నారి సారించిన నవల-33

వి.ఎస్. రమాదేవి-4

                      -కాత్యాయనీ విద్మహే

వి. ఎస్ రమాదేవి  “దారి తప్పిన మానవుడు” నవలకు ఒక మాట అనే శీర్షికతో వ్రాసుకొన్న  చిన్న ముందుమాట లో ఆమె 1961, 62 ప్రాంతాలను ప్రస్తావిస్తూ ఆ రోజులలో రాజకీయపరంగా ముఠాతత్వం మొదలై ఎన్నికల రాజకీయాలను నిర్దేశిస్తున్న తీరును ,  అరవిందుని రచనలు ఆలోచనాపరులను ప్రభావితం చేస్తున్న సందర్భాన్ని గమనిస్తూ వాటన్నిటి నేపధ్యం నుండి తాను ఆ నవల వ్రాసినట్లు చెప్పింది. దానిని బట్టి ఈ నవల  1962 తరువాతది   కావాలి.వనితాజ్యోతి పత్రిక  అనుబంధంగా ప్రచురించబడిన  మహిళా రచయితల పరిచయాల సంచికలో  ఈ నవల 1961 దిగా పేర్కొనబడింది.   2004 లో మిగిలిన నవలలతో పాటు ఇది కూడా ప్రచురించబడింది. దీనిని ఆమె చిన్నక్క లక్ష్మీదేవికి అన్నయ్య లోకరాజుకి అంకితం చేసింది. 

 దారి తప్పిన మానవుడు నవలలో ఇతివృత్తం గిరిధర్ జీవిత పరిణామాలను చుట్టుకొని ప్రవర్తిస్తుంది. మద్రాస్ లో  సినిమారంగంలో రచయితగా , దర్శకుడుగా పరిచయమైన గిరిధర్ నాలుగేళ్ళ అనుభవాల తరువాత అక్కడ ఇమడలేక ఊరటకోసం పాండిచ్చేరీ వెళ్లి మదర్ ను చూసి వచ్చి తక్షణమే స్వస్థలం శనివారప్పేటకు  మకాం మార్చి పత్రికా రచయితగా, సంపాదకుడిగా స్థిరపడి అక్కడి నుండి పార్లమెంటు రాజకీయాలలోకి దారి మార్చి,ఎమ్మెల్యే అయి  ఆ తరువాత మంత్రిగా వ్యవహారాలు నడిపటానికి హైదరాబాద్ మకాం మార్చి కొత్త మంత్రి వర్గంలో స్థానం దొరకక తిరిగి  శనివారప్పేటకు కాపురం మార్చి   ఏవో అసంతృప్తులు వెన్నాడుతుండగా కుటుంబాన్ని వదిలి  అరవిందాశ్రమం చేరిన గిరిధర్ జీవితాన్ని స్వాతంత్య్ర అనంతర  పార్లమెంటరీ రాజకీయ ధోరణుల నేపథ్యంలో, పత్రికా రంగం, సాహిత్య రంగం పని తీరుతెన్నుల సంబంధంలో చూపుతుంది ఈ నవల.  

నవల ఇతివృత్తంలో అసెంబ్లీ ఎన్నికలు,ఎన్నికల ప్రచారం ఒక భాగం. ఈ ఎన్నికలలో  గిరిధర్ కు  ఎం ఎల్ ఏ  గా నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించటం, భారీ మెజారిటీతో గెలవటం కూడా జరిగాయి. ఆ తరువాత  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ తో రాష్ట్ర మంత్రివర్గంలో వచ్చిన మార్పుల వల్ల గిరిధర్ కు మంత్రివర్గంలో స్థానం లభించినట్లు కూడా చెప్పబడింది. ఆంద్ర రాష్ట్ర అవతరణ 1956 నవంబర్ 1 న జరిగింది కనుక అప్పటికే ఎం ఎల్ ఏ గా ఎన్నికై ఉండటం వలన గిరిధర్  మంత్రివర్గంలోకి రాగలిగాడు కనుక  అతను పోటీ చేసింది 1955 ఫిబ్రవరి లో ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేషన్ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలో అయి ఉండాలి. ఈ ఎన్నికలకు కాస్తముందే  గిరిధర్ మద్రాస్ నుండి శనివారప్పేటకు వచ్చాడు. రాజావారిని కలవటం ఆయన స్థాపించిన ప్రెస్ ను నిర్వహించి ఆగిపోయిన పత్రికను ప్రారంభించటానికి ఒప్పుకొని పత్రికను బయటకు తీసుకురావటం రెండు నెలలో జరిగితే మరోరెండు మూడు నెలలలో పత్రిక అమ్మకాలు పెరిగాయి. ఆ తరువాత కొన్ని నెలలకు  ఎన్నికలు. అంతా ఒక సంవత్సరం అనుకోవచ్చు. ఆ  లెక్కన గిరిధర్  మద్రాస్ నుండి శనివారప్పేటకు వచ్చింది 1954. పిల్లలకు బడులు తెరవకముందే వచ్చారు. 1954 ఏప్రిల్ అయి ఉంటుంది. 1955 ఎన్నికలు,  అంతకు ముందు ఒక సంవత్సరం , ఆ తరువాత ఆంధ్రప్రదేశ రాష్ట్ర అవతరణ వరకు దాదాపు రెండేళ్లు ఆ తరువాత కూడా కనీసం ఒకఏడాది – మొత్తం మూడేళ్ళ మీద కథ నడిచినట్లు. 

ఈ నవలలో దారితప్పిన మానవుడు గిరిధర్ అన్నది స్పష్టం. నిర్మల ముఖంగా నవల చివర అది వాచ్యం చేయబడుతుంది కూడా. దారితప్పటం అంటే ఏమిటి?  మానవుడు జీవించవలసిన పద్ధతి ఒకటి ఉండగా అట్లా జీవించక మరొక రకంగా ప్రవర్తించటం అనుకోవచ్చు. అయితే దాని వెంట  మానవుడు జీవించవలసిన అసలు పద్ధతి ,దారి ఇది అన్న  నిర్దిష్ట నిర్వచనం ఏమైనా ఉందా?  అది నిరపేక్షమా ? మార్పు లేనిదా? వంటి ప్రశ్నలు కూడా ఉంటాయి.  గమ్యం ఏమిటో తెలియని నిలకడ లేని పరుగు అయిన  జీవితం లో గిరిధర్ దారి తప్పాడు అనుకోవచ్చా? 

నవల ప్రారంభానికి  గిరిధర్ భార్య కాపురానికి వచ్చి ఇరవై ఏళ్ళు. ఆమె వయసు ముప్ఫయి ఎనిమిది. అంటే గిరిధర్ నలభయ్ లలో ఉన్నాడు. మద్రాసు సినిమారంగంలో తన భవిష్యత్తును వెతుక్కొంటూ అతను వచ్చి నాలుగేళ్లు. రచయితగా,  దర్శకుడిగా కాలు నిలదొక్కుకొన్నాడు. కానీ  నిర్మాతల జోక్యం, పెత్తనం, నిర్లక్ష్యం, తనవల్ల మేలుపొంది కూడా తన పక్షాన నిలబడి ఒక మాట మాట్లాడలేని వాళ్ళ  స్వార్ధం అన్నీ కూడా అతని మనసును చికాకు పరిచి  మద్రాస్ తనను తరిమివేస్తున్నట్లుగా ఒత్తిడికి లోనై తక్షణమే శనివారప్పేటకు సంసారం తలరించాడు. నాలుగేళ్ళ క్రితం  అతను అక్కడే ఉన్నాడు. ఏమి చదివాడో , రచయిత ఎలా అయ్యాడో, ఏమి వ్రాశాడో తెలియదు. జమిందార్ రాజా గారితో , రాణి గారితో పరిచయం రాకపోకలు, రాజకీయాలు ఉన్నాయని సూచనలు కనబడతాయి. హఠాత్తుగా నాలుగేళ్ళ క్రితం అక్కడి నుండి బయలుదేరి మద్రాసుకు రావటానికి కారణమూ తెలియదు. మళ్ళీ శనివారప్పేటకు వచ్చాక రెండు మూడేళ్ళలో పత్రికా రంగం నుండి రాజకీయాలకు అక్కడి నుండి అరవిందో ఆశ్రమానికి అతను అతివేగంగా ప్రయాణించటం చూస్తాం. ఏ క్షణంలో గాలి ఎటు వైపు వైపు మళ్లుతుందో అటు ప్రయాణించే పద్ధతి ఇది. జీవితం ‘ఎటు మళ్లితే ఆటే వెళ్లనీయ్ .. దానిని పని గట్టుకుని తిప్పటం ఎందుకు అనే పద్ధతి’ గిరిధర్ ది అని భార్య కమలకు తెలుసు.  అని   ఈ క్రమంలో అతను ఎక్కడైనా దారి తప్పాడా ? ఎక్కడ? ఎలా ?  

నవల ప్రారంభంలో ఏవో చిరాకులలో మదర్ ను చూడటానికాని అప్పటికప్పుడు పాండిచ్చేరి వెళ్లిన గిరిధర్ ఆలోచనా ధారను బట్టి అతను ‘నేను’ అన్న అహం నడిపిస్తుంటే నడుస్తున్న మానవుడు అని అర్ధం అవుతుంది. నేను మదర్ ని చూడటానికి వచ్చానా లేకపోతే నేను మదర్ కు కనపడాలనా అని అనుకొనటమే కాదు , మదర్ తనవైపు చూచి నవ్విందని కూడా అనుకొంటాడు. ఇంతమందిలో నన్నెలా గుర్తించింది? అందరికన్నా భిన్నంగా ఉన్నానా ? అని విచికిత్స చేస్తాడు. తాను , ఎందరిలో వున్నా తాను ప్రత్యేకంగా కనబడాలన్న ప్రగాడమైన వాంఛ అతనిని నడిపిస్తున్నాయనుకోవచ్చు. డైరెక్టర్ గా తన పనిని తాను చేసుకోకుండా నిర్మాత తనకు సలహాలియ్యటం , వాటిని తాను పాటించటం లేదని దూరం పెట్టటం, మరొక నిర్మాత తాను డబ్బు అడిగినప్పుడు ఇయ్యకపోవటం- ఇలాంటివి అతని అహాన్ని దెబ్బతీశాయి కనుకనే మరుక్షణం మద్రాస్ వదిలేసాడు.

     గిరిధర్ ఎప్ప్పుడెప్పుడు సంతృప్తి పడతాడో , సంతోష పడతాడో  ఎప్పుడెప్పుడు చిరాకు పడతాడో పరిశీలిస్తే అవన్నీ అహం కేంద్రకాలే అని స్పష్టం అవుతుంది. అతని భార్య అతని ని ఎంతగా ప్రేమిస్తుందో , అతని అవసరాలు ఎంత కనిపెట్టుకొని ఉంటుందో అంతే స్థాయిలో బయటి ఆడపిల్లలందరికీ అతనిపట్ల ఒక ఆకర్షణ  ఉంటుందని, అతనిని తమ వైపు తిప్పుకొనటానికి వాళ్ళు  ఏవో వేషాలు వేస్తుంటారని ఆమె అభిప్రాయం.‘ఆడదాన్ని కనుక ఆడవాళ్ళ మనస్సుల ను పసిగట్టగలను’ అన్నది ఆమె నమ్మకం. తనలాగే వాళ్ళు అతనిని తమ స్వంతం అనుకుంటు న్నారేమోనని చేసుకోవాలని చూస్తున్నారేమోనని నిత్య అనుమానాలతో వేగిపోతుంటుంది. తనభర్త పరిచయంలోకి వచ్చే ప్రతి స్త్రీని ద్వేషించటం వాళ్ళలో లోపాలు  చూపిస్తూ తక్కువచేస్తూ భర్త దగ్గర మాట్లాడటం అన్నీ అందులో భాగమే. ‘ఎవరివస్తువుని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే అది మహాపరాధం ఏమీ కాదు” అని అతనిపై తన  అధికారాన్ని హక్కును ప్రకటించుకొంటుంది. ఇది ఒకరకంగా అతనిని చిరాకు పెట్టేదైనా మరొక వైపు  భార్య చూపు, ఆలోచన , జీవితం తనను చుట్టుకొనే ఉండటం  అది తన అందాన్ని , యవ్వనాన్ని నిత్యం గుర్తుచేస్తూ ఉండటం అతని అహాన్ని సంతృప్తి పరిచిన విషయం. భర్తకు కీర్తి కాంక్ష ఉందన్న విషయం  కూడా గుర్తించి చెప్పింది ఆమే.  కీర్తి గుర్తింపు ఫలితమే కదా ! భార్య తనగురించి ఇంతలోతుగా ఆలోచిస్తున్నదా  అనుకొంటూ గిరిధర్ ఆమెతో  పల్లె టూరివాణ్ణి నేనా నువ్వా అని సందేహం వస్తున్నది  అన్నాడు అభినందిస్తున్నట్లుగా. దానికి ఆమె అతనిని ఎంతో కృతజ్ఞతతో చూస్తూ ‘ నాకు ఏ కాస్తో కూస్తో ప్రపంచజ్ఞానం తెలిసిందంటే అది మీ వల్లే కదండీ ‘ అన్నప్పుడు గిరిధర్ సంతోషంగా తెరిపిగా ఊపిరి పీల్చుకున్నాడుట. అంటే  జ్ఞానప్రదాత గా అతనికి లభించిన మరొక గుర్తింపు అది. అది అతనికి సంతోషాన్ని ఇచ్చింది.      

       రాజావారి ప్రెస్సు పని , పత్రిక పని  బాధ్యతలు తీసుకొనటానికి సిద్ధమవుతూ గిరిధర్  ను ఆ పని చూసిపెట్టగలవా అని అడిగితే  రంగారావు ‘అంతకంటే కావలసిందేముంది…. ! మీ  దగ్గర పని నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుందంటే వదులుకోగలనా’  అని నమ్రతగా ఇచ్చిన సమాధానం కూడా గిరిధర్ కు సంతోషం కలిగించింది. తనకు లభించిన గురు స్థాయి గురించిన సంతోషం అది. తనమిత్రుడికి ఆయన అంటే అభిమానం అనీ, కలుసుకోవాలనుకొంటున్నాడనీ, తాను పనిచేస్తున్న పత్రిక సంపాదకుడికి ఆయన రచనలంటే గౌరవం అనీ కలవాలనుకొంటున్నాడనీ రంగారావు చెప్పినప్పుడు కూడా గిరిధర్ లో అదే విధమైన  సంతోషం. సంతృప్తి.  అలాగే రాణీ గారు తమ గ్రూప్ నుండి ఎంఎల్ ఏ నిలబెడతామని ఫోన్ చేసి చెప్పినప్పుడు అతను సంతోష పడటంలో తన శక్తి సామర్ధ్యాలకు లభించిన గుర్తింపు ను తలచుకొనే అన్నది  గమనించవచ్చు. 

  రంగారావు చెల్లెలు నిర్మల. విశాఖ పట్నంలో ఇంగ్లీష్ లో ఆనర్స్ చేసింది. అక్కడే  ఆనర్స్ చేసిన మోహన్ ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. పరిశోధన కోసం  అమెరికా  వెళ్లిన అతను  ప్రమాదంలో చనిపోయాక పుట్టిన బిడ్డ కోసం మనసు కూడదీసుకుని ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకొన్నప్పుడు  గిరిధర్ సలహా మీద వాళ్ళ పత్రికాఫీస్ లో నే పనిలో చేరింది . గిరిధర్ తన గదిలోనే  ఆమెకు పనిచేసుకొనేందుకు  కుర్చీ, బల్ల వేయించాడు. అప్పటి నుండి ఆమె గిరిధర్ ప్రవర్తనకు ప్రత్యక్ష సాక్షి . వ్యాఖ్యాత కూడా. 

గిరిధర్  తాను వ్రాసిన సంపాదకీయాలను , వ్యాసాలను మెచ్చుకొంటూ వచ్చే ఉత్తరాలకు ఎంత ఆనంద పడతాడో విమర్శిస్తూ వచ్చే ఉత్తరాలకు అంత చిరాకు పడతాడు.అలా వ్రాసిన వాళ్ళ మీద ఎప్పుడో ఒకప్పుడు కక్ష సాధించటానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి చికాకు లో వ్రాసే సంపాద కీయాలలో వ్యాసాలలో ఆ కసి ప్రతిఫలిస్తుంటుంది. 

 గిరిధర్ కు ఏదో సాధించాలన్న తపన, కష్టపడే తత్వం , ఎదుటి మనిషిలో ఉండే తెలివి తేటలను గుర్తించి, పని చేయించగల నాయకత్వ లక్షణం వున్నాయి. కానీ వాళ్ళు తన నెత్తి కెక్కు తారేమో నన్న అనుమానం కూడా ఉండటం వల్ల వాళ్ళతో అతని ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. దానికి సామాజిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయని ఆ దిశగా ఆలోచించమన్న సూచన గిరిధర్ ఆలోచనగా ప్రారంభించిన రచయిత్రి కథనంలో ఉంది. “ స్వతహాగా తనది ఉన్నదానికంటే ఎక్కువగా  ఊహించుకొని , అనుమానపడే స్వభావం వల్లనైతే నేమి , జీవితంలో అప్పుడప్పుడు తగులుతున్న దెబ్బల వల్లనైతేనేమి , కమలమ్మతో అన్నేళ్ళుగా కాపురం చేస్తూ , నిరంతరం ఆవిడ సాధింపుకు తట్టుకుంటూ, ఇంట్లో గలాటాలు లేకుండా ఉండటానికి కొంత కృత్రిమంగా ఉండటానికి అలవాటు పడటం వల్లనైతేనేమి, గిరిధర్ లో ఎదో తీరని ఆరాటం , ఒక విధమైన కసి , ఇతరులను నొప్పించి ఆ కసిని తీర్చుకోవాలన్న ఉబలాటం, అందర్నీ తన గుప్పెటలో పెట్టుకోవాలనీ , అందరూ తననే ఆరాధించాలనీ, ఇలాంటి లక్షణాలు దినదిన ప్రవర్ధమానం అవుతూ వచ్చాయి అతనిలో.. “ దాని పర్యవసానమే తాను  పని ఇచ్చి ఒక దారి చూపించినవాళ్లు  తనకు జీవిత కాలం  విశ్వాసంగా ఉండాలని ,తన కనుసన్నలలో వాళ్ళు మెదగాలని , తనను దాటి స్వతంత్రమైన కదలిక వాళ్లకు ఉండకూడదని అనుకొనటం. సినిమాలలో  పనిచేసినప్పుడు తాను అసిస్టెంట్ డైరెక్టరుగా అవకాశం కల్పించిన కృష్ణమూర్తి తనకు మద్దతుగా నిలబడలేదని బాధపడటం,    నిర్మల స్వతంత్రించి సహోద్యోగులతో  స్నేహ సంభాషణలు సాగించటం పట్ల అసహనం, సుబ్బారావు ఎదిరించి మాట్లాడినప్పుడు అందరూ కృతఘ్నులేనని తిట్టటం ఇవన్నీ దాని పరిణామాలు , ఫలితాలే. 

గిరిధర్ లో మరొక లక్షణం మాట్లాడుతూ మాట్లాడుతూనే ఒకరు అన్న మాటలు మరొకరి దగ్గర కూర్పులు చేర్పులతో చెప్పి ఆ మాటలు విన్నవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్లకు తానేదో సాయం చేస్తున్నట్లుగా వాతావరణం సృష్టించటం. అది పత్రిక నడుపుతున్నప్పుడు అందులో పనిచేసే వాళ్ళలోనూ , సాహిత్య రంగంలో బయట వాళ్ళలోనూ , రాజకీయాలలోకి వచ్చాక ఎమ్మెల్ ఏ ల మధ్య , మంత్రుల మధ్య కూడా ఇదే పద్ధతిని అనుసరించాడు.అంతిమమగా  అందరికీ కావలసిన వాడుగా ఉంటూనే  ఎవరిపట్లా సానుభూతిని ప్రకటించగల సంస్కారం పెంచుకోలేక , ఎవరికీ స్నేహితుడు కాలేకపోవటమే  అతనిని  జీవితపు కాలపు అసంతృప్తికి  గురిచేశాయి. 

గిరిధర్ ఏది చెప్పినా మనమంచికే కదా అని ఆయనకు అల్లుడు, నిర్మలకు అన్న అయిన రంగారావు అన్నప్పుడు అందులో మంచి చేస్తున్నట్లు, సాయం చేస్తున్నట్లు చేస్తూనే మనుషులను తన  కను సన్నలలో,తన  గుప్పెటలో పెట్టుకోవాలన్న దృష్టి, తన మాటను ఏ మాత్రం కాదని ప్రవర్తించినా వాళ్ళ పట్ల కక్ష తీర్చుకొనే ధోరణి ఉన్నాయని చెప్పింది నిర్మల. ఆయనతో సంబం ధంలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ అందువల్లనే ఆయనపట్ల గౌరవాన్ని కడవరకు చూపలేకపోయారని అంటూ అన్నగారు ఒక్కడే మొదటి నుంచి చివరివరకూ ఒకే విధమైన గౌరవం తో , ఆరాధనతో చూడగలుతున్నాడని చెప్పగలిగింది. కమలమ్మ తన భర్తను గుప్పెటలో పెట్టు కోవాలనీ ఆయన తనొక్కతంటేనే ప్రాణం పెట్టాలని అనుకొంటుంటే గిరిధర్ ప్రపంచమంతా తననే ఆరాధించాలనీ, అందరూ తన కనుసన్నలలో మెలగాలనీ అనుకొంటాడు అని గ్రహించగలిగింది కనుకనే ఎక్కడా ఇమడలేక, స్థిరంగా నిలబడలేక అరవిందాశ్రమానికి వెళ్ళిపోయిన గిరిధర్ ను “దారి తప్పిన మానవుడు”  అని నిర్ధారించగలిగింది. 

గిరిధర్ జీవితాన్ని దేశానికి స్వతంత్రం వచ్చిన దశాబ్దికి ఇటు సాహిత్య సాంస్కృతిక రంగాలు అటు   పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముఠాతత్వం, ఎవరి అధికారాలు ఆధిక్యతలు వాళ్ళు నిలుపుకొనటానికి  మనుషుల మధ్య , కులాల మధ్య వైరుధ్యాలను సృష్టించి వాడుకొనే ధోరణి ఆత్మవంచన పరవంచనలతో కునారిల్లుతున్న కాలంతో కలిపి ప్రదర్శించటం ద్వారా  మనుషులను సమాజాన్ని కలిపి అర్ధం చేసుకోవాలని ఒకదానిని సంస్కరించటం మరొక దాని సంస్కరణతో ముడిపడి ఉందనీ చెప్పినట్లయింది. ఈ దిశగా మార్పుకు స్త్రీలు విద్యావంతులై సామాజిక జీవితంలోకి ప్రవేశించటం వలన మార్గం సుగమం అవుతుందన్న సూచన నిర్మల జీవిత పరిణామాల ముఖంగా చెప్పినట్లయింది. 

ఈ నవలలో గిరిధర్ భార్య కమలది పూర్తిగా ఇంటికి పరిమితమైన జీవితం. నూతిలో కప్పు జీవితం. ఆడవాళ్ళ ప్రపంచం వేరు, మగవాళ్ల ప్రపంచం వేరు అని గీతలు గీసుకొని అవి చెరిగిపోకుండా చూసుకొనటంలోనే ఆమె బ్రతుకు అంతా. భర్త సినిమా రంగంలో ఉన్నప్పుడైనా , పత్రికా రంగంలో ఉన్నప్పుడైనా , రాజకీయ రంగంలో ఉన్నపుడైనా పల్లెలు దాటి పట్నాలకు మారినప్పుడైనా అతని కోసం వచ్చే ఆడవాళ్లు వస్తే లోపలికి రావాలి కానీ వాళ్ళను  కలిసి స్నేహం చేయటానికి ఆమె డ్రాయింగ్ రూమ్ లోకి రావటానికి ఇష్టపడలేదు. ఆడవాళ్ళూ మగవాళ్లు కలిసి మాట్లాడు కొనటం అంటే ఆమె దృష్టిలో తప్పు చేస్తున్నట్లే. స్త్రీలు భర్త , పిల్లలు అన్నఇంటి ప్రపంచపు  వ్యాపకాల  నుండి సినిమాలు, పత్రికలు, రాజకీయాలు మొదలైన బయటి ప్రపంచపు వ్యాపకాలలోకి ప్రవేశిస్తున్న సామాజిక గమనాన్ని అర్ధం చేసుకొనటానికి, దానికి అనుగుణంగా మారటానికి ఆమె సంసిద్ధం కాలేదు. అందువల్లనే స్కూల్ ఫైనల్ వరకు వచ్చిన  కూతురిని పై చదువులకు పంపాలని కాక త్వరగా పెళ్లి చెయ్యాలని అనుకొన్నది. చేసింది. ఫలితం ఆ అమ్మాయి చిన్నతనంలోనే గర్భవతి కావటం, బడి చదువు అర్ధాంతరంగా ఆపెయ్యటం సంసారంలో పడిపోవటం జరిగింది.   

మారుతున్న కాలతో పాటు మారటానికి సిద్ధమైన స్త్రీలకు ప్రతినిధి నిర్మల. విశాఖ పట్నం వెళ్లి ఆంద్ర యూనివర్సిటీ లో ఆనర్స్ చదవటం, తనకు జీవన సహచరుడిని తానే ఎన్నుకొనటం, చిన్నాన్నకు ఇష్టం లేకపోయినా అన్న సహకారంతో పెళ్లి చేసుకొనడం, తాను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భర్త ప్రమాదంలో  మరణిస్తే తన పిల్లవాడిని పెంచుకొంటూ స్వతంత్రంగా నిలబడటానికి అన్నగారు పని చేస్తున్న ప్రెస్సులోనే పనిలో చేరి సామాజిక సంబంధాలలోకి ప్రవేశించటం ఇవన్నీ ఆమె నిరంతరం చలనం లో ఉన్న మనిషి అని చెప్తాయి. స్త్రీలు ఉద్యోగాలలోకి రావటం , రక్త సంబంధీకులు, బంధుత్వ సంబంధాలు లేని పురుషులతో సరికొత్త సహచర సంబంధాలలోకి రావటానికి కారణం అయితే అదే సమయంలో అక్కడ సహోద్యోగులతో వాళ్ళ సంబంధాలను నియంత్రించే పితృస్వామ్యం ఒకటి అమలు అవుతుందని గ్రహించగల సూక్ష్మ దృష్టి స్త్రీలకు అనివార్యంగా అలవడుతుందని నిర్మలను చూస్తే తెలుస్తుంది. అల్లుడి చెల్లెలు, వితంతువు అయిననిర్మల రక్షణ బాధ్యత తనదే అన్నట్లుగా పత్రికలో ఉద్యోగం ఇచ్చి ఆమె సీట్ తనరూములోనే ఏర్పాటు చేసాడు గిరిధర్. ఆయన ప్రమేయం లేకుండా తాను ఎవరితో మాట్లాడినా, ఎవరైనా ఇచ్చిన పని చేయటానికి సిద్ధపడినా అతనికి అసహనంగా ఉంటుందని అర్ధం అయ్యాక ముడుచుకు పోవటం కాక అతని పెత్తనానికి లోబడకుండా తన జీవితాన్ని, స్నేహాలను నిర్మించుకొనటానికి , కొనసాగించటానికి ఆమె నిశ్శబ్ద యుద్ధమే చేసింది. గుంటూరు కాలేజీ లో లీవు మీద ఏర్పడిన ఖాళీలో చేరటానికి నిర్ణయించుకొనటమైనా , అక్కడ పర్మినెంట్ ఉద్యోగానికి ఎం ఎల్ ఏ గా గిరిధర్ చేయగల పైరవీని తిరస్కరించి కలకత్తా లో మాంటిసోరీ శిక్షణకు వెళ్ళటమైనా , తిరిగి వచ్చాక హైద్రాబాదులో స్నేహితురాలతో కలిసి బడి పెట్టటమైనా , ఆ బడికి శిశు సంరక్షణాలయానికి ప్రభుత్వ నిధులు ఇప్పిస్తానన్న గిరిధర్ ప్రతిపాదనను నిరాకరించటమైనా అందులో భాగమే. ఏ స్థాయిలోనైనా తమ మీద పెత్తనం చేయగల శక్తులను గుర్తించి ఆ శక్తులకు లోబడని వ్యక్తిత్వాన్ని అభివృద్ధిచేసుకొనే మనుషులు ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రజస్వామ్యాన్ని మించి విలువల ప్రజస్వామ్యంగా మార్చగలుగుతారు. ఆ రకంగా ఈ నవల ద్వారా విఎస్ రమాదేవి అందుకు చోదక శక్తిగా పని చేయగల ఆధునిక మహిళ రూపొందుతున్న తీరును నిర్మల పాత్రలో చూపించగలిగింది.    

నిర్మల పరిణామంలో లత అయింది, 1971లోఆంధ్రజ్యోతి లో అచ్చయిన వి. ఎస్. రమాదేవి  రమాదేవి నవల ‘జీవిత సాఫల్యం’ లో నాయిక పాత్ర.( ఒకమాట , పంకజం నవలికలు 2004) ఆధునిక మహిళ అంటే ఎవరు? తన జీవితంపై తానే సర్వాధికారాలు కలిగి ఉండి తన జీవితానికి తానే బాధ్యత వహించగలిగిన పరిణితి సాధించిన యువతి. 1963 తరువాత తన మకాం ఢిల్లీ కి మారాక విఎస్ రమాదేవి అక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చి,  ఒంటరిగా గదులు అద్దెకు తీసుకొనో , హాస్టళ్లలో ఉండో ఉద్యోగాలు చేసుకొంటున్న స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తూ ఎటువంటి పరిస్థితులలోనూ స్థైర్యంగా నిలబడ గలిగిన వ్యక్తిత్వాల వికాసాన్ని ఆపేక్షిస్తూ వ్రాసిన నవల ఇది. 2004 లో పంకజం నవలతో పాటు ఈ నవలిక కూడా ప్రచురించబడింది.

లత ఇరవై ఏడేళ్ల యువతి. నాలుగేళ్లుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ ఢిల్లీ లో ఉంటున్నది. పెళ్లంటూ చేసుకో .. ఏకులం వాడైనా , ఎక్కడి వాడైనా ఫరవాలేదు అని తల్లి ఎంత చెప్తున్నా వినిపించుకోదు. పెళ్లి గురించి ఆమెకు ఉన్న ప్రశ్నలు, సందేహాలు  ఆమె జీవితంలోకి వచ్చిన ఇద్దరు యువకుల తోటి సంభాషణలో తెలుస్తుంటాయి.ఆ యువకులలో ఒకడు  మురళి ఆమె అన్నయ్యకు  స్నేహితుడుగా చాలా ఏళ్ల  నుండి  తెలిసిన వాడే. మరొక యువకుడు పతి. తన తల్లిదండ్రులు  ద్వారా  పరిచయం అయినాడు. 

ప్రేమించానని, పెళ్లి చేసుకొందాం అని ప్రతిపాదించటానికి ముందు మురళి మీ వాళ్ళెంత చెప్పినా  ఇన్నాళ్లు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని ప్రశ్నించినప్పుడు పెళ్లంటే భయం పట్టుకొన్నది అంటుంది. ఆమె భయానికి కారణాలలో ఒకటి పెళ్లయినప్పటి నుండి భార్యాభర్తలు ఒకరినొకరు గిరులలో పెట్టి బంధించాలని చూడటం. ఆడామగా కలిసి చదవటం,  కలిసి ఉద్యోగాలు చేయటం, స్నేహంగా ఉండటం కొత్తగా వచ్చిన అవకాశాలు. అయితే వివాహ వ్యవస్థ కు సంబంధించిన నీతిలో  ఆడ పిల్లలకు పరపురుషులతో స్నేహానికి స్థానం లేదు అందువల్ల ఆడపిల్లలు తమతో కలిసి చదివిన మొగపిల్లలు ఎక్కడైనా కనబడితే నేరం చేసినట్లు తలదించుకుని వెళ్లిపోయే పరిస్థితి ఉందన్నది ఆమె ఆరోపణ. దానిని ప్రేమించే భర్తకు భార్య తనను గురించి తప్ప మరొకరి గురించి ఆలోచించటం భరించరానిది అవుతుందేమో నని సానుకూలంగా అర్ధం చేసుకోవాలన్నట్లు మురళి సర్ది చెప్పే ప్రయత్నం చేయబోతే అటువంటి ప్రేమ కన్నా నరకం నయం అంటుంది లత. 

పతితో మాట్లాడేటప్పుడు ఈ విషయాన్నే- దంపతుల మధ్య అఖాతాలను – తన అక్క అన్న   అనుభవాలనుండి  వివరిస్తుంది.  అక్కయ్య రేడియోలో  పాటలు పాడటాన్ని కూడా సహించని  బావ  అధికారాన్ని, అన్నయ్య చదువుల నాటి ఆడపిల్లలెవరైనా కనిపించి పలకరిస్తే వదిన చూపే అసహనాన్ని గురించి ప్రస్తావించి ఇలాంటి  ఈర్ష్య, అనుమానమానాలతో దంపతుల మధ్య ప్రేమ ఎన్నాళ్ళు నిలవగలుతుంది అని అంటుంది. ఇవన్నీ చూస్తున్నఆలోచన జ్ఞానం కల వాళ్ళెవరైనా పెళ్ళికి విముఖులు కావటానికి అవకాశం ఉందని ఆమె అభిప్రాయం. అయితే ఇన్ని అనుమానాలు , ఆశా భంగాల మధ్య పెళ్లి కుటుంబ బంధాలు మనగలగటానికి తల్లి మాత్రమే కారణం అంటూ  మాతృత్వం  ఒక్కటే సత్యం అని నమ్మకంగా చెప్తుంది.. తల్లికి పిల్లలమీద ఉండే ఆప్యాయత , ప్రేమలాంటిది మనుషుల్ని ఒక  ఇంటికి బంధించి ఉంచుతుందని అంటుంది కూడా పతితో. కానీ అదే సమయంలో మాటల మధ్య  అలవాట్లకు బానిసలు  కావటం గురించి పతి అన్న మాటకు అలవాట్లకు బానిసలు కాకుండా చూసుకొనటం ముఖ్యం అని కావాలంటే ఆ అలవాటు నుండి తప్పించుకోగలను అన్న ధైర్యం కూడా ఉండాలని చెప్పిన లత మాటను బట్టుకొని పతి “ఇల్లు , సంసారం కావాలంటే ఒదులుకోగలను అనే ధైర్యం ఉండాలన్నమాట అని ఆమె అభిప్రాయానికి సవరణ చెప్తాడు. అందులో తప్పు లేదని ఆమోదిస్తూనే గత్యంతరం లేక కష్టమో సుఖమో ఇందులోనే పది ఉండాలను కొని నిర్బంధంగా ఉండటం కన్నా తప్పించుకొనటానికి వీలున్నా ఇదే నయం అనుకొని ఉండటంలో తృప్తి, ఆనడం ఉన్నాయి కదా అని ఆ సమస్యను మరొక కోణం నుండి చూడమంటుంది. అయితే నిర్ణయించుకోగల మానసిక వికాసం వుండాలని అంటుంది. ఈ మొత్తం చర్చలో రచయిత్రి స్త్రీలు  తల్లులు గా సంసారాలను అంటిపెట్టుకొని ఉండటం అయినా , వదిలించుకొనటమైనా ఎవరో చెప్పారని , ఎవరో ఎదో అంటారని కాకుండా వాళ్లకు వాళ్ళు నిర్ణయించుకొనవలసినదిగా ఉండాలని సూచించటం చూస్తాం. ఇతరులకు హాని కలిగించని ప్రవర్తనను ఇతరులేమనుకున్నా సరే ఖాతరు చేయవలసిన అవసరం లేదని లత చేత చెప్పించింది కూడా. 

ఏ అనుభవాలను శాశ్వతం చేసుకోనలని గానీ , ఏ బంధాలకు కట్టుపడా లని గానీ లేక జీవితంతో ప్రయోగాలు చేస్తున్న పతి లత ఆకర్షణలో పడ్డాడు. ‘జీవితాన్ని ఆంటీ అంట నట్టుగా ఉంది , ఒడ్డున నిలబడి సముద్రాన్ని పరీక్షిస్తున్నట్లు కనబడే లత’ అతనిలో ఆసక్తిని కలిగించింది.  ‘ఒంటరిగా ఉద్యోగం చేసుకొంటూ తనకాళ్లమీద తాను నిలబడి తనమనస్సుతోనే తాను జీవితాన్ని చవి చూడటానికి ప్రయత్నించటం’ తనను ఆకర్షించిందేమో అనుకొంటాడు పతి. లత ఆడవాళ్ళలో అంతగా ఆలోచించే మనిషి , అన్ని విషయాలూ చర్చించే మనిషి, కావటం  కూడా అందుకు కారణం అయివుంటుంది. పతితో మాట్లాడటంలో లత కు మేధో సంతృప్తి ఉంది కనుకనే అతని రాకకు , అతనితో సంభాషణకు ఎదురు చూస్తుంటుంది. ఈ క్రమంలో ఆమెలో కూడా అతని పట్ల ఆకర్షణ ఏదో రేకెత్తింది. దాని పరిణామం సినిమాకు వెళ్లివచ్చిన ఒక వర్షపు రాత్రి పతితో ఆమెకు శారీరక సంబంధం ఏర్పడటం. 

సెక్స్ పట్ల ఆమెలో ఒక విముఖత ఉందని పతి గుర్తించాడు. ఆమెను  ప్రేమిస్తున్నట్లు చెప్పిన   మురళి హఠాత్తుగా ఒక రోజు హఠాత్తుగా వెనక నుండి మెడమీద, ఆమె గిరుక్కున వెనక్కు తిరిగేసరికి పెదవులమీద ముద్దు  పెట్టుకున్నప్పుడు ఆమె నుదురు చిట్లింపు,  పెదవులు చీరకొంగుతో తుడుచుకొనటం  తనమీద అసహ్యం వల్లనే అనుకొన్నాడు అతను. ఏదో ఘర్షణ సందర్భంలో ఆ విషయంలో ఆమెను నిలదీశాడు కూడా. రొమాన్స్ అన్న సెక్స్ అన్నా  తనకు అంతగా మోజు లేదని  ఆమె జవాబు ఇచ్చింది. పతితో ఒక సినిమా చూసిన సందర్భంలో సెక్స్ గురించి వచ్చిన ప్రస్తావనలో కూడా మానసికంగా దగ్గరకు వస్తే తప్ప సెక్స్ పశుత్వం అంటుంది. బహుశా పతికి మానసికంగా దగ్గరైంది కనుకనే ప్రేమ అనో, పెళ్లి అనో ఏ ప్రస్తావనా రాకముందే హఠాత్తుగా ఒక వర్షపు రాత్రి పతి చొరవతో అతనితో సెక్స్ ను ఆనందించింది. 

పతి అమెరికా వెళ్ళాక తాను గర్భవతి అని తెలిసి అతనికి ఉత్తరం వ్రాసింది. అబార్షన్ చేయించుకోమని అతను సలహా ఇచ్చినా బిడ్డను కనటానికి నిర్ణయించుకొంది. ఆ విషయం అతనికి తెలియపరచకుండానే తన ఏర్పాట్లు తాను చేసుకొని బిడ్డను కన్నది. ఈ మొత్తం క్రమంలో పరిణామాలను ఒంటరిగా ఎదుర్కొనటానికి సిద్ధపడటంలో ఉన్నది లత వ్యక్తిత్వం అంతా. పెద్దల ప్రమేయం, నిర్ణయంతో పనిలేకుండా సంపూర్ణ మానవిగా తన శారీరక మానసిక అవసరాలకు తన ఇష్టం ప్రకారం ప్రవర్తించటం ఒక ప్రజాస్వామిక విలువగా అభివృద్ధి చేసుకొనే ఆధునిక మహిళా తత్పరిణామాలను కూడా తానుగానే సంపూర్ణంగా బాధ్యత పడటం అభివృద్ధి పరచుకొనవలసిన మరొక విలువ అవుతుంది. లత ఆ మార్గంలోనే గర్భానికి కారకుడైన పతి అబార్షన్ చేసుకొమ్మని చేతులు దులుపుకున్నాడని నిందించలేదు. పిల్లను కనటం , కనకపోవటం సంపూర్ణంగా స్త్రీల హక్కు అన్న చైతన్యం వల్లనే అందుకు తగిన ఏర్పాట్లు డాక్టర్లతో సంప్రదించి స్థైర్యంగా నిలబడగలిగింది. ఏ రకమైన పెత్తనాలకు తావు లేని స్వతంత్ర జీవితన్ని  చదువు వల్ల కొత్త సంస్కారాలతో ఆలోచనలు  వికసిస్తున్న స్త్రీలు   ఆచరణ ప్రయోగాలలోకి  తెచ్చుకొనటం గురించి 1971 నాటికే  ఇలా దర్శించ గలగటం నవలా రచయితగా విఎస్ రమాదేవి విలక్షణత.      

*****

(ఇంకా వుంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.