కాళరాత్రి-6

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

అయితే మేము మంటల్లోకి పోతున్నామన్నమాట. కొద్ది ఎడంగా పెద్దవాళ్ళను కాల్చే గుంట ` అందులో మంటలు. నాకు అనుమానం వచ్చింది. నేనింకా బ్రతికే ఉన్నానా? అని. పెద్ద, చిన్న, ఆడ, మగ అందర్నీ అలా కాల్చి చంపుతుంటే ప్రపంచం నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నది? ఇది నిజం కాదేమొ!  పీడకల అయి ఉండాలి నాది. ఒక్క ఉదుటున మేల్కొంటాను భయంతో చెమటలు కక్కుతున్నాను. తీరా చూస్తే నా చిన్ననాటి రూములో ఉన్నాను. చుట్టూ నా పుస్తకాలు ఉంటాయి అని అనుకుంటుంటే నాన్న గొంతు గట్టిగా వినిపించింది. నీ వయసు గల చాలా మంది పిల్లలు తమ తల్లులతో వెళ్ళటం చూశాను అంటున్న నాన్న గొంతులో విచారం అర్థమయింది. నన్నేమి చేస్తారో అని భయపడుతున్నాడు. తన ఏకైక పుత్రుడిని తన ముందే చంపటం చూడలేనన్న బాధ నాన్నలో.

నాకు చెమటలు పడుతున్నాయి.  ‘‘అలాంటిది జరగదు. ఈ రోజుల్లో మంటల్లో కాల్చి చంపటం ఉండదు. ప్రపంచం అలాంటి వికృతాన్ని సహించదు’’ అన్నాను.

‘‘ప్రపంచమా? మనం ప్రపంచానికి పట్టలేదు. ఏదైనా జరగవచ్చు మంటల్లో కాల్చి చంపవచ్చు’’ అంటుంటే నాన్న గొంతు పూడుకుపోయింది.

‘‘అలా జరిగిందంటే నేను ఎలక్‌ట్రిక్‌ ముళ్ళ కంచ మీదకు దూకుతాను. మంటల్లో కాలటం కంటే ఆ చావు తేలిక’’ అన్నాను.

నాన్న ఏడుస్తున్నాడు. అందరూ ఏడుస్తున్నారు. కొందరు కడిష్‌ వల్లిస్తున్నారు. అది చనిపోయిన వారి కోసం వల్లించే ప్రార్థన.

యూదుల చరిత్రలో ఇలా తమ చావుకు తామే కడిష్‌ వల్లించటం ఇదివరకెన్నడూ చూడలేదు.

నాన్న వల్లిస్తున్నాడు దేవుని స్తుతించమంటూ.

‘‘నాలో మొదటి మాటు కోపం ఎగిసి వచ్చింది. దేవుని ఎందుకు స్తుతించాలి? ప్రపంచాధినేత, దయామయుడు అయితే నిశ్శబ్దంగా ఎందుకున్నాడు ఇలా జరుగుతుంటే! ఆయన గొప్ప తనాన్ని గురించి ఎందుకు స్తుతించాలి?’’ అని ప్రశ్నించుకున్నాను.

మేము మంటల గుంటకు 20 అడుగుల దూరంలోకి వచ్చాము. మంటల వేడి తీవ్రంగా ఉన్నది.

నేను చావదలిస్తే యిదే అవకాశం. పళ్ళు బిగబట్టాను.  నాన్నకు నా భయం తెలియగూడదని. ఇక 10 అడుగుల దూరంలో ఉన్నాం. మా శవయాత్ర మేమే చేసుకుంటున్నాము. మంటల గుంటలకు మరీ దగ్గరగా వచ్చాము. నేను ముళ్ళ కంచె పొదమీద దూకటానికి వరుసలో నుండి తప్పించుకోవటానికి శక్తినంతా గూడకట్టాను. మనసులోనే నాన్నకు వీడ్కోలు చెప్పాను. నా అభీష్టానికి వ్యతిరేకంగా ప్రపంచానికి వీడ్కోలు చెప్పాను. ప్రార్థన మొదలుపెట్టాను. గుండె ఆగిపోతున్నదనిపించింది.

ఇంకా మంటల గుంట 2 అడుగుల దూరం ఉందనగా మమ్మల్ని ఎడంవైపుకు తిరగమని ఆర్డరు వేశారు. బ్యారక్స్‌లోనికి పంపించారు.

ఆ రాత్రి నేనెప్పటికి మర్చిపోలేను. క్యాంపులో మొదటిరాత్రి. ఆ పొగలను నేనెప్పటికి మరువలేను. నిప్పులలోకి తోయబడిన పసివాళ్ళ ముఖాలు ఎలా మరిచిపోగలను? నా విశ్వాసాన్ని దెబ్బకొట్టిన ఆ మంటలను ఎలా మరచిపోగలను?

జీవితం మీద విరక్తి పుట్టిన ఆ రాత్రినెలా మరువగలను?

నా దేవుడిని, నా ఆత్మను ఖూనీ చేసిన ఆ క్షణాలు ఎలా మరచి పోగలను. నా కలలను బూడిద చేసిన రాత్రి అది. దేవుడు జీవించినంత కాలం నాకు జీవించమని శిక్ష పడినా జరిగిన ఘటనలను ఎన్నటికీ మరచిపోలేను.

మాకు ఇచ్చిన బ్యారక్‌ చాలా పొడవుగా ఉన్నది. కప్పు మీద కొన్ని నీలి బల్బులు వెలుగుతున్నాయి. ఎంతో మంది మతి చలించిన వ్యక్తులు, ఎన్నో అరుపులు, ఎంతో దారుణ సంఘటనలు.

అక్కడ నివసిస్తున్నవాళ్ళు లాఠీలతో విచక్షణా రహితంగా మమ్మల్ని కొడుతూ మాకు ఆహ్వానం పలికారు.

బట్టలు విప్పుకోండి. మీ బెల్టు, బూట్లు మాత్రమే పట్టుకోండి. అని ఆర్డరు. మా బట్టలు బ్యారక్‌ వెనక్కి విసిరేయాలి. అక్కడ అప్పటికీ గుడ్డల గుట్టలున్నాయి. మాసిపోయినవి, చిరిగి పీలికలైనవి. అందరం చలితో వణికిపోయాము.

ఎస్‌.ఎస్‌.లు మాలో బలాఢ్యుల కోసం వెతుకుతున్నారు. నాన్న బలహీనంగా కనపడాలన్నాడు. బలం గలవారిని ఎలక్‌ట్రిక్‌ స్మశానంలో పని చేయటానికి పంపుతారు.

మాకంటే వారం ముందు అక్కడకు చేర్చబడిన బెలాకట్జ్‌ (మా ఊరులో పేరు మోసిన వ్యాపారి) మేము వచ్చామని తెలిసి రహస్యంగా చిన్న చీటీ మాకు పంపాడు. తను బలం ప్రదర్శించటం వలన ఎలక్‌ట్రిక్‌ స్మశానంలో తన తండ్రినే మంటల్లోకి విసర వలసివచ్చిందని తెలిపాడు.

మా మీద లాఠీలు రaుళిపిస్తూనే ఉన్నారు. మంగలి దగ్గరకు పోండి, అంటే చేతిలో బెల్టూ, బూట్లతో మంగలి వైపుకు నడిచాము. మా నెత్తిమీద, ఒంటిమీద ఉన్న వెంట్రుకలన్నీ క్లిప్పర్‌తో లాగేశాడు. నాలో ఒక్కటే ఆలోచన, నాన్న నుండి నేను వేరు కాకూడదు.

మంటల బారినుండి బయటపడి అటూ ఇటూ తిరుగు తుంటే పరిచయస్తులు, స్నేహితులు కలిశారు. సంతోషించాం ` అందరం ఇంకా బ్రతికున్నందుకు.

కొందరు ఏడుస్తున్నారు. ఏడవటానికి గూడా శక్తి కావాలి. వారిని ఇక్కడకు తీసుకురాక ముందే చనిపోయి ఉంటే బాగుండేదని వాపోయారు.

నన్నెవరో హత్తుకున్నారు. ఆశ్చర్యంగా చూస్తే సిఘెట్‌ రబీ సోదరుడు ఎహిఎల్‌ బాధగా ఏడుస్తున్నాడు. ఇంకా బ్రతికున్నందుకు అవి ఆనంద బాష్పాలనుకున్నాను. 

‘‘ఏడవకు, నీ కన్నీళ్ళు వృధా పోనీయకు’’ అన్నాను.

‘‘ఏడవ వద్దంటావా, మరి కాసేపట్లో నిప్పుల్లోకి తోస్తారు మనల్ని, దుఃఖ పడకుండా ఎలా ఉండమంటావు?’’ అన్నాడు.

నాకు భయమనిపించలా, వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. అలసిపోయాను. కనపడని వారి గురించి మేము ఆలోచించటం లేదు. మా బుర్రలు మసకబారాయి. ఆలోచించే శక్తి నశించింది. మమ్మల్ని కాపాడుకోవాలనే కోరిక మా ఆత్మాభిమానం అన్నీ మమ్మల్ని వీడిపోయాయి. చావుకు సిద్ధంగా తిరుగాడుతున్నాము. ఎలాంటి ఆశలు మాలో లేవు.

తెల్లవారు రaామున 5 గంటలకు మమ్మల్ని బ్యారక్‌ బయటకు నెట్టారు. కపోలు మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. నాకిక బాధ కూడా తెలియటం లేదు. మొండి మొలలతో ఉన్నాం. చలి కొరుకుతున్నది.

‘‘పరుగెత్తండి’’ అంటే పరుగెత్తాం కొత్త బ్యారక్‌ దగ్గరకు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.