గోదావరి- ఒక పయనం

-ఎస్. జయ

గోదావరి నవ్వుల గలగలలు

కవ్విస్తుంటే వెంట వెళ్ళాం

కాపలా కాసే భటుల్లా

తెల్ల మబ్బుల గొడుగులు పట్టుకొని

బారులు తీరిన ఆకుపచ్చని కొండలు

దారంటా పరిచిన నురగల మల్లెలు

చిన్ని చిన్ని సుడిగుండాలు

నవ్వే గోదావరి బుగ్గల్లో సొట్టలు

సన్నని సవ్వడితో అలలు మెలమెల్లగా విరిగిపడుతూ

అంతలోనే కలిసిపోతూ

గాజుపలకల్లా మెరిసిపోతూ

కొండల అంచుల్లో అలలు

ఆకుపచ్చని రంగులో తలుకులీనుతూ


నవ్వుల పారిజాతాలు వెదజల్లుకుంటూ కాసేపు

సుదీర్ఘాలోచనలతో మరికొంతసేపు

మా కంతరాయం కలిగిస్తూ

ఉన్నట్టుండి హోరెత్తిన

“నాకున్నది పదహారేళ్ల వయసంటూ” పాట

ఆడుతున్న పన్నెండేళ్ల అమ్మాయి బాల్యాన్ని మింగేసింది

రోజూ టీవీల్లో, బడుల్లో

కన్నవాళ్ళే హంతకులవుతున్న వేళ

కళ్ల ముందు జరిగిన హత్యకు

కాసేపు మౌనం పాటించాం

                  

గోదావరి వంపుల్లో

ఎన్నెన్నో జీవిత సత్యాలు

మలుపు వుందని తెలుస్తుంది

ఆ మలుపు ఆవల ఏముందో రహస్యాన్ని చేదించాలని

మనసులో ఒక ఆరాటం మొలకెత్తుతుంది

మలుపు తిరిగే సరికి మరో మలుపు కవ్విస్తుంది

ఏ అందమైనా కనుమరుగవుతుందని అనిమేష నయినా

రెండు కళ్లు చాలని తనం వెక్కిరిస్తుంది

ఉన్నట్టుండి దారికడ్డంగా వేలాడుతూ 

నీలి మబ్బుల తెరలు

గోదావరినే దాచేస్తూ

తెరల్ని తొలగించుకొని లోపలికి తొంగి చూస్తే

మమ్మల్ని నిలువునా తడుపుతూ పాపికొండల పన్నీటి జల్లు

వర్షించే మబ్బులు మమ్మల్ని తమలోకి లాక్కున్నాయో,

మేమే రెక్కలు చాచి ఆకాశంలోకి ఎగిరిపోయామో

ప్రకృతిలో కలగలిసిపోయిన

అవ్యక్తమైన అద్భుత ఆనందంతో నిలువెల్లా వణికిపోతూ

అందరం ఒకే కవితగా పలవరించి

ఒకే ప్రేమను వరించాం

   

కొన్ని నిముషాలు గడిచి, మబ్బులు కరిగి

పాపికొండల మధ్య ఇరుకుదారిలో 

సాగిపోతున్న గోదావరి

అలలు లేవు గలగలలు లేవు

మౌనం తపస్సు చేస్తున్నట్టు

ధీర గంభీరంగా గోదావరి

ఏటికెదురీదే సాహసాలకు ప్రాణం పోస్తూ

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.