మిట్ట మధ్యాహ్నపు మరణం- 6

– గౌరీ కృపానందన్

            మొదట ఆ రక్తపు ధార ఏమిటో ఆమెకి అర్ధం కాలేదు. ఎటువంటి సంశయం లేకుండా తలుపు తట్టింది. లోపల గొళ్ళెం వేసి ఉంటుందని అనుకున్న ఆమెకు తలుపు మీద చెయ్యి పెట్టగానే తెరుచుకోవడంతో లోపలికి అడుగు పెట్టింది.

            మూర్తి మంచం మీద లేడు. “లేచేసారా బాబ్జీ?” 

            ఇప్పుడు మూర్తి చెయ్యి మాత్రం మంచం పరుపు మీద కనబడింది. మరీ ఇంత కలత నిద్రా? క్రింద పడిపోయింది కూడా తెలియనంతగా? వంటి మీద స్పృహ లేనంతగానా?

            అనుకుంటూ మూర్తిని సమీపించింది.

            మంచం పక్కన అతను కూర్చున్నాడో పడుకుని ఉన్నాడో,  సరిగ్గా తెలియని ఒక భంగిమలో, తల ఒక పక్కగా ఒరిగి, కాస్త నోరు తెరిచినట్లుగా ….

            ఉమ కెవ్వుమని అరిచింది. “అయ్యో దేవుడా! ఏమిటిది?” వంట్లోని రక్తం పూర్తిగా మెదడుకు ప్రవహించినట్లనిపించింది. 

            మూర్తి గొంతు దగ్గర రక్తపు చారికలు! అక్కడ ఏర్పడిన గాయం నుంచి ఇంకా రక్తం బైటికి వస్తూనే ఉంది. పెదవి చివరన రక్తం!

            తనేం చేస్తుందో తెలియని స్థితిలో ఉమ అతన్ని పట్టుకుని కుదపబోయి చూసింది. అతను ధరించిన ఆకాశం నీల రంగు షర్ట్  గుండెల దగ్గర పూర్తిగా రక్తంతో తడిసి ఉంది.

            ఒక్క ఉదుటున ఉమ బైటికి పరిగెత్తింది. అస్పష్టంగా అరుస్తూ,  తడబడుతూ మెట్లు దిగిన ఉమ రిసెప్షన్ దగ్గిరికి రాక ముందే కళ్ళు తిరిగి, మైకం కమ్ముకోగా ఆఖరు మెట్టు దగ్గర స్పృహ కోల్పోయింది.

            రిసెప్షన్ లో ఉన్న యువకుడు ఆమె వైపు పరిగెత్తినట్టే వచ్చాడు.

            మూర్తి ఉన్న ఆ గది విశాలంగా ఉంది. లేత ఆకుపచ్చ రంగు కర్టెన్లు వేలాడుతున్నాయి. డబుల్ కాట్! పెద్ద నిలువుటద్దం. పక్కనే డ్రస్సింగ్ టేబిల్. దాని మీద మూర్తి చేతి గడియారం 12.27 చూపిస్తోంది. పక్కనే ఉమ ఐ బ్రో పెన్సిల్ పడి ఉంది. అటాచ్డ్ బాత్రూం తలుపులు తెరిచే ఉన్నాయి. గది పూర్తిగా శుభ్రంగా ఉంది. మూర్తి ఉన్న చోటుకి పక్కనే ఉన్న గోడ మీద రక్తపు మరకలు ఉన్నాయి. అక్కడ ఉన్న అద్దం మీద MAYA అని వ్రాసి ఉంది. కిటికీ తలుపులు గాలికి ఊగుతున్నాయి.

            ఉమ ఆ గది నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు, పక్కన ఉన్న గదులన్నీ చాలా వరకు తాళం వేసి ఉన్నాయి. మూర్తి రూము నంబరు 424.

            428నంబరు గదిలో హనీమూన్ కోసం వచ్చిన దంపతులలో భార్య అంది. “ఎవరో అరిచిన శబ్ధం వినబడలేదూ?”

            “ఏదో అయ్యుంటుందిలే. మనకెందుకు?” అన్నాడు భర్త.

            426 గదిలో ఉన్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన మసాలా దోశను తీసుకు వెళ్తున్న బేరర్, 424 గది తలుపులు తీసి ఉండడాన్ని గమనించాడు. అతను చూసిన కోణంలో మూర్తి అతని కంట పడలేదు.  “తలుపులు తీసి ఉంచి ఎటో వెళ్లి పోయినట్లున్నారు” అనుకుంటూ తలుపులను దగ్గర వేసి లాక్ చేసి  మరీ వెళ్ళాడు.

            విషయం  ఏమిటో తెలుసుకోకుండా అనాలోచితంగా అతను చేసిన ఈ పని కేసును మరింత క్లిష్టం చేసింది.

            పోలీసులను పిలవడానికి ఎవరూ ప్రయత్నించ లేదు. కింద రిసెప్షన్ దగ్గర ఉమ స్పృహ కోల్పోగానే అక్కడికి వచ్చిన  మధ్య వయస్కురాలైన ఒక స్త్రీ, “ఏమైందమ్మా? ఒంట్లో బాగా లేదా?” అని అడిగింది.

            అంతలో హోటల్ స్టాఫ్ అంతా చుట్టు ముట్టారు.

            “ఏమయ్యింది?”

            “వేగంగా వస్తూ, ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది.”

            “సోడా! సోడా!”

            హోటల్ లో డాక్టర్ ఎవరూ లేరు.

            “గాలి రానీయండి. గుంపుగా నిలబడకండి.” నడివయస్సు స్త్రీ ఉమ చీరను సరి చేసింది.

            “కళ్ళు తెరుస్తోంది.”

            ఎవరో నీళ్ళు చిలకరించారు. ఉమ కళ్ళు తెరిచింది. 

            “ఏమయ్యిందమ్మా? ఒంట్లో బాగా లేదా?”

            కళ్ళు తెరిచిన ఉమకి ఒక్క సారిగా భోరుమని ఏడవాలనిపించింది.   ఏదో చెప్పాలనుకున్నా గొంతు పెగలని స్థితి! ఎక్కడికో పరిగెత్తాలని, ఎవరికో టెలిగ్రాం ఇవ్వాలని..ఏవేవో ఆలోచనలు. ఏమీ చేయలేని అశక్తత! షాక్!

            “అక్కడ… అక్కడ… రూమ్ లో బాబ్జీ…”

            “కాస్త మంచి నీళ్ళు తాగమ్మా.”

            “బాబ్జీ… రక్తం!”

            “ఈ అమ్మాయిని ఎవరికైనా తెలుసా?”

            “వెయిట్ ఎ మినిట్. ఏదో రూమ్ లో దిగారనుకుంటాను. హియర్ ఈజ్ ది డాక్టర్!”

            “ఏమయ్యింది? అందరూ కాస్త జరగండి.” హోటల్ డాక్టర్ మోకాళ్ళ మీద కూర్చుని ఆమెను పరిశీలించాడు.

            “ఐ థింక్ షి ఈజ్ ప్రెగ్నెంట్ డాక్టర్.” హెల్ప్ కోసం వచ్చిన డాక్టర్ వెంట వచ్చిన అమ్మాయి అంది.

            “లెట్ మి సీ.”

            “రూమ్ నంబర్? ఒక్క నిమిషం.”

            “నతింగ్ రాంగ్ విత్ హర్. ఈ అమ్మాయి వెంట ఎవరూ లేరా?” మెడలోని మంగళ సూత్రాలను చూసి, “భర్త ఉన్నట్లు ఉన్నాడే.”

            “ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎవరైనా 424 గదికి వెళ్లి ఆమె భర్తను పిలవండి.”

            నాలుగో అంతస్తులో వరండాను తుడుస్తున్న క్లీనర్ బాయ్ మాపర్ తో శుభ్రం చేయడంతో  424 గది గుమ్మం దగ్గర ఉన్న రక్తపు ధార కాస్తా తుడిచి పెట్టుకు పోయింది. 

            భర్తను పిలవడానికి వచ్చిన హోటల్ బాయ్ కాలింగ్ బెల్ నొక్కుతూ క్లీనర్ ని అడిగాడు.

            “ఏమోయ్! కొత్తగా రిలీజ్ అయిన సినిమా చూశావా?”

            “ఎక్కడా? రేపు మాట్నీకి వెళ్ళాలను కుంటున్నాను.నువ్వు చూసేసావా?”

            “ఓ.. మొదటి షో.”

            “సినిమా ఎలా ఉంది?”

            “ఫరవాలేదు. ఒక సారి చూడొచ్చు. ఎవరూ లేరా ఏంటీ?” మరో సారి బెల్ నొక్కాడు.

            “లోపల ఎవరూ లేనట్లున్నారు.”

            “అవును.” తలుపును తోసి తెరిచే ప్రయత్నం చేయకుండా, లిప్ట్ లో దిగి వచ్చిన హోటల్ బాయ్, “గదిలో ఎవరూ లేరండీ” అన్నాడు.

            ఉమ ఇప్పుడు సోఫా లో కూర్చిని ఉంది. “బాబ్జీ…. బాబ్జీ..” అని అస్పష్టంగా ఉచ్చరించింది.

            “ఏమైంది? మీ భర్త ఎక్కడికి వెళ్ళారు?”

            “నా భర్త… నా భర్త..” అంటూ ఏడవసాగింది.

            “వదిలేసి వెళ్లి పోయాడా?”

            ఉమ మంగళ సూత్రాలను చేత్తో పట్టుకుని, “అయ్యో దేవుడా!” అంది.

            “భార్యా భర్తల మధ్య గొడవ కాబోలు.” ఎవరో సానుభూతిగా అన్నాడు. ఉమ చేతికి మంచినీళ్ళ గ్లాసును అందించారు.

            “పోలీస్… పోలీసులను పిలవండి.”

            అంతలో రిసెప్షనిస్ట్ కౌంటర్ లో గది తాలూకు తాళం చెవి లేదన్న విషయాన్ని గుర్తించాడు.

            “ఒరేయ్! సరిగా చూడలేదా? రూమ్ కీస్ ఇక్కడ లేవు. ఆయన గదిలోనే ఉండాలి.”

            మళ్ళీ వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరూ తీయలేదు.

            “నిద్ర పోతున్నాడో ఏమో. లోపలికి వెళ్లి చూసి రారాదూ?”

            వరండా తుడుస్తున్న కుర్రాడు అప్పుడే రక్తపు మరకను చూశాడు. తలుపు దగ్గరిగా వేసి ఉంది. తలుపు మీద చేయి వేసాడు. తెరుచుకుంది.

            “సార్! సార్!” అని పిలుస్తూ గదిలోకి తొంగి చూశాడు. అంతలో రిసెప్షనిస్ట్ కూడా అక్కడికి వచ్చాడు.

            “ఏరా? లోపల ఉన్నారా లేరా?”

            “క్రింద పడుకుని ఉన్నట్లు ఉన్నాడు సార్.”

            “సార్!” అంటూ ఇద్దరూ దగ్గిరికి వెళ్ళారు. అప్పుడు టైం సరిగ్గా ఒకటీ ఐదు.

            “అయ్యో! డెడ్ బాడి… రక్తం…” టెలిగ్రాం భాషలో అరుస్తూ బైటికి పరిగెత్తారు.

            ఇనస్పెక్టర్ మాధవ రావు వచ్చారు. వచ్చీ రాగానే, “ఎక్కడ వుంది బాడీ?” అన్నారు.

            “నాలుగో అంతస్తులో ఉంది సార్. ఈవిడే అతని భార్య.”

            మతిభ్రమించిన దానిలా దిక్కులు చూస్తున్న ఉమ వైపు ఒక్క క్షణం చూసి, “ముందు అక్కడికి వెళదాం. లిప్ట్ పనిచేస్తోందా?” అడిగారు మాధవరావు.

            కానిస్టేబుల్ వెంటరాగా లిప్ట్ లో నాలుగో అంతస్తుకు వెళ్ళి, గబా గబా నడవసాగారు. మధ్యలో ఒకసారి గడియారం కేసి చూసుకున్నారు. 1:37.

            “ఈ రూమేనా?”

            “అవును సార్.”

            “అందరూ కాస్త జరగండి. మీరు వెళ్లి కాస్త మీ రిజిస్టర్ పుస్తకాన్ని తీసుకుని రండి.”

            గది తలుపులు తోశారు.

            చాలా జాగ్రత్తగా, కాలి గుర్తులు ఏవైనా ఉండి ఉంటే అవి చెరిగిపోకుండా లోపలి వెళ్ళారు.

            “ఎవరూ లోపలికి రావద్దు. “ గుమ్మం దగ్గర నిలబడి గదిని పరిశీలనగా చూశారు.

            “ఈయన ఎవరో తెలుసా?”

            “తెలుసు సార్. పేరు కృష్ణమూర్తి. హోటల్లో స్టే చేయడానికి వచ్చారు.”

            “తిమ్మప్పా! మీరు స్టేషన్ కి ఫోన్ చేసి ఒక 142 ఫారం నింపి ఇంక్వెస్ట్ కి ఏర్పాటు చేయమని చెప్పండి. తరువాత సి.ఐ.డి. కి చెప్పి ఫోటోలు తీయమని చెప్పండి. అంత వరకు డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేస్తున్నామని చెప్పండి.”

            మళ్ళీ గుంపు చేరింది.

            “ఎవరైనా కోర్టుకు వస్తారా? సాక్ష్యం చెప్పడానికి.”

            ఒక్కసారిగా అందరూ చెదిరి పోయారు.

            మాధవరావు అక్కడ ఉన్న నిలువుటద్దాన్ని చూశారు. “MAYA”

            “భార్య పేరు ఏమిటి?”

            “తెలియదు సార్. మిస్టర్ అండ్ మిసెస్ అని రిజిస్టర్ లో రాశారు.”

            “ఎవరైనా ఆవిడ దగ్గిరికి వెళ్లి పేరు అడిగి తెలుసుకుని రండి.”

            “ఆమెను పిలుచుకుని రమ్మంటారా?”

            “వద్దు వద్దు. ఆమెను అక్కడే ఉండనీయండి. శవాన్ని మొట్ట మొదట చూసింది ఎవరూ?”

            “ఆ అమ్మాయే చూసినట్లుంది సార్. క్రిందికి పరిగెత్తుకుంటూ వచ్చి, స్పృహ తప్పి పోయింది. ఏమయ్యిందని అడిగితే జవాబు చెప్పలేదు. తరువాత నేను గదికి వచ్చి చూస్తే..”

            మాధవరావు మళ్ళీ ఓసారి జాగ్రత్తగా లోపలి వెళ్లి చూసారు. మూర్తి మరణించాడన్నది నిర్వివాదాంశం. బాత్ రూమ్ లోకి తొంగి చూశారు. గోడమీద రక్తపు మరకలు… నిలువుటద్దంలో ఆ రాతలు..

            శవం మంచం మీది నుంచి జారినట్లుగా తెలుస్తోంది. వంటి మీద గాయాలు… ముఖ్యంగా మెడ మీద కత్తి పోటు, గుండెల దగ్గర ఇంకా కారుతున్న రక్తం. మళ్ళీ మళ్ళీ కత్తితో పొడిచి ఉండాలి. పది సార్లైనా… సంభవం జరిగి రెండు గంటల పైనే అయి ఉంటుంది.  అతని క్రాప్ చిందర వందరగా ఉంది. మంచం మీద ఉన్న అంతని చేతి మణికట్టుకి పసుపు తాడు కంకణం, వేలికి కొత్త ఉంగరం కనబడ్డాయి. దాదాపు ఐదడుగులు ఎనిమిది అంగుళాలు పొడవు ఉంటాడనిపించింది. నోరు కొద్దిగా తెరుచుకుని ఉంది. ఏదో చెప్పబోయి సగంలో ఆపేయ బడినట్లు.

            క్రింద ఉమ ఇంకా అలాగే కూర్చుని ఉంది. ఫోటో గ్రాఫర్స్, ఫింగర్ ప్రింట్ నిపుణులు అందరూ వచ్చేసారు.

            “నాలుగో అంతస్తు సార్.”

            అందరూ పైకి వచ్చారు.

            “వెళ్ళండి వెళ్ళండి . మీ మీ పనులు చూసుకోండి.”

            అమ్మా, నాన్నలకి చెప్పాలి. ఫోన్ నంబర్ గుర్తు రావడం లేదు. మణి మామయ్య ఎక్కడ ఉన్నాడు? మూర్తి ఆఫీసుకు తెలియచేయాలి. అయ్యో! అమ్మా నాన్నలకి ఈ వార్త ఎంత షాక్ గా ఉంటుందో? అమ్మా… అమ్మా… బాబ్జీ …బాబ్జీ..

            ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉమ మనసులో ఆలోచనలు పరిగెడు తున్నాయి. ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? అర్ధం కానట్లు మతి చలించిన దానిలా అలాగే కూర్చుండి పోయింది.

            ఇనస్పెక్టర్ మాధవరావు లిప్ట్ నుంచి నేరుగా ఆమె దగ్గరికి వచ్చారు.

            “మిసెస్ మూర్తి!”

            ఉమ తలెత్తి చూసింది.

            “ఇంకా ఇక్కడే కూర్చున్నారా? రండి లోపలికి వెళదాం.”

            యాంత్రికంగా ఆయనను అనుసరించింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.