ఊరుమ్మడి బతుకులు

-నజ్మా బేగం

          “నే బడికి బోతానయ్యా”…..కంటి నిండా నీరు కుక్కుకున్నాడు పదేళ్ల నరసిమ్ము.
 
          పొలం పని చేస్తున్న వెంకటప్ప. కొడుకు మాటతో ఇoతెత్తున ఎగిరాడు. ” బడికి బోతే …సావుకారీ అప్పు ఎట్టా తీర్సాలoటా…సదువుతాడంట సదువుతాడు.మనిండ్ల ఎవురైన సదివినాడ్రా..మా ఆయ్య సదివిండా..మా తాత సదివిండా.. యాళ్లకు ఏళ్ళు మనవ్ ఆళ్ళింట్లోనే పని సెయ్యాల.. ఇంగా ఈడే ఉండావా…పోతివా లేదా”…. కొట్టేంత పని చేశాడు ఎంకటప్ప.
 
          తండ్రి అరుపులకు బoబేలెత్తిన నరసిమ్ము తల్లి చెంతకు చేరాడు. 
 
          ఏడుస్తున్న కొడుకును చూసీ ఆ తల్లి కన్నపేగు ఖలుక్కుమంది. ” ఏందయ్యా… సంటోడిని గట్ట కసరతాండావు.ఇయ్యలకొదిలేసేయ్ ! రేపు మాయిటాల నేనే వొదిలి పెట్టొస్తాలే..నూ రారా అయ్యా..ఏడి ఏడిగా సంకటిముద్ద తీస్కచ్చినా.. తిందూ గానీ… అంటూ కొడుకు చేయి పట్టి పొలం గట్టు మీదకు తీసుకెళ్లింది లచ్ఛమ్మ.
 
          దీని పరిణామం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే గుండెలదిరాయి ఎంకటప్పకు.
 
          “మీ అమ్మా కొడుకులకేం తెలుసుద్దే.!.ఈయప్ప రాడని ఆ సావుకారీకి  తెలిస్తే ఇంగేమైనా ఉందా..అసల మనల్ని బతకనిస్తడా…సంగటి ముద్దలో ఉల్లికారం అద్దుకుంటూ అన్నాడు ఎంకటప్ప.
 
          ఇంతలో వీరి మాటల్లోనే వచ్చిన సావుకారు అనుచరుడు కేశవుడు  “ఓ ఎంకటప్పా…!!! సావుకారు పిలిసిండు బిరింగా రా”….అని ఎంకటప్ప సమాధానo కోసం ఎదురు చూడకుండానే విస విసా వెళ్ళిపోయాడు.
 
          కేశవుడి మాటలు విన్న ఎంకటప్ప గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.సంగటి సత్తు గిన్నెను పక్కకు నెట్టేసి నెత్తిమీది కండువను నడుంకు కట్టి ఉరుకుల పరుగుల మీద సావుకారీ బంగళా ముందు వాలాడు ఎంకటప్ప.
 
          “దండాలు దొరా.. అంటూ చేతులు ముడుచుకున్న ఎంకటప్పను చూసి ఏరా !… బలిసిందా…నీ కొడుకుని పన్లో పంపమంటే యాలకు పంపలేదురా… నొసలు చిట్లించాడు సావుకారీ.
 
          “దొరా……తల గోక్కున్నాడు ఎంకటప్ప.
 
          “యాందిరా..అడగాతాంటే ఇన్రాలేదరా..గర్జించాడు సావుకారి.
 
          “ఆ యప్పకి పని సెయ్యడం ఇట్టవ్ లేద్ దొరా…..నసిగాడు ఎంకటప్ప.
 
          “పని చేయక ఇంగేo జేస్తాడ్రా… చుట్టను ఎలిగించి దమ్మును వదిలాడు సావుకారి
 
          “బడికి బోతాడంటా దొరా…కళ్ళలోకి చూశాడు ఎంకటప్ప.
 
          ఇది విన్న సావుకారీ.. ఎంగిలి తుంపరలు ఎగిరినంతగా భళ్ళున నవ్వాడు.తోడుగా.. అనుచరులు కూడా శృతి కలిపారు.
 
          దొర తన మాటలు విని కోపగించుకుంటాడు అనుకున్న ఎంకటప్ప సావుకారీ నవ్వును ఆశ్చర్యoగా చూశాడు.
 
          “ఏరా…ఎకసెక్కాలుగా  ఉందా…పిచ్చనా కొడకా…నీకేవైన మతి దొబ్బిందా.. మీరేందిరా సదుకునేదీ..??? మా కాలి కింద చెప్పుల్లా పడుండల్లా… నీ కొడుకుని బడికి అంపితే నీ బాబు బాకీ ఎవురు తీరాస్తాడంటా..నీవే గాదు, నీ నాలుగు తరాలు గూడా మాకింద చాకిరి జేస్తేగానీ నీ అప్పు తీరదు….గబ్బు నా కొడకా..సదివిస్తాడoట.మాయిటాల లోపల నీ కొడుకుని పన్లో తీస్కరాకబోతే..కొడకా నిన్నేo జ్యాస్తానో నాకే తెల్దు.! ఇయ్యాల నించి నీ పెండ్లాన్నీ గూడా తొల్కో రా…ఇంట్లో దొరసానమ్మకు పనికి గావాలంటా.. అంటూ మరో మాటకు తావివ్వకుండా మీసాలు తిప్పుకుంటూ వెళ్ళబోతున్న సావుకారుతో అన్నాడు వెంకటప్ప.
 
          “దొరా !…మా అయ్య బాకీ ఇంకెoతుండాదీ దొరా…. నేను పుట్టింకాడ్నించి ఆ యప్ప జేసిన అప్పు తీర్సడం కోసం నేనూ.. మా యమ్మా..మా అయ్యా గొడ్డు సాకిరి స్యాస్తానే ఉండాము.ఇంగా ఎంతుండాదో సెబితే…భయంభయంగా నోరు పెగిలింది ఎంకటప్పకు.
 
          మాట పూర్తవక ముందే సావుకారీ బూటు దెబ్బ ఎంకటప్ప వీపు మీద పడింది.” ఒర్రెయ్ ! ఈ నాయలకంట లెక్క చెప్పండ్రా…అని వెళ్ళిపోయాడు సావుకారి.
 
          అంతే… సావుకారీ ఆజ్ఞ విన్న అనుచరులు ఎంకటప్పను గొడ్డును బాదినట్టు బాది వదిలేసి వెళ్లిపోయారు.కేశవుని సహాయంతో ఎలాగోలా ఇంటికి చేరాడు ఎంకటప్ప.
 
          రక్తసిక్తమై వచ్చిన భర్తను చూసిన లచ్చమ్మ ఏడుస్తూ గుండెలు బాదుకుంది.
 
          జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించిన కేశవుడు ” మన బతుకులింతే లే లచ్మక్కా..కుక్క బతుకులు మనయి.మా తాత అప్పు ఏలి ముద్ర కోసం ఇయ్యాల దాకా నేను సావుకారింటికి కాపలాగా ఉండా…బావకు కాపడం బెట్టు.అని కంటి నిండా నీరు నింపుకెళ్లాడు కేశవుడు
 
          ఎంకటప్ప అవతారాన్ని చూసిన నర్సిమ్ము తాను పనికి పోక పోవడం వల్లనే నాయనకు  సావుకారీ దెబ్బలు పడ్డాయని,ఇక చదువు గురించి నాయన్ని అడగకూడదనే గట్టి నిర్ణయానికొచ్చేశాడు.
 
          దెబ్బల కారణంగా ఎంకటప్ప ఆరోగ్యం క్షీణించసాగింది.రేయనక పగలనక కళ్ళలో వొత్తులు పెట్టుకొని భర్తను కనిపెట్టుకొనే ఉన్నదీ లచ్మమ్మ.నరసింహు అయితే తండ్రిని అంటిపెట్టుకొనే ఉండేవాడు.భార్యా కొడుకు సపర్యలతో  త్వరగానే కోలుకున్నాడు ఎంకటప్ప.
 
          ఆ మరునాడే ఈ నోటా ఆ నోటా ఎంకటప్ప లేచి కూర్చున్నాడని విన్న సావుకారీ  ఎంకటప్పకు పెండ్లాo , కొడుకుతో సహా  తన ముందు హాజరవ్వాలని కేశవుడితో కబురెట్టాడు.
 
          కేశవుడు చెప్పినదంతా విన్న లచ్మక్క మొగుడి వైపు భయంగా చూసింది.ఏమీ కాదులే అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు ఎంకటప్ప.
 
          “దండాలు దొరా…అనే పిలుపు తో కుక్కకు బిస్కెట్లు వేస్తున్న సావుకారీ..ఏరా ! ఇబుడు పానం బాగుందా..ఇయ్యాల చెనిగిత్తనాల్ని మిసను కాడ తోలాలా.. నీ కొడుకుని గూడా తోల్కపో..పని నేర్సుకుంటాడు అన్నాడు.
 
          “ఆడు పనిగాదు దొరా.. సదువు నేర్సుకుంటాడు.మిసను కాడకు కాదు.నా కొడుకు బడికి బోతడు.మేవు కూలినాలి సేసి మా పిలగాడ్ని సదివించుకుంటాం.మా కట్టాలు మా బిడ్డకు వొద్దు దొరా..ఆడు పెద్ద పెద్ద సదువులు సదవాల.మాతోనే ఈ బానిసత్వం పోవాల్ల దొరా…పోవాల్ల..పదే పోదాం ..అంటూ కొడుకును భార్యను తీసుకెళుతున్న ఎంకటప్పను చూస్తూ ఉండి పోయాడు సావుకారు.
 
*****
(సమాప్తం)
Please follow and like us:

2 thoughts on “ఊరుమ్మడి బతుకులు (కథ)”

  1. బానిసత్వాన్ని అంతం చేసేది చదువు ఒకటే అని రచయిత్రి బాగానే చెప్పారు. కానీ ఆ షావుకారు అంత సులువుగా వాళ్లను వదులుతాడా అని అనుమానం. ఆ తరువాత వాళ్లకు ఏమయ్యిందో ఏమిటో పాపం? మంటే జరిగింది అనుకుందాము. మాండలీకం చాలా బావుంది.

  2. సదువులొక్కటే తమ జీవితాలను బాగు చేస్తా
    యని ఘంటాపధంగా చెప్పిన రచయిత్రి.

Leave a Reply

Your email address will not be published.