యుద్ధం ఒక గుండె కోత-14

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

వెలుగురేఖలు ఆవలిస్తూ

చీకటి దుప్పటిని విసిరికొట్టి

తూరుపుగట్టు ఎక్కి విచ్చుకోకముందే

రాత్రంతా భయం ముసుగు కప్పుకొన్న కళ్ళు

తడితడిగా నిరీక్షణ ముగ్గుల్ని ముంగిట్లో పరిచి

వార్తాపత్రికలోని అక్షరాల్ని

చూపుల్తో ఏరుకొంటూ ఏరుకొంటూ ఉండగానే

కన్నీరు ఆవిరైపోతూ దేశాంతరాలు పట్టిపోతోంది

ఆకాశానికీ నేలకీ మధ్య

ఎక్కడో నిప్పులవాన కురుస్తోంది

అక్షరాలన్నీ వేడెక్కి కళ్ళనిండా

ఎరుపు జ్వాలల్ని ప్రతిబింబిస్తున్నాయి

పొట్ట నిండా ఆందోళన ఆమ్ల ద్రావణమై పొర్లిపోతోంది

పేగు భగ్గున మండి సెగ ఎగసి గుండెని తన్నుతోంది

వేగం పెరిగిన రక్తం గుండె కవాటాల్ని తోసుకొని

జలజలా లావాలా కదులుతూ

నరాల్నిండా అగ్నిప్రవాహాల్ని సృష్టిస్తోంది

ఎక్కడో మసీదులు కూలినా

ఇంకెక్కడో శిలువ విరిగిపడినా

మరోచోట విగ్రహాలు శకలాలైపోయినా

ఇక్కడ ఇన్నివేల మైళ్ళదూరంలో

శిరస్సులు తెగిపడటమేమిటో!

భయం గుప్పిట్లో దేశాలు ఉండటమేమిటో?!

అంగబలం, అర్థబలం వందిమాగధులైనప్పుడు

సమరోత్సాహియై

అణుక్షిపణులు మీటుతూ

కదనకుతూహల రాగాలాపన ఆశ్చర్యం కాదు

ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా

ఫెళఫెళార్భాటాల ప్రగల్భాలు సహజమే

భద్రతలేని ప్రాణాల్ని ఏ చిలుగుండెలో దాచాలనుకొన్నా

అంబరాన్ని ఆక్రమించిన ఆయుధాలు

ఏ గుండెనెప్పుడు చీలుస్తాయో తెలియకనేపోయె

మనుషులకైతే చెప్పొచ్చు

రాక్షసుల కెట్లా బోధపరుస్తాం?

ప్రపంచాన్ని ఆయుధం మొనమీద

నిలబెట్టగలనని సవాలుచేస్తున్న వాడొకడు!

ఎంతెత్తుకు ఎదిగినా

ఎగిరైనా తలదన్నగలనని

పునాదుల్ని కొసవేళ్ళతో పెళ్ళగిస్తున్న వాడొకడు!!

బింబప్రతిబింబాల ఏ కంటికొస మూలల్లోనూ

చిరుకన్నీటి బిందువంతైనా

మానవత్వం, మమతల తడీ లేని

పొడికళ్ళ రెండు ముఖాల భయంకరాకారం

భూగోళం ఆయువుపట్టును పట్టి పీల్చేస్తూ

జలగ అయిన తర్వాత ఎవరైతేనేం

బహుశా వాళ్ళిద్దరూ 

ఆత్మీయానురాగాలతో

ప్రేమను రంగరించిన అమ్మచేతి గోరుముద్దలు

ఏనాడూ తిననివాళ్ళే అయి వుంటారు!

నిశిరాత్రిలో సైతం ఆకాశం నిండా పహరాకాస్తున్న

రాబందుల రెక్కల చప్పుడు మధ్య

ఉండుండి నిశ్శబ్దాన్ని పగలగొడుతూ

అవిరామంగా కురుస్తున్న ఇనపడేగల అండాలు

నేలని తాకగానే విరిసిన అగ్నిపుష్పాలై

నలుదిశల్లో

అమానుషత్వ దుర్గంధాలు పరుచుకుంటున్నాయి

పుట్టలు పుట్టలుగా పాకుతూ

పుట్టుకొచ్చేస్తున్న విషక్రిములు

నేలంతట్నీ ఆక్రమించేస్తున్నాయి

అదేమిటి! ఎప్పుడో వీటిని

సమూలంగా పాతిపెట్టేసామనుకున్నాం కదా!

రాక్షస హృదయాలలో పాతర్లకింద

కుళ్ళిపోయిన గుండె అరల్లో

పైశాచిక ఆలోచనల్లో భద్రంగా

లుకలుకలాడుతూ

ఇంకా సజీవంగానే ఉన్నాయి కాబోలు!

బలప్రదర్శకుల అహంకారయుద్ధక్రీడనో

ఒకే ఒక్క మొండివాడి గుండె నిబ్బరాన్నో

మనిషికన్నా మతాన్ని ప్రేమించే మూర్ఖత్వాన్నో

మతం కోసం మందిరాల గుమ్మటాల మీద

ప్రాణపతాకాల్ని ఎగరేయటాన్నో

ఇంకా…. ఇంకా… ఎన్నో… ఎన్నో

పోతే… పోనీలే… క్షమించేద్దాం

కానీ….

ఇదేమిటి?

పౌర ప్రాణాల్ని విషక్రిములకు ఆహారంగా వేయటం?

రోగాల్ని కత్తులబోనులో బంధించి

మృత్యువుపై విజయం సాధించామనుకొని

ఊపిరిని స్వేచ్ఛగా పీల్చుకొంటుంటే

మళ్ళీ దేశాలమీద క్రిముల్ని జల్లటం?

ఎంత రాక్షసత్వం!

ఆలోచనల్లోనే కాదు శరీరంలో సైతం

విషసర్పాలు విహరిస్తున్నవాడో

నిప్పుల చట్రంలో బతుకుతూ

మాతృదేశాన్నే కాదు తనని తాను తప్ప కన్నతల్లిని సైతం

ప్రేమించలేనివాడో అయివుంటాడు

ఎవడైతేనేం వాడే అసలైన రోగక్రిమి

వాడే దేశాలకు పట్టిన గ్రహణం

భూగోళాన్ని చుట్టేస్తున్న క్రీనీడ వాడే

ఇప్పుడు చూడండి

నేలంతా ఎలా పురుగుల పుట్ట అయిపోతోందో!

జనచైతన్యాన్నే కొరుక్కుతింటున్న రోగక్రిమిని

ఇప్పుడెలా హతమార్చాలి?!

చాతనైతే

ఏ కన్నతల్లో తిరిగి తన గర్భంలో పొదువుకొని అయినా

రక్తస్రావం చేయించుకొనేదే!

కాని ఎందరి తల్లుల గర్భస్రావాలు

ఈ నేల మీద ప్రవహించాలో కదా!

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.