వీక్షణం సాహితీ గవాక్షం-114 వ సమావేశం

కథా మధురం- స్త్రీల పాత్రలు

-వరూధిని

            వీక్షణం-114వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా  ఫిబ్రవరి13, 2022 న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా “కథామధురం- స్త్రీల పాత్రలు” అనే అంశం మీద శ్రీమతి ఆర్. దమయంతి గారు ప్రసంగించారు. 
 
            నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురిస్తున్న ‘కథా మధురం ‘ శీర్షిక నించి కొన్ని కథలనెంచుకుని ప్రసంగించారు దమయంతి గారు.
            ప్రసంగాన్ని ప్రారంభిస్తూ – తాను ఈ శీర్షికను ఎంచుకోవడం లో గల ముఖ్యోద్దేశాన్ని ముందుగా వివరించారు. కథని విశ్లేషించేటప్పుడు సాధారణంగా కథని, కథాంశాన్ని, శైలిని, భాషని ప్రస్తావించడం సహజ సాధారణమైన విషయమనీ, కానీ తానందుకు భిన్నంగా కథలోని స్త్రీపాత్రలకు, స్వరూప స్వభావాలకు పట్టం కట్టి  స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించడానికే ప్రాధాన్యతనిస్తున్నానని చెప్పారు. అందుకుగాను నెచ్చెలి పత్రికా సంపాదకురాలు డా.కె.గీత కూడా సమ్మతించి, ప్రోత్సహించడం ఎంతైనా ముదావహం అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
            విశ్లేషణలో భాగం గా ముందుగా శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ‘తాతగారి ఫోటో’ కథలోని స్త్రీ పాత్రలను విశ్లేషించారు. కట్టుకున్న వాడు బయటవాళ్ళకు ఎంత గొప్ప వాడైనా, భార్య మనసులో అతనికి ఇసుమంత స్థానమైనా లేనప్పుడు అతను పోయాక దుః ఖమూ వుండదు, ఇక లేడన్న బాధా వేయదనే,  అంతెందుకు? చివరికి గోడ మీద వేలాడే ఫోటోని సైతం తొలగించేందుకు వెనుకాడదు. అని స్పష్టం చేస్తుందీ కథ అన్నారు. అలానే, ఆయన గారి రెండో సావాసిని గురించి మాట్లాడుతూ..’అదర్ వుమన్..’ అంటే చాలా మంది   చులకన చేసి మాట్లాడతారనీ, సమాజంలో ఆమె స్థానం హీనమన్నట్టు కించపరుస్తారని, కానీ కథలో ఆ పాత్రని ఎంతో హుందాగా మలచడం రచయిత్రి సంస్కారానికొక కొలబద్ద అని  కొనియాడారు. పోయిన ఆ పెద్దమనిషి ఫోటో తన ఇంట్లో కూడా వొద్దనడం ఆ స్త్రీ ఆత్మ గౌరవానికి చిహ్నమని పేర్కొన్నారు. కథంతా నడిపిన మనవరాలు ముగింపులో అమ్మమ్మకి తోడుగా నిలవడం పై మాట్లాడుతూ ఈ రోజుల్లో తల్లితండ్రులకి, ఇంట్లోని వృద్ధులకీ – ఆడపిల్లలే తోడై నిలుస్తున్నారనడానికి ఈ పాత్ర ఓ మచ్చుతునక గా పేర్కొనాలన్నారు.
            డా.కె.వి.రమణ రావు గారు రచించిన ‘కలలోని నిజం..’ కథలోని స్త్రీ పాత్రల రూపకల్పన గురించి, ఆయా పాత్రల ఔన్నత్యం గురించి మాట్లాడారు. కథలోని ప్రధాన పాత్రధారి మాధవరావు లోని చీకటి ఆలోచనలను తొలగించి, అతనిలో మార్పుని తీసుకొచ్చిన ముగ్గురు వనితల ఉన్నత సంస్కారాన్ని కొనియాడారు.
 

            శ్రీమతి పావనీ సుధాకర్ రచించిన ‘ప్రయాణం..’ చిన్న కథ లోని ఏకైక స్త్రీ పాత్రని వివరిస్తూ.. పసిపిల్లాడితో ఒంటరిగా ప్రయాణించే స్త్రీలకి కథలోని హీరో లాటి మగవాడు దొరకడం  కేవలం కథలకే పరిమితం కాకూడదని..హీరో ఇజం  అంటే ఇబ్బందుల్లో వున్న స్త్రీలకి సహాయాన్నందించి, చేయూత గా నిలవడం ఎంతైనా అవసరం అన్నారు.అలా సాయం చేసిన ఆ హీరో ఆమె మనసులో చెరగని ముద్ర వేయడం, అతని జ్ఞాపకం ఆమె మనసులో పరిమళాలను వెదజల్లుతున్నాయని ఆమె ప్రకటించడం వెనక స్త్రీ స్వచ్చమైన కృతజ్ఞతాభావాన్ని ప్రశంసించారు.  

            స్త్రీ భావప్రకటనా స్వేచ్చకి పెద్ద పీట వేసిన కథ గా “ప్రయాణం” కథని అభివర్ణించారు.

            జింబో రాజేందర్ గారు రచించిన ‘ఆమె కోరిక..’ కథలో – విడాకులకు  ఆ భార్య అంగీకరించని కారణం వెనక దాగిన రహస్యం తో బాటు ఆమె మనోభావాల మీద, మనోభారాల వ్యధల మీద పూర్తి విశ్లేషణా ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే, పాఠకులు కథని చదవడం కోసం ముగింపుని సశేష విభాగం లో వుంచారు.

            ఈ కథలపై డా.గీత గారితో బాటు శ్రీ విద్యార్ధి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ సి.బి.రావు, శ్రీమతి రమణ, శ్రీ ప్రసాదరావు గోగినేని,  శ్రీ వెంకట సోమయాజి మొ.న వారు కూడా చర్చలో పాల్గొని ఆనాటి కథా విశ్లేషణా కార్యక్రమాన్ని  రక్తి కట్టించారు.
 
            వీక్షణం సంస్థాపకఅధ్యక్షులు  డా.కె.గీత గారు మాట్లాడుతూ – జీవితం లో తుఫానులాటి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు స్త్రీలు మనోధైర్యాన్ని కలిగివుంటమే కాదు, అవసరమైతే కొత్త మార్గాన్ని ఎంచుకుని మార్గదర్శకత చాటాలని సూచించారు. అతిథులందరూ శ్రీమతి ఆర్. దమయంతిని అభినందించారు.
 
            ఆ తర్వాత ఇటీవల పరమపదించిన “బుజ్జాయి” గా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ కార్టూనిస్టు, దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి గారి గురించి శ్రీ విద్యార్థి ప్రసంగించారు. ఆయన  దేవులపల్లి కృష్ణ శాస్త్రి  గారి ఏకైక కుమారుడు. ఎటువంటి ప్రాథమిక విద్య లేకుండా ఆయన జీవితాన్ని గడపడం ఆశ్చర్యకరం. విద్యార్థి గారు ఆయన కార్టూనిస్టు కావడానికి దోహదపడిన విషయాలని పరిచయం చేస్తూ స్వయంగా కృష్ణ శాస్త్రి  గారి మేనకోడలు శ్రీమతి వింజమూరి అనసూయ గారు తనతో ప్రస్తావించిన అనేక అంశాల్ని సభకు పరిచయం చేసారు. 
 
            ఆ తర్వాత డా.కె.గీత గారు, శ్రీమతి రమణ గారు శ్రీ నరిశెట్టి ఇన్నయ్యగారి సతీమణి శ్రీమతి కోమల గారికి నివాళులు అర్పించారు. కోమల గారు నెచ్చెలిలో రాస్తున్న తెలుగు, ఆంగ్ల శీర్షికల్ని పరిచయం చేసారు.
 
            కోమలగారు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు. శేషజీవితాన్ని వాషింగ్టన్ డీ.సీ లో గడిపారు. వారు అనేక అనువాదాలు చేసారు. వారి స్వీయచరిత్రని  తెలుగులోను, ఇంగ్లీషులోను రచించారు. అనేక పత్రికలకి వ్యాసాలు రాశారు. అయాన్ హిర్సీఅలీ  నోమాడ్ ను,  కేజ్డ్ వర్జిన్ ను, యంగ్ ఛాంగ్  వైల్డ్ స్వాన్స్ ను, ఎమ్.ఎన్.రాయ్ ‘మెమోయిర్స్ ఆఫ్ కాట్’ ను, ఎలీవీజల్’ నైట్ ‘ను, తస్లీమా నస్రీన్ ‘సోథ్‌’ను చెల్లుకు చెల్లు పేరుతో  తెలుగులోకి అనువాదం చేసారు. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి ప్రశాంతంగా డిసెంబరు 5, 2021న అమెరికాలో తనువు చాలించారు. 
 
            చివరిగా ఇదేనెలలో స్వర్గస్థులైన ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కు నివాళులు అర్పిస్తూ శ్రీమతి దమయంతి, డా.కె.గీత గానం చేశారు. 

 

            ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో  డా||కె.గీత ఇటీవల కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదం గురించి రాసిన   “నా ఆహార్యం – నా ఇష్టం” కవితని,  దమయంతి గారి కోరిక మీదట “మా నారింజచెట్టు” కవితని, శ్రీ వెంకట సోమయాజి  అంతర్జాతీయ స్త్రీల దినోత్సవాన్ని గురించిన కవితని వినిపించారు. 
 
స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిదాయకంగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.   ****
Please follow and like us: