ఒక్కొక్క పువ్వేసి-6

మద్యమ్ మత్తు నేరాలకు ఎవరు బాధ్యులు?

-జూపాక సుభద్ర

ఈ మద్య హుజురాబాద్ బై ఎలక్షన్స్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వము ‘దళిత బంధు’ ను ప్రకటించినట్లు మద్యం షాపుల కేటాయిపుల్లో ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% గౌండ్లవాల్లకు 15% రిజర్వేషండ్లనీ, యింకా నాలుగు వందల నాలుగు (404) మద్యం షాపులు పెంచుతున్నామని ప్రకటించింది.
ఈ సంగతి టీవీలో చూసిన మా అటెండర్ విజయ వచ్చి ’ఏందమ్మా !
గీ ముచ్చటిన్నవా, తెలంగాణను ఇదివరకే కల్లుల ముంచి కల్లుల తేలుస్తుండ్రనుకుంటే గది సాలదని కల్లమ్ముకోనీకి రిజర్వేషండ్లిచ్చి, యింకా ఇప్పుడున్న దుకుణాలు సరిపోలేదని ఒక్కటిగాదు రెండు గాదు నాలుగువందల రెండు దుకానాలు బెంచింది. గౌరుమెంటు జనం మంచిసెడ్డ సూడాలెగనీ గింతద్వానమామ్మ. గీ తాగుడు జెయ్యవట్టి మా బత్కులు బజారుపాలాయె సంసారాలు యిచ్చుక పాయె, మొగడు లేని మొద్దుల లెక్క బత్కవడ్తమి. మన సెక్రెటేరియట్ ఆఫీసుల నేనొక్కదాన్నేనా ,నా అసోంటోల్లు నూటయాబైమందుంటరు. మీరంత అంటరు సూడుండ్రి ‘యoగ్ విడోల’ మని గట్ల 150 మంది మున్నం. పెండ్లాంపిల్లల బట్టక తాగి తాగి కడుపుల కార్జాలు సెడిపోయి సచ్చిపోయిండ్రు ముప్పయేండ్లు గూడ ముదురక ముందే… టీవిల తాగినోనికి తాగినంత, తలకు వోసుకునేటోల్లకు తలకు వోస్కున్నంత అని మొత్తుకుంటాంటె పానం
కలకలయిందమ్మా. గౌరుమెంటే గిట్ల తాగుమని వుసిగొలిపితే , మా అసోంటోల్లు ఎట్ల బత్కుతము ? మా బస్తీలల్ల యూత్ పోరగాండ్లు,నడీడోల్లు ముసలోల్లు అంత తాగుడే… తాగుడు. గట్ల తాగినోనికి తల్లి లేదు, బిడ్డలేదు ఆడోల్లు గనబడితె సాలు ఆగమ్ జేసే గీ నేరాలకు గౌరుమెంటు గూడా జిమ్మెదారేనని కోర్టులు గూడ మొత్తుకొని సెప్పినా ,..,ఏలినోల్లకు సెవి నెక్కుతలేదు. గీ కల్లు దుకాణాల్ని కల్లమ్ జెయ్యాలె.
ఇయ్యాల రేపు జరిగే నేరాలు చానావరకు తాగినోల్లే జేస్తున్నపుడు గాల్లని తాగకుంట, నేరస్తులను జెయ్యకుంట మంచి మనుషులను జెయ్యనీకి కల్లు దుకాణాలు బందువెట్టచ్చు గదా,
గీ సర్కారు. అడుగు కో కల్లు దుకాణమ్ వుండె, యిగ తాగెటోన్ని ఎట్లాపుతరు. యీల్లను ఎన్ని కరోనాలు , ఎన్నెన్ని లాక్ డౌన్ లైనా ఆపయి. గిదేమి గౌరుమెంటమ్మా రొండోసారి లాక్డౌన్ అప్పుడు షాపులు గీపులు తెరువనీకి పర్మిషన్ లేకుండెగానీ కల్లు దుకాణాలు మాత్రమె తెరిసే వుండే. వున్నోడు ఎవడు తాగినా మా క్లాస్ ఫోర్లంత తాగుడు ఎవడు తాగడు. నాటుసారా, గుడంబ గిట్ల పైసున్నోల్లు ఎవలు తాగుతలు ! వాల్లు లిమిట్గ తాగుతరు,తాగినా వాళ్ళ పైసలు ఒడువయి , మా అంత బరిబాతలుగ తాగరు. గీ మా మొగోళ్లు యింట్లకు జీతమియ్యరు, జీతమంత ఒక్కరోజే తాగుతరు, అది సాలక అప్పులు జేసి గూడ తాగుతరు. కార్జాలు తూట్లు బడే గుడంబ, సారా తాగుతరు. యింట్ల పిల్లలు మేము వుపాసం జచ్చేటోల్లము, పిల్లలకు సదువుల్లేవు .
యిప్పుడు ఆ సచ్చినోల్ల వుద్యోగమ్ జేత్తన్నమ్, పిల్లలను బడికి తోలుకుంటన్నం గానీ యింటి మనిసి బోయిన దుక్కమ్ అడుగడుగున ఎదురొస్తంది. నా పిల్లలకు తండ్రిలేకపాయె, నాకు తోడు లేకపాయె. యిగ మన ఆఫీసుల, బైట, చుట్టాలల్ల భర్తబోయిన ఆడోల్లంటె లోకువ. ఏందో జాలిపడ్తరు. ఏందో సాయం పేరు మీద దగ్గరైదామని సతాయిస్తరు. యీ గాడిది కొడుకులు తాగి మా యిండ్ల మీదికొచ్చి బే ఇజ్జతిగా మాట్లాడ్తరు.
అమ్మా ! మా బస్తీ పోరలు ఎప్పుడు జూసినా సేతుల సెల్లులు, తూలుతానే కనబడ్తరమ్మా, ఏ మొగోడు మామూలుగ్గనబడడు. యింట్ల చిన్న చిన్న ఆడ పిల్లలుంటరు, ఆఫీసు కాన్నుంచి యింటికి బోయేదాక ఏమైందో,ఎంబోయిందనే గుటగుటనే వుంటది.” అనుకుంట యెల్లిపోయింది విజయ. యిది ఒక్క విజయ బుగులే గాదు, సమాజాన్ని అంతటిని వణికించే బుగులు.
తెలంగాణ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలనే పాచికలు గానే మద్యమ్ అమ్మకానికి రిజర్వేషన్స్ వచ్చినయి. ఎస్సీ ఎస్టీలకు గౌండ్లకు 30% పోతే మిగతా 70% ఎవరికి పోతున్నట్లు? యిన్నాల్లు మద్యమ్ షాపులు ఏ కులాల ఆధిపత్యంలో వున్నయి. ప్రభుత్వాలు ప్రజల్ని అభివృద్ధి చేయాలనే పేరుమీద మద్యాన్ని ఏరుల్లాగ పారిస్తే… అది అభివృద్ధా. ప్రజల్ని సమాజ ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వాలు ప్రజల్ని తాగించి వారు నేరస్తులుగా, హంతకులుగా, అత్యాచారాలు చేసేవాల్లుగా తయారుచేస్తుంది. మద్యమ్ ను క్రమంగా దూరం చేసే ప్రయత్నాలు చేయాలి ప్రభుత్వాలు. మనుషులు నేర ప్రపంచంగా మరాడానికి మద్యమ్ దుకాణాలను వేలకు వేలగా పెంచుతూ రాయితీలివ్వడమ్ ను ప్రజలంతా వ్యతిరేకించాలి. మద్యమ్ వల్ల ఎక్కువ విధ్వంసాలకు గురవు తున్నది బహుజన శ్రామిక కులాల మహిళలు. ప్రజల మానసిక దౌర్బల్యాల్ని, వ్యసనాల్ని వ్యాపారం చేసి సంవత్సరానికి దాదాపు 30 వేలకోట్ల పన్నులు కట్టించుకుంటున్నది తెలంగాణ రాష్ట్ర ఎక్సయిజ్ డిపార్ట్మెంట్. జనమ్ ఆరోగ్యాల్ని, ఆర్తికాల్ని ముఖ్యంగా శ్రామిక ఎస్సీ ,ఎస్టీ ,బీసీ కులాల ఆరోగ్యాల్ని, ఆర్థికాల్ని, కుటుంబాల్ని ధ్వంసం చేసే మద్యం దుకాణాలు ఎందుకు? ‘మద్యమ్ లేనిదే ఓట్లు రాలవు’ అని తెలంగాణ గవర్నమెంట్ బై ఎలెక్షన్ (హుజూరాబాద్) లో
” రిజర్వేషన్స్ కేవలం ఉద్యోగరంగంలోనే కాదు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వానిజ్య వ్యాపార రంగంలో కూడా వారికి రిజర్వేషండ్లు కల్పించాలనే ఉద్దేశంతోనే మద్యమ్ దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌండ్లోల్లకు రిజర్వేషన్స్’ అని ప్రకటించింది.
మద్యమ్ వల్లనే సమాజమ్ లోని మనుషులు నేర ప్రపంచంగా మారుతున్నారని బాలికలపై, మహిళలపై జరిగే లైంగిక దాడుల్లో, హత్యల్లో మనదేశమే ముందున్నదని అనేక సర్వేలు ఒక దిక్కు మొత్తుకుంటున్నయి. యింకో వైపు ’మద్యమ్ మత్తులో జరిగే నేరాలకు ప్రభుత్వాల్ని కూడా బాద్యుల్ని చేయాలని‘ కోర్టులు సూచిస్తున్నా… తెలంగాణ ప్రభుత్వానికి పట్టడమే లేదు. సమాజంలో వున్న తొంబయి పర్సెంటుగా వున్న బహుజన శ్రమకులాలన్ని మద్యమ్మత్తులో వుండి పోవాలె, విచక్షణలుండొద్దు, ప్రశ్నించొద్దు, తాగి బానిసల్లాగ పడివుండాలె, నేరస్తులు గా జైల్ల పడాలే, వారి కుటుంబాలు చిన్నాభిన్నమై పోవాలె. అధికార సీట్లు మాత్రము పాలక కులాలకు రావాలె.పీడిత కులాల జనమంతా మద్యం మత్తులో ఓట్లేయ్యాలె.
మద్యమ్ దుకాణాల విస్తృతి కోసం రిజర్వేషండ్లే కాదు అనేక అలివి గాని రాయితీలిచ్చినా యింకా వందల మద్యమ్ షాపుల్ని (2620) పెంచినా మద్యమ్ మత్తులో ముంచినా ఏమైంది? గల్లంతే అయింది. ఈ గల్లంతులు కల్లు దుకాణాల మీద కూడా పడితే…బాగుంటది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.