మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

బడిలో చదువుతుండిన నా రెండవ కూతురు ఫాబియెలా , సైగ్లో -20 లోనే ఉండి పోయింది. తల్లిదండ్రులు “రాక్షసులైనా” సరే, పిల్లలకు చదువు నిరాకరించొద్దని ఒక ఉపాధ్యాయురాలు అంది. తాను ఏ వివక్షత చూపకుండా పిల్లలకు చదువు చెప్తానని ప్రతిజ్ఞ తీసుకున్నానని, అందువల్లనే యాజమాన్యపు ఉత్తర్వును పాటించనని ఆవిడంది. “నీ పాప నొదిలేసి వెళ్ళడానికి మీ వాళ్లెవరూ లేకపోతే, నా దగ్గర వదిలేసి వెళ్ళు. నా ఇంట్లో ఉండి ఈ ఏటి చదువు పూర్తి చేసుకుంటుంది. మీరెక్కడున్నారో తెలిపితే ఈ సంవత్సరం అయిపోగానే పాపను మీ దగ్గరికి పంపిస్తాను” అందావిడ. అలా ఫాబియోల అక్కడ ఉండిపోయింది. మిగతా పిల్లలకు మాత్రం చదువు కొనసాగించలేక పోయాను. వాళ్ళు రాత్రింబవళ్ళూ సైగ్లో-20నీ, అక్కడి ఇంటినీ, అక్కడి తిండినీ – ఒక్కటేమిటి, ఎన్నో సంగతులను గుర్తుచేసుకుంటూ ఏడుస్తుండే వాళ్ళు.

ఇక నేను, ఏమైనాసరే సైగ్లో-20కి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. జూలై నెలాఖరులో ఒక రోజున రాత్రి ఏడింటికి నేను పిల్లలతోసహా సైగ్లో-20కి బయల్దేరి, మా చెల్లెలింటికి చేరాను. అది రాళ్ళ గుట్టమీద పనిచేస్తుండేది. నేనక్కడ దాదాపు నిర్బంధంలో ఉన్నట్టు ఉండవలసి వచ్చింది. నేను వచ్చేటప్పుడే నా దగ్గరున్న డబ్బంతా నా భర్తకిచ్చేసి వచ్చాను. ఆయన ఒరురోలోనే ఉండిపోయాడు. నన్నెప్పుడయినా పట్టుకుంటే నా దగ్గరున్నవన్నీ లాక్కుంటారు గదా అనే ఉద్దేశ్యంతో నేనీ పని చేశాను. తిండి ఖర్చులకు మాత్రం ఐదువందల సిసోలు నా దగ్గరుంచుకున్నాను. మేమలా ఆ ఇంట్లో రెండు నెలలు గడిపాం. నేనప్పుడు గర్భంతో ఉన్నాను.

“ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకుంటాను” అని రెనె మొదట్లో అన్నాడు. గాని, ఆయన పేరు ప్రమాదకర వ్యక్తుల జాబితాలో ఉండడంతో ఆయనకెక్కడా పని దొరకలేదు. ఈ జాబితాలో ఉన్నవాళ్ళకు ఉద్యోగం ఇవ్వొద్దని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉద్యోగం దొరకని చిరాకులో ఆయన తన దగ్గరున్న డబ్బంతా తాగేయడానికి అలవాటుపడ్డాడు. మొదట్లో నాకీ సంగతి తెలిసిరాలేదు.

ఓ రోజు మా నాన్న నాతో “నీ భర్త ముప్పొద్దులా తాగిపడుంటున్నాడు. నువ్వాయనకు డబ్బంతా ఎందుకిచ్చేశావు? దాన్నాయన నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు. నేనాయన్ను నిలదీశాను. ‘ఇప్పుడు తాగడమే నా పని’ అని నాకు జవాబిచ్చాడు. కొంచెం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. పట్నానికొచ్చి ఆ డబ్బుతో ఏదన్నా చిన్న వ్యాపారమైనా పెట్టుకోండి’ ‘ అన్నాడు. నేను తలూపాను.

అప్పటికే నా దగ్గరి డబ్బులు అయిపోయాయి. ఇంట్లో ఇంక తిండి దినుసులేమీ లేవు. అందుకని నేనిక సెప్టెంబర్ 15న ఒంటరిగానే ఒరురో వెళ్ళాను.

నేను ఒరు రోచేరి చూసేసరికి నా భర్త తాగిన మైకంలోనే ఉన్నాడు. నన్ను చూడగానే “పిల్లలేరీ?” అని తిట్టడం మొదలు పెట్టాడు. నా వల్లనే తనకు ఉద్యోగం దొరకడం లేదనీ, ఇంకా అలాంటి మాటలెన్నో అన్నాడు. మా ఇద్దరికీ అలా కొంచెం సేపు రభస జరిగింది. ఆయన నెమ్మదించేవరకూ ఆగి నేనాయనతో “చూడూ, మనం ఎలాగూ సైగ్లో-20 వదిలేయాల్సిందే. అందుకనే నా ప్రసవం అయ్యేవరకూ ఈ బస్తీలోనే ఉందాం. ఇక్కడేదైనా పనికూడా చూసుకోవచ్చు ననుకుంటాను” అన్నాను.

అప్పుడాయన తనకు రెండుచోట్ల చిన్న ఉద్యోగాలొచ్చాయనీ, కాని పనిలో చేరిన మరుక్షణమే అంతరంగిక మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రత్యక్షమై, ఉద్యోగం ఊడ గొట్టించారని చెప్పాడు. ఈ పరిస్థితిలో ఎవడు పనిస్తాడు? ఆయన తీవ్రమైన నిరాశలో ఉన్నాడు.

“నేను కూడ ఇక్కడుండడం నయమేమో. నాకేదన్నా పని దొరకొచ్చుగదా! పిల్లలను తీసుకొస్తాను. నువు మాత్రం తాగుడు మానెయ్యి” అని నేనన్నాను.

ఆయన దగ్గర వెయ్యి పిళలు తీసుకొని నా పుట్టబోయే బిడ్డకోసం బొంత, ఇతర అవసరమైన వస్తువులు కొన్నాను. పిల్లలకోసం కొన్ని సరుకులూ, చెప్పులూ కొన్నాను. మిగిలిన కొద్దిపాటి డబ్బు మా నాన్న చేతిలో పెట్టి నేను సైగ్లో-20కి బయల్దేరాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.