యాత్రాగీతం

బహామాస్ 

-డా||కె.గీత

భాగం-3

మయామీ నగర సందర్శన – విన్ వుడ్ వాల్స్

మర్నాడు రోజంతా మయామీ నగర సందర్శన చేసాం. 

హోటలులోనే బ్రేక్ ఫాస్టు కానిచ్చి కాస్త స్థిమితంగా 11 గంటలకు బయలుదేరాం. 

మయామీ డే టూరులో ఏవేం ఉంటాయో అవన్నీ మేం సొంతంగా తిరుగుతూ చూద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా చూడవలసిన మొదటి ప్రదేశం అని ఉన్న ట్రినిటీ కేథెడ్రల్ చర్చికి వెళ్లాం. 

అయితే చర్చి మూసి ఉన్నందువల్ల బయట్నుంచే చూసి ఫోటోలు తీసుకుని అక్కణ్ణించి విన్ వుడ్ వాల్స్ (Wynwood Walls) సందర్శనకి వెళ్ళేం. 

మయామీ నగర డౌన్ టౌన్ నించి చాలా దగ్గర్లో ఉంటుంది ఈ విన్ వుడ్ వాల్స్ అనే ప్రదేశం. 

ఇక్కడ కనిపించే ప్రతి గోడా ఒక కళాకుడ్యమే. 

గ్రఫిటీ కళాకారులు, యువ కళా కారులు, ప్రసిద్ధి చెందిన మ్యూరల్ (mural) ఆర్టిస్టులు ఒక్కరేవిటి అంతా ఒక్కచోట చేరారా అన్నంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. 

ఒక గొప్ప స్వేచ్ఛ తాండవిస్తూ ఉంటుంది. 

ప్రత్యేకించి మధ్య ఉన్న పెద్ద ఆవరణలోని ఆర్ట్ ఎగ్జిబిషన్ తప్పక చూడవలసిందే. 

ఒకప్పుడు అంటే 1970 ల ప్రాంతంలో ఈ ప్రదేశం సరుకులు భద్రపరిచే వేర్ హౌస్ ల నిలయమట. 2000 వ సంవత్సరంలో టోనీ గోల్డ్మన్ అనే కళాకారుడికి ఇక్కడ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అయితే ఆయన బాగా డబ్బున్న వ్యాపారస్తుడు కూడా కావడంతో ఆలోచన వెంటనే కార్యరూపం దాల్చింది. 

దాదాపు 2010 నాటికి ఈ ప్రదేశం ఒక కళాత్మక నిలయం అయిపోయింది. స్వేచ్ఛని కోరుకునే ప్రతి కళాకారుడికీ ఆహ్వానం పలుకుతుంది ఈ ప్రదేశం. 

నెలనెలా ఇక్కడ విభిన్నమైన ఆర్ట్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి. 

ఇక్కడ ‘ఉమన్ ఆన్ ద వాల్స్’ ఆర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన జపనీస్ కళాకారిణి ఐకో, న్యూయార్క్ సబ్వే రైళ్లని కళామయం చేసిన ప్రఖ్యాత గ్రఫిటీ కళాకారిణి లేడీ పింక్, ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ లో సిద్ధహస్తురాలైన మాయా హయూక్ మొ.న వారి పెయింటింగ్స్ ని చూడొచ్చు. 

ఇక్కడ ప్రపంచ వ్యాప్త కళాకారుల విభిన్నతని గమనించొచ్చు. 

నెలలో ప్రతి రెండవ శనివారం ఇక్కడ ఆర్ట్ వాక్ జరుగుతుంది. రాత్రి పూట విందులు, చిందులతో  ఇదొక  పెద్ద వేడుక ఇక్కడ. 


ఈ చుట్టుపక్కల  విన్ వుడ్ వాల్స్ కి సంబంధించిన ఆర్ట్ లతో గిఫ్ట్ షాపులు, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. 

ఉదయం 11 గంటల నించి మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ప్రాంతం.

ఒక్కొక్కళ్ళకి $12 టిక్కెట్టు, 12 ఏళ్ల లోపు పిల్లలకి ఉచితం. 

కాలినడకన  తిరుగుతూ దాదాపు రెండు, మూడు గంటల పాటు గడపగలిగిన ఒక గొప్ప అవుట్ డోర్ మ్యూజియం విన్ వుడ్ వాల్స్. ఇక్కడ గైడెడ్ టూర్స్ కూడా ఉంటాయి. నాకైతే మరో ప్రపంచంలోకి వెళ్లిన అత్యద్భుతమైన అనుభూతి కలిగింది.  

****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.