నారి సారించిన నవల-32

వి.ఎస్. రమాదేవి-3

                      -కాత్యాయనీ విద్మహే

          మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ మీద  వైవిధ్య భరితమైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య సంబంధాలలోని వైచిత్రిని చిత్రించిన నవల ఇది. స్వార్ధాలు, అహంకారాలు, అధికారాలు, అసూయలు, ఈర్ష్యలు, ఆప్యాయతలు, ఆనందాలు, ప్రేమలు, బాధ్యతలు, సర్దుబాట్లు, నిరాశలు, నిస్పృహలు, ఒంటరి వేదనలు, ఇలాంటి రకరకాల సంవేదనలతో కొట్టు మిట్టాడే మనుషుల చలన చిత్రం ఈ నవల. శశిరేఖ పెళ్లి దగ్గర మొదలైన కథ ఆమె మరణంతో ముగుస్తుంది. ఆ మధ్యకాలం ఐదారేళ్లను మించి ఉండదు. పెళ్లయిన ఏడాదికే రేఖకు కొడుకు పుట్టాడు.  మరణించే నాటికి వాడికి ఐదారేళ్లను మించి వయసు లేదు. అంతే గాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగు సినిమా పరిశ్రమను  మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలించటం గురించి వచ్చిన ఆలోచనలు, అభిప్రాయాల గురించి,  పంచాయతీ రాజ్ ను బలోపేతం చేయటానికి జరుగు తున్న ప్రయత్నాల గురించి వచ్చిన  ప్రస్తావనలను బట్టి నవలలో  కథ  స్థూలంగా 1954 -55 ప్రాంతాలలో మొదలై 1962 వరకు( నవల రచనా కాలం అదే) ప్రవర్తించి  ఉంటుందను కోవచ్చు.  విజయవాడ , గుంటూరు, హైదరాబాద్ , వికారాబాద్ , మద్రాస్ , కొడైకెనాల్ , ముస్సోరి మొదలైన ప్రాంతాలలో కథ  నడుస్తుంది. ఈ ఐదారేళ్ళ కాలంలో రేఖ జీవిత పరిణామాలు, అనుభవాలు, ఆలో చనలు, అంతర్మథనం ప్రధాన కథ.  కుటుంబంలో భార్యభర్తల సంబంధాలు, మనుషులమధ్య సంబంధాలు,  సినిమా కళా సాహిత్య మత   సాంస్కృతిక సంబంధ విషయాలు, హైదరాబాద్ చరిత్ర సంస్కృతులు, ప్రాంతాల మధ్య అసమానతలు, వాటిని పరిష్కరించటానికి రాజ్యాంగం కల్పించిన అవకాశాలు,  భౌగోళిక దర్శనీయ స్థలాల వర్ణన, చర్చ  ఇవన్నీ ఈ కథాగమనం లో భాగమై సమగ్ర మానవ జీవితాన్నీ, దాని వెనుక ఉన్న   సమాజాన్నీ ప్రదర్శిస్తాయి 

          రేఖ హైదరాబాద్ నిజాం కాలేజీలో బి.ఎ చదివిన అమ్మాయి. పెద్దలు సత్యనారాయణతో కుదిర్చిన పెళ్లి చేసుకొని భర్తతో కాపురం మొదలుపెట్టినప్పటినుండి భార్యగా ఆమె అనుభవం ఏమిటి? మృదువుగా మాట్లాడలేని భర్త పెడసరం లక్షణం, ఎవరి ముందైనా భార్య మీద విసుక్కొనటానికి, అరిచి చిన్న బుచ్చటానికి ఏ మాత్రం  జంకని  భర్త ప్రవర్తన, తాను ఏది మాట్లాడినా తప్పుపట్టే అతని మాటవైఖరి చూసి వారం రోజులకే రేఖకు  అతనితో కాపురంలో  మనసుకు తెరిపిలేకుండా గడపవలసి రావటం తప్పదు అని అర్ధం అయింది. ఇన్నాళ్లు తన బాగోగులు చూసిన  అక్క అయినా అన్న అయినా వాళ్ళ దగ్గరకు తనను తీసుకొని వెళ్లాలంటే భర్తను అడగవలసి రావటం, అతని ఇష్టా ఇష్టాలబట్టి తన రాకపోకలు ఉండవలసి రావటం కూడా అర్ధం అయింది. స్నేహంగా వుండే సందర్భాలు బొత్తిగా ఉండవని కాదు. ఉంటాయి కానీ మొత్తం మీద ఎదుటిమనిషి గమనంలో  లేనట్లు, వున్నా తనకనుగుణంగా ప్రవర్తించాలి అనే ఒక మొరటుతనం అతని సాహచర్యంలో ఆమెకు అనుభవం అయింది. ఏ విషయం మీదనైనా అభిప్రాయం చెప్పటానికి ఆమె నోరు తెరవకముందే అతను తాను అనుకొంటున్నదే ఆమె అభిప్రాయంగా ప్రకటిస్తాడు. ఆమె పక్షాన నిర్ణయాలు తానే  తీసుకొంటాడు. నవల ఇతివృత్తంలో అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ నిర్లిప్తంగా స్వీకరించటమే సంసారంలో ఆమె చేసిన అభ్యాసం. 

          నిజానికి రేఖది స్వతంత్రంగా వికసించిన వ్యక్తిత్వం. తండ్రికి చివరి సంతానం. ఇద్దరు అక్కలు, అన్న తండ్రికి మొదటి భార్య పిల్లలు. అయినా వాళ్ళతో ఏ ఘర్షణా లేని జీవితం. ముఖ్యంగా అక్కలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్ళిపోయినా అన్న రాజేశ్వర్ తో ఆమెకు మంచి స్నేహం. పెద్దక్క శాంత పెళ్లి చేసెయ్యమని గోల పెడుతున్నా అతను రేఖ ఆసక్తులను కనిపెట్టి ఆమె చదువును కొనసాగించాడు. ఫిలాసఫీతో బిఎ చదివింది. కవిత్వం వ్రాయగల భావుకత, చింతన, నటన పై అభిరుచి ఆమెలో వృద్ధిచెంది  కాలేజీ చదువుల కాలంలోనే  వ్యక్తమయ్యాయి. కానీ పెళ్లితో జీవితం పంచుకోవలసిన వ్యక్తికి ఇవన్నీ తెలియవలసిన విషయాలు కాకపోవటం ఒక సామాజిక సాంస్కృతిక విషాదం. సత్యనారాయణ రేఖల పెళ్లిలో ఆమె బిఎ చదువుకు కూడా ప్రమేయం ఏదీ లేదు. ఆమె అన్న ఆరువేలు మించి కట్నం ఇవ్వలేడు అన్న మాట ఒక్కటే రేఖ బావగారు            సత్యనారాయణకు చెప్పింది. అది అతనికి సమ్మతం అయింది కనుక, తాను ఎంతో గౌరవించే చిన్నాన్న ఆమోదించాడు కనుక పెళ్లయింది. ఇందులో రేఖ అభిప్రాయం కూడా ఎవరికీ అవసరం లేనిదే. ఈ పరిస్థితి పట్ల రేఖ అంతరంగంలో అలజడి ఏదో చెలరేగుతున్నదని“ తనకు కాబోతున్న భర్తను గురించిగాని, ముందు ముందు తన జీవితాన్ని గురించిగాని ఎలాంటి ఊహలూ రావటం లేదు తనకెందుకనో’ అన్న  నవలలోని మొదటి వాక్యాలే సూచిస్తాయి.“ అన్నకు బరువు తీరుతోంది  కదా అని సంతోషంగా నిట్టూర్చటం ఆడపిల్ల పెళ్లి ఆమె కోసం కాక పుట్టింటి వారి బరువుకో, పరువుకో సంబంధించింది కావటంలోని లోక వాస్తవికతను సూచించేదే. పెళ్లిళ్లలో సహజీవనం అలవాటుగా సాగేదే కానీ ఒకరి పట్ల ఒకరికి ఆసక్తిని పెంచేదికాదు, ఒకరినొకరు తెలుసు కొనటానికి ఉపకరించేదీ కాదు. కనుకనే సత్యనారాయణకు తన భార్య కవిత్వం వ్రాస్తుందని, నాటకాలు వేసిందని తన స్నేహితుడి భార్య, రేఖకు సీనియర్ అయిన ప్రమీల చెప్తేగానీ తెలియలేదు.     

          అలాగని స్వతంత్రంగా ఆలోచించే, అభివ్యక్తీకరించే , ప్రవర్తించే వ్యక్తిత్వాన్ని రేఖ పూర్తిగా వదిలేసుకొన్నది అనటానికి వీల్లేదు. చాలా సందర్భాలలో ఆమె తన ఆలోచనలను,  అభిప్రాయాలను ఎవరి ముందైనా నిస్సంకోచంగానే ప్రకటించింది. భర్త విజయవాడలోని  కలప వ్యాపారం కట్టేసి సినిమా పరిశ్రమలో  రఘుతో కలిసి పెట్టుబడి పెట్టటానికి నిర్ణయించి మద్రాసుకు మకాం మార్చినప్పటి నుండి అందుకు ఆమెకు అవకాశాలు కలిసి వచ్చాయి. ప్రమీలతో కలిసి మహిళా సంఘంలో చేరి దానికి కొత్త జీవం ఇయ్యటానికి చేసిన ప్రయత్నం, ఆ సందర్భంగా ఆమెకు వచ్చిన పేరు అధ్యక్ష కార్యదర్శులకు కంటగింపు అయినప్పుడు వాళ్లకు తగిన సమాధానం చెప్పి రావటం దగ్గర నుండి తాగటం వంటి అలవాట్లపై మంచి చెడులు తర్కించటం వరకు సందర్భాలు అనేకం. సినిమా నటిగా తన ప్రవర్తన పై వ్యతిరేక  వ్యాఖ్యలు చేసిన బయటివాళ్లకు  కానీ సన్నిహితులకు  కానీ ఆమె సమాధానం ఇచ్చిన తీరు ఆత్మగౌరవ చైతన్యంతో కూడినది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సినిమారంగంలో మంజులత, అరుణ, మణి పుష్ప మొదలైన వాళ్లకు ఆమె చాచిన స్నేహ హస్తం, సంఘ సేవలో ఉన్న స్నేహితురాలు  సుమతికి ఇచ్చిన ఆర్ధిక సహకారం వంటివి ఆమె స్వీయ వ్యక్తిత్వ ప్రకటనలే. మనుషులను పైకి కనిపించే ప్రవర్తనను బట్టి కాక ఆ ప్రవర్తనకు కారణమైన పరిస్థితులు ఏమిటో అలోచించి సానుభూతితో అర్ధం చేసుకొనటానికి ప్రయత్నించటం, తప్పొప్పుల స్వరూపం ఎప్పటికప్పుడు మారిపోతుంది అన్న అవగాహనతో తీర్పులు ఇయ్యటానికి తొందరపడకపోవటం ఇలాంటివి అన్నీ ఆమె మేధో సునిశితత్వాన్ని తెలిపేవి. అయితే ఆ మేధో వ్యక్తిత్వం, తన సాహిత్య కళా సృజన శక్తులు, సాటి మనుషులతో తన సంబంధాలు ఏవైనా సరే అవి  భర్త ఇష్టానికి, అధికారానికి గిట్టనివి అయినట్లయితే  ఆ మేరకు  తనను తాను కుదించుకొనటానికి, కత్తిరించుకొనటానికి, ఉపసంహరించుకొనటానికి రేఖ  సిద్ధం అయిన తీరులోని విషాదం  నవల పొడుగునా ప్రవహిస్తూనే ఉంటుంది.

          “అందరికీ ఇష్టమైన పనులే నేనెక్కడ  చేస్తూ ఉండగలను” అన్నది తరచు రేఖ తనను తాను వేసుకొనే ప్రశ్న. లేదా   ఇతరులకు అయినా వేసే ప్రశ్న. లోకం  అంతటికీ ఇష్టమైన పద్ధతిలో ప్రవర్తించటం సాధ్యం కాదని అనటంలో ఆమె ధిక్కారం, ఆ మేరకు తనకు మంచిది అనిపించిన దానిని పూర్తి బాధ్యతతో ఆచరించటంలో ఆమె నిజాయితీ చాలా సందర్భాలలో కనబడతాయి. కానీ అందరికీ ఇష్టమైన పనులే చెయ్యాలంటే సాధ్యం కాదు అని చెప్పగలిగిన రేఖ అంతే సహజంగా భర్తకు ఇష్టమైనదాన్ని చేయటం మాత్రం స్వీయ ధర్మం గా అభివృద్ధి చేసుకొనటం గమనించవచ్చు. అది మనుధర్మం స్త్రీలకు ఇచ్చిన శిక్షణ మరి. సత్యనారాయణ చెల్లెలు సూర్యకాంతం సినిమాలలో వేయటానికి అన్నయ్య ఒప్పుకొన్నాడా అని అడిగినప్పుడు రేఖ మీ నాన్నగారు ప్రోత్సహించారు కూడా అని సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం విని అయితే భయపడవలసిందేమీ లేదు అంటుంది. భర్తకు ఇష్టంలేని పని చేయటం అంటే చేజేతులా  సంసారాన్ని కూలదోసుకొనటమే అన్న భయం సృష్టించి స్త్రీల గమనాన్ని, గమ్యాలను నియంత్రించే పితృస్వామిక సమాజం ఇది. ఇక్కడ రేఖ “మా ఇంట్లో మా అక్కలకీ   ఇష్టం లేదు, మన బంధువులలో కూడా ఎవరికీ నచ్చదని తెలుసు. కానీ అందరికీ నచ్చే పనులే ఎక్కడ చేయగలం? అని అంటుంది. అందరికీ నచ్చే పనులే చేయలేం, కానీ భర్తకు నచ్చే పని మాత్రమే చేయగలం అన్న సమాధానం ఈ ప్రశ్నలో గర్భితమై ఉంది.     

          భర్త అవసరాలకు, ఇష్టాలకు,  నిర్ణయాలకు లోబడి వాటిని సంతృప్తి పరచటానికి అనువుగా పుట్టింటి వారితోనైనా, స్నేహితులతోనైనా తన సంబంధాలను సమయాన్ని నిర్వహించుకు రావటం రేఖ కష్టమైనా సరే ఇష్టమేనని అభ్యాసం చేసి అలవరచుకొన్న లక్షణం. అది ఏ రంగంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న స్త్రీకి అయినా అనివార్యం చేసిన వ్యవస్థ పెట్టె ఒత్తిడి ఫలితం. ఎక్సట్రా వేషాలు వేసే అరుణకు పెద్ద ప్రొడ్యూసర్ తో సంబంధం వుంది. గర్భస్రావాలు చేయించు కొనే బెడద తప్పించుకొని ధైర్యంగా పిల్లలను కనటానికి ఆ ప్రొడ్యూసర్ కే  కారు డ్రైవర్ అయిన మామయ్యను బూటకపు పెళ్లి చేసుకొన్నది అరుణ. ఆ  పెళ్ళికి వెళ్లి వచ్చినప్పుడు రేఖను ప్రమీల ‘తక్కువరకం మనుష్యులతో ఆ సంబంధాలు ఏమిటని’  మందలించింది. నేనేమీ తప్పు చేయలేదు. ఆయనకు చెప్పే వెళ్ళాను.. అంటే పని హడావిడిలో అంతగా పట్టించుకోక పోయి ఉండవచ్చు గానీ ఆయనకు కూడా ఇలాంటివి ఇష్టం ఉంటాయని అనుకోను అని ప్రమీల అంటే ఒక క్షణం కూడా సందేహించకుండా ఆయనకిష్టం లేకపోతే , తప్పకుండా మానేస్తాను అంతే కానీ అలా వెళ్ళటం తప్పని మాత్రం అనుకోను అని బదులిచ్చింది రేఖ. ‘భర్తను నొప్పించి ఆయనకు వ్యతిరేకంగా ఏదీ ఎప్పుడూ చేయను’ అన్నది రేఖ  ప్రతిజ్ఞ. 

          తమ స్వంత సినిమాలో అయినా , మరొక కంపెనీ  సినిమాలలోనైనా రేఖ నటిస్తుందని నిర్ణయించిన భర్తే భార్య సినిమాలలో చేరి ఇంటిపట్టున ఉండకపోవటంవల్ల ఇంట్లో వాళ్ళ సౌకర్యాలు జరగడంలేదని ఆరోపించినప్పుడు జరిగిన సంభాషణలో రేఖ “నాకు ఇష్టం  అయిష్టం ఏమీలేవు. వీలుంటే అవకాశం ఉంటే వేద్దామని తప్ప. అది చెయ్యందే  ఉండలేనని ఏమీ లేదు” అని చెప్పటం గమనించదగినది.  స్త్రీలకు అనివార్యం చేయబడిన అసిధారావ్రతం వంటి జీవిత స్వభావాన్నిఇది ధ్వనిస్తుంది. వీలు అవకాశం లేక మగ్గిపోయేవాళ్లు కొందరైతే అవకాశం కల్పించబడి అనుక్షణం అనుమానించబడుతూ , హింసించబడే వాళ్ళు మరి కొందరు. అనుమానం లైంగికతకు సంబంధించిందే కానక్కరలేదు. విశ్వాసపాత్రురాలిగా ఉండటంలో లోటు ఏమైనా ఉందా అన్నది కూడా అనుమానమే. సినిమా నటిగా పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదిస్తున్న భార్య తనను ఎక్కడ తక్కువ చూపు చూస్తుందోనన్న అనుమానం అది. రేఖ అటువంటి హింసకు గురవుతున్నది. ఒక సినిమా షూటింగ్ లో మెట్లమీద నుండి జారిపడి కాలునొప్పి చేసి ఆసుపత్రిలో చేరిన రేఖను చూడటానికి అన్న రాజేశ్వర్ వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన మంజులత షూటింగ్ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆ భర్త మీద అంత కోపం తెచ్చుకొని అంత దూకుడుగా మెట్లు దిగటం ఎందుకు!? అని రేఖను కోప్పడుతూ ఇంట్లో మళ్ళీ ఆయన దగ్గర పిల్లిలా ఉంటుంది అని చిన్న ముక్తాయింపు కూడా ఇచ్చింది. దానికి స్పందిస్తూ ఆ సినిమా భర్త మీద దూకుడు చూపితేనే కాలు విరిగింది. ఇక ఇంట్లో ఆయన మీద దూకుడు చూపుతూ మెట్లు దిగితే కాలు జారి మెడే విరిగేది అని రేఖ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలో ఏడవలేని తనమే కనిపిస్తుంది. లోపలి ఏడుపు  వాస్తవం. పై నవ్వు నటన. డైరెక్టర్ చెప్పినట్లు సినిమాలో నటించే రేఖ స్త్రీగా సమాజ దర్శకత్వంలో నటించటంలో భాగం అది. 

          రేఖ అన్న రాజేశ్వర్ భార్య సుందరి. వాళ్ళ   సంబంధాలు  కూడా పెళుసు బారినవే. తన ఆరోగ్యం పట్టించుకొనటం లేదని, పిల్లలను పట్టించుకొనటం లేదని, నగలు చేయించలేదని,  ఆస్తులతో రాలేదని, చదువుకోలేదని భర్త తనను చిన్న చూపు చూస్తున్నాడని, తమ భవిష్యత్తు ఆలోచించ కుండా చెల్లెలి పెళ్ళికి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడని, స్నేహితుల తో కలిసి తాగుతూ తనను పట్టించుకోడని , అతనికి ఇంకెవరితోనో సంబంధాలు ఉన్నాయని ఇట్లా ఎప్పుడు ఏదో ఒక ఫిర్యాదుతో , లోలోపల మసిలే అసంతృప్తులతో తాను బాధపడుతూ భర్తను సాధిస్తూ ఇంటిని నరకం చేస్తుంటుంది. రేఖ ప్రసవించాక చూడటానికి వచ్చిన రాజేశ్వర్  తన మిత్రులు, మధు సుధీర్ ల గురించి చెప్తూ తన సంసారంలో లోపించిన శాంతి గురించి బాధపడుతూ చెల్లెలి కాపురం సంగతి ఏమిటని అడుగుతాడు. అది మనచేతుల్లో లేదంటూ ఒకవేళ వాళ్లు  మనల్ని కష్టపెట్టేవాళ్లే దొరికితే శక్తి ఉన్నంతవరకు ఓర్చుకుంటాం … చేసేదేముంటుంది. ఏమిటో, ఇలాంటి విషయాలు ఆలోచించగూడదన్నయ్యా” అంటుంది రేఖ. పెళ్లయిన అతి కొద్దికాలానికే రేఖ  ఆ  అవగాహనకు వచ్చిందంటే అది దాంపత్య సంబంధాల వాస్తవికత నేర్పిన కఠిన పాఠం వల్లనే. 

          సంసారంలో, సహజీవనంలోని ప్రేమ రాహిత్యం, డొల్లతనం రేఖను లోలోపలి నుండి తొలచి వేసాయి కనుకనే మధు మరణం తరువాత అతని డైరీలలో తన పట్ల వ్యక్తమైన అతని ప్రేమ తాకిడికి బీటలు వారిపొయింది.  అతను పెళ్లయినవాడు. పిల్లల తండ్రి. వైవాహిక బంధంలో ఉన్న అతనికి రేఖ మీద కలిగిన ప్రేమ ఆమె లోని కవితా హృదయాన్ని, భావుక సౌందర్యాన్ని, కళా దృష్టిని చూచే కావచ్చు. ఎందుకంటే అతను స్వయంగా కవి. కానీ ఆమెపట్ల తన ప్రేమను వ్యక్తం చేయటానికి తాను పెళ్లయినవాడు కావటమే ప్రతిబంధకం. ఆమెకు పెళ్లయింది. తనదిగా చేసుకోలేని రేఖ తనకిక దూరం  నుండి ఆరాధించుకొనవలసినదే. డైరీలలో వ్రాసుకొనటం అందులో భాగమే. ఆమె వ్రాసిన కవితలను పుస్తకంగా అచ్చువేయించటమూ అందులో భాగమే. డైరీలు చదివాక  కుప్పకూలిన ఆమె ఆ డైరీలలో అతని కవితలు ఉన్న పేపర్లు చింపి పెట్టి మిగతాభాగాన్ని కాల్చి బూడిద చేసి బయటకు చల్లింది. ఆ ప్రేమ తనలో నింపిన బరువును మోయలేని ఒక సామాజిక అసందర్భం నుండే ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. మరణించింది. స్త్రీపురుషుల పరస్పర ఇష్టాలతో , అభిరుచుల అభిప్రాయాల సారూప్యతతో  సంబంధం లేని పెళ్లి , దాంపత్య సంబంధాల వైఫల్యాన్ని చూపి వి. యస్. రమాదేవి కుటుంబాన్ని కొత్తగా నిర్మించుకొనవలసిన అవసరాన్ని చెప్పింది. 

          స్త్రీలు పుట్టరు. తయారుచేయబడతారు అంటారు. సత్యనారాయణ వంటి పురుషులు కూడా పుట్టరు. తయారుచేయబడతారు అని రమాదేవి సూచించదలచుకొన్నది. నవల ప్రారంభంలోనే అతని నేపథ్యం చెప్పబడింది. తండ్రి తల్లితో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడటం అతను చూడలేదు.తల్లి తండ్రి వస్తున్న సవ్వడి వింటేనే ఉలిక్కిపడటం , కంగారు పడటం అతను చూసాడు. వంట వడ్డన సరిగాలేవని వంకపెడుతూ  కోపతాపాలు ప్రదర్శిస్తుంటే తినే పళ్లెం ఎప్పుడు విసిరేస్తాడోనని ప్రాణాలు అరచేతపెట్టుకొని తల్లి నిలబడటం చూసాడు. తండ్రి అంటే అతనిలోనూ భయమే గూడు కట్టుకొన్నది. అలాంటి తండ్రి సత్యనారాయణకు పద్నాలుగు ఏళ్ళు వచ్చేటప్పటికి చనిపోయాడు. కొడుకుని భర్తలాగా కాకుండా బాగా చదివించి సౌమ్యపరుడిగా చేయాలని సత్యనారాయణ తల్లి ఆశపడింది కానీ తండ్రి మూసలోనే అతి సహజంగా ఇమిడి పోయాడతను. అందుకు సామాజిక సంస్కృతి దోహదకారి పాత్ర వహిస్తుంది. అధికారంతో ఆధిపత్యంతో  సంబంధంలోనే మగవాడి సామర్ధ్యం గణింపబడే సమాజంలో ఆ ప్రవాహంలోకి అందరూ సులభంగా లాగబడతారు. ఆ నాడు తల్లి తండ్రికి ఎంత అగ్గగ్గ లాడుతూ బతికిందో ఈ నాడు రేఖ తనకు అలా అగ్గగ్గ లాడుతూ బతుకుతున్నదన్న  స్పృహను, సున్నిత మానవీయ గ్రహణ శక్తిని కోల్పోయాడు. అలాంటి సత్యనారాయణలను ఉద్దరించటం ఎలా అన్న కోణం నుండి కూడా ఆలోచించవలసిన అవసరాన్ని ఈ నవల సూచిస్తుంది. 

          స్త్రీపురుష సంబంధాలు, కుటుంబం మాత్రమే కాదు అవినీతి , అలసత్వం, శుష్కప్రియాలు శూన్యహస్తాలుగా ఉన్న స్వాతంత్య్ర అనంతర భారత రాజకీయాలు, గ్రామీణ రాజకీయాలు, కింది నుండి అధికారాన్ని సంపాదించుకొనటానికి గ్రామాలను పార్టీలుగా చీలుస్తున్న పంచాయతీ రాజ్య రాజకీయాలు అన్నీ సంస్కరింపబడవలెనన్న ఆకాంక్షను, ప్రజల చొరవతో జరగవలసిన గ్రామీణ పునర్నిర్మాణాన్ని కూడా చూపిన నవల ఇది. 

          సినిమారంగంలో  రావలసిన మార్పుల గురించి,  చదువుకొని , సంస్కారవంతులైన స్త్రీలు సినిమా రంగంలోకి వస్తే మంచికి జరిగే మార్పుల గురించి, సినిమాను  లాభాల కోసం చేసే వ్యాపారంగా కాక ప్రేక్షకుల సంస్కారాలలో, అభిరుచులలో  విలువలను  అభివృద్ధి చేసే కళారంగంగా అభివృద్ధి చేయటం గురించి కూడా విస్తృతంగా చర్చించిన నవల ఇది. జమునారాణి, మణి  పుష్ప, మంజులత, అరుణ మొదలైన పాత్రల ద్వారా సినిమారంగంలో స్త్రీల స్థితి గతులపైన భిన్న పార్శ్వాల నుండి వెలుగును ప్రసరింప చేయటం అందరూ మనుషులే నవలలో జరిగింది. సినీ జీవితరంగాన్నివస్తువుగా చేసుకొని రావూరి భరద్వాజ పాకుడు రాళ్లు నవల వ్రాయటానికి పదహారేళ్ళ ముందే        వి. ఎస్. రమాదేవి నవల వచ్చిందని గుర్తించాలి. ఈ రెండింటికీ ఉన్న సారూప్య భేదాలగురించి ఆలోచించవచ్చు.

    ( ఇంకా ఉంది)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.