుల వలే లాభ నష్టాలు ఎంచుకుంటూ, వ్యూహాత్మకంగా తమ గెలుపు ని నిర్ధారించుకునే పిల్లలను చూసిన తరువాత వారు జీవితంలో ఏ విలువలను నమ్ముతున్నారో, ఏ దిశగా ప్రయాణీస్తున్నారొ అని భయపడతాం.  “విజయం కంటే విలువలు గొప్పవని, సాధించిన విజయంతో పాటు సాధన మార్గం కూడా ముఖ్యమైనదని ఆ పిల్లవాళ్లకు ఎవరూ చెప్పడం లేదెందుకు “ ఉన్నత స్థానానికి ఎగబాకే క్రమంలో ఉదాత్తతని విస్మరించడం తప్పని వాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారు” అని బాధపడే ఒక ఉపాద్యాయుడు అర్ధం అవుతే విజయం పట్ల మనకున్న విపరీత వ్యామోహం, విలువల పట్ల మనకున్న సర్ధుబాటు ధోరణి మనిషి జీవితాన్ని ఎంత కలుషితం చేస్తున్నాయే అర్ధం చేసుకోవచ్చు. ఈ ఒక్క కథ కోసం అన్నా తప్పకుండా ఈ సంకలనాన్ని కొని ఇంట్లో ఉంచుకోవాలి. 

రచయితకి పసి పిల్లల పట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు అర్ధం అవుతుంది ఈ సంకలనంలో కొన్ని కథలు చదివితే. నిష్కలంకమైన వారి మనసులను పెద్దలే కలుషితం చేస్తారు అనే నిజాన్ని వీరు కొన్ని కథలలో చూపిస్తారు కూడా. “గోకులన్న” అన్న కథలో తన పుట్టిన రోజు నాడు తన కిష్టమైన అన్నను పిలుచుకోవాలని ఒక అమాయక మైన పిల్లవాడు కోరుకుంటాడు. కాని అతని తల్లికి ఇది ఇష్టం ఉండదు. అకారణమైన కోపాన్ని ఆ గోకులన్న పై ఆమె చూపిస్తుంది. అటు తల్లికి చెప్పలేక, తనకెంతో ఇష్టమైన అన్నను ఇంటికి పిలవలేక ఆ అబ్బాయి పడే క్షోభను చూసిన అతని తండ్రి తెలివిగా ఆ అబ్బాయి కోరిక తీరేలా చేయడం కథా వస్తువు. చాలా సున్నితమైన స్నేహ మాధుర్యాన్ని చర్చించే కథ ఇది.  “వైట్ బోర్డ్” అన్న కథలో కూడా పసి పిల్లల మధ్య ప్రేమను, ఆప్యాయతలను వర్ణిస్తూ, పిల్లల మధ్య ఉండే నిష్కళంకమైన ప్రేమను పరిచయం చేస్తారు రచయిత. 

కృష్ణా జలాల కోసం జరుగుతున్న రాజకీయాన్ని చూసి భరించలేక కృష్ణా నది పూర్తిగా ఇంకి పోయి స్వర్గానికి  చేరిందట. అక్కడ తనను పలకరించిన సరస్వతీ నదిని చూసి మన కోసం వారు గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటుంటే చూడలేక భూమిని వదిలి వచ్చేసానని చెబుతుంది కృష్ణ. ఈ కథలో రచయిత ప్రదర్శించిన శైలి బావుంటుంది. ఒక చిన్న ఆస్థి తగాదా లో “మనుష్యులు ఎప్పుడు నిస్సహాయుడి వైపే ఉంటారని, ఇది మనిషి మూల స్వభవమని కొన్ని సార్లు న్యాయాన్యాయాలు, ధర్మాదర్మాలకి అతీతంగా మానవుడి తక్షణ స్పందన బలహీనుడి వైపే ఉంటుందనే” నిజాన్ని తెలుసుకునే రవి అనే పాత్ర “ధర్మామీటర్” అనే కథలో కనిపిస్తుంది. న్యాయమైన  బలవంతుడి కన్నా మోసగాడైన బలహీనుడి పట్లే ప్రతి ఒక్కరికీ సానుభూతి ఉంటుదనే నిజం తెలియజేసిన కథ ఇది. 

తమ జీవితాలలో మార్పు గురించి పెద్దగా ఆలోచించకా, జీవితంలో వివక్షను కూడా మౌనంగా స్వీకరించే కొన్ని వర్గాలకు తన స్థితిగతుల పట్ల అవగాహన ఎంత అవసరమో చెప్పే కథ “నీ లేల పాడెద దేవా” మంగలివాని కులం లో పుట్టి సన్నాయి వాద్యమే పరమపదం అని నమ్మి ఆ వృత్తి ప్రేమించే ఒక కళాకారుని కొడుకు తమ స్థితిగతులను మెరుగు పరుచుకోవడానికి కుల వృత్తికి దూరం అవడం ఇందులోని కథ.  మనిషిని దేవుడుగా చేసి అతనిలోని గొప్పదనాన్ని సమాధి చేసి అతన్ని పూజిస్తూ భక్తిని ఆధ్యాత్మికత నుండి విడదీసే మానవుల కథ  “మనిషి-దేవుడు”. ఒక సాధువు మహిమ గల వాడని నమ్మి అతనికి గుడి కట్టించి అతను చెప్పిన మాటలనే విస్మరించి తమ భక్తిని మూర్ఖపు ప్రదర్శనగా మార్చుకుని చివరకు ఆ మహనుభావుడు విస్మరించమని భోధించిన విషయాలనే పట్టుకుని అతన్ని రాయిగా మార్చే మూఢ భక్తులను ఈ కథలో చూస్తాం.

 సెల్ ఫోన్ వైబ్రేషన్లకు బలి అయిపోయిన పిచ్చుకలు ఎన్నో. అయితే ఈ విపత్తుకి తట్టుకుని నిలబడి తమ జాతిని నాశనం కాకుండా చెసుకున్న పక్షులు కొన్ని ఉన్నాయి. తమ శరీరంలో సెల్ టవర్ల వైబ్రేషన్లను తట్టుకోగలికే ఇమ్యూనిటీని పెంచుకుని పూర్తిగా అంతరించిపోకుండా తమ జాతిని కాపాడుకున్న పిచ్చుకల కథ “మొదటి పిచ్చుక”

 

అస్థికి వారసులు అయే కుమారులు చాలా సార్లు వ్యక్తుల భావాలకు, ఆశయాలకు వారసులుగా నిలబడరు. తండ్రి ఆస్థి కోసం ఎంతటి దూరాభారాన్నయినా, ఎంతటి శ్రమనయినా ఓర్చుకుని కష్టపడాలనే కొడుకులు ఆ ఆస్థిని తమ హక్కుగా అనుకుంటారు తప్ప, హక్కుల తో పాటు భాద్యతలు కూడా ఉంటాయని, తండ్రి పట్ల తమ భాద్యత నెరవేర్చడం ప్రధమ కర్తవ్యం అని తెలుసుకోరు. ఒక వ్యక్తి ఆశయాలకు, ఆశలకు ఎవరు ప్రతినిధులుగా నిలవగలరో వారే నిజమైన వారసులు అన్న అభిప్రాయాన్ని ప్రకటించిన కథ “వారసులు” ఈ సంకలనంలో ఇది మరో మంచి కథ. “సిద్దాంతలకు, భావాలకు వారసులుంటారేమోగాని సిద్దాంతకర్తలకు ఉండల్సిన అవసరం లేదు” అంటారు రచయిత ఈ కథలో. తల్లి దండ్రుల పట్ల తమ భాద్యతను మర్చిపోయి  వారిని వృద్ధాప్యంలో ఒంటరిని చేసి తరువత తాము వృద్దులయినాక పశ్చాత్తాపపడే వ్యక్తుల కథ “చందమామ రావే” “మన దేశంలో తయారైన నీలిమందు, పత్తి ఉపయోగించి ఫ్యాక్టరీలో బట్టలు తయారుచేసి మనకే అమ్మిన పరతంత్ర కాలానికి, మన వనరులు ఉపయోగించి సాప్ట్ వేర్ తయారు చేసి మనకే అమ్ముతున్న స్వాతంత్ర్య కాలానికి మధ్య మనమేం సాధించాం” అని ప్రశ్నిస్తూ, మూఢ దేశభక్తి కన్నా ఒక చిన్న పొరపాటు కారణంగా వందల మంది భుక్తికి ప్రమాదం జరగకుండా, ఒక చిన్న మోసంతో మంచి చేసిన ఒక వ్యక్తి కథ “నేను నా దేశమును”. మంచి, చెడు నిజం అబద్దం అన్న విషయాల పట్ల ప్రాధాన్యత సందర్భాని బట్టి మారుతుందని, ప్రజా ప్రయోజనాన్ని మించిన ఆదర్శం మరొకటి లేదని ఈ కథ చెబుతుంది. మనిషి స్వార్ధానికి బలి అవుతున్న వృక్షం మనిషికి బుద్ది చెప్పడం “హరిత విప్లవం” అనే కథలో చూస్తాం.

జి. ఉమామహేశ్వర్ గారి కథల చదివిన తరువాత, వీరు వ్యక్తిగత ప్రయోజనం కోసం కాక సమజిక ప్రయోజనం కోసం సాహిత్య సృజన చేసారనిపిస్తుంది. కథలలో వీరు ప్రస్తావించిన సమస్యలన్నిటికి సామూహిక ప్రయోజనం చేకూరాలని ఆశించారు. వీరు ఈ కథలలో సంధించిన ప్రశ్నలు ఏ ఒక్క పాత్ర మనోగతాలో మాతమే కావు. వాటికి సమాధానాలు వెతకడం మనందరి భాద్యత అవుతుంది. రచయితకు మనిషి పట్ల చాలా నమ్మకం ఉందని అర్ధం అవుతుంది, పక్కదారి పట్టిన మానవ మేధస్సును తిరిగి మంచి వైపుకు మళ్ళించగలం అని ఆయన బలంగా నమ్ముతారు. అందుకే వీరి కథలలో నిరాశావాదం కనిపించదు. ఇది మంచి పరిణామం. ఎవరి పట్లా ప్రతికూలత కనపర్చరు. అందుకే వీరి కథా వాతావరణం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. వాస్తవాన్ని అంగీకరిస్తూ, అందులోని మంచి చెడులను విశ్లేషిస్తూ  మార్పు కోసం మానవ జీవనం ఎటువైపుకి ప్రయాణించాలో ఆలోచించమని అభ్యర్ధించే ఆశావాద రచయిత జి. ఉమామహేశ్వర్. “భరోసా” అందువలన ఒక మంచి కథా సంకలనం గా గుర్తుండిపోతుంది. 

****

Please follow and like us:

2 thoughts on “జి. ఉమామహేశ్వర్ కథా సంకలనం “భరోసా” పై సమీక్ష”

  1. ఉమా మహేస్వర్ చాలా ప్రతిభావంతమైన రచయిత. అరుదైన వస్తువులు కథఅంశాలుగా తీసుకొని చాలా నేర్పుగా చెప్పగలరు.

  2. భరోసా సమీక్ష బాగుంది, క ధలను చదివే యాలని
    కోరిక పుట్టేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published.