షర్మిలాం “తరంగం”

మానవాళి నివాళి 

-షర్మిల 

ఒక్కోసారి ధైర్యం పోగొట్టుకుంటాం.

మన చుట్టూ మమతలు పెనవేసుకున్న వారెందరో నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా  వుండిపోవడం ఎంత శిక్ష ?

కరోనా ఎందర్ని ఎత్తుకుపోయిందో తల్చుకుంటే గుండె చెరువవుతుంది.

ఆషామాషీగా ముక్కుకి నోటికీ ఒక మాస్క్  వేసుకుంటే దగ్గరకు రాదనుకొనే కోట్లాది జనంలాగానే నేనూ కాబోలనుకున్నాను.

కానీ మృత్యుదేవత మారువేషమని నా సన్నిహితులెందరినో పోగొట్టుకున్నాకే అర్ధం అయ్యింది.

కరుణాకర్ మా మరిది ఫ్రెండ్.  నేను పెళ్ళయి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన  దగ్గర నుంచి “వదిన గారూ ! అంటూ నీడలా తిరిగేవాడు.

నా కూతురు మాకంటే తన దగ్గరే ఎక్కువ వుండేది. 

కరోనాతో వున్న  అన్నయ్యని ఆసుపత్రికి తిప్పి అతనితో పాటు కరోనా బారినపడి కన్నుమూసాడు. 

వృద్ధులైన తల్లితండ్రులు నడివయసులో వున్న ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకుని బతుకీడుస్తున్నారు.

నా మరదలు నా తమ్ముడి ఇంటి దీపం వాడిని పిల్లల్ని అనాధల్ని  చేసి వెళ్ళిపోయింది.

వరసకి వదినని అయినా “అక్కా”  అని అరుణ పిలిచే పిలుపు ఇంకా చెవులకి వినిపిస్తూనే వుంది.

మా తోటికోడలి తమ్ముడు నన్నూ ఎంతో ప్రేమగా “అక్కా! ఇంటికి ఓసారిరండి ” అని ఆప్యాయంగా పిలిచే రాజేంద్ర చిన్న చిన్న పిల్లల్ని భార్యకి వదిలి అర్ధంతరంగా కరోనాకి బలయ్యాడు.

“అమ్మడూ ఎప్పుడొస్తావ్ అమెరికా నుంచి”  అని ఆర్తిగా అడిగే మా మేనత్తని కూడా  దూరం చేసింది కరోనానే !

ఎవరో బంధువు గుండెపోటుతో ఆస్పత్రిలో వుంటే అటెండెంట్ గా వెళ్ళివైరస్ బారిన  పడిన కజిన్ రవి గుర్తొస్తే దుఃఖం వస్తుంది.

బయటకి వెళ్తే బాల్కనీ లోనుంచి నవ్వుతూ పలకరించే మా ఇంటిపక్కావిడ తల్లి ,  స్కూటర్ మీద వెళ్తూ విష్ చేసే ఇంటికి మూడిళ్ళ వెనుకవుండే నైబర్ కరోనాతో దూరమైతే అది వెలితి కాదూ !

ఇంకా స్నేహితుల్ని ఇద్దరు ముగ్గురిని దూరం  చేసిన కోవిడ్ వైరస్ ఇప్పటికైనా వదిలేస్తే  ప్రపంచానికి ఊరట.

పిల్లలకి కొందరికి తల్లులు, కొందరికి తండ్రులు , తోడు పోగొట్టుకున్నజంటలు, బిడ్డల్ని పోగొట్టుకున్న వృద్ధ తల్లితండ్రులు …

నా ఒక్కదానికే ఇంతమంది కోవిడ్ బాధితులు తెలిస్తే ఎందరు బలయ్యారోకదా !

హఠాత్తుగా వచ్చి ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్ వైరస్ ఎందరి జీవితాల్లోనో అంతులేని వేదన మిగిల్చింది.

నా జీవితంలో నేను చూసిన ఉపద్రవాల్లో ఇదొకటి.

మిగతావి ప్రకృతి బీభత్సాలే కానీ ప్రపంచాన్ని వణికించింది  కోవిడ్ మాత్రమే !

ప్రపంచ చరిత్రలో ఈ చీకటి అధ్యాయం ఇంతటితో ముగిసిపోయినట్టే అనిపిస్తోంది.

వీడ్కోలుకు కూడా నోచని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టిన కోట్లాది భౌతికకాయాలకు  మానవాళి మౌనంగానే నివాళి అర్పించింది.

ఈ పెను వైరస్ ను దునుమాడేందుకు మనిషి మేధస్సు వాక్సిన్ తయారుచేసింది.

కోవిడ్ మెడికల్ మాఫియా సృష్టి అని వాదించి వాక్సిన్ వేసుకోని వారు వున్నారట !

మరి చనిపోయిన వారంతా మిధ్య అంటారా ?

ఏది ఏమైనా అంతిమవిజయం మనిషిదే!

శత్రువు బలహీనపడడం కూడా క్షీణించడం జరిగితే మానవాళికి శుభపరిణామం !

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.