కాళరాత్రి-8

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

            అది మే నెలలో చక్కటి రోజు. వసంతకాలపు గాలులు వీస్తున్నాయి. సూర్యాస్తమవబోతున్నది. కొన్ని అడుగులు ముందుకు వేసామో లేదో మరో క్యాంపు. మరో ముళ్ళకంచె ఇక్కడ ఒక ఇనుప గేటు ఉన్నది. దానిమీద ‘‘పని మీకు విశ్రాంతినిస్తుంది’’ ఆష్‌విట్స్‌ అని రాసి ఉన్నది.

            బెర్కెనా కంటే కొంచెం నయమనిపించింది. రెండతస్తుల సిమెంట్‌ కట్టడాలు. అక్కడక్కడ చిన్న తోటలున్నాయి. ఒక ద్వారం ముందు కూర్చున్నాం. లోన షవర్‌ స్నానాలు తప్పనిసరి. ఒక క్యాంపు నుండి మరో క్యాంపుకు రోజులో ఎన్నిసార్లు మారినా షవర్‌ స్నానాలు తప్పవు.

            వేడినీటి స్నానం తరువాత చీకటిలో వణుకుతూ వేచి ఉన్నాం. వేరే బట్టలిస్తామన్నారు. ‘‘పదండి త్వరగా, త్వరగా వెడితే నిద్రపోవచ్చు’’ అంటూ ఆర్డర్లు విసురుతూనే వున్నారు.

            పిచ్చిగా పరుగెత్తా బ్యారక్‌లోనికి. అక్కడ అధికారి పోలెండ్‌ యువకుడు. అతను మావైపు చూచి నవ్వి చెప్ప సాగాడు. అలసి పోయి ఉన్నా శ్రద్ధగా విన్నాము.

            ‘‘మిత్రులారా! మీరిప్పుడు ఆష్‌విట్స్‌ కాన్‌సంట్రేషన్‌ క్యాంపులో ఉన్నారు. మీరు ఎన్నో కష్టాలు అనుభవించాలి ముందు ముందు. ఆశ విడవకండి. శక్తి కూడగట్టుకోండి. సెలెక్షన్‌ అపాయం నుండి తప్పించుకున్నారు. మీ నమ్మకాన్ని విడవకండి. నిరాశను పారదోలండి. చావుకు దూరంగా జరగవచ్చు. నరకం ఎక్కువ కాలం వెంటాడకపోవచ్చు. ఒక చిన్న సలహా. మీలో మీరు కలిసి ఉండండి. మనమందరం సోదరులం. అందరి పరిస్థితి ఒక్కటే. ఒకే పొగ మన తలల మీద సుడులు తిరుగుతున్నది. ఒకరి కొకరు సహాయపడండి. అదొక్కటే బ్రతకటానికి మార్గం. చాలా మాట్లాడాను. మీరు బ్యారక్‌ 17లో ఉన్నారు. నేనిక్కడ  పరిస్థితిని అదుపులో ఉంచేవాడిని. మీకేదైనా ఫిర్యాదు ఉంటే నన్ను కలవండి. ఇక ఇద్దరిద్దరూ ఒక బంక్‌లో నిద్రపోండి. శుభరాత్రి!’’

            ఇన్ని రోజుల తరువాత మానవ మాత్రుని మాటలు విన్నాము.

            బంక్‌ చేరగానే నిద్రపోయాము. మరుసటి ఉదయం అక్కడున్న పెద్దవాళ్ళు మమ్మల్ని హింసించలేదు. కాలకృత్యా లయ్యాయి. కొత్త బట్టలిచ్చారు. నల్లకాఫీ (డికాక్షన్‌) యిచ్చారు.

            పది గంటలకు బ్లాక్‌ శుభ్రపరచటానికి మేము బయటకు వెళ్ళవలసి వచ్చింది. బయటి సూర్యరశ్మి మాకు ఊరట కలిగించింది. కొంచెం తేరుకున్నాం. స్నేహితులం కలిశాం. కొంచెం మాట్లాడుకున్నాం. కనపడని వారిని గురించి ప్రస్తావించకుండా సంభాషణలు సాగాయి. యుద్ధం ముగియ వస్తున్నదనే ఆశాభావం వ్యక్తపరుచుకున్నాం.

            మధ్యాహ్నానికి అందరికి గాఢమైన సూపు గిన్నెలలో యిచ్చారు. చాలా ఆకలిగా ఉన్నా నేను సూపు ముట్టుకోలేదు. నాన్నకు నా మొండితనం తెలిసింది. నా వంతు కూడా నాన్న తిన్నాడు.

            కొంచెం సేపు కునుకు తీశాం. బ్లాక్‌ నీడలో ఎస్‌.ఎస్‌. ఆష్‌విట్స్‌ గురించి విశ్రాంతి ప్రదేశం కాదని తప్పుడు సమాచారమిచ్చాడేమొ!

            మధ్యాహ్నానికి వరుసలు కట్టాం. ఖైదీలు ఒక టేబుల్‌, కొన్ని వైద్య పరికరాలు తెచ్చారు. వాళ్ళు మా ఎడం భుజం మీద సూదులతో నంబరు వేశారు. నా నంబరు ఎ`7713. ఇక అప్పటి నుండి వేరే పేరు లేదు నంబరు తప్ప.

            సంధ్యవేళ మా హాజరుపట్టీ. వేలమంది ఖైదీలు బయటకు రాగా ఎస్‌.ఎస్‌.లు మా నంబరు చెక్‌ చేశారు. పనిచేయించే కమాండోస్‌ వచ్చారు. ద్వారం దగ్గర మిలిటరీ బ్యాండ్‌ మార్చింగ్‌ పాట వాయించింది.

            అందరూ లోనకెళ్ళారు. కొత్తగా తేబడిన వారిలో బంధువులూ ` స్నేహితులూ ఉన్నారేమొ చూసుకున్నాం.

            అలా రోజులు గడవసాగాయి. ఉదయం నల్లకాఫీ, మధ్యాహ్నం సూపు. మూడు రోజుల తరువాత నేను ఏది యిచ్చినా తింటున్నాను. ఇంతలో ఎవరో ` ‘‘మీలో సిఘెట్‌ నుండి వచ్చిన వీజల్‌ ఎవరు?’’ అని అడగటం విన్నాను. అడుగుతున్న అతను  ఒక పొట్టి వ్యక్తి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.